అపార్ట్ మెంటాయణం - భమిడిపాటి ఫణి బాబు

apartment problems

ఇదివరకటి రోజుల్లో గ్రామాల్లో కానీ,కొంచెం పెద్దగా ఉన్న పట్టణాల్లో కానీ,నగరాల్లో కానీ విడివిడి గా ఉండే ఇళ్ళు కనిపించేవి. కాల క్రమేణా జనాభా ఎక్కువ అయిన తరువాత, ఆ ఇళ్ళన్నీ మాయం అయిపోయి అపార్ట్మెంట్ లు గా మారిపోయాయి. చాలా కాలం క్రితం వరకూ, అపార్ట్మెంట్ లు నగరాల్లోనే చూసేవాళ్ళం. ఇప్పుడు ఓ లక్ష జనాభా ఉన్న ఊళ్ళలో కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఖాళీ స్థలాలన్నీ, 'రియల్టర్స్' చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఉద్యోగ రీత్యా అనండి, లేక పిల్లల చదువుల నిమిత్తం అనండి, చాలా కుటుంబాలు పెద్ద ఊళ్ళకి ' వలస' వచ్చేస్తున్నారు. వీళ్ళందరికీ నివాసాలుండాలిగా, దానితో ఎక్కడ చూసినా ఆకాశ హర్మ్యాలు దర్శనం ఇస్తున్నాయి.ఒక బెడ్ రూం,రెండు బెడ్ రూంలు,వగైరా వగైరా.

ఇంక ఆ అపార్ట్ మెంట్ లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.ఎవడో ఒక బిల్డర్ ఓ పెద్ద బిల్డింగు కట్టేయడం, మనమో, మన పిల్లలో బ్యాంకు లోన్ తీసేసుకొని ఓ అపార్ట్మెంట్ కొనేయడం, సంసారం అంతా ఆ కొంపలోకి మారడం.ఇంకా పాత తరం వాళ్ళు, తండ్రో, తల్లో లేక ఇద్దరూనో ఇంకా గ్రామం/పట్టణం లోనే, ఆ ఊరుని,ఆ బంధాల్నీ వదులుకోలేక అక్కడే ఏదో కాలక్షేపం చేద్దామనుకుంటూంటారు.కానీ ఇక్కడ అపార్ట్మెంట్ కొన్న/కొనాలుకొన్న సుపుత్రుడు, ఏవేవో ఆశలు చూపించేసి, ఇక్కడైతే మనందరమూ కలిసి ఉండవచ్చూ, మీకేదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇక్కడ సదుపాయాలు బాగుంటాయీ అని ఎన్నెన్నో కారణాలు చెప్పి, మొత్తానికి ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మించేదాకా ఊరుకోడు.

ఇంక ఆ పెద్దాళ్ళు, వాళ్ళ స్వంత ఊళ్ళో ఉన్నట్లు ఇక్కడ ఎలా కుదురుతుందీ? అక్కడేమో ముందూ, వెనక్కాలా పెరడూ,పూలకీ, కూరలకీ మొక్కలూ అవీ నందన వనంలాంటి చోటులోంచి, ఈ అగ్గిపెట్టెల లాంటి అపార్ట్మెంట్ లోకి రావాలి.

ఎలాగో సర్దుకుపోతారు.బిల్డింగ్ కట్టించేటప్పుడు,అన్నీ బాగానే ఉన్నాయీ అనుకుంటాము.ఉండడానికి వచ్చిన తరువాత అసలు సమస్యలన్నీ వెలుగులోకి వస్తాయి. ఏ టాయిలెట్/ బాత్ రూం లోనో నీళ్ళు సరీగా రావో, లేక ఫ్లష్ సరీగ్గా పనిచేయదో. అవి సరిచేయించాలంటే ప్లంబర్ ఉంటేనే కానీ పని అవదు. వాడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు.తపస్సు చేస్తే దేముడైనా ప్రత్యక్షం అవుతాడేమో కానీ, ఈ ప్లంబర్ అనే ప్రాణి అంత త్వరగా దొరకడు.అలాగే, అపార్ట్మెంట్ కి ఉన్న ఒకే ఒక ప్రవేశద్వారం,తాళం సరీగ్గా పడదు. అది బాగుచేయాలంటే కార్పెంటర్ కావాలి, ఈ పేద్దమనిషీ దొరకడు. ఎలాగోలాగ ఎవర్నో ఒకర్ని పట్టుకుని, వీళ్ళ సెల్ నంబర్లు తెలిసికొని, వాళ్ళని అడగ్గా అడగ్గా ఏమైతేనేం ఆ పనులన్నీ చేయించుకుంటాము. ఇవన్నీ చేయంచుకోవడానికి, ప్రొద్దుటనుండి సాయంత్రం వరకూ ఆఫీసులకెళ్ళే భార్యా భర్తలకి టైమెక్కడిదీ? ఇలాటి సమయాల్లో, ఇంట్లో ఉన్నారే వాళ్ళ ఉపయోగం ఎంతైనా ఉంటుంది.

ఇంక ఆవచ్చిన ప్లంబరో, కార్పెంటరో వాడిష్టమొచ్చినంత రేటు చెప్తాడు, మన అవసరాన్ని బట్టి. ఈ ఇంట్లో ఉన్న పెద్దాయనకి ప్రాణంమీదకి వస్తుంది, ఆ ఫిగర్ విన్నతరువాత. అంత డబ్బూ పెట్టి చేయిస్తే ఏం తంటా వస్తుందో,అంత డబ్బెందుకు పెట్టావూ అంటారేమో అని ఓ భయం, చేయించకపోతే 'వాడు మళ్ళీ మళ్ళీ దొరకడుకదా, వచ్చినప్పుడు చేయించకపోతే ఎలాగా' అని కొడుకూ, కోడలూ క్లాసు పీకుతారేమో.చెప్పొచ్చేదేమిటంటే,పని చెప్పినప్పుడు, డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఇచ్చేయాలి, అంతే కానీ సగం సగం పవర్స్ కాదు. ఇవ్వడానికి కుదరకపోతే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి.

ఈ పైన చెప్పిన ప్లంబర్,కార్పెంటర్, ఎలెక్ట్రీషియన్ లాటి వాళ్ళ అవసరాలు, మనం ఆ కొంపలో ఉన్నంతకాలం ఉంటూనే ఉంటాయి. ఓ ఆస్థాన టీం ని తయారుచేసికుంటే మంచిది.వాళ్ళకి ఏ పండగలొచ్చినప్పుడో ఓ సారి పిలిచి, పని ఉన్నా లేకపోయినా 'బక్షీసు' లాంటిది ఇస్తూంటే, మనం ఎప్పుడైనా అవసరం వచ్చి పిలిస్తే వస్తాడు. ఇదో రకమైన 'ఇన్వెస్ట్మెంట్' లోకి వస్తుంది. ఊరికే ఏం పనీ లేకుండా డబ్బులివ్వడం ఎందుకని అనుకోకండి, మనం చేసే ఖర్చుల్లో ఇదీ ఒకటి.పైగా ఇన్స్యూరెన్స్ పాలసీ కంటే ముఖ్యమైనది. ఆరోగ్యం బాగుండకపోతే, డాక్టర్ దగ్గరకైనా వెళ్ళొచ్చు,లేక హాస్పిటల్లోనైనా చేరొచ్చు, బాత్ రూంలో నీళ్ళురాకపోయినా, టాయిలెట్ లో ఫ్లష్ పనిచేయకపోయినా, పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేముకదా !దానికి ప్లంబరే గతి !!

అదృష్టమేమంటే ఈ మధ్యన  అన్ని అవసరాలకీ  అంతర్జాలంలో వెదకాలే కానీ, ప్రతీదీ దొరుకుతోంది.   నెట్ లో వెతుక్కోవడం తెలిస్తే చాలు. ప్రతీదానికీ ఓ ఏజన్సీ ఉంది. అసలు తెలియకపోవడం కంటే మెరుగే కదా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి