వెండి కొండలపై వెండి కన్నుల నైనాదేవి - ..


               వెండి కొండలపై వెండి కన్నుల నైనాదేవి 


హిమాచల్ లోని ' బిలాస్ పూర్ ' జిల్లాలో రాష్ట్ర రాజ్యమార్గం 21 మీద నైనా పర్వత శిఖరాన వుంది యీ మందిరం .

ఛండీగఢ్ నుంచి నైనాదేవి బిలాస్పూర్ మీదుగా 56 కిలో మీటర్లు . కాని మన ప్రయాణం ఘాట్ రోడ్డు మీద సాగుతుంది కాబట్టి సుమారు రెండుగంటల సమయం పడుతుంది . అక్కడక్కడ వున్న చిన్న గ్రామాలు , వాటిని ఆనుకొని మెట్ల వ్యవసాయం , యెక్కువగా మద్ది , టేకు , గుగ్గిలం వృక్షాలతో కూడిన అడవి మీదుగా సాగుతుంది ప్రయాణం .

నైనాదేవి యిప్పుడిపుడే పెరుగుతున్న పట్టణం . బస్సు స్టాండ్ , కారు పార్కింగు సౌకర్యాలు వున్నాయి . పూజా సామగ్రి అమ్మే దుకాణాలలో అమ్మవారి పూజకోసం కొనుగోలు చేస్తున్న భక్తులతో రద్దీ గా వున్నాయి .

కొండమీదకు చేరడానికి నడకదారి సుమారు 1.5 కిలోమీటర్ల నిలువు దారి లో ప్రయాణించి చేరుకోవచ్చు , నిలువు దారిలో కొండ యెక్కడం కష్టం చాలా మంది యీ దారినే అమ్మవారి దర్శనానికి వుపయోగిస్తారు . నడవలేని వారికోసం యిక్కడ కేబుల్ కారు సౌకర్యం కూడా వుంది . మేం కేబుల్ కారులోనే వెళ్లేం . కేబుల్ కారులో ప్రయాణిస్తూ కింద కనిపించే దట్టమైన అడవి , కొండ పక్కగా ప్రహిస్తున్న యేరు కనువిందు చేస్తాయి . సుమారు అయిదు నిముషాల ప్రయాణం .

పర్వత శిఖరాన నిర్మించిన పాలరాతి నిర్మాణం , చాలా కొత్తగా వున్న కట్టడం యీ మధ్యన కట్టినట్టు తెలుస్తోంది . ప్రవేశ ద్వారం , గర్భగృహద్వారం రెండూ వెండితో వివిధ దేవతా మూర్తులతో చెక్కబడ్డాయి . గర్భగుడి వెలుపల రెండువైపులా పాలరాతి సింహాలను చూడొచ్చు . గర్భగుడిలో  మధ్యన వున్న పసుపు కుంకుమలు , పూలు , నగలతో అలంకరించి పెద్దపెద్ద వెండి కళ్లు అమర్చిన లింగాకారం శ్రీ నయనా భగవతి అమ్మవారు , అమ్మవారికి కుడి పక్కన పెద్దగా వుండి పెద్దపెద్ద వెండికళ్లతో వున్నది ద్వాపరయుగంలో అజ్ఞాతవాసంలో వున్నప్పుడు పాండవులచే ప్రతిష్టింపబడి పూజలందుకున్న లింగాకారం . యెడమ వైపున వినాయకుడి విగ్రహం వుంటాయి .

ఇక్కడి స్థలపురాణం తెలుసుకుందాం .

రక్తబీజుడు , మహిషాసురుడు అనే దైత్యులు బ్రహ్మ వరముల వలన ఓటమి లేక ముల్లోకాలను తమ ఉత్పాతముతో అల్లకల్లోల పరుస్తూ వుండగా మునులు , ఋషులు , దేవతలు వీరి బాధలు పడలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించగా , బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మిగతా దేవీ దేవతల తేజస్సును కేంద్రీకరించగా ఆ మహా తేజస్సు నుంచి పాతాళ లోకం లో కాళ్లు ఆకాశాన్ని అటుతున్న  శిరస్సు అన్ని దిక్కులకు వ్యాపించిన అనేక మైన భుజములు కలిగి పులిని వాహనముగా చేసుకున్న  ఓ స్త్రీ మూర్తి వుద్భవిస్తుంది  . ఆమెకు దుర్గ అని పేరు పెట్టి దేవీ దేవతలందరూ తమతమ వద్దనున్న శక్తులను ఆయుధాలను ఆమెకు యిచ్చి లోక కంటకుడైన మహిషాసురుని వధించమని కోరుతారు వేయి సూర్యుల కాంతితో దుర్గాదేవి మహిశాసురునితో యుద్ధానికి వెళ్తుంది . ఆమె కాంతికి మహిషాసురుని సైన్యం చెల్లాచెదురు కాగా దుర్గాదేవి రక్తబీజుని సంహరించి , అతని రక్తపు బొట్టు కింద పడకుండా పాత్రలో అతని రక్తాన్ని సేకరించి అతనిని సంహరిస్తుంది . రక్తబీజుని మరణాన్ని చూసిన మహిషాసురుడు మహిషం  రూపంలో అడవులలోకి పారిపోతాడు . మహిషాసురుని సైన్యాధ్యక్షుడైన చికాసురుడు అతనివెంబడే వెళ్తాడు . దుర్గాదేవి మహిషాసురుని వెంటే వెళ్లి అతని రెండు కళ్లు పెకిలించి అతనిని వధిస్తుంది . మహిషాసురుని కళ్లు పెకిలించిన మాత కాబట్టి దుర్గా దేవిని దేవతలంతా ' జై నయనా మాతా ' అంటూ జయజయ ద్వనులు చేసేరు , అందుకు అమ్మవారు యిక్కడ నయనా దేవిగా పూజలందు కుంటోంది .

మరో కథనం ప్రకారం

సత్యయుగానికి చెందిన కధ యిలా చెప్తారు . అదేమిటంటే సత్యయుగం లో దక్ష ప్రజాపతి పుత్రి సతీదేవి తండ్రి యిష్ఠానికి వ్యతిరేకం గా శివుని పరిణయ మాడుతుంది . దక్ష ప్రజాపతి మహా యజ్ఞం తలపెట్టి ఋషులను , మునులను , సర్వదేవీ దేవతలను ఆహ్వానిస్తాడు కాని సతీదేవిని , శివుని ఆహ్వానించడు . తండ్రి చర్యకు కోపగించిన సతీదేవి యాగ ప్రదేశమునకు వెళ్లి శివునిని  కుడా యజ్ఞమునకు ఆహ్వానించ వలసినదిగా కోరుతుంది . ఆగ్రహించిన దక్షుడు శివుని నానా దుర్భాషలతో నిందిస్తాడు . పతికి జరిగిన అవమానము సహించలేని సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది . సతీదేవి శరీరాన్ని భుజముపై మోస్తూ తిరుగుతున్న శివుని కార్యోన్ముఖుని చేయుటకు విష్ణు మూర్తి తన చక్రం తో సతీదేవి శరీరానన్ని 108 ఖండాలు గా ఖండిస్తాడు . అవి శక్తి పీఠాలుగా పూజింప బడుతున్నాయి . ఇక్కడ  సతీ దేవి నయనం పడ్డ ప్రదేశం కాబట్టి యీ ప్రదేశం నైనాగావ్ గాను యీ అమ్మవారు నైనాదేవిగాను ప్రసిద్ధి పొందేరు  . సతీ దేవి మరో కన్ను పడ్డ ప్రదేశం నైనిటాల్ అని అంటారు .

అప్పటి నుండి రాయిగా పడి వున్న అమ్మవారు కలియుగంలో   రాజా బీర్చంద్ రాజ్యంలో ఓ పశువుల కాపరి తన గోవు ప్రతి నిత్యం క్షీరాన్ని ఓ రాతి మీద విడవడం చూస్తాడు కాని గోవు యెందుకు అలా చేస్తున్నది తెలియక కలవరపడగా ఓ రాత్రి అతని స్వప్నము లో అమ్మవారు కనిపించి తన ఉనికి  తెలియజేస్తుంది . పశువులకాపరి తన స్వప్న వృత్తాంతమును రాజుకు వివరంచగా అతను కూడా స్వయంగా వచ్చి చూసి ఆ లింగాకారము లో అమ్మవారు కొలువున్నదని తెలుసుకొని అక్కడే మందిర నిర్మాణం చేసేడు .

15 వ శతాబ్దం లో రాజా బీర్ సింగ్ యీ మందిర నిర్మాణం చేసేడని చరిత్ర  .

సతీదేవి కన్ను పడ్డ ప్రదేశం కావడం వల్ల అమ్మవారికి ' నయనాదేవి ' గా స్తుతించేరు .

నయనాదేవి కోవెల హిందువులకే కాదు సిక్కులు కూడా పవిత్రమైనదే , యెలా అంటే సిక్కుల పదవ గురువైన ' గురు గోవిందసింగు ' మొగలులతో యుధ్దానికి వెళ్లేటప్పుడు నయనా దేవి మందిరంలో యజ్ఞం చేసుకొని వెళ్లి విజయుడై వచ్చేడు , అప్పటినుంచి ముఖ్య మైన పనులమీద వెళ్లేటప్పుడు సిక్కులు నయనాదేవికి మొక్కుకొని వెళ్లడం అలవాటు , విజయం పొందిన తరువాత అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం వీరి అలవాటు .

నైనా దేవి మందిర పరిసరాలలో దర్శనీయ స్థలాలు --

1) గుహ  --

కోవేలకి ఎదురుగా 70 అడుగుల పొడవైన నైనా గుహ చూడదగ్గది .

2) కృపాలి కుండం --

మహిషాసురుని వధించేటప్పుడు దుర్గాదేవి మహిషాసురుని రెండుకళ్ళు పీకి విసిరివేయగా అవి నైనా పర్వతానికి సుమారు రెండు కిమీ దూరంలో పడి రెండు సరస్సులుగా మారేయి అవి 1) బమ్  కి బావడి లేక జీరా కి బావరడి , 2)  భుభక్ బావడి .

3)  ఖప్పర మహిషాసుర -- 

నైనా దేవి దర్శనానికి ముందు యీ సరస్సులో భక్తులు స్నానం చేస్తారు . మహిషాసురుని శిరస్సు పడ్డ ప్రదేశం లో బ్రహ్మ మహిషాసురుని కోరిక మేరకు యీ సరస్సుని సృష్ఠించేడు .

4) కాలా జోహార్  --

మహిషాసురుని సైన్యాధికారి  చికాసురుడు మరణించిన ప్రదేశం లో ఏర్పడ్డ సరస్సు . యీ సరస్సు నీటికి చర్మ రోగాలు పోగొట్టే శక్తి వుందని స్థానికులు నమ్ముతారు . సంతానము లేని వారు యీ సరస్సులో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనేది యిక్కడి వారి నమ్మకం .  యీ మందిర సమీపం లో పెద్ద మర్రి చెట్టు  వుంది .కొన్ని వందల సంవత్సరాలుగా యీ చెట్టు  వుందని అంటారు .నైనాదేవి మందిరం లో శ్రావణ అష్ఠమి రోజు ప్రత్యెక ఉత్సవం నిర్వహిస్తారు . దసరా నవరాత్రులు , వసంత నవరాత్రులు విశేషం గా జరుపుతారు . నవరాత్రులలో దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించు కుంటారు .

కొండ పైనుంచి చూస్తే దిగువున వున్న గోవిందసాగర్ కనువిందు చేస్తుంది . అమ్మవారిని దర్శించుకున్న తరువాత మా ప్రయాణం గోవింద సాగర్ వైపు సాగింది .

గోవిందసాగర్ సరస్సు ---

 నైనా దేవి మందిరం నుంచి సుమారు 17 కిలో మీటర్లదూరంలో వున్న మానవనిర్మిత మంచి నీటి సరస్సు యిది . సెట్లజ్ నది పైన ప్రపంచంలో అతి యెత్తైన ఆనకట్ట యైన బాక్రా నంగల్ ని నిర్మించేటప్పుడు ఆనకట్ట లోకి చేరే నీటిని నియత్రించేందుకు నిర్మించిన సరస్సు యిది . దీని పొడవు సుమారు56 కిలో మీటర్ల పొడవు 3 కిలో మీటర్ల వెడల్పు కలిగి సెట్లజ్ మరియు బియాస్ నదులను కలుపుతూ వున్న సరస్సు . పదవ సిక్కు గురువైన గురుగోవింద్  గౌరవార్ధం ఈ సరస్సును ' గోవింద సాగర్ ' అనే పేరు పెట్టేరు . ఈ సరస్సు హిమాచల్ లోని బిలాస్పూర్ , ఊనా రెండు జిల్లాలను కలుపుతూ వుంది .

అక్టోబరు నవంబరు మాసాలలో యీ సరస్సు నీటితో నిండుగా వుండడంతో హిమాచల్ టూరిజం మరియు సివిల్ ఏవియేషన్ వారు వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహిస్తున్నారు . సాధారణంగా యీ పోటీలు అక్టోబరు మూడవ వారం లో నిర్వహిస్తూవుంటారు . నవంబరు నుంచి మార్చి వరకు వాటర్ స్పోర్ట్స్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తూవుంటారు . సాధారణ పర్యాటకులకు బోటింగ్ , ఫెర్రీ  మొదలయినవి అందుబాటులో వున్నాయి . ఈ సరస్సులో యెక్కువగా ఫిషింగ్ చేస్తూ వుంటారు . సుమారుగా ఈ సరస్సులో 51 రకాలయిన చేపలు వున్నాయి .      ప్రశాంతమైన పరిసరాలలో , పచ్చని అడవుల మధ్య వున్న సరస్సు మనస్సును ప్రశాంతంగా మార్చింది . నిజ జీవితంలో వుండే ఒత్తిడిలను మరచి పోయేట్టు చేసి కొత్త జన్మ యెత్తినట్లు చేసింది .

అక్కడ నుంచి మా ప్రయాణం హిమాచల్ లోని ' చంబా ' లోయ వైపు సాగింది .

-కర్రా నాగలక్ష్మి

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి