హిమగిరి సొగసులు చూద్దాం రండి - ..

డల్ హౌసీ --2

చమేరా సరస్సు ---

రావి నది మీద హైడ్రో పవర్ ప్రోజెక్ట్ కట్టేటప్పుడు నది నీటిని నిలువ చేసేందుకు ' చమెరా ' ఆనకట్ట వద్ద నిర్మించిన సరస్సు యిది . సుమారు 1700 మీటర్ల యెత్తులో హిమాలయాలలో పైను వృక్షాలతో నిండిన అడవుల మధ్య వుండడం తో యీ సరస్సు పరిసరాలు యెంతో ప్రశాంతంగా వుంటాయి . డల్ హౌసీ కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వుండడం తో డల్ హౌసీ కి వచ్చే పర్యాటకులు తప్పకుండా యిక్కడకి వస్తూ వుంటారు . హిమాచల్ టూరిజం వారి చే బోటింగ్ , ఫిషింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ నడపబడుతుండడం పర్యాటకులను పెద్ద సంఖ్య లో ఆకర్షించడానికి  ఓ ముఖ్య కారణం మని చెప్పవచ్చు .

సరస్సు పరిసరాలు మా మనసులలో ముద్రవేసుకున్నాయి .

భలైమాతా మందిరం ---

ముందుగా చెప్పినట్టుగా యీ లోయ లో సుమారు 84 పురాతన మైన మందిరాలు వున్నాయి , పురాతన మయినది అంటే 6వ శతాబ్దానికి చెందినవి . అందులో డల్ హౌసీ కి సుమారు 35 కిలోమీటర్ల దూరం లో వున్న  ' భలై ' గ్రామం లో వున్న భద్రకాళి మందిరం ఒకటి . సముద్ర మట్టానికి సుమారు 3800 అడుగుల యెత్తులో వున్న మందిరం . కళ్లను ఆకట్టుకొనే రంగులతో వున్న ముఖ్య ద్వారం , స్థంబాలపైన గోపురం పైన అమ్మవారి వివిధరూపాల విగ్రహాలు వున్నాయి . మందిరం కొత్తగా నిర్మింప బడినట్లుగా తెలుస్తోంది . గర్భగుడిలో రెండడుగుల అమ్మవారి నల్లరాతి విగ్రహం యిచ్చే ఆకట్టుకుంటుంది .

1065 లో యీ ప్రాంతం  ' రాజా ప్రతాప సింగ్ ' ( పృధ్వీరాజ్ చౌహాన్  మేనల్లుడు ) ' సామ్రాజ్యం ' బరౌలి '  లో వుండేదట , రాజా ప్రతాప సింగ్ అతని శాసన కాలంలో యెన్నో పురాతన మందిరాలను పునః నిర్మించి నిత్య పూజా నైవేద్యాలకు మాన్యాలు యేర్పరచేవాడట , అతనికి ఓ రాత్రి కలలో దుర్గా దేవి కనబడి తాను ప్రస్తుతం వున్న మందిరానికి మూడు కిలో మీటర్ల దూరంలో అడవిలో మట్టిలో కప్పబడి వున్నట్లు , అక్కడనుంచి తనని తీసి మందిర నిర్మాణం గావించమని కోరుతుంది , మరునాడు అమ్మవారు చెప్పిన గుర్తుల ప్రకారం తన పరివారంతో వెళ్లి ఆ ప్రదేశం లో మట్టిని తొలగించి అమ్మవారి విగ్రహం బయటకి తీసి ' చంబా ' లో మందిర నిర్మాణం చేసి అక్కడ ప్రతిష్టించి దలచి పల్లకిలో విగ్రహాన్ని తరలిస్తూ రాత్రి అవడం వల్ల ' భలై ' గ్రామం లో బస చేస్తారు . మరునాడు రాజా ప్రతాప్ సింగ్ చంబా కు బయలుదేరదలచి విగ్రహమున్న పల్లకీని తీసుకు రమ్మనగా పల్లకి చాలా బరువుగా వుండి యెంతమంది యెత్తినా కదలదు . పండితులను సంప్రతించగా వారు అమ్మవారు యీ ప్రాంతంలోనే వుండదలచినట్లు  , అక్కడే మందిర నిర్మాణం గావించమని సలహా యిస్తారు . రాజా ప్రతాప సింగ్ భలై గ్రామం లోనే మందిర నిర్మాణం చేస్తాడు . భలై గ్రామం లో వున్న అమ్మవారు కాబట్టి స్థానికులు భలైమాత గా పిలువసాగేరు . రాజా ప్రతాప సింగ్ కట్టించిన మందిరాన్ని రాజా శ్రీసింగ్ పునః నిర్మించేడు , స్థానికులలో అమ్మవారి మీద వున్న నమ్మకంతో తరవాతి రాజులుకూడా మందిర మంచి చెడులు చూస్తూ వుండడం జరిగింది . 1973 లో యీ మందిరం లోని విగ్రహాం దొంగిలించబడి తిరిగి కొద్ది సంవత్సరాల తరువాత చోహ్ర ఆనకట్ట ప్రాంతం లో తిరిగి లభించింది . ఆ తరువాత నుండి విగ్రహం నుండి స్వేదం వస్తున్నట్లు యీ మందిర పూజారులు గమనించేరు , యిప్పటికీ కూడా విగ్రహానికి చెమట పడుతూ వుంటుందట .

ఈ మందిరం లో రోజూ అమ్మవారికి హోమం చేస్తూ వుంటారు . చైత్ర నవరాత్రులు , దేవీ నవరాత్రులు ఉత్సవాలకు దూరప్రాంతాలనుంచి భక్తులు వచ్చి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు .

సచ్ పాస్ ----

చంబా లోయని పంగి లోయని కలుపుతున్న " పాస్ " . హిమాలయాలలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులలో  చంబాకి సుమారు 127 కిలో మీటర్ల దూరంలో వుంది . సంత్సరంలో యేడు మాసాల కాలం మంచుతో కప్పబడి రాకపోకలకు వీలులేని ప్రాంతం చంబా నుంచి 'కిల్లర్ ' వెళ్లే రోడ్డు యీ సచ్ పాస్ మీదుగా వెళుతుంది . సాధారణంగా లడాక్ లో వుండే సైనికులకు నిత్యావసర వస్తువలు అందజేసే మార్గం యిది . సచ్ పాస్ మీదుగా వెళితే సుమారు 250 కిలోమీటర్లు  దూరం తగ్గుతుంది  . సరియైన రోడ్లు లేని ఘాట్ రోడ్డు లో 250 కిలో మీటర్లు అంటే సుమారుగా ఒకరోజు ప్రయాణం తగ్గుతుంది . ఈ మార్గం నిర్మించక ముందు మనాలి - రొహతాంగ్ ల మీదుగా  లడాక్ లోని భారత సైన్యానికి నిత్యావసర వస్తువలు అందజేసేవారు . ఇప్పుడు యీ రెండు దారులలోనూ నిత్యావసర వస్తువలు పంపగలుగు తున్నారు .      కనుచూపు మేర వరకు తెల్లగా మంచు తో నిండి వుంటుంది . గ్లేషియర్స మీద నడవడం ఓ అనుభూతి , చిన్నచిన్న కర్ర బల్లల మీద కూర్చొని మంచులో జారడం ఓ అను భూతి . పర్యాటకులు మంచు లో ఆడుకుంటూ ఆనందిస్తున్నారు వుంటారు . రోజులో యెక్కువభాగం వాన పడుతూ బురదబురదగా వుంటుంది . పర్యాటకులకు వేడి వేడి పానీయాలు , ఫలహారాలు అందించే చిన్న బడ్డి హోటల్స్ పర్యాటకులను సేదదీరుస్తూ వుంటాయి . డల్ హౌసీ వచ్చే పర్యాటకులు తప్పక విజిట్ చెయ్యవలసిన ప్రదేశం .
ఖజ్జియర్ ----

చంబా లోయలో సుమారు 6500 అడుగుల యెత్తున వున్న మరో వేసవి విడిది . దౌలాధర్ పర్వత శ్రేణుల పాదాలవద్ద వుండడంతో యిక్కడనుంచి మంచుతో కప్పబడ్డ శిఖరాలు చాలా దగ్గరగా కనిపిస్తాయి . డల్హౌసీ నుంచి సుమారు 24 కిలో మీటర్ల దూరం లో వున్న చిన్న వేసవి విడిది . ఇప్పుడిప్పుడే పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశం కావడంతో చాలా ప్రశాంతంగా వుంది . ఏ వో రెండు హోటల్స్ , గవర్నమెంటు వారి గెస్ట్ హౌస్ తప్ప వేరే వసతులు లేని ప్రదేశం . ఓ మోస్తరు గా వుండి నిండా నాచు మొక్కలతో కప్పబడ్డ సరస్సు , యెటువైపు చూసినా పచ్చని పచ్చిక మైదానాలు , పైను వృక్షాలు , వాటి మీదుగా వీచే చల్లని గాలి , దూరంగా తెల్లని హిమాలయాలతో మినీ స్విట్జర్ లాండు గా ముద్దుగా పర్యాటకులచే పిలువ బడుతోంది . మాకు మాత్రం స్విట్జర్ ల్యాండ్ కన్నా అందంగా అనిపించింది . ఇక్కడకి దగ్గరగా పదకొండవ శతాబ్దానికి చెందిన నాగ మందిరం వుంది . ఈ మందిరం కర్రతో నిర్మింప బడింది . ఈ మందిరంలో వున్న ముఖ్య ఆకర్షణ యేమిటంటే గర్భగుడిలోపల నాగ ప్రతిమలతో పాటు పాండవుల విగ్రహాలు వున్నాయి , కౌరవుల విగ్రహాలు కోవెల పైకప్పు నుంచి వ్రేలాడు తున్నట్లు వున్నాయి . కారణం  స్థానికులు వివరించలేక పోయేరు .

ఖజ్జియర్ నుంచి చిన్న పెద్ద ట్రెక్కింగులు మొదలవుతాయి . అందులో చిన్న పెద్ద కూడా సునాయాసంగా చెయ్యగలిగేది డాయినీకుండ్ ట్రెక్క్ . సుమారు 3.5 కిలోమీటర్లు యెగుడుదిగుడులు  లేకుండా చక్కని కాలిబాట గుండా సాగే ప్రయాణం . పెద్దగా ఆయాసం అనిపించదు . క్రమంగా కొండపైకి చేరుతాం . పచ్చని మైదానాలగుండా సాగే నడక , యెటువంటి తొందర లేకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ , ప్రకృతికి మనకి కలిపి సెల్ఫీ లు తీసుకుంటూ నడిస్తే ఓ గంటలో చేరిపోతాం . తిరుగు ప్రయాణం యింకా తొందరగా అయిపోతుంది . దారిలో వేడి పానీయాలు , నూడిల్స్ అమ్మే చిన్నచిన్న హోటల్స్ కూడా వున్నాయి . ఈ ప్రాంతం లో కేంపింగ్ వసతి కూడా వుంది .

డాయినీకుండ్ ----

డాయన్ అంటే పిశాచం లేక దుష్ట శక్తి అని చెప్పుకోవచ్చు . డాయినీకుండ్ శిఖరం చేరుకోగానే కాళీమాత విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది . చిన్న శిఖరం అక్కడ నుంచి కిందకు చూస్తే అద్భతమే , ఆ ప్రకృతిని వర్ణించడానికి మాటలు లేవు . అమ్మవారికి మొక్కుకొని డాయనీకుండ్ దగ్గరకి వచ్చేం . చిన్న ప్రహారిగోడతో వున్న చిన్న మందిరం . రెండు రాళ్లు పడి వున్నాయి . ఓ పక్కగా లెక్కకు మించి త్రిశూలాలు పాతబడి వున్నాయి . అక్కడ యే దేవీ విగ్రహమూ లేదు . స్థానికుల కథనం ప్రకారం పూర్వం యీప్రదేశం లో దుష్టశక్తులు ప్రవేశించి ప్రజలను నానా యిబ్బందులకు గురి చేస్తూ వుంటే కొందరు మునులు యీ ప్రదేశంలో కాళీమాత కొరకై యాగం నిర్వహించగా అమ్మవారు అక్కడ వున్న ఓ రాయిని పగలగొట్టుకొని ప్రత్యక్షమైందట , తరవాత ఆమె దుష్టశక్తులను సంహరించి అంతర్ధానమైందట , అందుకే యిక్కడ యేవిధమైన విగ్రహమూ లేదు . ఆ రాళ్లకు యిప్పటికీ పూజలు నిర్వహిస్తున్నారు . మునులు మరియే దుష్ట శక్తి రాకుండా యాగకుండంలో త్రిశూలాలను పాతి పెట్టి నట్లుగా చెప్పేరు . కధ యేమయినా గాని డాయనీకుండ్ లాంటి ప్రదేశం మరొకటి మనదేశం లో లేదు అని మాత్రం చెప్పగలను .

జంద్రి ఘాట్ --- 1870 - 1871 లో పూర్తిగా యురోపియన్ స్టైల్ లో రాజా గోపాల సింగ్ చే నిర్మించ పడిన రెండస్తుల భవనం . వేసవిలో రాజ పరివారం అహ్లాద వాతావరణం లో గడపడానికి నిర్మించుకున్న భవనం . బ్రిటిష్ రాజ లో యీ ప్రాంతపు గవర్నరు నివాసనార్దం వుపయోగించేవారు . ఇక్కడి ప్రకృతి యెంతో ఆకర్షించడంతో వైస్రాయి నివాస స్థలంగా మార్చబడింది . పైను వృక్షాలతో నిండిన దట్టమైన అడవి , గలగల మని కొండల పైనుంచి జారుతున్న జలపాతాలు , సెలయేళ్లు , మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరాల మధ్య వున్న యీ భవనం , భవనం ముందున వున్న ఉద్యానవనం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది . ఈ ప్రదేశం మంచి పిక్నిక్ స్పాట్ గా స్థానికులలోను , పర్యాటకులలోను పేరు పొందింది .

ఆనకట్టలు , సరస్సులు , మందిరాలు , ట్రెక్కులు , హిమాలయాలు , గ్లేషియర్స్ , వింటర్ స్పోర్ట్స్ , వాటర్ స్పోర్ట్స్ , ప్రకృతి యిలా అన్నీ వుండి అందరినీ ఆకట్టుకొనే మంచి హాలిడే స్పాట్  ' చంబ ' లోయ అని చెప్పక తప్పదు . యెందుకు ఆలస్యం మీరూ వెళ్లి నేను రాసింది నిజమే కాదో చెప్పండి .

పై వారం మరో ప్రదేశం గురించిన వివరాలతో మీముందుకు వస్తాను అంత వరకు శలవు .

- కర్రానాగలక్ష్మి 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి