వాషింగ్టన్ డి.సి.
వాషింగ్టన్ డి.సి అంటే, వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజధాని. పొటోమేక్ నదీ తీరాన వున్నది. అమెరికా విప్లవానికి నాయకత్వం వహించిన సైనిక నాయకుడు జార్జి వాషింగ్టన్ జ్ఞాపకార్ధం ఆయన పేరు రాజధానికి పెట్టబడింది. అయితే ఈ పేరుతో ఇంకా వేరే నగరాలు కూడా వుండటంతో దీనిని గుర్తించటానికి ఇది కొలంబియా రాష్ట్రంలో వున్నది కనుక డి.సి. అని పక్కన రాస్తారు.
ఇది ఒక అద్భుత నగరం. దీనిని పూర్తిగా చూడాలంటే అనేక రోజులు పడుతుంది. మేమున్న రెండు రోజులలో చాలా ఎక్కువ తక్కువ చూశాము. ఎక్కువ ఎందుకంటే ఒక్క నిముషం కూడా వృధా చెయ్యకుండా ఉపయోగించుకోవటం వల్ల వున్న సమయంలో చాలానే చూశామని చెప్పవచ్చు. అక్కడ వున్న వాటిలో అతి తక్కువ చూశాము కనుక తక్కువ చూశాము. పిల్లలు మా గురించి చాలా జాగ్రత్త తీసుకున్నారులెండి. చూడదగినవి ముందు లిస్టు చేసుకున్నారు. మా ఓపిక గురించి కూడా చూస్తూ జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఈ ప్రదేశాలన్నీ కారులో తిరగటానికి వీలుండదు. పార్కింగు కి ఇబ్బంది. అందుకే కారు ఒక చోట పార్కు చేసి నడవాల్సి వచ్చింది. మధ్యలో కొంత బస్. కొంత దూరం తిరిగేసరికి నేను నడవలేక పోయాను. కదలలేని పరిస్ధితి. చూడటానికి చాలా వున్నాయి, చూడాలి. మావాళ్ళు ఏదో ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చారు. స్పోర్ట్స్ పర్సన్స్ వాడతారు ఎనర్జీ కోసం, ఎక్కువ తాగ కూడదు, ప్రస్తుతానికి నువ్వు తాగు అన్నారు. మనకలాంటివి అలవాటు లేదాయే. అందులో ఏముందో, నాకెలా పనిచేస్తుందో అనే అనుమానాలతో తాగకుండా కొంచెం సేపు చూశాను. పిల్లల వివరణతో తప్పక సగం తాగాను. చిత్రం. కాళ్ళ నొప్పులు తగ్గి ఓపిక వచ్చింది. తర్వాత అన్నీ చూశాను, అంతే కాదు మిగతా సగం డ్రింక్ కూడా మధ్యలో తాగేశాను.
ఇక్కడ అమెరికా అద్యక్షుడి నివాసం వైట్ హౌస్ తో బాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, కాంగ్రెస్ అద్యక్షుడి భవనం వగైరా అనేక అంతర్జాతీయ సంస్ధల ప్రధాన కార్యాలయాలు వున్నాయి. అంతేకాదు అనేక జాతీయ స్మారక చిహ్నాలు, పెద్ద పెద్ద మ్యూజియంలు వున్నాయి.
ఆ భవంతులు, ఆ రోడ్లు ఎంత చూసినా తనివి తీరదు. మేము చూసిన విశేషాలు చెబుతాను.
వైట్ హౌస్
ముందుగా అమెరికా అధ్యక్షులవారి శ్వేత సౌధానికి వెళ్ళాము. రోడ్డు మీదనుంచి చూడటమే. లోపలకి వెళ్ళటానికి పర్మిషన్లు వగైరాలుంటాయేమో తెలియదు. ఎందుకంటే మాకున్న తక్కువ సమయంలో మేము అలాంటి ప్రయత్నాల గురించి ఆలోచించను కూడా లేదు. బయటనుంచి మామూలుగా వున్నది. ప్రెసిడెంటుగారు ఈ రోడ్డులోంచి వస్తారు వగైరాలేవో చెప్పారు కానీ, ఇంత కాలమయింది కదండీ ఇంకా ఎక్కడ గుర్తంటాయి. అయినా ఫోటో తెచ్చాను కదా .. చూసెయ్యండి.
జాతీయ మాల్
ఇది డౌన్ టౌన్ లోని పెద్ద ఉద్యానవనం. ఇక్కడ ప్రదర్శనలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. దీనిలోనే వాషింగ్టన్ స్మారక చిహ్నం, జఫర్సన్ పియర్ వున్నాయి. లింకన్ మెమోరియల్, వైట్ హౌస్, రెండవ ప్రపంచ యుధ్ధ జాతీయ స్మారక చిహ్నం, అనేక ప్రఖ్యాతిగాంచిన మ్యూజియంలు, ప్రసిధ్ధ బిల్డింగులు దీని చుట్టుపక్కలే వున్నాయి.
లింకన్ మెమోరియల్
అమెరికా దేశపు జాతీయ స్మృతి చిహ్నం ఇది. అమెరికా 16వ రాష్ట్రపతి అబ్రహం లింకన్ జ్ఞాపకార్ధం నిర్మింపబడింది. శిల్పి హెంరీ బేకన్. రోజూ వేలాదిమంది ప్రజలు దీనిని తిలకిస్తారుట. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా దర్శించవచ్చు. ప్రపంచ చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయిన మాజీ అద్యక్షుడు అబ్రహాం లింకన్. అమెరికా అంతర్యుధ్ధం సమయంలో అత్యంత కార్య దక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుధ్ధం ముగిసే సమయంలో హత్యగావించబడ్డాడు.
అబ్రహాం లింకన్ ఇల్లు
లింకన్ నివసించిన ఇల్లు .. చివరికి మరణించిన ఇల్లు. ఇంటి ముందు బోర్డు వున్నది. ... లింకన్ ఈ ఇంట్లో 4-15-1865లో ఉదయం 7-22 కి మరణించాడు. యునైటెడ్ స్టేట్స్ చే 1896 లో కొనబడింది. ....
సందర్శన సమయాలు ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.