భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతమైన ఛండీఘర్ గురించి తెలుసుకుందాం . పంజాబు , హరియాణా రాష్ట్రాల ముఖ్యపట్టణం గా కొనసాగుతూ పంచకుల , మొహాలి , జిరక్ పూర్ , ఖరర్ , ఛండీ ఘడ్ జిల్లాలు కలిగినది ఛండీఘర్ ఛండీ ఘర్ అంటే ఛండీ మాత యిల్లు అని అర్దం అని మనందరకీ తెలుసు . అయితే ఛండీమాత యెవరు , ఈమె యిల్లు యెక్కడ వుండేది , ఈమె పుట్టుకను గురించిన వివరాలు తెలుసుకుందాం . దేవీ పురాణమ ప్రకారం శుంభ నిశుంభులు అనే అసురసోదరులు బ్రహ్మ వద్ద నుంచి మగవారివల్లగాని , జంతువు వల్ల గాని , దేవీ దేవతల నుంచి గాని మరణం లేనట్లుగావుండే వరం పొందుతారు .
వరమదం వల్ల అసుర సోదరులు ఋషులను , మునులను , జనులను కష్టాలపాలు చేస్తూ వుంటారు . వీరి ఉత్పాతం వల్ల ముల్లోకాలు గడగడలాడ సాగాయి . దేవతలంతా విష్ణుమూర్తి ని వుపాయమడుగగా హరి పార్వతి , లక్ష్మి , సరస్వతి ముగ్గురు మాతల శక్తులను కేంద్రీకరించి ఓ అందమైన కన్యను సృష్టించి అందరు దేవతలు తమతమ శక్తులను , ఆయుధాలను యిచ్చి ఆ కన్యకు , ' కౌసికి ' అని నామకరణం చేసి సింహాన్ని వాహనంగా యిచ్చి తమను శుంభ నిశుంభుల బారి నుండి కాపాడమని ప్రార్ధిస్తారు . ' కౌసికి ' శుంభ నిశుంభులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ఉగ్ర రూపాన్ని ' ఛండి ' అని పిలువసాగేరు . ఛండీ ఘర్ కి 10 కిలో మీటర్ల దూరంలో పంచకుల వెళ్లే రోడ్డు మీద శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య గల ప్రదేశంలో హోమగుండం నుంచి ఉద్భవించింది . ఛండీ మాత ఉద్భవించిన ప్రదేశం కావడం తో యీ ప్రదేశాన్ని ఛండీ నివాసంగా ప్రసిద్ధి పొందింది . అందుకే యీ ప్రదేశాన్ని ఛండీఘర్ గా పిలువసాగేరు . ఇది పురాణకథ .
ఇక చరిత్రను చూస్తే మొఘల్ చక్రవర్తులు , ఘుర్ఖా రాజుల చేతులనుండి మహారాజా రంజిత్ సింగ్ పరిపాలనలోకి వచ్చి బ్రిటిష్ రాజ్ లో సిమ్లా , మనాలి మొదలయిన వేసవి విడుదులకి ఛండీఘర్ మీదుగా వెళ్లవలసి రావడంతో యిది ముఖ్య కూడలిగా రూపు దిద్దుకుంది . స్వాతంత్ర్యానికి ముందు పంజాబు ప్రాంతాన్ని తూర్పు పంజాబు పడమర పంజాబుగా విభజించి నప్పుడు అంతవరకు పంజాబు ముఖ్యపట్టణం గా వున్న లాహోరు పడమట పంజాబు కి చెందగా తూర్పు పంజాబుకి ముఖ్యపట్టణం గా ఛండీ ఘర్ ని తీర్చిదిద్ద వలసిన అవుసరం పడింది .
స్విస్-ఫ్రెంచ్ నిర్మాణకారుని ద్వారా నగరనిర్మాణం జరిగింది . ఈ నాటికీ కూడా ఛండీఘర్ నగర నిర్మాణం ఒక అద్భుతమైన నిర్మాణంగా లెక్కిస్తారు . హరియాణా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఛండీఘర్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి పంజాబు , హరియాణా రాష్ట్రాలకు ముఖ్య పట్టణంగా ప్రకటించేరు . ఛండీఘర్ కేపిటల్ బిల్డింగులో ఉభయ రాష్ట్రాల హై కోర్టులు , సెక్రటేరియెట్లు వున్నాయి . ఈ భవనాన్ని 2016 జూలైలో ' వర్ల్డ్ హెరిటేజ్ సైట్ ' గా UNESCO వారి గుర్తింపు పొందింది .
ఈ కేంద్రపాలిత ప్రాంతం శివాలిక్ పర్వతశిఖరాల పాదాల వద్ద వుండడం తో అటవీ ప్రాంతం కూడా యెక్కువే , భారతదేశంలో యెక్కువ అటవీ ప్రాంతం గల ప్రదేశాలలో మూడవ స్థానం సంపాదించుకుంది . అలాగే సెలయేళ్లు , సరస్సులు యెక్కువే , ధార్మిక స్థలాలు కూడా యెక్కువే . అలాగే నగర నిర్మాణ కర్త యీ నగరానికి ఒక చిహ్నాన్ని కూడా నిర్మించేడు , దానిని ' ఓపెన్ హేండు మోన్యుమెంటు ' అని అంటారు .ఛండీఘర్ లో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు సుక్నా సరస్సు , మానసా దేవి మందిరం , రాక్ గార్డెన్ , రోజ్ గార్డెన్ , ఛండీ మందిరం .
సుక్నా సరస్సు --
ఇది మానవ నిర్మితమైన సరస్సు . కొండల మీంచి వర్షాకాలంలో జారే సెలయేటి నీటిని నిలువ చేసేందుకు నిర్మించబడింది . శివాలిక్ పర్వతాలలో పడే వర్షపాతం నీరు నేరుగా యీ సరస్సులోకి వచ్చి చేరుతుంది . దీనిని 1958 నిర్మించేరు , దీని పొడవు సుమారు 3 కిలోమీటర్లు . పర్యాటకులు ఇందులో బోటింగు , ఫిషింగు చేస్తూ వుంటారు . ఈ సరస్సు మధ్య లో టూరిజం వారిచే నిర్మింపబడిన వుద్యానవనం ఒక ఆకర్షణ . ఉదయం సాయంత్రం జోగర్స్ , వాకర్స్ లతో ఈ ప్రాంతం రద్దీ గా వుంటుంది . చుట్టు పక్కల పట్నాలలో నివసించే చిన్న పెద్దలకు యిష్టమైన వారాంతపు శలవు దినాలలో సేదతీరే ప్రదేశం .
మానస దేవి మందిరం ---
హరియాణా రాష్ట్రం లో పంచకుల జిల్లాలో బిలాస్పూర్ గ్రామం దగ్గర సుమారు వంద యెకరాల జాగాలో కట్టిన మందిరం . దీనిని మణిమజ్ర రాజ్యాన్ని పరిపాలించిన మహారాజా గోపాల్ సింగు 1811 - 1815 లలో కట్టించేడు . మణిమజ్ర సామ్రాజ్యం ' పటియాలా అండ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ లో చేరిన తరువాత ఈ మందిరం నిరాదరణకు గురైంది , మందిర పూజారులు మందిర భూములనుండి వచ్చే ఆదాయం వారి అవసరాలకు ఖర్చు పెట్టుకొని మందిర మరమ్మత్తులు వెనుకపెట్టేవారు . పూజలు , ఉత్సవాలలో భక్తులు అనేక యిబ్బందులకు యెదుర్కొనేవారు . 1991 లో హరియాణా ప్రభుత్వం మందిర ట్రస్ట్ యేర్పరచి మందిరాన్ని వారికి వప్పజెప్పేరు . విశాలమైన ప్రాంగణం , పాలరాతి కట్టడం . ఉత్తర భారతదేశం లో పేరు పొందిన మందిరం .
మానస దేవిని గురించి తూర్పు , ఈశాన్య , ఉత్తర భారత ప్రాంతాలలో వింటూ వుంటాం , అదికూడా యెక్కువగా అటవీ , అరణ్య ప్రాంతాలలో . చాలా చోట్ల ఈమెని ' నిత్య ' , ' విషహర ' అని కూడా అంటారు . ఈమెని ఉత్తర భారత దేశం లో శీతలామాతగా కూడా పూజిస్తూ వుంటారు . శీతలామాత అంటే వూరి అమ్మవారు . సాధారణం గా మానస దేవి విగ్రహం యేడు పడగలు కలిగిన ఆసనం మీద కూర్చొని ఒడిలో శిశువుతో వున్నట్లుగా వుంటుంది . మానస దేవి భక్తులు దర్శించుకున్నంత మాత్రానికే ప్రసన్నురాలై వరాలను ప్రసాదిస్తుందట , అలాగే తనను దర్శించుకోని వారిపై అసహనం కలిగి వుంటుందట . కోవెల ప్రాంగణం లో వున్న మర్రి చెట్టుకి యెర్రదారాలు కట్టి వారి వారి కోర్కెలు అమ్మవారికి విన్న వించుకుంటూ వుంటారు . ఒడిలో శిశువుతో వుంటుంది కాబట్టి సంతానం కోసం పూజిస్తారు . నాగపడగల ఆసనం మీద కూర్చొని వుంటుంది కాబట్టి నాగులు యీమె వశంలో వుంటాయని , మానసదేవి పూజిస్తే పాముకాటు వల్ల మరణం సంభవించదని భక్తులు నమ్ముతారు . ఒకే కన్ను వుండడం తో ' ఏకాక్షి ' గా కూడా పిలువబడుతూ వుంటుంది .
మహాభారతం లోనూ దేవీ పురాణం మొదలయిన పురాణాలలో మానస దేవి గురించి కథ యీ విధంగా వుంది .
కశ్యప ప్రజాపతి కి కదృవ కు కలిగిన సంతానం మానసదేవి , నాగుల రాజైన వాసుకి కి సహోదరి . మానస దేవికి చిన్నప్పటినుంచి లక్ష్మి సరస్వతి ల వలె పూజింపబడాలని కోరిక వుంటుంది . యుక్త వయస్సు రాగానే ' జరత్కరు ' అనే మునికిచ్చి వివాహం జరిపిస్తారు . వివాహానంతరం కొద్ది కాలానికే జరత్కరు ముని మానస దేవిని పరిత్యజించి వెళ్లిపోతాడు . పతి నిరాదరణకు గురైన మానస బ్రహ్మ దేవుని ఆజ్ఞ మేరకు ద్వాపరయుగం లో కృష్ణుని సేవించుకొని అతను కృపను పొంది సిధ్దులను పొందుతుంది . కృష్ణుని కృప వల్ల మానసదేవి కూడా పూజార్హురాలు అవుతుంది . కాని ఆమెలో వున్న అసహనం వల్ల తనని దేవీగా అంగీకరించని వారిపై పగ కలిగి వుంటుంది .
దేవీ భాగవతం ప్రకారం బ్రహ్మ ప్రళయానంతరం సృష్టి చేసేటప్పుడు ముందుగా జలచరాలను , సరీసృపాలనుసృష్టించి వాటికి అధిపతిగా శివుని మానసం నుండి మానసదేవిని సృష్టించేడు . శివుని మానసపుత్రి ని చూచి పార్వతీ దేవి అసూయకు లోనై ఆమెను అడవిలో విడిచి పెడుతుంది . ఒకసారి ఛండీదేవి ఆగ్రహాంతో కట్టె విసురుగా అది తగిలి మానసదేవి ఒక కన్ను పోగొట్టు కుంటుంది . యుక్త వయస్కు రాలు కాగానే ' జరత్కరు ' ముని కచ్చి వివాహం చెయ్యడం మిగతా కధ అంతా మొదటి కధ లాగే వుంటుంది . సరీసృపాలకు అధిపతి కావడంతో ఆమెకు పాము విషాన్ని హరించే శక్తి , నాగదోషం వల్ల సంతానం లేనివారికి సంతానాన్ని కలుగజేస్తే శక్తి శివుడు ప్రసాదిస్తాడు .
ఇది మానసదేవిని గురించి మన పురాణాలలో వున్న విషయాలు .
ఈ మందిరం పొద్దున్న 4 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే వుంటుంది . శీతాకాలంలో 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి వుంటుంది . పగలు 10 గంటలనుంచి భక్తులచే నిర్వహింపబడుతున్న ' లంగరు ' అంటే ఉచిత భోజన సదుపాయాలు వున్నాయి . చైత్ర నవరాత్రులు , ఆశ్వీజ నవరాత్రులు యెంతో భక్తి శ్రధ్దలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు .
ఛండీ మందిరం -----
శుంభ నిశుంభులను సంహరించేందుకు చేసిన యాగం లో ముగ్గురమ్మల మూలపు శక్తి నుండి మూడు కన్నులు నాలుగు చేతులతో ' కౌశికి ' ఉద్భవిస్తుంది , శుంభ నిశుంభులను సంహరించి ఛండిక అని పిలువబడుతుంది . ఆమె ఉద్భవించిన కోవెల మానస దేవి మందిరానికి పది కిలోమీటర్ల దూరంలో వుంది . దీనిని ఛండీ మందిరం అని అంటారు . ఈ మందిరం పేరు మీదుగా యీ నగరం ఛండీఘర్ అని పిలువబడసాగింది . పచ్చని ప్రకృతి మధ్యలో యెంతో ప్రశాంతతని కలుగ జేస్తూవుంటుంది .
మిగతా వివరాలు పై వారం చదువుదాం అంతవరకు శలవు .
కర్రానాగలక్ష్మి