కథ : కథంటే..
రచయిత : జీడిగుంట నరసింహమూర్తి
సమీక్ష : రాచమళ్ళ ఉపేందర్
గోతెలుగు 158వ సంచిక!
కథ రాయటం కత్తి మీద సాములాంటిది.
వేల ఆలోచనలతో మధనపడి, కథలోని పాత్రలను సరికొత్తగా రూపుదిద్ది, కథా, కథనాలను సరియైన దిశలో నడిపిస్తూ... అర్థవంతమైన ముగింపుతో పాఠకుల మనస్సు గెలవాలంటే రచయిత ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించాలో, ఎన్ని మెళుకువలు పాటించాలో గోతెలుగు 158వ సంచికలో ప్రచురితమైన జీడిగుంట నరసింహమూర్తి గారు రాసిన "కథంటే...." కథలో కనిపిస్తుంది.
ఈ కథలో జీడిగుంట నరసింహమూర్తి గారు తీసుకున్న వస్తువు, కథనం వినూత్నంగా సాగాయి. రచయితలు ఎదుర్కొంటున్న ప్రధానమైన అంశాలను సున్నితంగా చెప్పటం చాలా బాగుంది. దీనికి మానసిక ఉల్లాసాన్ని కలిగించే చక్కని హాస్యాన్ని జోడించడం సముచితంగా ఉంది.
ఈ కథలోకి వెళితే... రాశుల కొద్దీ కథలు రాస్తున్నా, అవి పత్రికల్లో ప్రచురణకు నోచుకోక రచయితలు పడ్తున్న మనో వ్యథను నారాయణ అనే పాత్ర సూచనల ద్వారా పరిష్కరించే కృషి చేయటం బాగుంది.
పది సంవత్సరాల నుండి కథలు రాస్తున్న అండాళ్ళమ్మ ఒక్క కథ అచ్చులోకి రాకపోవడంతో... బరువెక్కిన గుండెతో నారాయణ దగ్గరకు వస్తుంది. అమె కథలను పరిశీలించి, వాటిలో లోపాలను చెబుతాడు నారాయణ. ఈ సందర్భంలో అండాళ్ళమ్మ హావభావాలను రచయిత చక్కగా వ్యక్తపరిచారు. "విచారాన్నంత ముఖానికి పులుముకొని.." తన్నుకువస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ.." "అమె పరిస్థితి చిలక జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఏమి చెబుతాడో అని ఎదురుచూసే వాడిలా ఉంది" వంటి వాక్యాలు పాఠకులను గిలిగింతలు పెట్టిస్తాయి.
ఆమె కథలు చదివిన నారాయణ వేదాంతిలా నవ్వుతూ... నిట్టూర్పులు విడుస్తూ... కళ్ళకు చేతులు ఆనించుకుంటూ, దీర్ఘ శ్వాస తీసుకుంటూ అమె కథలు ఎందుకు తిరిగొస్తున్నాయో చెబుతాడు. కామాలు, పుల్ స్టాఫ్ల్, ప్రశ్నార్ధకాలు సరిగా లేవని అండాళ్ళుకు చెపుతాడు. ఇలా... మరో కొన్ని పాత్రలు నారాయణ నుండి కథా రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్తూ... కథను ముగింపులోకి వెళతాడు రచయిత.
ముగింపులో కథల వర్కుషాపు పెట్టిన నారాయణ కూడా మాజీ రచయితే అంటూ కథ ముగిస్తుంది.
జీడిగుంట నరసింహమూర్తి గారు ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించేలా సలహాలూ, సూచనలు చేస్తూ చక్కని కథను అందించారు. అంతేకాదు, రచన సామాజిక ప్రయాజనం కలిగించాలి అనే మంచి సందేశాన్ని కూడా గుర్తు చేశారు.
మంచి కథకు పసందైన చిత్రాలు గీసిన మాధవ్ గారికి, "కథంటే..." కథను అద్భుతంగా ప్రజెంట్ చేసిన నరసింహమూర్తి గారికి శుభాభినందనలు.
జీడిగుంట నరసింహమూర్తి గారి ప్రతిభ పెంటాస్టిక్. నిజంగా ఈ కథ వర్థమాన రచయితలకు చక్కని టానిక్ అనడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు.
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు....http://www.gotelugu.com/issue158/4036/telugu-stories/kathante/