ఇలా కూడా కేసులు పెట్టొచ్చా..! - మావూరు.విజయలక్ష్మి

కొన్ని విషయాలు వింటే.... ఔరా! ఇది నిజమేనా? ప్రపంచంలో ఇలాంటి సంగతులు కూడా జరుగుతాయా? అని ఆశ్చర్యాన్ని మించిన భావమేదో కలుగుతుంది. అలాంటి వింతకేసుల మీద ఓ లుక్కేద్దాం.



సూర్యుని మీద కేసు

 

లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యుణ్ని భగవంతుడిగా ఆరాధిస్తాం. పూజలు చేస్తాం. అలాంటి సుర్యభగవానుడినే కోర్టుకి ఈడ్చాడు ఓ ఘనుడు.  ఇంతకీ విషయమేమిటంటే మధ్యప్రదేశ్ లోని షాజపూర్ కి చెందిన శివపాల్ సింగ్ అనే వ్యక్తీ తన పనుల మీద ఫలోడి అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ విపరీతమైన ఎండ మాడ్చేస్తోంది. ఎంతటి వాళ్లయినా ఎండ తట్టుకోలేక సతమతమవాల్సిన పరిస్తితి. అంతా ఉస్సు, అస్సు అనుకుంటూనే ఆ ఎండను భరిస్తున్నారు. కాని శివపాల్ సింగ్ మాత్రం అందరిలా ఊరుకోదలచుకోలేదు. జనాల్ని ఇంతలా వేడెక్కిస్తున్న దినరజుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకే.... సూర్యుని మీద కేసు పెట్టాడు. ఒక పరిమితి అనేది లేకుండా, చెలరేగుతూ ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సూర్యుని మీద చర్యలు తీసుకొని, ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోర్టుకెళ్ళాడు.

తాబేలు అరెస్ట్

ఇదింకా విచిత్రమైన కేసు. ఫ్లోరిడాలో రోడ్డు మీద, వాహనాలని, జనాలని ఎక్కడివక్కడ నిలిపేసి చాలా ఇబ్బంది పెట్టేసిందట ఓ తాబేలు. దాంతో హుటాహుటిన పోలీసులొచ్చి ఉన్నపళంగా దాన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు.  ఇంతకీ అదేం చేసిందంటే .... పాపం నోరులేని తాబేలేం చేస్తుందండి! రోడ్డు మీద తన మానాన తాను నిదానంగా వెళుతోంది. తాబేలుకంటే పనేంలేదు కాబట్టి నిదానంగా వెళుతోంది. కాని వెనకన వెళ్తూన్న జనాలు మాత్రం దానిని దాటుకొని ముందుకు వెళ్ళలేక, అలాగని తాము కూడా తాబేలు నడకలు నడవలేక చాలా ఇబ్బంది పడిపోయారట. దాంతో పోలిసులు రంగంలోకి దిగి, ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తుందని ఆ తాబేలుని అరెస్ట్ చేసి తిసుకుపోయారట. అదీ సంగతి.

కటకటాల వెనక్కి మేక 

ఆ మధ్య ఛత్తీస్గడ్ లో ఓ జడ్జిగారింటి తోటలో మేత మేసి తోటను పాడుచేసినందుకు ఓ మేకను కటకటాల వెనక్కు పంపించేరు. అలాగే కొంతకాలం క్రితం వారు, వీరని తేడా లేకుండా  దారిన పోయేవారినందరిని బండబూతులు తిడుతున్న ఓ చిలుకను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపించేరు పోలీసులు. 

రామలక్ష్మణులకూ తప్పలేదు కేసులు

అదేంటి సాక్షాత్తూ రామచంద్రుని మీదే కేసా అని ఆశ్చర్యపోతున్నారా?  అవునండి....కేవలం ఒక అనామకుడి మాటలు పట్టుకొని సీతాదేవిని శ్రీరామచంద్రుడు అవమానించాడని, సత్యాసత్యాలను తెలుసుకోకుండా అడవులకు పంపించేసాడని, ఇందులో లక్ష్మణుడు కూడా అన్నకు సహకరించాడని, ఇది అన్యాయం కాబట్టి వీరిద్దరిపైన చర్య తీసుకోవాలని బీహార్లోని సీతమడి జిల్లాలోని ఠాకూర్ చందన్ అనే లాయర్ కేసు పెట్టాడట.

చిలుక మీద కేసు

ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే చిలకలా మాట్లాడుతున్నారంటాం. ఎందుకంటే చిలక పలుకులు అంత వినసొంపుగా, ముచ్చటగా ఉంటాయ్. కాని ఆ చిలుకే అసభ్యంగా, తిడుతూ, బూతులు మాట్లాడుతుంటే వినగలమా? సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురయింది ఆ మామ్మగారికి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో జనాబాయికి, ఆమె కొడుక్కి విబేధాలు రావడంతో ఇద్దరూ వేరువేరుగా నివసిస్తున్నారు. ఆ కొడుకు దగ్గర ఒక చిలుక ఉంది. తల్లంటే సరిపడని ఆ కొడుకు తన చిలుకకు తల్లి ఫోటో చూపించి ఆమెను బూతులు తిట్టడం నేర్పించాడు. దాంతో ఆ చిలుక జనాబాయి కనబడినప్పుడల్లా ఆమెను బూతులు తిడుతూ వెక్కిరించేది. చాలాకాలం ఒర్చుకున్న జనాబాయి ఇక సహించలేకపోయింది. పోలిస్ రిపోర్ట్ ఇచ్చి చిలుక మీద కేసు పెట్టింది. దాంతో పోలీసులు ఆ చిలుకను రప్పించి అటవీశాఖకు అప్పగించేసారు.

దేవుడి మీదే కేసు

చిన్నతనం నుంచి పడుతున్న కష్టాలకు విసిగిపోయిన ఓ నిర్భాగ్యుడు ఏకంగా ఆ దేవుని మీదే కేసు పెట్టాడు. ఇజ్రాయిల్ లో చిన్నప్పట్నుంచి కష్టాలే  తప్ప సుఖాలెరుగని ఓ వ్యక్తీ తన కష్టాలకు కారణం ఆ దేవుడేనని, తనకు ఇన్ని కష్టాలు పెట్టి తనను బాధించిన ఆ దేవుడిని శిక్షించి, తనకు న్యాయం చేయమని పోలిసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. అయితే కష్టాలతో మనశ్శాంతి లేక ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడని జాలిపడి, ఆ వ్యక్తిని పెద్దగా పట్టించుకోకుండా నచ్చచెప్పి ఇంటికి పంపించేసేవారు. ఇలా మూడు సంవత్సరాలు పోలిసుల చుట్టూ తిరిగి, ఇక లాభంలేదని తానే కోర్టులో కేసు దాఖలు చేసాడు. అసలు విషయం తెలుసుకున్న జడ్జిగారు అతని బాధలు తీర్చే చర్యలు చేపట్టామని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కథ సుఖాంతమయింది.                                                                                                

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి