వృక్షములు - జీవ సంరక్షకులు - -హైమాశ్రీనివాస్

vrukshamulu  - jeeva samrakshakulu

నారికేళము - కొబ్బరి చెట్టు .

భారతీయ సంస్కృతిలో నారికేళానికి ఉన్న ప్రముఖ స్థానం మరి దేనికీ లేదని  చెప్పవచ్చు. కొబ్బరికాయ కొట్టందే ఏపూజా సమా ప్తం  కాదు. ఆలయానికి వెళ్ళేఅప్పుడు గుడిబయట ఉన్న కొబ్బరికాయల షాపులో ఒక మంచి కాయ కొని బుట్టలో ఉంచు కుని లోని కెళతాం.నారికేళం సమర్పయామి అని చేయి త్రిప్పుతూ నివేదన చేశాకే దేవునికి హారతి. కొబ్బరి మట్టలను స్థంభాలకు కట్టందే పండుగలూ, పబ్బాలూ, ఉత్సవాలకూ ,ఊరేగింపులకు అలంకారం  పూర్తి కాదు. ఇలా కొబ్బరికాయ హిందు వులకు ఒక ముఖ్య మైన పూజా ద్రవ్యమైంది అన్ని శుభకార్యాలకూ దైవసంబందమైన  కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే. ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపైఉన్నమూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు. కొబ్బరి కాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలం.దేవ తలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.

నగరాల్లో సైతం నేడు అపార్ట్ మెంట్స్ కాకుండా  నేలమీద ఇళ్ళు కట్టుకునే వారు కొబ్బరి చెట్లను ఇళ్ళ ముందు వేసుకోడం చూస్తుం టాం. అందానికేకాక ఆదాయానికీనీ. కనీసం మన ఇంటివరకూ వాడుకకు కొబ్బరికాయలు, కొబ్బరి ఈనేలూ, కొబ్బరి బోండాలు అందుతాయి.

పెళ్ళికూతురు  బాగా అలంకరించిన  కొబ్బరిబోండాన్ని తన రెండు అరచేతులతో పట్టుకుని పెళ్ళిపీటల మీదికి వస్తుంది. కొత్త ఇంట్లో అన్ని మూలలా , అన్ని గుమ్మాల వద్దా  కొబ్బరికాయ కొట్టవలసిందే. మనదేశంలో ఎంతోమంది  కొబ్బరితోటల్లోనూ, కొబ్బరి  నుండీవచ్చే దిగుబడుల్లోనూ పనిచేస్తూ జీవనం  సాగిస్తున్నారు. కొబ్బరి కాయను దృష్టి తీసి  అనారోగ్యం నుండీ కోలు కున్నవారికీ, ఏదైనాప్రదర్శనలు అవీ ఇచ్చిన వారికీ పదిమందీచూసినపుడు దృష్టి దోష నివారణార్ధన్ చుట్టూ త్ప్పి కొట్టడమూ ఒక అలవాటు.కొబ్బరిచెట్టును కౌశికఫలము, తేమ్రాను, నారికేళము, నాళికేడము, ఫలకేశరము, ముండఫలము, వరఫలము,టెంకాయ,  విశ్వామిత్రప్రియము, శిరఃఫలము, సదాఫలము, టెంకాయ అనికూడా అంటారు.

కొబ్బరి మనకు ఒక ముఖ్యమైన వృక్షం. ఇది కొమ్మలు లేని చెట్టు. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' . కోకాస్ ప్రజాతిలో ఇదేఏకైక జాతి వృక్షం . ఇవి ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లో ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు వరకూ ఎదుగుతుంది. కొబ్బరి చెట్లకు  కాచేవే కొబ్బరికాయలు.  దీనిని అనేక రకాల ఆహార పదార్థాలలో అనేకరకాలుగా మన వంట గదిలో స్థానం సంపా దించుకుంది.  కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. దీని జీవితకాలం షుమరుగా 100 సంవత్స రాలు గాచెప్పవచ్చు. ఏడేళ్లకే  ఇది పూతపూస్తుంది.కొన్ని కొబ్బరి చెట్లు మూడేళ్ళ కే పూత వేస్తాయి. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది.

దీనిని కల్పవృక్షం - అంటారు. ఎందుకంటే ఈచెట్టులోని అని భాగాలూ మానవులకు ఉపయోగిస్తున్నాయి కనుక. కృష్ణ గోదావరీ ప్రాంతాల్లోనూ ఇంకా అనేక ప్రాంతాల్లో రైతులు కొబ్బరి తోటల మీది ఫలసాయంతో జీవనం గడుపుతారు.

ఒకమారు పల్లెనుండీ నగరంలోని సంతలో తమ వస్తువులను అమ్ముకోను ముగ్గురు వ్యాపారులు గాడిదలమీద బస్తాల్లో వస్తువులు నింపి బయల్దే రారుట. వారు ఒక నది దాటాల్సి ఉందిట. ఆనదికి ఉన్నట్లుండి వరద వచ్చిందిట. ఒక గాడిద మీద ఉప్పుమూటలు వెసుకుని వెళ్ళే వ్యాపారి నీరు తగిలి ఉప్పుమూటలు బరువెక్కగా ఆ  గాడిద నీటిలోకి మునిగిందిట, ఉప్పు మూటలన్నీ నిళ్ళలోపడి ఉప్పుకరిగి పోయిందిట. రెండోవ్యాపారి తన గాడిదమీద పప్పు మూటలు వేసుకుని ఉన్నాడు . ఆ     గాడిదా మొదటిదాన్ని చూసి నీళ్లలో మునిగింది. పప్పంతా తడిసి పోయింది.మూడో వ్యాపారి తన గాడిదమీద కొబ్బరి బోండాలు వేశాడు. మొదటి రెండింటినీ చూసి ఆగాడిదా నీళ్ళలో మునిగింది. మొదటి ఉప్పు వ్యాపారి ఏడ్చి ఊరు కున్నాడుట. రెండో పప్పు వ్యాపారి పడీపడీ ఏడ్చాడుట.మూడో బోండాల వ్యాపారి పొర్లీ పొర్లీ ఏడుస్తూనే ఉన్నాడుట. నిజానికి ఉప్పు నీట ములిగితే కరిగి పోతుంది, అంతా నష్టమే.పప్పు నీరు తగిలితే పాడౌతుంది, కానీ కొంతైనాపనికి వస్తుంది. కొబ్బరి బోండాలు వందరోజులు నీటిలో ఉన్నా కాస్తైనా పాడవవు.కానీ కొబ్బరిబోండాల వ్యాపారి పొర్లీపొర్లీ ఊరికే నష్టం వాటిల్ల కుండానే ఏడ్చాడు. అది ఇతరుల జాలి కోసం అన్నమాట. అదో చిన్నకధ. కొబ్బరికాయలు నీటిలో ఉన్నాపాడవవు. కోతికి కొబ్బరికాయ చిక్కినట్లు - అనే సామెత అంటేకోతులు కొబ్బరి చెట్టెక్కి కాయలు కోసి క్రిందపడేసి నష్టం కలిగిస్తాయి. వాటి పీచు వలుచుకుని , కొట్టుకుని తినను చేతకాదనే అర్ధంలో ఈ సామెత వచ్చింది. ఐతే నేటి ఆధునిక కోతులు మానవుల తెలివి పెరిగినట్లే వాటి తెలివీ పెరిగి లేత కొబ్బరి బోండా లను కోసుకుని గోళ్ళతో పీకి నోటితో కొరికి నీరు గుటగుటా త్రాగడం మనలో  ఎంతోమంది చూసే ఉంటారు. సామెతలను తిరగరాయాల్సిన పరిస్థితి ఇది. 

కొబ్బరిచెట్టు మనకు అనేక వస్తువులను  ప్రసాదిస్తున్నది. ఆహారానికే కాక అనేక నిత్యావసర వస్తువులనూ  మనకు అంది స్తున్నది. ప్రతి ఇంటా పూజలలో, పెళ్ళిళ్ళలో, ఉత్సవాలలో ,ఊరేగింపుల్లో వ్రతాల్లో ,నోముల్లో ఇంకా అనేకానేక సందర్భాలలో  కొబ్బరి కాయలను మనం వాడుతుంటాం.కొబ్బరిబోండాం ముత్తైదువులకు తాంబూలంతో ఇవ్వడం మన సాంప్రదాయం. వేసవి లో కొబ్బరి బోండాలకు గిరాకీ .
ఈ కొబ్బరికాయలోని  నీళ్ళ లో 'ఎలెక్ట్రోలిటిక్ ' ఉంటుంది. దానివల్ల ఎవరికైనా మూత్ర విసర్జనలో ఏదైనా ఇబ్బందులు కలిగినా ,జలోదరానికీ, డయేరియా వలన శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను త్రాగిస్తే స్వాంత న పొందు తారు. కడుపులో మంట ,  పేగుల మంటను ఈ కొబ్బరి నీరు తగ్గిస్తుంది.అసిడిటి కి కూడా బాగా పని చేస్తుంది.శరీరంలో పొటా షియం తగ్గితే తిరిగి శరీరానికి సరఫరా చేస్తుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరాక  దానిలో ఉన్న నీరు జెల్లీ లాగా తయారవు తుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. ఇది రుచికరంగా ఉండి ,సులభంగా జీర్ణమవుతుంది. దీనినిండా  మాంస కృత్తులే.ఎండు కొబ్బరి నుండీ నూనె తీస్తారు. దాన్ని తలకు రాచుకుంటే కళ్ళుమంటలు లేకుండా, జుత్తు నల్లగా నిగనిగ లాడు తుం టుం ది.  స్నానానికి ముందుగా ఒంటికి రాచుకుని పది నిముషాలు ఆరనిచ్చి   స్నానంచేస్తే చర్మం మృధువుగా ఉంటుంది. కేరళీ యులు కొబ్బరి నూనె తోనే అన్నివంటలూ చేస్తారు.మనదేశంలోని కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి.   

ఇహ పచ్చి కొబ్బరే కాక ఎండు కొబ్బరిని కూడా వంటల్లోకీ , పిండి వంటల్లోకీ కూడా వాడుతారు.పచ్చి కొబ్బరి తురిమి కూరల కూ, చట్నీలకూ, స్వీట్ల తయారీకీ వాడతారు.కొబ్బరి ఉండలూ, లౌజూ కమ్మని తీపి వంటకం  బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకా ళ్ళ నొప్పులు ఉండవు.  కొబ్బరికాయను అందరూ శుభప్రధంగా భావిస్తారు. మనదేశంలో శుభకారార్యాలకు కొబ్బరి కాయ తప్పనిసరి.కొబ్బరికాయలో ఉన్న  లారిక్ యాసిడ్ వలన  తల్లి పాలకు దీటుగా శక్తినిస్తుంది.కొబ్బరిపాలతో చేసిన వెజిట బుల్ పులావ్ రుచి తిన్న వారికితప్ప చేసినవారికీ, చూసినవారికీ, కూడా తెలీదు.  

కొబ్బరిచెట్టు లోని అన్ని  భాగాలూ మానవులకు ఉపయోగపడు తున్నాయి.అందుకే దీనిని కల్పవృక్షము అని ముందే చెప్పు కున్నాం కదా!.  'ప్రపంచ శ్రీ ఫల దినోత్సవం గా 'కొబ్బరి కాయ దినోత్సవాన్ని జరుపుకోడం వేలం వెర్రేంకాదు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ రెండు న కొబ్బరి కాయల దినోత్సవం అన్నమాట.కొబ్బరి కాయల ప్రత్యేకత ఏంటంటే ఇది అన్నికాలాల్లోనూ లభించ డం. బాగా ముదిరిన కొబ్బరి కాయ చాలాకాలం పాడవ కుండా నిలువ ఉండటం. కొబ్బరి బొండం నీటి లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . వేసవి కాలములో ప్రపంచదేశాలన్నింటిలోనూ లభ్యతను బట్టి కొబ్బరి నీరుత్రాగను అంతా ఇష్ట పడతారు ఎందుకంటే వేడిని తగ్గిచి, శరీరాన్ని చల్ల బరుస్తుంది గనుక.కొబ్బరినీటిలో విటమిన్ ఎ,బి , సి, రైబోఫ్లెవిన్ , ఐరన్ , కాలసియం ,ఫాస్పరస్ , కార్బోహైడ్రేట్లు ,కొవ్వు ,ప్రోటీన్లు సమృద్ధి గా లభిస్తాయి .

ముదిరిన కొబ్బరి కాయ లో  తెల్లని పువ్వు ఏర్పడు తుంది ఇది స్త్రీల  గర్భాశయానికి మేలు చేస్తుంది .కొందరు ప్రతిరోజూ కొబ్బరి నీరు త్రాగుతారు,ముఖ్యంగా వేసవిలో . అలాంటివారికి మూత్రపిండాల సమస్యలే రావు.

కొబ్బరి నూనెలో 50% ఉండే లారిక్ ఆసిడ్ ఉండటం వల్ల దీన్ని వంటల్లో వాడితే గుండెకు రక్తప్రసరణ సమంగా అయ్యేలా సహక రిస్తుంది.  కొబ్బరి నూనే లో ఉండే విటమిన్ 'ఇ ' వలన దీన్ని శరీరానికి రాచుకుంటే చర్మాన్ని కోమ లంగా , మెత్తగా ఉండేలా చేస్తుంది.కొబ్బరి పాలు చర్మానికి మలాం చేస్తే  మృతకణాలు , మురికి వదులుతాయి .

దీనికి కొమ్మలుండవు. పైన గొడుగులా ఆకులు ఇంచు మించు వృత్తాకారం లో విస్తరించి ఉంటాయి.ఈ ఆకులను మట్టలు అంటా రు .పొడవుగా మధ్యలో సన్న ఈనెలతో కూడిన  ఆకులు గాలికి కదులుతుంటే ఒక లాంటి సంగీతం వింటు న్నట్లు ఉంటుంది.
ఇహ కొబ్బరిచెట్టు మిగతా భాగాలు ఎలా మానవులకు ఉపయోగిస్తాయో చూద్దాం.కొబ్బరి పీచు తో తాళ్ళు అళ్ళుతారు. వీటితో నూతినుండీ నీరు బావిగిలక మీంచీ తోడు తారు. కొబ్బరి తాళ్లతో ,పీచుతోనూ వాకిలి ముందు పట్టలు అంటే డోర్ మ్యాట్స్ తయా రు చేస్తారు.పీచును మెత్తగా చేసి  పరుపులు , సోఫాలకు కూషన్స్ తయారు చెస్తారు. కొబ్బరిఆకులతో  చాపలు,  బుట్టలు, గంప లు అల్లి అమ్ముకోడం ఒక వృత్తేకాక జీవనాధారం కూడానూ. వాటిని అల్లేవారి నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది, ఐతే రాబడి మాత్రం  వారి పొట్టను కూడా నింపదు.  
కొబ్బరి ఆకులు వేసవిలో ముఖ్యంగా గ్రామాల్లో పెళ్ళిళ్ళూ,ఆలయాల్లో తిరునాళ్ళూ జరిగేప్పుడు పందిళ్ళు వేయనూ ఇంటి పైకప్పుల పైన వేసవిలోచల్ల దనం కోసమూ వేస్తారు. ముఖ్యంగా భరతీయ సంస్కృతిలోని ఆచారాలప్రకారం ఆడపిల్ల వ్యక్తు రాలైనపుడు కొబ్బరిమట్టలమీద కూర్చోబెడతారు.

కొబ్బరి మట్టల నుండీ తీసిన ఈనెలతో మన గృహాలు శుభ్రపరచే చీపురు తయారు చేసుకుంటున్నాం. కర్రకు ముకోణా కారంలో పుల్లలు కట్టి తయరుచేసే వీధు చిమ్మే చీపుర్లు కూడా కొబ్బరిఈనెలనుండీ తయారు చేసినవే.  కొబ్బరి చెట్టు కాండాన్ని  ఇంటికి  దూలాలుగానూ, స్తంభాలు గానూ  వాడతారు.కొబ్బరి, తాటి జాతికి చెందినదిగా చెప్పవచ్చు. రెండింటి ఉపయోగాలూ ఒకేగా ఉండటం ,వాటి అన్ని భాగాలూ మానవులకు ఊపయుక్తంకావడం విశేషం 

చాలా కాలం క్రితం పోర్చుగీసు, స్పెయిన్లకు చెందిన నావికులు ఓడలపై దేశదేశాలు తురుగుతుండగా వారు  ఒక తీరంలో మొదటిసారి కొబ్బరి చెట్టును చూశారు. ఆ చెట్టు కాయ వాళ్లకి చాలా తమాషాగా కనిపించి ఒలిచి చూశారుట. . లోపల మూడు కళ్లతో కోతి ముఖంలాగా కనిపించింది. వెంటనే 'కోకో నట్' అన్నారుట. వారి భాషల్లో కోకో -- అంటే కోతి ముఖమని అర్థంట.. అలా పుట్టిన ఈ పదం తొలిసారిగా 1555లో ఆంగ్ల  నిఘంటువుల్లో చోటు చేసుకుంది.

ప్రతి పూజలోను ప్రముఖ పాత్ర వహించే కొబ్బరికాయకు 'మూడు కళ్ళూ అంటే పైన మూడు గుంతల్లాంటి మచ్చలు ఉంటాయి. కొన్నింటికి  రెండు కళ్ళు కూడా ఉందవచ్చు. ఒక కన్ను మాత్రమే ఉండే కొబ్బరికాయ కూడా లభిస్తుందిట. ఒకే కన్నుగల టెంకా యను 'ఏకాక్షి నారికేళం'అని అంటారు. లక్ష్మీదేవి  స్వరూపంగా  భావించే ఈ టెంకాయ దొరకడం చాలా రేర్ . లక్ష్మీదేవి పూజలో ఏకాక్షి  నారికేళం ప్రాధాన్యమైనది గాభావిస్తారు. దీనితో  పూజ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని విశ్వాసం. ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో వుంచుకుంటే సర్వదా సర్వ లాభాలూ  సుఖసంపదలు స్వంతమవుతాయని నమ్మిక. కొబ్బరికాయ మూడుకన్నుల్లో కుడివైపుది సూర్యనాడిగానూ  , ఎడమవైపుది చంద్రనాడిగానూ  , మధ్యలోకన్ను బ్రహ్మ నాడి గానూ భావిస్తారు.పీచు ఈమూడు నాడులనూ సమన్వయపరుస్తుమి. పీచు తీసేస్తే అసలైన మోక్ష ఙ్ఞానం కలుగుతుంది., కాయకొట్టి భగవంతునికి నివే దించేముందు పీచుతీస్తాము.   కొబ్బరి పీచుతోనూ, కొబ్బరి తీసేసాక వచ్చే చిప్పతోనూ అనేక ఆటవస్తువులు చేస్తారు.

నేత్ర వ్యాధులకుకొబ్బరి బాగా పనిచేస్తుంది.కొబ్బరిపెంకునుండీ తీసినతైలం చర్మ వ్యాధులకు పనిచేస్తుంది. ఆయుర్వేదం, సిధ్ధ , యునానీ   వైద్యాల్లో కొబ్బరినూనె వాడుతారు.                               

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి