సమాజములో మార్పులు అనేవి చాలా సహజము ఆ మార్పు మంచికి అవచ్చు చెడుకు అవచ్చు వచ్చిన మార్పు మనకు అన్నివేళల రుచించకపోవచ్చు అంట మాత్రానా ఆ మార్పును తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగములేదు ఆ మార్పు రావటానికి రావటానికి గల కారణాలను గమనించాలి.ఇవన్నీ ఎందుకు చెపుతున్నానంటే ప్రస్తుతము మనము అందరు అనేది వింటూనే ఉంటాము. ఏమిటి అంటే ప్రస్తుతము సమాజములో గురువుకు అంటే ముఖ్యముగా ఉపాధ్యాయులకు సమాజములో సరి అయిన స్థానము గౌరవము లభించటంలేదని ప్రస్తుతము నేను అది నిజమా కాదా అన్న దానిని చర్చించటము లేదు. సమాజములో గురువు స్థానము మారుతున్నది అనటానికి గల కారణాలను పరిశీలిద్దాము
పూర్వము విద్యాబోధన ఒక వృత్తికాదు సామాజిక భాద్యత సమాజములో శాస్త్రాలు చదువుకొన్న కొద్దీ మంది గురుకులాలు స్థాపించి వారిదగ్గరకు వచ్చిన వారికి ఏరకమైన ప్రతిఫలము ఆశించకుండా ఐ సామర్ధ్యాలను బట్టి వారికి విద్యాబోధన చేసేవారు విద్యార్థులు గురువుగారికి సేవలు చేస్తూ వారి విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకొని గురుకులాన్ని విడిచి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ వారి శక్తికి తగ్గట్టుగా ఇచ్చి వెళ్లేవారు సాక్షాత్తు దేవదేవుడైన శ్రీ కృష్ణుడు బలరామునితో సాందీపుని ఆశ్రమములో విద్యాభ్యాసము చేసినవాడే. అదేవిధముగా శ్రీ రాముడు వసిష్ఠుల వారివద్ద, విశ్వామిత్రుని వద్ద విద్యనభ్యసించారు రాకుమారులైన వారి వారి రాజా ప్రాసాదాలను వీడి గురుకులాల్లో అతి సామాన్యులవలె గురువులకు సేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు గురువుల పోషణ భాద్యత రాజులు తీసుకొనేవారు అందువల్ల గురువులకు సమాజములో అతున్నత స్థానము లభించేది
ఈ సందర్భముగా ఒక కథ చెపుతాను ఒకసారి ఒక రాజుగారు తన రాజ్యములో గల ఒక గొప్ప వ్యక్తిని ఎంచుకొని సన్మానము చేయాలనీ అనుకోని ఎంపిక భాద్యత తన మంత్రులకు అప్పజెప్పాడు వారు రాజ్యమంతా తిరిగి వారికి అర్హులనిపించినవారిని సభకు తెచ్చారు మొదటి మంత్రి ,"మహారాజా ఈ వ్యక్తి మన దేశములోని ప్రముఖ వైద్యుడు తన వైద్యముతో ఎంతమందినో ప్రాణాపాయ స్థితినుండి కాపాడాడు ప్రజలు ఈయనను దేవుడిగా భావిస్తారు ,"అని అన్నాడు రెండవ మంత్రి ,"మాహాప్రభో ఈయన గొప్ప సాంకేతిక నిపుణుడు ఈయన అనేక నీటి పారుదల పధకాలను పూర్తిచేసి మనదేశములో ఆహారసమస్యను పరిష్కరించాడు ,"అని అన్నాడు ఇదే విధముగా మిగిలిన మంత్రులు రకరకాల రంగాలలోని ప్రముఖులను రాజుగారికి పరిచయము చేసారు రాజుగారికి ఎవరికీ సన్మానము చేయాలో అర్ధముగాక ఆలోచనలో పడ్డాడు
ఇంతలో ఒక మంత్రి ఒక తొంభై ఏళ్ళ వృద్ధుడిని నెమ్మదిగా నడిపించుకుంటూ సభలోకి అడుగు పెట్టాడు . ఆ వృద్ధుడిని చూసిన వెంటనే సన్మానము చేయించుకుందామని వచ్చిన ప్రముఖులు ఒక్కసారిగా లేచి నిలబడి అయన దగ్గరకు వెళ్లి సాదరముగా నమస్కరించారు . ఆశ్చర్య పోయిన రాజు ఆ వృద్ధుడు ఎవరని అడిగారు . అ ప్రముఖులు అందరు ముక్త కంఠముతో ,"మా గురువుగారు "అని సమాధానము ఇచ్చారు అప్పుడు రాజుగారి సమస్య సులభముగా పరిష్కరింపబడింది. సన్మానానికి ఇంతమంది ప్రముఖులను సమాజానికి అందించిన గురువుగారి అర్హులు అని నిర్ణయించారు సభలోని వారందరు సంతోషముగా గురువు గారిని సన్మానించారు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒక డాక్టరు లేదా ఇంజనీరు ఎవరైనా ఒక ఉపాధ్యాయుడి చేతిలోనే తయారు అవుతారు. సమాజములో ఉపాద్యాయుడి స్థానము ఏమి మారలేదు కానీ ఉపాధ్యాయుల మనస్తత్వాలలోనే మార్పు వచ్చింది
ఈ మార్పు ఎందువల్ల వచ్చినది అంటే కాలక్రమేణా సమాజములో మార్పులవల్ల విద్యాభోదన ఒక వృత్తిగా మారింది. వృత్తి అన్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలము జీతము పేరుతొ లభ్యమవుతుంది. మొదట్లో తక్కువ జీతాలతో బతకలేక బడి పంతులు అనిపించుకున్న కాలక్రమేణా ఉపాధ్యా వృత్తి కూడా ఆకర్షణీయ మైన వృత్తిగా మారింది. ఉపాధ్యా నియామకాలకు జరిపే డి.ఎస్. సి పరీక్షలకు కోచింగ్ సెంటర్లు హాడావుడి చూస్తూ ఉంటె ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించటం ఎంత కష్టమో అర్ధమవుతుంది. కానీ ముఖ్యమైన మార్పు యువతలో ఉపాధ్యాయ వృత్తి పట్ల పూర్తి అవగాహన లేకపోవటమే దీనివల్ల వారు ఉపాధ్యాయ వృత్తిలో రాణించలేకపోతున్నారు వారి మానసిక ప్రవృత్తులు పూర్తిగా విద్యాభోధనపట్ల కేంద్రీకరించలేక అసంతృప్తి పనిచేయటము జరుగుతుంది అదికాక ఈ మధ్య కాలములో పిల్లలను హింసించే ,ఆడపిల్లలను మానభంగాలు చేసే ఉపాధ్యాయుల గురించి వింటున్నాము అటువంటి వారు వేలల్లో ఒకళ్ళిద్దరు ఉన్నా చెడ్డ పేరు ఉపాధ్యాయ వర్గము మొత్తానికి వస్తుంది సమాజములో ఉపాధ్యాయుడి స్థానము దిగజారుతోంది కడివెడు పాలు విరిగిపోవటానికి ఒక ఉప్పు రాయి చాలు కదండీ.
అప్పుడైనా ఇప్పుడైనా ఉపాధ్యాయుడు అంకితభావంతో,నిబద్దత తో పనిచేస్తే సమాజముగాని విద్యార్థులు గాని అటువంటి గురువులను ఉన్నత స్థానములో ఉంచి గౌరవిస్తారు కాబట్టి గురువు తన ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవటం అనేది కాలముతో పనిలేదు అతని నడవడి విధి నిర్వహణలో ఆతను చూపించే నిజాయితి,వృత్తి పట్ల అతనికి ఉండే గౌరవము మీద ఆధారపడుతుంది. ఉపాధ్యాయుడు ఎప్పుడు విద్యాబోధన జీతము రాళ్ల కోసము కాకుండా సామాజిక భాద్యత, భావితరాలకు అవసరమైన నిపుణులను సమాజానికి అందిస్తున్నాను అన్న భావనతో పనిచేస్తే విద్యార్థుల చేత లేదా సమాజముచేత గౌరవించబడతాడు. ఈ సందర్భముగా నాకు అనుభవంలోకి వచ్చిన రెండు సంఘటనలను మీకు తెలియజేస్తాను ఎప్పుడో 86 లో పదవి విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడికి పూర్వ విద్యార్థులు జీవితములో బాగా స్థిరపడ్డ వారు అయన మీద అభిమానంతో గుంటూరు దగ్గర గల హాయ్ ల్యాండ్ లో సన్మానము చేశారు గురువుకు సన్మానము చేసి శాలువాకప్పి దండలు వేయటము కాదు, ఆ సన్మానములో ఆయనకు ఐదు లక్షల రూపాయల చెక్కు బహుకరించారు ఆవిధముగా అయన పట్ల గల గౌరవాన్ని తెలుపుకున్నారు .ఇదే విధముగా ఈమధ్య హైదరాబాద్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో స్థిరపడ్డ దాదాపు యాభై మంది వాళ్లకు టైపు షార్ట్ హ్యాండ్ (ప్రస్తుతము అంతరించిన విద్య) ఇరవై ఏళ్ల క్రితము నేర్పిన గురువు గారిని సన్మానించి ఆయనకు వెండి కిరీటము చేతికి బంగారు కడియంను బహుకరించారు ఈ రెండు సందర్భాలలో ఆ గురువులు ఎప్పుడు మాకు ఇలా చేయండి అని అడగలేదు గురువుల దగ్గర చదువుకొన్నవాళ్ళఉన్నతికి కారణమైన గురువుల పట్ల అభిమానాన్ని ఈ విధముగా తెలియజేసారు ఈ రెండు వార్తలు వార్తా పత్రికలలో వచ్చినవే .అందువల్ల పిల్లలకు సక్రమముగా విద్యాబోధన చేస్తే ఆ పిల్లలు అట్టి గురువులను ఎప్పటికి మర్చిపోరు ఎందువల్లనంటే వారు పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసినవారు కాబట్టి .
అప్పుడు ఇప్పుడు ఎంతమందో మహోపాధ్యాయులు ఉన్నారు అందరికి ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా వందనాలు. చరిత్రలో అటువంటివాళ్లను చాలామందిని వింటూ ఉంటాము . మనకు వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ నాడు గురువులను స్మరించుకొనే అలవాటు ఉంది కాల క్రమేణా వచ్చిన మంచి మార్పులలో ఒకటి మన పూర్వ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మ దినాన్ని ప్రభుత్వమూ వారే ఉపాధ్యాయ దినోత్సవముగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు కానీ నిజానికి ఉపాధ్యాయుడిని గౌరవించటానికి ప్రత్యేకమైన రోజు అంటూ ఉండనవసరం లేదు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఈ రూపేణా గుర్తుచేసుకొని అయన కోరిక మేర అయన పేరుతొ ఉపాధ్యాయులను గౌరవిస్తున్నాము. ఈ సందర్భములో ఒక మాహానుభావుడు, గొప్ప ఉపాధ్యాయుడి గురించి తెలియజేస్తాను
అయన ఎవరోకాదు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ చంద్ర శేఖర్ , ఈయన నోబెల్ గ్రహీత సర్. సి.వి రామన్ అన్న కుమారుడు దురదృష్ట వశాత్తు భారతీయడిగా పుట్టినప్పటికీ అమెరికాలో స్థిర పడటము వల్ల అమెరికా పౌరుడిగా నోబెల్ బహుమతిని పొందాడు. అయన ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలను ప్రపంచానికి అందించిన గొప్ప అధ్యాపకుడు.ఈయన అమెరికాలోని విస్కాన్సిన్ నగరంలోని యార్కీస్ నక్షత్ర అవలోకన శాలలో పరిశోధకుడిగా పనిచేస్తున్నప్పుడు చికాగో విశ్వ విద్యాలయములో ఖగోళ శాస్త్ర విభాగాములో ఆచార్య పదవికి ఎంపిక చేయ బడ్డాడు ఆ విశ్వవిద్యాలయములో వారానికి రెండురోజులు మాత్రమే తరగతులు నిర్వహించాలి విస్కాన్సిన్ నుండిచికాగోకు స్వయముగా కారు నడుపుకుంటూ శీతాకాలములోకూడా శ్రమకోర్చి క్లాసులు తీసుకోవటానికి చంద్ర శేఖర్ గారు వెళ్లేవారు ఇంతా శ్రమ పడి వెళితే అక్కడ ఇద్దరే విద్యార్థులు. చికాగో యూనివర్సిటీ అధికారులు చంద్రశేఖర్ గారితో,"మీరు ఇద్దరు విద్యార్థుల కోసము శ్రమ తీసుకొని 160 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ రావటము కష్టము, విద్యార్థులు నలుగురి కన్నాతక్కువ మంది ఉంటె ఆ ఆచార్యుడు తరగతిని రద్దు చేయవచ్చు",అని చెప్పారు కానీ చంద్ర శేఖర్ గారు ఒప్పుకోలేదు ,"నా దగ్గర చదువుకోవాలని వచ్చిన విద్యార్థులను నేను నిరాశ పరచలేను నా విద్యార్థుల కోసము కష్ట పడటంలోనే నాకు అందము తృప్తి ,"అని చంద్రశేఖర్ గారు అన్నారు అప్పటినుంచి ఒక్కరోజు కూడా తరగతులకు గైరుహాజరు కాకుండా ఆ ఇద్దరు విద్యార్థులకు పాఠాలు బోధించి ఆ ఇద్దరు ఖగోళ భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి గ్రహీతలు కావటానికి కారకుడైనాడు ఆ ఇద్దరు విద్యార్థులు, చెన్ నిన్ యాంగ్ మరియు సున్ డా లీ . ఆవిధముగా ప్రపంచానికి ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలను అందించిన గొప్ప అధ్యాపకుడు డాక్టర్ చంద్రశేఖర్ ఏ ఉపాధ్యాయుడి కైనా తన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటే ఆనందము అంటా ఇంతా కాదు చెప్పటానికి అలవికానిది .
అటువంటి మహానుభావులను గొప్ప అధ్యాపకులను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరము ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తే సమాజములో వారు ఉన్నతస్థానిని చేరి విద్యార్థులచే , వారి తల్లిదండ్రులచే గౌరవింపబడతారు . ఉపాధ్యాయుడి ఉన్నత స్థానము సమాజములో పదిలంగా ఉంటుంది .