కాంగ్రా లోయ --2
మస్రూర్ రాతి మందిరాలు
మరునాడు మేము ' హిమాలయ పిరమిడ్ ' గా పిలువబడే మందిరాలు చూడ్డానికి వెళ్లేం .
ఆకారన్ని బట్టి వీటిని పిరమిడ్స్ అన్నారుగాని యివి సమాధులు కావు , దేవాలయాల సముదాయాలు .కాంగ్రా పట్టణానికి సుమారు 49 కిలోమీటర్ల దూరంలో వున్నాయి యీ మందిర సముదాయాలు . కాంగ్రా లోయ లోని ' డెహ్రా గోపి పూరు ' తాలూకా లో దౌలాధర్ పర్వతశ్రేణుల పాదాల దగ్గర నిర్మించ బడ్డాయి .
ఈ మందిర సముదాయం యెవరు నిర్మించేరు , యివి యేకాలానికి చెందినవి , యెవ్వరి ద్వారా నిర్మించ బడ్డాయి అనే వాటికి నిర్ధిష్ట మైన ఆధారాలు చరిత్ర కారులకు లభించలేదు . కొంత మంది చరిత్ర కారుల ప్రకారం యివి 6 వ శతాబ్దం , 8వ శతాబ్దం మద్యకాలంలో నిర్మింపబడి వుండవచ్చునని ఓ అంచనా . ఇంత పెద్ద ప్రాంగణం లో యేకశిల నిర్మితాలను నిర్మించడం మహారాజులకో , చక్రవర్తులకో సాధ్యం కాని సామాన్యుల వల్ల కాని పని కాబట్టి యెవరో శక్తివంతుడైన రారాజు కట్టించి వుండవచ్చు ననేది ఓ అంచనా .
హిందూ పురాణాల ప్రకారం వనవాస సమయంలో పాండవులు యిక్కడ గడిపారని తెలుస్తోంది .
యెల్లోరా , మహాబలిపురాలలో వలె యీ మందిరాలు అన్నీ ఒకే రాతి నుంచి చెక్కినవి .
మందిర శిఖరాలపైన వున్న అమలక ( ఉసిరిక ) గోపురాలు చాలా భాగం విరిగిపోయి వున్నాయి . ఇక్కడి శిల్పాలను బట్టి యివి గుప్తులకాలానికి చెందిన శిల్పకళగా చరిత్రకారులు గుర్తించేరు . ఈ మందిరాలు వైష్ణవానికి చెందినవి కావడంతో వీటిని ' ఠాకూరు వాడా ' అని కూడా పిలువబడుతున్నాయి .
ఈ మందిర నిర్మాణం లో వుపయోగించిన శిల్పకళ ' నగర ' శిల్పకళ ను పోలివున్నట్లు చరిత్రకారుల అభిప్రాయం , కాని ' నగర ' శిల్ప కళ లో యిటుక ను వుపయోగిస్తారు కాని యిక్కడ యేక శిలపై నిర్మించడం జరిగింది , ఈ అరుదైన ప్రయోగం మరే ప్రదేశం లోనూ జరుగలేదని , ఒక్క ఈ మస్రూర్ మందిరాలలో మాత్రమే దీనిని చూడగలమనేది చరిత్రకారుల అభిప్రాయం .
ఈ మందిరాలకు యెదురుగా వున్న సరస్సును ' మస్రూర్ సరస్సు ' అని అంటారు . 50 మీటర్ల పడవు 25 మీటర్ల వెడల్పు గల ఈ సరస్సు పర్యాటక స్థలంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది . ఈ సరస్సు కొండల మద్య వుండి మరే నీటి ప్రవాహంతోనూ కలిసి లేకపోయినా యిందులో నీరు యెప్పుడూ యెండిపోదట , విచిత్రం కదూ !
ఈ సరస్సుకు యెదురుగా వుండడంతో యీ మందిర సముదాయాన్ని ' మస్రూర్ మందిరాలు ' గా కూడా పిలువ బడుతున్నాయి . ఈ మందిరాలలో ఆరవ శతాబ్దానికి చెందిన చక్కని శిల్ప కళని చూడొచ్చు . ఈ ప్రాంతంలో వున్న గుహలు , ఆవాసాలు చూస్తే ఆరు నుంచి యెనిమిదో శతాబ్దం మధ్య కాలంలో జలంధరును పరిపాలించిన రాజులు అక్కడనుంచి యిక్కడకి వలస వచ్చి యీ ప్రాంతాలలో నివసించేరు అనే చరిత్రకారుల మాట నిజమే అని అనిపించక మానదు . జలంధరు రాజులు తమ రాజధానిని భద్రతా దృష్ట్యా కాంగ్రా తరలించినప్పుడు ఈ మందిరాలు , నివాస స్థానాల నిర్మాణం సగంలోనే నిలిపివేసి నట్లు గా తెలుస్తోంది . ఇప్పటికీ కాంగ్రా లోయ క్రింది ప్రాంతపు ప్రజలు యీ ప్రదేశాన్ని 'జలంధర ' అని పిలువబడడం కనిపిస్తోంది .
సుమారు 159 అడుగుల పొడవు , 105 అడుగుల వెడల్పు గల ఈ మందిర సముదాయం లో ముఖ్య మందిరం తొమ్మిది అంతస్థుల గోపురం తో నాలుగు వైపులా శిల్పాలతో తీర్చి దిద్ది కనిపిస్తుంది . ముఖ్య మందిరానికి రెండువైపులా సమాన యెత్తులో నిర్మించిన యేడేసి మందిరాలు వున్నాయి .
శిల్పకళ లో వీటికి పన్నెండవ శతాబ్దానికి చెందినవిగా గుర్తించిన కంబోడియా లోని ' అంకోర్ వాట్ ' మందిరాలకు గల సారూప్యత చరిత్రకారుల పరిశోధనను మరింత విస్త్రుత పరిచింది . ప్రస్తుతం చరిత్ర కారులు రెండు మందిరాలకు మధ్య గల సంబంధాన్ని పరిశోధిస్తున్నారు . 1905 లో జరిగిన భూకంపం మందిరానికి చాలా క్షతిని కలుగజేసింది . చాలామటుకు మందిరాలు నేలమట్టం కావటం , చాలా గోపురాలు పడిపోవడం జరిగింది . కిందపడి వున్న శిథిలాలను పునరుద్దరించి వుంటే యీ మందిరం యింకా కళకళ లాడుతూ వుండేది కదా అని అని పించక మానదు .
ఇక్కడ ముఖ్యంగా పదిహేను మందిరాలు నిర్మించినట్లు తెలుస్తోంది . ఈ మందిరనిర్మాణం జరిగిన కాలం లో శైవమతం ప్రాచుర్యంలో వున్నట్లు మందిరం పై నిర్మింపబడ్డ శిల్పాల ద్వారా తెలుస్తోంది . మధ్య కాలం లో వైష్ణవం ప్రాచుర్యం లో కి వచ్చినట్లు ముఖ్య మందిరంలో వున్న రామ, లక్ష్మణ , సీత విగ్రహాల ద్వారా తెలుస్తోంది . శివుడు , పార్వతి , లక్ష్మి , సరస్వతి లకు మందిరాలు వున్నాయి .
మందిరాలు పాడుబడడంతో కొన్ని ముఖ్యమైన విగ్రహాలను ' సిమ్లా స్టేట్ మ్యూజియం ' కి తరలించేరు . అందులో దుర్గ , వినాయకుడు , వరుణుడు , కార్తికేయుడు , లక్ష్మి , సరస్వతి మొదలయిన విగ్రహాలు వున్నాయి .
ఈ మందిరాల మరో ప్రాముఖ్యత యేమిటంటే యీ మందిర సముదాయాల ప్రతిబింబాన్ని యెదురుగా వుండే సరస్సులో చాలా చక్కగా చూడగలగడం . అది నిజంగా ఓ గొప్ప అనుభవం .
ఈ మందిర సముదాయాన్ని 1875 లో కనుగొన్నారు . ప్రస్తుతం యీ మందిరాలు ఆర్కియాలజికల్ సర్వే వారి ఆధ్వర్యంలో వున్నాయి .
ఈ ప్రాంతంలో మొఘల్ , హిందూ శిల్పకళలతో రాజా ' గులేర్ ' చే నిర్మింపబడ్డ విలాసమందిరం అర్దచంద్రాకారపు కప్పుతో ముచ్చటగా వుంటుంది .
వైధ్యనాథ్ మందిరం ----
హిమాచల్ లో వున్న మరో ప్రసిధ్దదేవాలయం ' వైధ్యనాథ్ ' దీనిని స్థానికులు ' భైధ్యనాధ్ ' మందిరంగా వ్యవహరిస్తూ వుంటారు . ఈ మందిరం 1204 లో ' స్వయం భూ ' గా వెలసిన శివుని కి అన్నదమ్ములయిన ' మన్యుక ' , ' అహుక ' అనే భక్తులచే నిర్మింప బడింది . అంతకు పూర్వం సరి అయిన మందిరము లేక యెండు యెండ వానకు తడుస్తూ వుండే ది వైధ్యనాథ్ శివలింగము . ఈ ప్రదేశాన్ని ' కిరగ్రామం ' అని పిలిచేవారు . 'బియాస్ ' నదికి వుపనదిగా పిలువబడే 'బింవ ' నది వొడ్డున వుంది . ఈ నదిని ' బిందుక ' నదిగా పిలిచేవారు , కాల క్రమేణా దీనిని 'బింవ ' అని వ్యవహరించ సాగేరు .
కిరగ్రామం పఠాన్ కోట్ నుంచి పాలంపూర్ వెళ్లే దారిలో పాలంపూర్ కి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో వుంది . హిమాచల్ ప్రదేశ్ అంతా హిమాలయాలకు అతి దగ్గరగా వుండడం తో వేసవిలో కూడా చాలా చల్లగా వుంటుంది . నవ్వంబరునుంచి చలి బాగా పెరగడం , స్నోఫాల్ అవడం జరుగుతూ వుంటుంది . అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు యీ ప్రాంతాలలో చలి యెక్కువగా వుండడమే కాక ప్రకృతి అహ్లాదకరంగా వుంటుంది .
ముదురాకు పచ్చ రంగులో వున్న ఆకులతో వున్న చెట్ల తో కూడిన కారడవులలో సాగే ప్రయాణం చాలా బావుంటుంది . సన్నని ఘాట్ రోడ్డు కావడం వల్ల ప్రయాణం చాలా నెమ్మదిగా సాగుతుంది . కొండలలో చిన్న చిన్న గ్రామాలు రోడ్డుని ఆనుకొని వుంటాయి . ఇంచుమించుగా రోడ్డుని ఆనుకొని వున్నట్లుగా వుంటుంది యీ మందిరం .
చుట్టూరా రాయితో నిర్మించిన గోడ , లోపలికి వెళ్లేందుకు సన్నని ద్వారం . ద్వారం గుండా పెద్ద పెద్ద రాతి మెట్లు దాటుకొనివెళితే విశాలమైన ప్రాంగణం . అందులో ముఖ్య మందిరం కాక చిన్న చిన్న మందిరాలు , పురాతనమైనవే అయినా నిత్యం భక్తుల రాకపోకలతో కళకళ లాడుతూ వుంటాయి . లోపల చతురస్రాకార మండపం , దానికి యెదురుగా ' నంది ' , నంది మండపానికి యెదురుగా ' నగర ' అనే శిల్ప కళ ఆధారంగా నిర్మించిన పెద్ద మందిరం , మందిర గోడలకు వివిధ దేవతా మూర్తులు వుంటాయి . ఉత్తర , దక్షిణాలకు ప్రవేశ ద్వారాలున్నాయి . ద్వారాల మీద , తలుపుల మీద దేవి దేవతా విగ్రహాలను చూడొచ్చు . ఈ మందిరం మీద వున్న శిల్పకళ చాలా అరుదయినదని , ప్రపంచంలో మరెక్కడా యీ శిల్పకళ తో చెక్కిన శిల్పాలు లేవని యిక్కడి స్థానికులు చెప్పేరు .
శాతవాహనుల శకం 1120 లో ( క్రీ.శకం 1204 ) లో మానుకు , అహుక లతో మందిర నిర్మాణం జరిగినట్లుగా , 1783 లో ' రాజా సంసార చంద్ర ' చే మందిరానికి మరమ్మత్తులు పనులు జరిగాయని మందిర గోడలపైన , క్ర తలుపుల పైన చక్కబడిన శాసనాలు వున్నాయి .
ఈ మందిరం లో శివునికి అభిషేకాదులు నిర్వహిస్తే దీర్ఘకాల రోగాలనుండి ఉపశమనం దొరుకుతుందని భక్తుల విశ్వాసం . ఈ విశ్వాసం వల్లే యేడాది పొడవునా ఈ మందిరం లో భక్తుల రాకపోకలు జరుగుతూ వుంటాయి .
ఇక్కడ శ్రావణ సోమవారాలు , శివరాత్రి , దశరా నవరాత్రులు , మకరసంక్రాంతి , వైశాఖ సంక్రాంతి మొదలయిన రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు . మకరసంక్రాంతికి దేశవిదేశానుంచి భక్తులు తరలి వస్తారు .
ఇక స్థలపురాణం తెలుసుకుందాం .
కోవెల నిర్మాణం 1204 లో జరిగినా యిక్కడి స్థలపురాణం మాత్రం త్రేతాయుగానికి చెందినది .
త్రేతాయుగంలో రావణాసురుడు దివ్యశక్తులను పొందగోరి కైలాస పర్వతానికి వెళ్లి శివునికై ఘోర తపస్సు చేస్తాడు . ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రసన్నుడు కాకపోవడంచేత రావణాసురుడు తన పదితలలను అగ్నికి ఆహుతిగా సమర్పిస్తాడు . రావణాసురుని భక్తికి మెచ్చిన శివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమౌతాడు . పార్వతీ దేవి అందానికి మోహితుడైన రావణాసురుడు శివుని లంకలో నివాసముండవలసినదిగా కోరుతాడు . రావణాసురుని ద్రోహబుద్ది పసిగట్టిన అమ్మవారు వారిస్తున్నా వినక భోళాశంకరుడు రావణాసురునితో లంకకు బయలుదేరుతాడు . భర్త వెనుక పార్వతీ దేవి కూడా పయనమవక తప్పదు . రావణుని ద్రోహబుద్ది అవగతమైన అమ్మవారు లంకలో నివాసముండుటకు యిఛ్చగించక రక్షింపవలసినదిగా మనసులో విష్ణువునకు విన్నవించుకుంటుంది . ఒక్కసారిగా శివుని కి విష్ణుమాయ కమ్ముతుంది , దాని ప్రభావాన శివుడు లింగరూపం ధరించుతాడు , శివుడు లింగరూపం ధరించడంతో రావణాసురుడు శివలింగాన్ని భుజాన మోస్తూ లంకానగరం వైపు పయనమౌతాడు . శివునివెంట పార్వతి కూడా పయనమౌతుంది . రాణాసురుడు శివలింగాన్ని మోసుకుంటూ పోవడం చూసిన విష్ణుమూర్తి గొర్రలకాపరి వలె రావణుని వద్దకు వచ్చి గొప్ప బలసాలి వలె వున్నావు , కొండచరియ యెక్కలేకపోతున్న నాగొర్రెను రక్షించకూడదా ! నోరులేని జీవాన్ని రక్షించి పుణ్యం కట్టుకో మని ప్రార్ధించగా , రావణాసురుడు శివలింగాన్ని నేలమీద పెట్టి గొర్రెను రక్షించేందుకు వెళ్లగా అప్పటి వరకు వున్న గొర్రె మాయమౌతుంది . విష్ణుమాయను గ్రహించిన రావణాసురుడు పరుగుపరుగున శివలింగాన్ని పెట్టిన ప్రదేశానికి వెళ్లి శివలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నించి విఫలుడౌతాడు . నేలపై అతుక్కున్న శివలింగాన్ని తాకగానే రావణాసురునకు తన తప్పు తెలుస్తుంది . తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆప్రదేశం లో మనస్సు శాంతించేంత వరకు పూజలు చేసి లంక కు మరలుతాడు .
తరవాత తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం కొరకు కైలాసం లో తిరిగి తపస్సు చేసుకోడానికి వెళతాడు .
శివుడు వైధ్యుడుగా రుగ్మతలను యేయే ప్రాంతాలలో పోగొట్టేడో ఆయా ప్రాంతాలలో శివుడు వైధ్యనాధుడుగా కీర్తింప బడ్డాడు . మన దేశంలో చాలా ప్రదేశాలలో శివుడు వైధ్యనాధునిగా గుర్తింపబడ్డాడు . అందులో మేము దర్శించుకొన్నవి యివి వైధ్యనాధ్ ధామ్ ( బీహార్లో వుంది , జ్యోతిర్లింగం అని అంటారు ) , పర్లి వైధ్యనాధం ( మహారాష్ట్ర , జ్యోతిర్లింగం అని అంటారు ) , వైథీశ్వరన్ కోయిల్ ( తమిళనాడు ) , భైధ్యనాథ్ ( ఉత్తరాంచల్ , రాణి ఖేత్ ) , భైధ్యనాథ్ ( కాంగ్రా , హిమాచల్ ప్రదేశ్ ) .
యెందరో దేవతలు , ఋషులు , మునులు పూజించి తమతమ రుగ్మతలనుండి విముక్తి పొందిన ప్రదేశం . ఇప్పటికీ దేశవిదేశావనుండి భక్తులు వచ్చి పూజించుకుంటున్నారు అంటే యెంత మహత్తువున్న ప్రదేశమో కదా !
కాంగ్రా లోయ లో ' ప్లాస్టిక్ సర్జరీ ' లు నిర్వహించినట్లు కిందట సంచికలో తెలుసుకున్నాం . చక్ర సంహిత , శుశ్రుత సంహిత గ్రంథాలు రచించిన ప్రదేశమని , యిక్కడి అడవులలో అనేకమైన మూలికలు లభించేవని ( యిప్పటికీ లభిస్తున్నాయని యిక్కడ అడవులలో తిరిగే సాధువులు చెప్పేరు ) ప్రతీతి .
ఉత్తర భారతం లో మనకి యెక్కువగా శివకోవెలలు కనిపిస్తాయి .
ప్రస్తుతం యీ మందిరం ఆర్కియాలజికల్ సర్వే వారి ఆధీనంలో వుంది .
చక్కని వాతావరణంలో , గలగల ప్రవహించే నదీ తీరంలో వున్న శివకోవెల మనస్సుకి ప్రశాంతతని చేకూరుస్తుంది . మనస్సు ప్రశాంతంగా వుంటే సగం రుగ్మతలు తొలగి పోయినట్లే , మిగతా సగం అక్కడి అడవులపై నుంచి వచ్చే గాలిని పీల్చడంతో పోతుంది .
ఆ మందిర పరిసరాలలో ఓ గంట సేపు గడిపి మేము పాలంపూర్ వైపు గా సాగిపోయేం .