మూడు కోరికలు
రాత్రి పదకొండు గంటలప్పుడు బార్ లో మందు కొడుతూ ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు పానకాల రావు. ఆ టేబుల్ దగ్గర పానకాలరావు తప్ప ఇంకెవరూ లేరు. టేబుల్ కి ఒక మూలగా కనిపించిన ఒక దీపాన్ని చేతిలోకి తీసుకుని యధాలాపంగా గట్టిగా రుద్దాడు. చిన్న మెరుపు మెరిసినట్లై కళ్ళముందు ప్రత్యక్షమైంది ఆ దీపం తాలూకు భూతం. పానకాలరావు తో చెప్పింది భూతం " నీ మూలాన నాకు విముక్తి లభించింది. అందుకు బదులుగా ఏవైనా మూడు కోరికలు కోరుకో త్వరగా. తీర్చి వెళ్తా". కొంచెం సేపు ఆలోచించిన పానకాలరావు ఇలా చెప్పాడు " నాకు ఒక బీరు బాటిల్ కావాలి. అది యెప్పటికీ ఖాళీ కాకుండా ఉండాలి. బీరు తాగీ తాగగానే మళ్ళీ సీసా నిండి పోవాలి." "తధాస్తు" అంది భూతం మరు క్షణం పానకాలరావు కళ్ళ ముందు బీరు సీసా ప్రత్యక్షం అయింది. ఆత్రంగా సీసాని ఖాళీ చేసేసాడు పానకాల రావు. మరుక్షణం సుయ్ మనే శబ్దం తో మళ్ళీ బీరు సీసా నిండి పోయింది. అలా మూడు సార్లు అయ్యాక భూతం అడిగింది " మిగతా రెండు కోరికలు కూడా త్వరగా కోరుకో నేను వెళ్ళాలి". దాంతో ఒక క్షణం ఆలోచించి ఇలా చెప్పాడు పానకాలరావు " ఇలాంటి బీరు సీసాలు మరో రెండు ఇవ్వు చాలు. "
*****************************************
దేవుడు-దయ్యం
తాను అన్ని చోట్లా ప్రత్యక్షం కావటం కష్టమని తనకు బదులుగా "తల్లి" ని సృష్టించాడు దేవుడు. దేవుడికి పోటీగా తనకు బదులుగా "అత్తగారిని" సృష్టించాడు దయ్యం.
*********************************************
లెక్చర్
అర్థరాత్రి తాగి ఊగుతూ నడుస్తున్న వ్యక్తిని ఆపాడు పోలీసు. ఈ సమయంలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. "తాగుడు, తాగుడు వలన వచ్చే బాధలు, తాగుడు మానేందుకు చిట్కాలు" అనే విషయం మీద లెక్చర్ వినటానికి వెళ్తున్నాను చెప్పాడు తాగుబోతు. ఈ సమయంలో ఆ విషయం మీద లెక్చర్ ఇచ్చేదెవరు? ఆశ్చర్యంగా అడిగాడు పోలీసు. "నా భార్య మా అత్తగారు" చెప్పాడు తాగుబోతు.
రాంగ్ నెంబర్
సుందరమ్మ కి ఎవరు ఫోన్ చేసినా కనీసం ఒక గంట అయినా మాట్లాడుతుంది. ఆ రోజు ఎందుకో ఇరవై ఐదు నిమిషాలకే ఫోన్ పెట్టేసింది. ఆశ్చర్యంతో తల మునకలు అయి "ఏమిటోయ్ సుందరీ- ఇవ్వాళ మరీ ఇరవై ఐదు నిముషాలకే ఫోన్ కాల్ ముగించేసావే. ఎవరి ఫోన్ ? " అని అడిగాడు భర్త సుబ్బారావు. " రాంగ్ నెంబర్ లెండి" చెప్పింది సుందరమ్మ.
***************
టీవీ సీరియల్
"సార్ మా ఇంట్లో టీవీ తప్ప అన్ని వస్తువులూ దొంగలు ఎత్తుకు పోయారు" పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నాగమణి. "ఆశ్చర్యంగా ఉందే టీవీ తప్ప అన్నీ ఎత్తుకు పోయారా దొంగలు ? టీవీ ని ఎందుకు వదిలేసినట్లు?" అడిగాడు ఇనస్పెక్టర్. "నేను అప్పుడు టీవీ సీరియల్ చూస్తూ ఉన్నాను కదా! " చెప్పింది నాగమణి.
***********************************
కొత్త కారూ- రివర్స్ గేరూ
కొత్తగా కొన్న మారుతి కార్ లో పక్క ఊరికి బయలుదేరాడు అయోమయం. పక్క వూరిలో ఉన్న తన స్నేహితుడి తో ఒక రోజు గడిపి మరునాడు తిరుగు ప్రయాణం అయ్యాడు అయోమయం. బయలు దేరే ముందు తన ఇంటి కి ఫోన్ చేసి తాను ఇంటికి బయలుదేరాననీ రాత్రి కల్లా ఇంటికి వచ్చేస్తాననీ తన తల్లికి చెప్పాడు.
అలా చెప్పిన వాడు రెండు రోజుల తరువాత నీరసంగా రొప్పుతూ రోజుతూ కారులో ఇంటికి చేరాడు అయోమయం. కొడుకు కోసం వీధి గుమ్మం లోనే నిలబడి ఎదురు చూస్తున్న అయోమయం తల్లి కంగారుగా " ఏమైంది నాయనా - నిన్న వస్తానన్నావు కదా. ఇంత ఆలస్యం అయిందేం?" అని ఆదుర్దాగా అడిగింది. తల్లి ఇచ్చిన గ్లాసు మంచినీటిని గట గటా తాగేసి చెప్పాడిలా అయోమయం " ఈ మారుతీ కంపెనీ వాళ్లకు బొత్తిగా బుద్ధి లేదమ్మా. ముందుకు పోవటానికి ఐదు గేర్లు ఇచ్చారు వెనక్కి రావటానికి ఒకే ఒక్క గేరు ఇచ్చారు" చెప్పాడు అయోమయం.
***********************************
పరుగు
లావు తగ్గటానికి డాక్టర్ ని సంప్రదించాడు సింగినాధం. రోజూ పది కిలోమీటర్లు పరిగెత్తితే ఒక నెలలో పది కిలోల బరువు తగ్గుతావని చెప్పాడు డాక్టర్.
నెల రోజుల తరువాత డాక్టర్ కు ఫోన్ వచ్చింది --" డాక్టర్ గారూ మీరు చెప్పినట్లే పది కిలోల బరువు తగ్గాను. కానీ ఇంకొక సమస్య వచ్చిపడింది. మా ఇంటి నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఏం చెయ్యమంటారు?" అని అడిగాడు సింగినాధం.
****************************
ఇస్త్రీ
ఎర్రగా కాలిన రెండు చెవులతో డాక్టర్ సుబ్బారావు క్లినిక్కి వెళ్ళాడు రామారావు.
" చెవులు ఎలా కాలాయి" అడిగాడు డాక్టర్.
"పొద్దున్న షర్టు ఇస్త్రీ చేసుకుంటున్నప్పుడు మా ఇంట్లో టెలిఫోన్ మోగింది. పరధ్యానంగా ఇస్త్రీ పెట్టెను ఫోన్ అనుకొని కుడి చెవికి ఆనించుకున్నాను" చెప్పాడు రామారావు.
" సో సారీ. మరి ఎడమ చెవి ఎలా కాలింది" అడిగాడు డాక్టర్.
"ఆ వెధవ రాస్కెల్ మళ్ళీ ఫోన్ చేసాడండీ" ఏడుపు గొంతుతో చెప్పాడు రామారావు.
**********************************
తిరిగొచ్చాడు
"సార్ సార్ మన జైలు నుండి రెండు రోజుల క్రిందట తప్పించుకున్న ఖైదీ తిరిగి వచ్చేశాడు" జైలు అధికారితో చెప్పాడు గార్డ్.
"ఆ ఏముందీ బయట అన్ని వస్తువుల ధరలూ కనుక్కుని ఉంటాడు. దెబ్బతో తిరిగివచ్చాడు" తాపీగా చెప్పాడు జైలు సూపర్ ఇంటెన్డెంట్
********************