సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam

పాండురంగమాహాత్మ్యం 

క్షేత్రము, దైవము, తీర్థము మూడూ అతి శ్రేష్ఠములై ఒకేచోట ఉన్న స్థలం ఏదైనా ఉన్నదా అని కుమారస్వామిని అడిగాడు  అగస్త్యుడు. అగస్త్యమహర్షికి కలిగిన సందేహనివృత్తి చేయగలిగినవాడు పరమశివుడే అని ఆయనను, ఆయన సతీమణిని, యితరులను వెంటబెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు షణ్ముఖుడు. తల్లిదండ్రులను దర్శించుకుని తను వచ్చిన కారణము ఏమిటో తండ్రి  అడిగిన పిమ్మట తెలియజేస్తున్నాడు.    

తనతండ్రిఁ బల్కుఁ గ్రౌంచనిషూదనుడు చంద్ర 
పరిషన్నిరుద్ద నీరరుహముకుళ 
భాతి మోడుపుఁగేలు ఫాలాగ్ర వీథిక 
విలసిల్లియలర 'నో వృషభ గమన!
నాపేర స్కాందంబునాఁదగు నొక పురా
ణము నీకరుణ కల్మినయ రచించి 
యిమ్మునీంద్రులకెల్లనెఱిఁగింప, నందు వీ
రలు సుర, క్షేత్ర, తీర్థముల కథలు                              (సీ)

చాల వినివిని 'సర్వాతిశాయియైన 
దేవుఁడేనియు నటువంటి తీర్థమేని 
నట్టి సుక్షేత్రమేని భోగాపవర్గ
దాయి గలదేని ఎఱిఁగింపు తడయ'కనిన        (తే)

నీవు వచ్చిన కారణమేమిటి కుమారా అని తండ్రి పలుకగా, చంద్రుల సమూహముచేత నిరోధింపబడిన తామరమొగ్గలవంటి చేతులు తన నుదుటకు తాకుతుండగా, వినయముగా నమస్కరించి విన్నపం చేశాడు షణ్ముఖుడు. చంద్రుడు తామరలకు,  పద్మాలకు శత్రువు. చంద్రుడిరాకతో తామరలు ముడుచుకుపోతాయి, రాత్రులలో.కుమారస్వామి పది వ్రేళ్ళ గోళ్ళు పది చంద్రులలా ఉన్నాయి. ఆ దెబ్బకు తామర  మొగ్గలవంటి చేతులు ముకుళించుకున్నాయి! అలా చేతులు జోడించి 'ఓ వృషభగమనా! నీదయవలన నాపేర ఒక పురాణాన్ని, స్కాందపురాణాన్ని రచించి వీరందరికీ వినిపించాను. అందులోని తీర్థ, క్షేత్ర, దైవతముల కథలను వినీ, వినీ వీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. తీర్థము, క్షేత్రము, దైవము అత్యుత్తమంగా ఒకేచోట వెలసిన పుణ్యస్థలం ఎక్కడన్నా ఉన్నదా అని నన్ను అడిగారు వీరు.  

నీవలనన కడముట్టిన 
దైవతమహిమయును క్షేత్ర తత్త్వముఁ దీర్థ 
శ్రీ విభవము శ్రుతిమార్గ సు
ధావిష్క్రుతిగాఁగ వినుటకై ముదమొదవన్   (కం)

అటువంటి దైవతము, క్షేత్రము, తీర్థము ఒకేచోట ఉన్న పుణ్యస్థలం గురించి నీద్వారా విని తరించడానికి మేము వచ్చాము తండ్రీ!  

ఈ కలశోద్భవప్రముఖు లేనును వచ్చితిమీహితార్థల
క్ష్మీకర! వీని మాకు నెఱిఁగింపు మనంబుననున్న  సంశయో
త్సేకము మానిపింపు కృపఁదేలెడు చూపులఁ జూడు'మన్న దా
రాకమనార్ధమౌళి మధురంబుఁ ప్రియంబునుగాఁగ నిట్లనున్            (ఉ)

ఈ కలశోద్భవుడు, యితరులు, నేను ఈ హితలక్ష్మిని ప్రసాదించే భగవంతుడవని నీ సన్నిధికి వచ్చాము స్వామీ! మా సంశయమును నివారించి, కృపతో చూడు తండ్రీ! అని షణ్ముఖుడు అడిగాడు. 'తారాజారుడు', అంటే చంద్రుడు, సగముగా శిరసులో అలంకారంగా ఉన్న ఆ స్వామి, చంద్రశేఖరుడు మధురంగా, ప్రియంగా యిలా  అన్నాడు.'మము నీ యర్ధమువేడుచున్నయది యుష్మన్మాత యోపుత్ర! యీ  

యుమకున్ మీకు నెఱుంగఁ జెప్పెద వినుండూహించి ఏతచ్ఛరి
త్రము సర్వంబుఁ గరోదర స్ఫటికరత్నశ్రీఁ బ్రకాశింప గో
ప్యము సేయందగు దీనివిన్నపిదపన్ బ్రాణంబుగాఁ జూచుచున్    (మ)

మీతల్లి కూడా యిదే విషయము నన్ను యిప్పుడే అడుగున్నది వత్సా! ఈ ఉమకు, మీకు అందరికీ ఈ వివరము అంతా అరచేతిలోని స్ఫటికములాగా స్పష్టముఅయ్యేట్లుగా చెబుతాను.ఈ చరిత్రమును విన్న తరువాత ప్రాణంతో సమానముగా రహస్యముగా ఉంచాలి సుమా!

'శఠమతికి నాస్తికునకు బాషండునకును 
గర్మము గురించి యాచించు గర్హితునకు 
నీపరమ గోప్యమోపుత్ర! యోపురంధ్రి!
తప్పిదారియు నెఱిఁగింపఁ దరముగాదు            (తే)  

ఓ నారీమణీ! ఓ కుమారా! మూర్ఖుడికి, నాస్తికుడికి, వేదతిరస్కారికి, నీచులకు యిది తెలియగూడని రహస్యము! పొరపాటునకూడా వీరికి ఈ పరమ పవిత్రమైన చరిత్రమును తెలుపగూడదు.  

అని నిజతనూభవునకును
దనమగువకుఁ దీర్థ దైవత క్షేత్రము లొ
క్కనెలవునన భువనత్రయి 
వినుతి గనుట దెలుపఁ గడఁగి విధుమౌళి మదిన్           (కం)

అని తీర్థము, దైవము, క్షేత్రము ఒకేచోట అత్యుత్తమంగా నెలకొన్న స్థలముగురించి చెప్పడానికి నిశ్చయించుకుని, మనసులో శ్రీహరిని భక్తిగా తలచుకున్నాడు పరమశివుడు.  

వెడఁదకన్నులవాని వేనామములవాని 
వ్రేఁతల వలపించు వెరవువాని 
జిప్పకూఁకటివానిఁ జిన్నినవ్వులవానిఁ 
జెరివిన మంచి పించియమువానిఁ 
బులుఁగుతత్తడివానిఁ బొడవులతుదవానిఁ 
బొక్కిటి వెలిదమ్మిపూవువాని 
మినుకుటూర్పులవాని మిసిమిమేఁతలవాని
మెఱుఁగుఁజామనచాయమేనివాని                                (సీ)

దిస్సమొలవాని బసిఁ గానఁద్రిప్పువాని
మురళిగలవాని, మువ్వంక మురువువాని,
విట్టలాధీశుఁదలఁచి తద్విపులమహిమ 
నొడువు బ్రామఱ్ఱి క్రీనీడ విడిదిప్రోడ                       (తే)

విశాలములైన కనులు గలవానిని, వేల నామములు గలవానిని, గొల్లపడతులను వలచేట్లు చేసే ఉపాయము తెలిసినవానిని, చిన్ని చిన్ని ముంగురులు గలవానిని, చిరునవ్వులు చిందేవాడిని, చక్కని పింఛమును సిగలో దోపుకున్నవాడిని, పక్షిని వాహనముగా గలవానిని, పెద్దవాటన్నిటికన్నా పైన ఉన్న పెద్దవాడిని, నాభిలో తామరపూవు కలవాడిని, వేదములను నిశ్వాసములుగా కలవానిని, వెన్నను ఆరగించేవాడిని, దిసమొలతో తిరిగే పసివాడిని,పశువులను అడవులలో త్రిప్పేవాడిని, మురళి గలవాడిని, మూడు వంకలు తిరిగిన శరీరభంగిమతో మురళీగానము చేసేవాడిని, శ్రీకృష్ణుడిని, విఠ్ఠలుడిని తలచుకుని, చెప్పడం  ప్రారంభించాడు పురాతనమైన మఱ్ఱిచెట్టు క్రీనీడను విడిదిగా గల దక్షిణామూర్తి రూపియైన పరమశివుడు!    

సారాచారవిచార! చారణవధూ సంస్తూయమాన ప్రథా
ధారోదారవిహార! హారసుషమా ధన్యస్పురత్కీర్తిక
ర్పూరాలంకృతదిక్క దిక్కరి కరాభోగ స్పురద్బాహుశా
ఖారారజ్యద శేషభూభరణదక్షా! దక్షజిద్వైభవా!                       (శా)

ఆచారముల సారమును విచారించి ఆచరించే ఉత్తముడా! దేవకాంతలచేత కీర్తింపబడే ఉదారగుణముతో నడయాడేవాడా! దిక్కులకు వ్యాపించి ధన్యతను ప్రసాదించే ముత్యముల హారమువంటి, కర్పూరమువంటి స్వచ్ఛమైన కీర్తిగలవాడా! దిగ్గజముల తొండములవంటి విశాలమైన, దృఢమైన బాహువులచేత అశేషమైన భూభారమును వహించగలిగినవాడా! పరమశివునితో సమానమైన వైభవమును గలవాడా, వేదాద్రి మంత్రీశ్వరా!  

నారాయణ పదసేవా 
పారాయణ! బంధులోకపాలన దీక్షా 
ప్రారంభకల్పభూరుహ!
భారతరామాయణాది పరమార్థజ్ఞా!         (కం)

నారాయణ పాదసేవా పారాయణుడా! ఆశ్రిత, బంధులోక పాలనము అనే దీక్షాప్రారంభములో, పాలనములో ల్పవృక్షమువంటివాడా!  భారతరామాయణముల పరమార్ధము సంపూర్ణముగా   తెలిసినవాడా!

సకలసుజనవర్యా! శాంభవాహార్యధైర్యా!
సుకవివినుతకీర్తీ! శుద్ధతత్త్వప్రవర్తీ!
ముకురనిభకపోలా! ముగ్ధలక్ష్మీవిశాలా!
కకుబధిపసమానా! గౌరవశ్రీనిధానా!                   (మాలిని)

సుజనులలో ఉత్తముడా! శివుని కైలాసపర్వతమువలె చలించని ధైర్యముగలవాడా! సుకవులచేత వినుతింపబడే కీర్తి గలవాడా! శుద్ధపరమాత్మ తత్త్వ చింతనలో మగ్నుడా! అద్దములవంటి చెక్కిళ్ళు గలవాడా! విశాల లక్ష్మీసమన్వితుడా! దిక్పాలకులతో సమానుడా! గౌరవలక్ష్మీ సమేతుడా! వేదాద్రిమంత్రీశ్వరా, వినుమయ్యా అని 'పాండురంగమాహాత్మ్యము'లో ప్రథమాశ్వాసమును ముగించాడు తెనాలి రామకృష్ణుడు.

(కొనసాగింపు వచ్చేవారం) 
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి