సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam
పాండురంగ మాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవతము, అత్యుత్తమమైన తీర్ధము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న పుణ్యస్థలం
ఏది  స్వామీ  అని అగస్త్యుడు అడిగిన ప్రశ్నకు యిందుకు సమాధానం యివ్వగలవాడు పరమశివుడే అని చెప్పాడు 
కుమారస్వామి. సమాధానంకోసం అగస్త్యుడినీ, ఆయన సతీమణి లోపాముద్రనూ, శిష్యులను, తన పరివారాన్నీ 
వెంటబెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు కుమారస్వామి.

అక్కడి అప్సరల పూజలు అందుకున్నాడు. అక్కడ  పరమశివునివలె వెలిగిపోతున్న ప్రమథగణములను  చూశాడు.

విబుధ మధురాధరా భుజావీజ్యమాన 
విమలచామర బహుసహస్రముల వొలిచె 
స్వామియిరుగడఁ బుష్పవర్శములఁ దలఁకి
సురవిమానమరాళముల్ దెరలె ననఁగ                      (తే)

మధురాధరలు ఐన దేవతాస్త్రీల భుజములచే వేలకొద్దీ ప్రకాశవంతమైన స్వచ్ఛమైన  వింజామరలు వీచబడ్డాయి. స్వామికి రెండుప్రక్కలా కురుస్తున్న పుష్పవృష్టికి భయపడి అన్నట్లుగా దేవతల విమానములు అనే మరాళములు ప్రక్కకు తప్పుకున్నాయి. వర్షంలా 
పూలను కురిపిస్తున్నారు దేవతాస్త్రీలు. రెక్కలు తడిసి బరువెక్కి ఎగరడం కష్టం అవుతుంది  కనుక ఆకాశంలో ఎగిరే హంసలు వర్షానికి భయపడతాయి. అది సహజం. పూలవర్శాన్ని  చూసి వర్షమనుకుని భయపడడం కవి చమత్కారం. వర్షానికి దేవతా విమానాలు కూడా 
జంకుతాయి బహుశా, ఆధునిక కాలపు విమానాలలాగా, కనుక హంసలలా తెల్లగా  మెరిసిపోతున్న దేవతా విమానాలు కూడా బెదిరి ప్రక్కకు తొలిగిపోయాయి. పైనుండి  మేము స్వమిమీడికి పుష్పవర్షం కురిపిస్తుంటే మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు 
అని ఆ పూలవర్షం కురిపిస్తున్న దేవతా స్త్రీలు గఁయ్యిమనడం వలనకూడా ఆ విమానాలలో  తిరుగుతున్న ఖేచరులు బెదిరి ప్రక్కకు తప్పుకుని ఉండవచ్చు, యిన్ని చమత్కార సూచనలు  చేస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. 

సామిమలనుండి రాజతాచలముదాఁక
సేతువెత్తినగతి మహాసేనసేన 
రోదసీరంధ్ర నీరంధ్రరూపమగుచు 
నడచె గిరి సింధు వన సృష్టి పుడమినడఁగ                (తే)

దక్షిణాన సామిమల కుమారపర్వతమునుండి ఉత్తరాన వెండికొండదాకా వారధి కట్టినట్టు, భూమ్యాకాశాలను సందులేకుండా ఏకంచేస్తూ నింపేస్తూ సముద్రాలు, అడవులు, భూమి, సృష్టి మొత్తము అణిగిపోయేలా ధూళి దూసరితము చేస్తూ కుమారస్వామి సేన నడిచింది.

పుట్టినమోములై శిఖరముల్ వెలుఁగొంద, నితంబమండలిన్
గట్టినకృత్తియై నిబిడకాననరేఖ దలిర్ప, లోనఁ జూ
పట్టిన విశ్వమై మెలఁగు ప్రాణికులంబలరన్, గిరీశుడ
ప్పట్టికిఁ గానిపించినప్రభన్, గలధౌతనగంబు దోఁచినన్                (ఉ)

అలా ఊరేగింపుగా వెళుతున్న కుమారస్వామికి వెండికొండ కనిపించింది అల్లంతదూరంలో. ఆ వెండికొండ ఎలా కన్పిస్తున్నదీ అత్యద్భుతమైన ఊహతో చెబుతున్నాడు ఈపద్యంలో. పుట్టినవూరు, పెరిగిన ఇల్లు, పుట్టడానికి కారకులైనవాళ్ళలాగా, జననీ జనకులలాగా పెంచినవాళ్ళ
లాగా కనిపిస్తాయి. ఎవరికైనా అంతే, దేవుడికైనా, దేవదేవుడికైనా అని చెబుతున్నాడు. ఎంత  సరసమైన ఊహ!

అల్లంతదూరంలో కనిపిస్తున్న కైలాస శిఖరాలు తండ్రిగారికి పుట్టిన మొలిచిన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానమూలానే ఐదు ముఖాలలా కనిపించాయి. ఆ పర్వత  సానువులలో నల్లగా ఉన్న అడవుల వరుస తన తండ్రి పరమశివుని నడుముకు కట్టుకున్న 
తోలులా కనిపించింది. ఆ అడవులలో సంచరిస్తున్న జంతుజాలం తన తండ్రి ఉదరములో  సుఖంగా, సురక్షితంగా మెలగుతున్న జీవులతో కూడిన విశ్వంలా కనిపించింది. యిలా  కొడుకు కంటికి సాక్షాత్తూ తన తండ్రిలానే కనిపించింది ఆ తెల్లని పర్వతం.

జైవాతృకబింబము నిజ 
జీవాతువుఁ గాంచి ప్రాప్తజీవములగుచున్ 
జీవంజీవములలరెడు 
భావంబున బాహులేయ బలములు పొదలెన్      (కం)

జైవాతృకబింబము అంటే చంద్రబింబము. జీవాతువు అంటే జీవనమును నిలబెట్టే ఔషధం. జీవంజీవములు అంటే చకోరములు. చకోరాలకు చంద్రుడు ప్రాణప్రదుడు. ఆయన వెన్నెలలు  వాటికీ జీవనౌషధాలు. అలా చంద్రుడిని చూసి పోతున్నాయి అనుకున్నా ప్రాణాలు మరలా 
వచ్చినట్లు సంతోషించే చకోరాలలాగా కుమారస్వామి సేనలు, అనుచరులు కూడా ఉత్సాహంగా  కదిలారు, కైలాసగిరిని చూసి.

పద్మరాగమణిమయ పాదలబ్ధి 
స్ఫురిత గైరిక శిఖర చంచూసమృద్ధి 
గంధవతియను నొక్క పంకజము నడుమ 
మించునక్కొండ కొదమరాయంచఁబోలి       (తే)

కైలాసము ఒక హంసలాగా ఉన్నది. హంస పాదాలలాగా కించిత్తు ఆ పర్వత పాదాలలో ఉన్న  ఎఱ్ఱని పద్మరాగమణుల కాంతి ఉన్నది. గైరికాది ధాతువుల ప్రకాశము అనే ముక్కును కలిగి  ఉన్నది. భూమి అనే విశాలమైన తామరపూవు మధ్యన ఉన్న కొదమ రాజహంసలాగా ఉన్నది.

నీలగళవాహరింఖాఖనిత్రనిహతి
నింగికెగసిన వెండిరానేలదుమ్ము 
ప్రాంతవర్తిష్ణు సప్తర్షి పరివృఢులకు
నొసఁగు నిర్యత్న విలసిత భసితమచట     (తే)

నీలగళుని వాహనమైన నందీశ్వరుడు తన జాతి సహజమైన గుణంతో తన గిట్టలచేత ఆ కైలాసభూమినిమట్టగించినపుడు వెండికొండ కనుక వెండిరంగులోనున్న ధూళి గాలికి ఎగురుతుంది. అలా ఎగిరిన  ఆ తెల్లని ధూళి విబూదిలాగా ఆ సమీప ప్రాంతంలో ఉండే సప్తర్షుల శరీరాలమీద పడుతుంది. అలా ప్రత్యేకమైన ప్రయత్నము లేకుండానే వారికీ లభించే విభూతిలాగా ఆ ధూళి విలసిల్లుతూ ఉంటుంది.

వాహనము డిగి గగనచర 
వాహినిఁ  దత్కుధర సవిధవన విహరణ కాం
క్షాహూతహృదయ, నటయట
'యోహో! నిలు'మనుచు నిలిపి యుల్లంబలరన్       (కం)

తన వాహనాన్ని దిగి, ఆ పర్వత వన విహరణ కాంక్షతో ఉన్న ఖేచర వాహినిని ఆగండి ఆగండి అని  నిలిపి, సంతోషంగా వెండికొండను ప్రవేశించాడు కుమారస్వామి.

ఆరవి వాలఖిల్యయుతుఁడై విధుగర్భము దూరెనో యనన్ 
దారకవైరి సంయమికదంభయుతంబుగ నేఁగుదెంచి ము
క్తారుచిరుంద్రమైన వసుధారథు గేహముఁ జొచ్చునప్డు  మా
రారియు నిష్కుటాంతరవిహార ముమాన్వితుఁడై యొనర్పఁగన్             (ఉ)

సూర్యుడు వాలఖిల్యమునులతో కలిసి చంద్రుని కడుపులోకి చొచ్చినట్లు తారకాసురవైరి ఐన  కుమారస్వామి మునులతో కలిసి చంద్రకాంతిని, ముత్యముల కాంతిని కలిగిన కైలాసమును  ప్రవేశించాడు. పూర్వం త్రిపురాసుర సంహారసమయములో భూమిని రథముగా చేసుకున్న  ఆ పరమశివుడు ఆ సమయములో, తన యింటిని అంటే కైలాసపర్వతాన్ని ఆనుకుని ఉన్న  వనంలో ఉమాసహితుడై  వనవిహారం చేస్తున్నాడు.

(కొనసాగింపు వచ్చేవారం)

**వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి