సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము

'అత్యుత్తముడైన దైవము, అత్యుత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట వెలసిన స్థలము ఏది' అన్న అగస్త్యుని ప్రశ్నకు 'అందుకు సమాధానమును యివ్వగలవాడు  పరమశివుడే' అని చెప్పి అగస్త్యమునిని, ఆయన  సతీమణిని, శిష్యులను, తన పరివారాన్ని వెంట బెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు షణ్ముఖుడు. ఆ సమయానికి పార్వతీసమేతుడై వనవిహారం  చేస్తున్నాడు పరమశివుడు.   

నలువది తొమ్మిది రూపం
బులు గొనియుం బుష్పగంధములు మోవఁగలే
కలసియొ తెమ్మెరలానున్ 
బలుమఱు యువజనము మేని పలుచని చెమటల్                         (కం)

తెనాలి రామకృష్ణుని పాండిత్యానికి, చమత్కారానికి, బహు గ్రంథ పరిచయానికీ మరొక  గొప్ప ఉదాహరణ యిది.  వాయువు ఏడు రకాలు అని భారతీయులు గాలిని కూడా లెక్కబెట్టి కట్టగట్టారు! వీచేగాలి  ఏడు రకాలు అని విశ్లేషించారు. ఆవహము, ప్రవహము, వహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము అని ఆ ఏడు వాయువుల రకాలు. ఈ ఏడురకాల వాయువులు కూడా ప్రళయకాలంలో ఒక్కొక్కటీ మరలా ఏడు రకాలుగా వీస్తాయి. కనుక  నలభైతొమ్మిది రకాల వాయువులు అన్నమాట మొత్తం మీద.  అలా నలభై తొమ్మిది రకాల వాయువులు కూడా ఆ వనములోని పూల వాసనలను  మోయలేక అలసిపోయాయి. అన్ని పూలు, అంత పెద్ద వనము! అలసిపోయినపుడు  దాహం వేయడం, దాహం తీర్చుకొనడం సహజం. అలాగే వనవిహారం చేస్తున్నపుడు  చిరుచెమటలు పోయడం కూడా సహజమే కదా! కనుక ఈ అలసిపోయిన నలభై తొమ్మిది రకాల వాయువులు కూడా ఆ తోటలో విహరించే 'యువజనుల' శరీరాలకు పట్టిన  పలుచని చమటలను పీల్చేశాయి, త్రాగేశాయి, దాహం తీర్చుకున్నాయి. యింతవరకూ  చూస్తే  అద్భుతమైన  పద్యం యిది. యింకా లోతుగా రహస్య వీక్షణం చేయగలిగితే అత్యద్భుతమైన పద్యం అని, మహాద్భుతమైన ఆధ్యాత్మిక ధ్వని అని తెలుస్తుంది.  అలసిపోయిన నలభై తొమ్మిది రకాల వాయువులు ఆ తోటలో విహరించే 'యువజనుల'  శరీరాలకు పట్టిన పలుచని చమటలను పీల్చేసి, త్రాగేసి దాహం తీర్చుకున్నాయి.  

ఎవరా యువజనులు? 

అది జగన్నాధుడైన పరమేశ్వరుని ఉద్యానవనం. యితరులు జొరడానికి వీలు లేని  ఉద్యానవనం. అక్కడ విహరించేవారు నిత్యయవ్వనులైన పార్వతీపరమేశ్వరులే.  దక్షిణామూర్తిగా నిత్య తరుణుడు పరమశివుడు. పార్వతీసహితుడై నిత్య యవ్వనుడు! ఆదిమిథునం ఐన వారిని నిత్యయవ్వనులుగా ఆరాధించడం శివారాధనలోని రహస్యం.  ఆ భావముతో జగజ్జననీ జనకులైన శివపార్వతులను ఆరాధించడం వలన యవ్వనము,  ఆరోగ్యము, పరిపూర్ణ ఆయుర్దాయము, సాలోక్యముక్తి లభిస్తాయి.  అందుకే 'నమశ్శివాభ్యాం  నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః  శంకర పార్వతీభ్యాం'(నిత్య యవ్వనులైన, పరస్పరం కలిసిపోయి అర్ధనారీశ్వర తత్త్వంగా  ఉన్న నగేంద్ర కన్యకు, వృషభకేతనుడైన పరమశివునకు నమస్కారం) అని జగద్గురువు  ఆదిశంకరాచార్యులవారు ఉమామహేశ్వర స్తోత్రంలో నుతించారు. పన్నెండు శ్లోకాలు  కలిగిన ఆ స్తోత్రఫల శ్రుతిగా సర్వ సౌభాగ్యములు, శతాయుర్దాయము, అంత్యమునందు  శివలోకము లభిస్తాయి అని అనుగ్రహించారు. 

అంతేకాదు, (ప్రళయకాలంలో వీచే) నలభైతొమ్మిది రకాల వాయువులు అన్న ప్రస్తావనతో శ్రీ లలితా సహస్రంలోని 'మైత్య్రాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ' అన్న అమ్మవారి స్తుతిని 'మహేశ్వరమహాకల్ప మహాతాండవసాక్షి ణీ, మహాకామేశమహిషీ, హాత్రిపురసుందరీ'  అన్న స్తుతిని ధ్వనిస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఆమె పరమశివుని అర్ధభాగం కనుక  ఆ మహాప్రళయానికి కర్త్రి, సాక్షి కూడా. 'నిత్య యవ్వనా! మదశాలినీ! మదఘూర్ణిత రక్తాక్షీ! మదపాటల గండభూ' అని ఆమె నిత్య యవ్వనగా, యవ్వన బిగి, ఆ బిగి తాలూకు అరుణిమను కలిగిన కనులను, చెక్కిళ్ళను కలిగినది అని( యోగమార్గంలో నిత్యమూ  ఆనందమయిగా ఉన్నది, యోగ సమాధి స్థితి వలన ఎఱ్ఱని కనులు, చెక్కిళ్ళు కలిగినది అని)  చెప్పబడిన తల్లి. కనుక చెరిసగాలు ఐన ఆమె, ఆమె పతిదేవుడు ఆ యువజనులు! యిలా చెప్పుకుంటూపోతే ఈ ఒక్కపద్యం ఎన్నో పుటలకు సరిపోను ఆధ్యాత్మిక రహస్య విశ్లేషణను యిముడ్చుకున్నది, వటవృక్షాన్ని బీజం యిముడ్చుకున్నట్లు! రామకృష్ణునికి నమస్సులు 

అనడం తప్ప యింకేమనగలము! 

ఈ పైన చెప్పుకున్న పద్యం ఆధ్యాత్మిక రసామృత పానపాత్రం అయితే, క్రింది పద్యం  జగజ్జననీ జనకుల పవిత్ర శృంగారరస పానపాత్రం, రామకృష్ణుని వైదుష్యం సంస్తుతిపాత్రం!   

విమల మయూఖరేఖయు నవీనతరోత్పలపత్రముం బ్రవా
ళమణియు నొక్క తీవె యబలా! ప్రబలాదృతిఁ దాల్చె నన్న వి
భ్రమ శిథిలాంగియయ్యు గుచభార నితంబ కపోల గోపన 
క్రమ కలనాకులాత్మయయి కన్నుల నీశునదల్చె గౌరియున్                       (చం)    

ఓ అబలా! ఒక తీగె విమలమైన చంద్ర రేఖను, లేత నల్లకలువ రేకును, ప్రవాళమును  ధరించింది చూడు అన్నాడు సరసంగా గరళకంఠుడు. తీగె అంటే తరుణీ, స్త్రీ అని కూడా అర్ధం కదా. అది అర్ధమయ్యింది పార్వతీదేవికి. మయూఖరేఖ అంటే చంద్రకాంతి పుష్పపు  చిగురు, ఉత్పల పత్రం అంటే నల్లకలువ చిగురు, ప్రవాళము అంటే ఎర్రచందనపు ఫలము, పుష్పము, చిగురు అని పై పై సూచన. ప్రవాళము అంటే పగడము అని కూడా. అంతర్యామి పలుకులలోని అంతరార్థం ఆయన అర్ధభాగానికి, పార్వతికి, అర్ధమయ్యింది.  వనవిహారం, శృంగారకేళీ విలాసం పూర్తి ఐనట్లుంది బహుశా. ఆమె  శిథిలాంగి అయ్యింది, అంటే, ఆమె అవయవాలు శృంగారకేళిలో నలిగిపోయాయి. అందునా అది ఏకాంతవనము. వేరెవరూ లేరు, తనూ పతిదేవుడు తప్ప. కనుక అలా అందస్తుగా కూర్చున్నట్లుంది. ఆమె  వక్షోజములపై చంద్రరేఖలవంటి తెల్లని గోటి గాట్లు, పిరుదులపై నల్లకలువల చివుళ్ళవంటి గోటిగాట్లు, చెక్కిళ్ళపై పగడములవంటి ఎర్రని గోటిగాట్లు కనిపిస్తున్నాయి. ఎక్కడి గుర్తులు అక్కడి వర్ణమును కలిగి ఉంటాయి. స్వచ్చమైన, కరుణామయమైన హృదయము కనుక, సంగీత సాహిత్యములనే తెల్లని క్షీరములను కలిగిన వక్షస్సీమ కనుక, అక్కడి గోటి గిచ్చుళ్ళు తెల్లగా ఉన్నాయి. ఆమె జఘనములు భూమి, నగములు కనుక అక్కడి గోటిగిచ్చుళ్ళు నల్లగా ఉన్నాయి. ఆమె చెక్కిళ్ళు వ్రీడతో, శృంగార క్రీడతో ఎఱ్ఱన అయినాయి కనుక అక్కడి గోటిగిచ్చుళ్ళు పగడాల్లాగా ఎఱ్ఱగా ఉన్నాయి.  వెంటనే తన వక్షస్సీమను, పిరుదులను, చెక్కిళ్ళను దాచుకునే ప్రయత్నం చేస్తూ కన్నులతోనే సరసంగా నాథుడిని అదిలించింది పార్వతి. 

'శివే శృంగారార్ద్రా..' అని, శివుని పట్ల శృంగారార్ద్రమైనవి, యితరులపట్ల కోపభరితమైనవి, గంగపట్ల రోష కలితమైనవి, శివుని వీర చరితలపట్ల విస్మయమయమైనవి,  ఆయన మెడలోని పాములను చూసి భయంగా చూసేవి, తన చెలికత్తెలైన ఆదిలక్ష్మి, సరస్వతులపై చిరునవ్వుతో  ప్రసరించేవి, తన సుతులపై కరుణతో ప్రసరించేవి అని ఆదిశంకరులు సన్నుతించిన ఆ చూపులు మనలను అందరినీ దయజూచునుగాక!

(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు.   

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి