ఔరా...! అనిపించే అంత్యక్రియలు
అంత్యక్రియలు అనగానే ఒకరకమైన విచారకర భావాలు చోటుచేసుకుంటాయి. కాని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని తెగల్లో జరిగే అంత్యక్రియల తంతు చూస్తే మాత్రం ఔరా అని ఆశ్చర్యం కలగడంతో పాటు వింతగా కూడా ఉంటాయ్. అలాంటి విడ్దూరమైన, విచిత్రమైన అంత్యక్రియల కథనాలను చూద్దాం.
పక్షి జాతులకు ఆహారంగా శవాలు :
పర్షియన్ దేశంలో శవాల అంత్యక్రియల గురించి వింటే మాత్రం చాలా ఆశ్చర్యంతో పాటు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇక్కడ శవం వృధాగా మట్టిలో కలిసిపోకుండా పక్షుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో, మరణించినవారి శరీరాన్ని గ్రద్దలు, రాబందులకు ఆహారంగా వేస్తారట. అయితే ఇప్పుడిప్పుడే ఈ పద్ధతి మారుతోందట. రానురాను రాబందులు తగ్గిపోవడంతో శవాలపై సోలార్ ప్లేట్లను ఉంచి, వాటి వేడికి శవాలు దహనమయ్యేలా అంత్యక్రియలు చేస్తున్నారట.
మగాడిని ఒంటరిగా సాగనంపారు....
చైనాలో కొన్ని ప్రాంతాల్లో మరీ విచిత్రమైన పద్ధతిలో అంత్యక్రియలు జరుపుతారు. ఇక్కడ పురుషులు మరణిస్తే వారికి ఒంటరిగా అంత్యక్రియలు చేయరు. మరో మహిళ శవాన్ని వెతికి తెచ్చి మరణించిన పురుషుడి పక్కనే పెట్టి ఖననం చేస్తారట.అలా మహిళ శవాన్ని తేవడం కోసం అక్కడ శవాల దొంగతనాలు కూడా జరుగుతాయట. సమాధులను తవ్వి మహిళల దేహాలను దొంగతనంగా తీసుకువెళ్ళి అమ్ముకోవడం కూడా జరుగుతుందట. అల స్త్రీ దేహం దొరక్కపోతే ఎదైనా లోహంతో గానీ, పిండితో గానీ స్త్రీ బొమ్మను తయారుచేసి దానితో అంత్యక్రియల తంతు కానిస్తారు. ఇలా మహిళ శవం గానీ, బొమ్మ గానీ తోడు పంపకుండా ఆ పురుషుడి అంతిమయాత్ర చేస్తే ఆ పురుషుడి శవం మళ్లి లేచి వచ్చేస్తుందని అక్కడివారి నమ్మకమట. దాదాపు 17 వ శతాబ్దం నుంచి ఈ ఆచారం ఇలాగే కొనసాగుతుందట.
పుర్రెకోబుద్ధి :
ఎవరైనా కొంచెం విచిత్రంగా ఉంటే వారిని చూసి పుర్రెకోబుద్ధి అంటూ ఉంటారు. అలాంటి విచిత్రమైన బుద్ధి పుట్టింది చైనాలోని డెయంగ్ కి. కొద్దిపాటి బంధువులు తప్ప కుటుంబం అంటూ ఎవరూ లేని డెయంగ్ కి తాను మరణిస్తే తనకు ఎవరైనా అంత్యక్రియలు చేస్తారో, చెయ్యరో అన్న సందేహం వచ్చిందట. దాంతోపాటు తన అంతిమయాత్ర జరుగుతున్నపుడు ఎవరెవరు వస్తారు...తనగురించి ఏం మాట్లాడుకుంటారు? అన్న సందేహం వచ్చింది. ఎలాగైనా దానిని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఇంకేముంది... డెయంగ్ చనిపోయాదు, ఫలానా దగ్గర ఘనంగా అంత్యక్రియలు జరుగుతున్నాయంటు అందరికీ తెలిసేలా చేసాడు. సహజమైన అంత్యక్రియలకు జరిగే అన్ని ఏర్పాట్లు చేసేసాడు. అనుకున్న సమయానికి చక్కగా ముస్తాబయి వచ్చేసాడు. అందరు చూస్తుండగానే అప్పటికే తన శవాన్ని పూడ్చడం కోసం సిద్ధం చేసిన గోతిలో కెళ్ళి పడుకున్నాడట. ఈ ఏర్పాట్ల కోసం దాదాపు లక్షన్నర పైనే ఖర్చు పెట్టాడట డెయంగో. ఈ నకిలీ అంత్యక్రియలకు వచ్చిన వారందరు పనిలోపనిగా నకిలీ శవంతో సెల్ఫీలు తీసుకునే పనిలో బిజీ అయిపోయారట.
వింత కోరికలు – విచిత్ర వీడ్కోలు
కొందరు వింత మనస్తత్వం గలవారు విచిత్రమైన కోరికలు కోరుకుంటారు. వారికి అన్నీ విభిన్నంగా ఉండాలి. చివరికి తమ అంత్యక్రియలు కూడా వినూత్నంగా జరగాలనుకుంటారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఉండాలనుకుంటారు. అలాంటి వారికి డల్లాస్ లోని గోల్డెన్ గేట్ స్మశానవాటికలో అన్ని సదుపాయాలు కల్పిస్తారట. క్రిస్టోఫర్ రినేరా అమోరా అనే బాక్సింగ్ క్రీడాకారుడు. అతని జీవితమంతా బాక్సింగ్ కే అంకితం. తన ఊపిరి, ప్రాణం అన్ని బాక్సింగే అని భావించేవాడు. బాక్సింగ్ ను అంతగా ఇష్టపడే అతని అభిరుచి కూడా అతని తుది పయనంలో ఉండాలనుకుంది. అతని తల్లి. బాక్సింగ్ అంటే ప్రాణమిచ్చే అతని కోరిక మేరకు బాక్సింగ్ రింగ్ లోనే అతని అంత్యక్రియలు జరిగేలా ఏర్పాట్లు చేసారట. అతని కోరిక ప్రకారం అతని చేతికి గ్లవ్స్ తొడిగి బాక్సింగ్ రింగ్ లో ఎలా అయితే ఉంటారో అలాగే నిలబెట్టి అతడిని సాగనంపారట.
స్వయంగా తయారు చేసుకున్న శవపేటికలో....
పోలండ్ కు చెందిన ఫ్రెడ్ గుంటేర్గ్ అంతిమయాత్ర చూస్తే మరీ విచిత్రం అనిపిస్తుంది. ఫ్రెడ్ తనకు కావలసిన శవపేటికను తనే స్వయంగా తయారుచేసుకున్నాడు. వివిధ ఆకృతులతో, ఈజిప్ట్ దేవత ఐసిన్, ఇంకా ఆకాశాదేవత, ఈజిప్ట్ ఆచారవ్యవహారాలకు, సంస్కృతికి సంబంధించిన అనేక చిత్రాలను చిత్రించి, చాలా అద్భుతంగా తయారుచేసుకున్నాదట తన శవపేటికను. ఈ ఇజిప్షియన్ థీమ్ శవపేటికను తయారుచేసుకోడానికి 25 సంవత్సరాలపాటు పాటుపడ్డాడట.చివరికి గత సంవత్సరమ్ తన 92 ఏళ్ల వయసులో ఫ్రెడ్ మరణించగా వింటర్పార్క్ లోని గ్లెన్ హెవెన్ స్మశానంలో తాను స్వయంగా తయారుచేసుకున్న శవపేటికలోనే ఖననం చేశారట.
కారుతో ఖననం ....
సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికిష్టమైన వస్తువులను వారి సమాధి దగ్గర పెట్టి వారిని, వారి అభిరుచులను గౌరవించడం ఒక సంప్రదాయంగా పాటిస్తారు కొన్ని ప్రాంతాల్లో. దానికి తగ్గట్టుగానే ఓ పాతికేళ్ళ క్రితం 71 సంవత్సరాల ఒక వ్యక్తీ తన చివరి కోరికగా తనకెంతో ఇష్తమైన తన తెలుపు కోర్వెట్టి కారులో పెట్టి ఖననం చేయమని చెప్పాడట. దాంతో అతని కుటుంబసభ్యులు ఆ ప్రకారమే కారుతో సహా అతనిని ఖననం చేశారట.