హిమగిరి సొగసులు చూతము రారండి ( ఎనిమిదవ భాగం ) - కర్రానాగలక్ష్మి

కాంగ్రా లోయ --3

పాలంపూర్ ----


కాంగ్రా జిల్లాలో వున్న మరో ప్రముఖ పట్టణం పాలంపూర్ .  స్థానిక భాష లో నీటి వసతి  సమృద్ది గా వున్న ప్రదేశాన్ని ' పాలం  ' అని అంటారు . పూర్వం యీ ప్రాంతం ' జలంధర ' రాజ్యం లో వుండేది .

ఈ ప్రదేశాన్ని చూసిన తరువాత కొండలమీంచి అడుగడుగునా ప్రవహిస్తున్న సెలయేళ్లని చూసినతరువాత స్థానికులు పాలం అని ఈ వూరిని పిలవడం లో అతిశయోక్తి లేదు అని అనిపించక మానదు .

పాలంపూర్ కి దగ్గరౌతున్నగొద్దీ పెద్ద పెద్ద పైను వృక్షాలు , కొండవాలులలో పెరుగుతున్న ' తేయాకు తోటలు ' కనువిందు చేస్తాయి .

కాంగ్రా పట్టణానికి సుమారు 35 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేసి చేరుకోవచ్చు .

పాలంపూర్ గురించి చెప్పుకోవాలంటే ఓ చిన్న పట్టణం . మిలిటరీ కంటోన్మెంటు వున్న ప్రదేశం . సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే ఉత్తర భారత దేశపు ' డార్జిలింగ్ '  అంటే సరిపోతుంది .

మిగతా వేసవి విడుదలలకి ఊటీ కి తేడా యేమిటి అంటే ముఖ్యంగా  ' టీ ' తోటలనే చెప్పుకోవాలి . సిమ్లా , కులు , మనాలి , శ్రీనగర్ లలో టీ తోటల పెంపకం కనబడదు . పాలంపూర్ లో పండే తేయాకు మనదేశంలోకి అతి మేలైన రకంగా గుర్తించేరు . 1849 లో మొదటి సారిగా  ' ఆల్మోరా ' నుంచి తేయాకు ను తెచ్చి ఈ ప్రాంతం లో వేసేరు . అప్పటి నుంచి యిక్కడ ప్రముఖ పంటగా తేయాకు సంతరించుకుంది .

ఓ వైపు ఆకాశాన్ని అంటుకుంటున్నట్లున్న మంచుతో కప్పబడిన పర్వతాలు , గలగల ప్రవహిస్తున్న జలపాతాలు , మరో వైపు పచ్చిక మైదానాలతో అహ్లాదకరంగా వుంటుంది .

ఎనభైల తరువాత యీ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుంది . ప్రముఖ పర్యాటక స్థలంగా రూపొందించే నేపథ్యం లో ' కేబుల్ కారు ' , ' ఎంమ్యూజ్ మెంటు పార్కులు ' నిర్మించ బడ్డాయి . పర్యాటకుల నివాసనార్దం సౌకర్యాలు , భోజన సదుపాయాలు వచ్చేయి . పాలంపూర్ లోని ' పారాగ్లైడింగు ' ప్రపంచ ప్రసిధ్ది పొందింది అనే దానికి 2015 లో నిర్వహించబడిన ' ప్రపంచ పారా గ్లైడింగ్ ' పోటీల సాక్షం పాలంపూర్ పర్యాటక స్థలంగా నే కాక ప్రముఖ విద్యాకేంద్రం కూడా . ఉత్తర భారతదేశం లో ప్రధమస్థానం లో నిలచిన ఆయుర్వేద కళాశాల , అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రి వున్నాయి . వ్యవసాయ కళాశాల వున్నాయి .

నౌగల్ ---

పాలంపూర్ నగర శివార్ల లో  ' నౌగల్ ' సెలయేరు యెత్తైన పర్వతాలమీదుగా జారుతూ కనువిందు చేస్తుంది . అక్కడకి ఓ వంద మీటర్ల దూరంలో వున్న ' బుంద్లా ' జలపాతం , దానికి ఆనుకొని కట్టిన , ' కేప్టెన్ సౌరబ్ సింగ్ కాలియా ' పేరు మీద నిర్మించిన ' సౌరబ్  వన్ విహార్ ' ని సందర్శించొచ్చు .

పాలంపూర్ లో అడుగడుగునా కనిపించే ' ఖుమాని ' ఫలవృక్షాలు కనువిందు చేస్తాయి . ఈ జాతి వృక్షాలు జమ్ము - కశ్మీరు లోని శ్రీనగరు లోయలోను , పాలంపూర్లోనూ పెరిగే అరుదైన ఫలజాతి . బాగా పండిన పళ్లు పసుపు రంగులో కాస్త పెద్ద రేగుపండు సైజులో వుంటాయి

జ్వాలాముఖి----

కాంగ్రా లోయ లో వున్న మరో ప్రముఖ పుణ్యక్షేత్రం ' జ్వాలాముఖి ' . ఉత్తర భారతీయులు ' జ్వాలాజీ ' గా వ్యవహరిస్తారు . సముద్ర మట్టానికి సుమారు 610 మీటర్ల యెత్తులో సిమ్లా - ధర్మశాల హైవే మీద , కాంగ్రా పట్టణానికి  సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామం . ఇక్కడ మందిర ట్రస్టు వారిచే నడపబడుతున్న విశ్రాంతి భవనాలు , చాలా కొద్దిగా  స్థానికుల నివాసాలు కలిగిన చిన్న గ్రామం .

జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్దం చెప్తారు . అందుకనేనేమో యిక్కడ మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడలనుంచి , చిన్న నీటికుండం గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చెస్తూవుంటారు . శ్రీయంత్రం వున్న ప్రదేశంలో యెర్రని శాలువ తోను బంగారు ఆభరణాలతోనూ కప్పి వుంచుకారు . శ్రీ యంత్రానికి యెర్ర వస్త్రం , పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూవుంటారు . ఈ అమ్మవారి మందిరం లో సిక్కు మతస్థుల వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తూ వుంటుంది . అలాగే నూతన వధూవరులు అమ్మవారి దర్శనార్థం రావడం కూడా వుంది .

గోరఖ్ నాధ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు , మందిర ప్రాంగణం లో వున్న గోరఖ్ నాధ్ మఠం దగ్గర కింద రాతి నుండి వస్తున్న ' జ్వాల ' ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .

ఇనుప గేట్లు కట్టిన నీటి కుండం లో నీటిలోంచి వస్తున్న ' జ్వాలలు ' పర్యాటకులను అబ్బుర పరుస్తాయి .

ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్దపెద్ద పళ్లేలలో పళ్లు , పూలు , పసుపు కుంకుమ యెర్రవస్త్రం తో పాటు తీపి వంటకాలను సమర్పిస్తూవుంటారు . అమ్మవారి భక్తులలోఅధిక సంఖ్య లో సిక్కులు కనిపించడం మాకు ఆశ్చర్యం కలుగజేసింది .

పూర్వం కటోచ్ వంశానికి చెందిన ' మహారాజా భూమా చంద్ ' దుర్గాదేవికి పరమభక్తుడు . ఒకరోజు భూమా చంద్ కు స్వప్నం లో అమ్మవారు కనిపించి తాను  ' జ్వాల ' గా ఆ అడవులలో పూజా నైవేద్యాలు లేక పడి వున్నట్లు తనను వెలికి తెచ్చి నిత్యపూజలు నిర్వహించ వలసినదిగా శలవివ్వగా మహారాజు ఆ అడవులలో వెతికి అమ్మవారిని కనుగొన్నారు ఆమెకు కోవెల కట్టించి నిత్యపూజలు నిర్వహించసాగేడు .

సిక్కుల మతగురువు ' గురు నానక్ ' యీ ప్రదేశానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం నచ్చడం తో తపస్సు చేసుకుంటాడు . ' గురునానక్ ' పై శతృత్వము  పెంచుకున్న ' అక్బరు ' ' నానక్ ' దేవతగా పూజలు చేస్తున్న జ్వాలలను ఆర్పాలని ఆ ప్రదేశాన్ని కొన్ని నెలల పాటు నీళ్లతో నింపి వుంచుతాడు . కొన్ని నెలల తరువాత కూడా మంటలు ప్రజ్వలిస్తూ వుండడాన్ని చూసిన అక్బరు నానక్ ను మహాపురుషుడిగా అంగీకరించి , అమ్మవారికి బంగారు ' ఛత్రి ' ని సమర్పించి అమ్మవారికి క్షమార్పణ అడిగి ఢిల్లీ మరలిపోతాడు .

 ఘోరక్ నాధ్ యిక్కడ తపస్సు చేసుకొని అనేక సిద్ధులు పొందినట్లు వారి శిష్యులు చెప్తారు .

815 లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో సహా పాలరాతి మందిరం నిర్మించేడు .

 పెద్ద పెద్ద మంటపాలలో ఓ పక్క  సామూహిక వివాహాలు జరుగుతూ వుంటాయి .

మరో పక్క మంటపం లో నేపాలీ రాజు బహూకరించిన పెద్ద ఇత్తడి గంట వుంచేరు .

ఈ మందిరం లో ముఖ్యంగా యేడు జ్వాలలను దర్శించుకోవాలి అదే అమ్మవారి రూపం .

అమ్మవారికి ' దుర్గా శప్తశతి ' పారాయణతో అయిదు దశలుగా పూజలు , హారతి , హోమాలు నిర్వహిస్తారు . ప్రతీ రోజు 11-30 నుంచి 12-30 వరకు మద్యాహ్నపు హారతి కోసం మూసివేస్తారు . మిగతా సమయం  అంటే రాత్రి 8-30 వరకు మందిరం తెరిచే వుంటుంది .
మందిరం వెనుక భాగాన ఆరు అడుగుల లోతులో వేడినీటి బుగ్గలు వున్నాయి .

ఈ మందిరం గురించిన స్థల పురాణం తెలుసుకుందాం ----

దేవీ భాగవతం ప్రకారం సతీదేవి దక్షవాటికలో ఆత్మత్యాగం చేసుకున్న తరువాత సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అవి అష్టాదశ పీఠాలుగాను , 51 వ పీఠాలుగాను , 108 పీఠాలుగాను వుద్భవించేయి . ఆ 51 పీఠాలలో సతీ దేవి యొక్క ' నాలుక ' పడ్డ ప్రదేశం యీ జ్వాలాముఖి క్షేత్రం .

సిధ్దిద( సిధ్దులను ప్రసాదించేది ) ఉన్మత్తభైరవ ( కాలభైరవుడు) క్షేత్రంగా కూడా ప్రసిద్ది పొందింది .

 సిద్ధులు అవీ అలా వుంచితే ప్రశాంత వాతావరణం లో వున్న యీ మందిరం మనకి ప్రశాంతతను కలుగజేస్తుంది అనడంలో యెటువంటి సందేహంలేదు .

మళ్లా వారం మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తానని మాట యిస్తూ శలవు .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి