.స్కంధఫలం - పనస - .

skandaphalam uses

  పస - ఉన్న -నస లేని ,రుచికరమైన, ఆరోగ్య కరమైన, కమ్మ నైన ఫలం-పనస.  పనస- అనేపదానికి -వేదభాగముఅనే అర్ధమూ ఉంది.యజుర్వేద సంహితా భాగంలో ప్రతి పనసలోనూ 50 పదాలుంటాయి. పనస అంటే వేదార్ధంలో  50 పదముల సమూహము అని అర్ధం. వేద భాగాలను అజ్ఝము, అధ్వము, అనువాకము, అట్టము, ఆరణ్యకము, పనస, బ్రాహ్మణము, వగ్గము అని అంటారు.  పనస కు తెలుగు పర్యాయపదములు-కంటక ఫలము, కంటఫలము, చంపాలువు, పయోండము, పూతఫలము, ఫల వృక్షకము, మృదంగఫలము .  'తండ్రి గరగర - తల్లి పీచుపీచు ,బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు '' పనస మీద మన మాతృ భాషలో ఒక తెలుగు పొడుపుకధ .     ‘ఓహోహో బాలమ్మా -ఒళ్ళంతా ముళ్ళమ్మా-కరకరాకోస్తే - కడుపంతా  తీపమ్మా!-- పనస పండుగురించిన మరో పొడుపు కధ పనస ను ఆంగ్లం లో జాక్ ఫ్రూట్ అంటారు .ఇది కమ్మని ఫలాలనిచ్చే అతిపెద్ద వైన పొడవైన పండ్లను కాచే ఒక పండ్ల చెట్టు. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం.

శాస్త్రీయంగా చూస్తే మునగ, ఉసిరి, చింత, నేరేడు, పనస వంటి చెట్లు, మిరియాలు వంటి మొక్కలను ఇంటిలో పెంచడం వలన ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందిట. పనస ప్రపంచంలోనే అతి పెద్ద పండును కాచే చెట్టు. దాదాపు ఒక్కోటి 36  కేజీల పైన బరువు ఉంటుంది. షుమరుగా 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీ మీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పనస పండును కోయడ మూ ఓకళే. కోసేప్పుడు చాకు కు, చేతులకు నూనె రాచుకుని, పెద్ద కత్తిని ఒడుపుగా పట్టుకుని దాని జిగురు చేతులకు అంటకుండా ముందుగా నిలువు కోత వేయాలి. పండును మధ్యకు విడదీసి రెండుగా చేసి నాక ఒక్కో పనా విడదీసి తొనలను లాఘవంగా  పండునుంచీ  అవి విరక్కండా చేత్తోనే విడదీయడం ఓకళ , వేళ్ళను చకచకా కదిలిస్తూ ఎంతో నేర్పుతో చేయాలి.  ఈ పనస పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం.తేనె వంటి తీపిదనం , వెన్న వంటి మెత్తదనం తో  ఈ పనస తోనల రుచి  తింటే తప్పవర్ణిం చడం అసాధ్యం.'పనస పండు వంటి బిడ్డ' అనేమాట వినే ఉంటాం.

ఆయా సీజన్లలో   పండే పండ్లను భుజించడమేకాక , మన ఇరుగుపొరుగులకు  నోములు,వ్రతాల్లో రూపంలో వాయనాలు ఇవ్వడమూ , దానం చయడమూ మనకు తరతరాలు గా వస్తున్న అలవాటు.     వరో లేక గోధుమ తోనో ,మరోటో మాత్రమే తినే  అవసరం లేకుండా ప్రకృతి ప్రసాదించిన పండ్లు , కూరగాయలు ఇతర త్రుణ ధన్యాల ను ఆహారముగా తీసుకుని జీవించినట్లైతే మన శరీరానికి కావల్సిన అన్నిరకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి .ఇదే ఉత్తమమైన ఆహార నియమ నిబంధన అనీ,జీవన విధానమనీ  ప్రకృతి వైద్యుల ఉవాచ.  పనస తొనలు చూడనేకాక తిననూ చాలా రుచిగా ఉంటాయి . మనప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడుతారు . పనస పొట్టు తో ఆవపెట్టిన కూర చేయడం విశాఖ వాసుల స్వంత మనవచ్చు. వారు చేసినంత వడుపుగా ,పధ్ధతిగా, రుచిగా పనస పొట్టుకూరచేయడం వారికే సాటి. ఊరగాయగా నూ తయారు చేసి నిలువ ఉంచి వారు తినడమేకాక అతిధి అభ్యాగతులకందరకూ వడ్డించి విందుచేస్తారు.  దీనిని సంస్కృతంలో “స్కంధఫలం” అని, హిందీలో “కటహక్-కటహర్-చక్కీ” అని, బెంగాలో “కాంటల్”‘ అని, మరాఠిలో “పణస” అని, ఆంగ్లంలో “ఇండియన్ జాక్ ఫ్రూట్” అనీ  అంటారు.  పనస మన పెరట్లో ఉంటే ఆపండు పండాక వచ్చే కమ్మని వాసన ఎంతో మధురంగా ఉంటుంది. పనసచెట్టును ,మన వంట గది సమీపంగా వేసుకుంటే గదిలో కి ఎలాంటి దుమ్మూ ధూళీ రాకుం డా ఆపుతాయి ఆకులు. పనస ఆకులు మందంగా పెద్దవిగా ఉండటాన దుమ్మును చొరనివ్వవు. 

పోషక విలువలు 100గ్రా.లకు  సోడియం - 3మి.గ్రా, కార్బీహైడ్రేట్స్ - 24 మి.గ్రా. ఫైబర్ - 2 మి.గ్రా, ఫ్రొటీన్  -  1 మి.గ్రా, విటమిన్ ఏ - 297  ఈఊ, విటమిన్ ఛ్- - 6.7 మిగ్రా, తియామిన్‌  - 0.03 మిగ్రా, రిబోఫ్లావిన్ - 0.11 మి.గ్రా,నియాసిన్ (విటమిన్ భ్3) - 0.4 మి.గ్రా ,విటమిన్ భ్6 - 0.108 మి.గ్రా, ఫోలేట్ - 14 ంచ్గ్ ,కాల్షియం - 34 మి.గ్రా ,ఐరన్  - 0.6 మి.గ్రా, మెగ్నీషియం- - 37 మి.గ్రా, ఫాస్ఫరస్ - 36మి.గ్రా, ,పొటాషియం-  303 మి.గ్రా, జింక్  - 0.42 మి.గ్రా ,కాపర్ - 0.187 మి.గ్రా, మాంగనీస్ - 0.197 మి.గ్రా, సెలేనియం- 0.6 ంచ్గ్ ,ఫాట్ - 0.3 మి.గ్రా ,శాచురేటెడ్ ఫాట్  - 0.063 మి.గ్రా  మొనౌన్ శాచురేటెడ్ ఫాట్ [అసంతృప్తకొవ్వులు-]- 0.044 మి.గ్రా ,పాలీన్యాచురేటెడ్ కొవ్వులు  - 0.086 మి.గ్రా క్యాలరీస్- 94  .  వైద్యపరం గాపనస చెట్టు సంపూర్ణంగా మనకు ఉపయోగిస్తుంది. పనస ఫలం  జీర్ణ శక్తిని పెంచుతుంది. జారుడు గుణం కలిగి వున్నందున మలబద్దకం నివారిస్తుంది. తిన్న భోజనం  త్వరగా జీర్ణమై ఆకల వు తుంది. పొటాసియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గించును , విటమిన్ సి ఉన్నందు న వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైటోన్యూట్రియంట్స్ ,యాంటీఆక్సిడెంట్లు, ఐసోఫ్లేవిన్స్  ఉన్నందువల్ల కాన్సర్ నివారణకు సహకరిస్తుంది .పనసలో విటమిన్లు,ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్ని స్తుంది. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది.  పనస ఆకులు, మొక్క  జొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి ని రాచినట్లైతే శరీరమ్మీద వచ్చే పుండ్లు  నయమవుతాయి. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. పనస గింజలతో కూరకూడా చేసుకుంటారు.ఇది బలమైన ఆహారం   అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునెప్పి, క్షయ, వంటి వ్యాధులున్నవారు పనసపండును తినకపోడం మంచిది.         చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే కాక , తయారైన కాయను కోసి, ఒకటి రెండు రోజులు నిలువ ఉంచికోస్తే  ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటుంది. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడతారు. అతి సర్వత్రావర్జయేత్ కనుక ఎంత రుచిగా ఉన్నా ,బాగా లభ్యమైనా ఎక్కువగా తింటే అతిసారం కలుగు తుంది. అందుకే ఎక్కువగా కాసినపుడు కోసి తొనలకు ఇరుగు పొరుగులకు ఇవ్వడం వల్ల వారి ఆనందా న్ని చూసి మనకూ ఆ ఆనందం రుచి తెలుస్తుంది.  ' చిన్ననా పొట్టకూ శ్రీరామ రక్ష ' అనుకోక పొరువుగు వారి పొట్టలకూ కాసిన్ని తొనలు పంచడం ఉత్తమం కదా!  ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని స్వయంగా అను భూతి చెందడమూ ఓ గొప్ప లక్షణం.   భారతదేశంలో రెండు రకాల పనస ను పండిస్తారు.

ఒకటి కూజా చక్క. దీనిలో చిన్న చిన్న తొనలుం టా యి.  పండుకూడా కొంచెం చిన్నగానే ఉంటుంది.ఐతే ఈ ఫలాల తొనలు చాలా తియ్యగా, పీచుగా ఉంటా యి. అవి మృదువుగా ఉండడం వల్ల అందులోని తొనలను బయటికి తీయ టానికి చాకు వంటి పరికరాల అవసరం లేదు. రెండవది కూజా పాజమ్. ఇవి వాణిజ్య పరంగా ముఖ్యమైనవి. వీటిలో తొనలు పెళుసుగా ఉంటాయి. వీటిని ఒలవడానికి చాకును తప్పకుండా ఉపయోగించాలి .పనస పండ్లు పూర్తిగా పండితే త్వరగా పాడవుతాయి. వాటి   వాసన మనల్ని కోయమని, తినమనీ తొందరచేస్తుంది. పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండ బెడతారు. వాటిని డబ్బాల్లో వేసుకుని సంవత్సరమంతా ' ఒరుగ్గా ' చేసి ఉపయోగించుకుంటారు. వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతం లో ఒక్కో సమయంలో ఈ పనస పండ్లు పక్వానికి వస్తాయి. కొన్ని చోట్ల మార్చి నుండి జూన్ మధ్యలో, మరి కొన్ని చోట్ల ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో, ఇంకొన్ని చోట్ల జూన్ నుండి ఆగస్టు మధ్యలో అవి కాస్తాయి. వెస్ట్ ఇండీస్లో జూన్ లోనూ, అమేరికాలోని ఫ్లోరిడాలో వేసవి చివరిలోనూ వస్తాయి.పనసకు ప్రసిధ్ధమైన కర్ణాటకలో మాత్రం వేసవిలోనే అంటే ఏప్రిల్ తర్వాత జులైవరకూ పనసపండ్లు పండ్ల దుకాణాల్లో కను విందు ,మూల్యం చెల్లిస్తే కడుపుకూ విందు చేస్తాయి .  పనస వృక్షాన్ని చక్కి చెట్టు అనికూడా అంటారు. ఒకే వృక్షానికి రెండు రకాల పత్రాలు అంటే ఆకులు ఉండడంవల్ల -  దీనిని అనఘ-దత్త వృక్షం అంటారు. పనస వృక్షం లో దత్తాత్రేయులవారి వామ భాగం ఉంటుంది. పనస వృక్షం, ఔదుంబర మేడి చెట్టు కలిసి ఉంటే అది చాలా విశిష్ట మైన ప్రదేశం గాచెప్తారు.పనస వృక్షం మధుమతి తల్లి అంటే సాక్షాత్తూ అనఘాదేవి  నివసించే వృక్షమట. దత్తాత్రేయుని శక్తిస్వరూపిణి ఐన అనఘాదేవి ఈ పనస వృక్షంమూలంలో తన అన్ని శక్తి అంశాలతో నివశిస్తూ ఉంటుంది ట. ఔదుంబర వృక్షం లో దత్తాత్రేయుని కుడిభాగం అంటే,పనస వృక్షం లో దత్తాత్రేయుని వామభాగం ఉంటుంది . పనస వృక్షం లో మహాలక్ష్మి, మహా కాళీ, మహా సర స్వతి, శ్రీ రాజరాజేశ్వరి అంశలు, అలాగే దశమహా విద్యలైన శ్రీదేవి తత్వమూ ఉంటాయిట.

కాబట్టి పనస వృక్ష పూజ చాల ప్రసస్త మైనది అంటారు విఙ్ఞులు . బంగ్లాదేశ్లో జాతీయఫలం పనస. పూర్వం ఇళ్ళళ్లో ఏ మాత్రం చోటున్నా పనస చెట్టు వేసుకునే వారు. ముత్తై దువులు నోచుకునే పదహారుపళ్ల నోములో పనసది ప్రముఖ పాత్ర. పనస పండుతో నోము పూర్తైన వారు, తమనోము సక్రమంగా జరిగిందని సంతోషిస్తారు.   పోలాల అమావాస్య నాడు, మహాలయ అమావాస్య నాడు పనస ఆకులతో గిన్నెలు అంటే దొన్నెలు కుట్టి వాటిలో ఇడ్లీ పిండి వేసి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నివేదిస్తారు.కర్ణాటక రాష్ట్రం లో పనస దొన్నెల లో వండిన ఇడ్లీ లు విశేషంగా భుజిస్తారు. ఫనస పండు వంటి బిడ్ద అనే వాడుక పదం ఉంది.  పనస పండే కాదు ఆ చెట్టులోని అన్ని భాగాలూ మనకు ఉపయోగపడేవే.

ముఖ్యంగా పనస కొయ్య ఎంతో పవిత్ర మైంది. వీణ అనగానే మనకు పలుకులతల్లి వాగ్దేవి చేతిలో శబ్దించే వీణ - కచ్ఛపి, దేవర్షి ఐన నారదుడు నిత్యం' నారాయణ ' నామ జపం చేస్తూ మీటే  వీణ మహతి గుర్తుకు వస్తాయికదా! మరి వీణ లను , మద్దెలలు ఈ పనస కలపతో చేయడం విశేషం . గొప్ప వీణా విద్వాంసులైన ఈమని శంకరశాస్త్రి ,ఆయన తాతగారైన సుబ్బరా యశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా పనస కొయ్యతో తయరు చేసిన  వీణలనే వాయించి కచేరీలు చేసినవారే.   దీని కర్రను ఎక్కువ గా చిన్న పడవలను చేయను ఉపయోగిస్తుంటారు. మృదంగం, కంజీర వంటి సంగీత పరికరాలను కూడా తయారు చేస్తారు. తలుపులు, కిటికీలు వంటి గృహోపకరణాల తయారీలోనూ ఈకలప వాడుతుంటారు.   పనస ఆకులను, పండ్లను పశువులకు మేతగా వేస్తారు. మనదేశం లో పనసాకులను వంటల్లో ఉపయో గిస్తారు. వీటిని భోజనం చేసే విస్తరాకులుగా కూడా ఉపయోగిస్తారు. పనస జిగురును పింగాణి పాత్రలకు, బకెట్లకు పడిన చిల్లులను మూయటానికి వాడుతారు. పనస చెట్టు వేర్లను చెక్కి ఫొటో ఫ్రేములు తయారు చేస్తారు. కొన్ని ఉత్సవాల్లో ఎండిన పనస కొమ్మలను రాకుతూ నిప్పును పుట్టిస్తారు. బౌద్ధ సన్యాసుల దుస్తులకు పనస బెరడుతో తయారు చేసిన డై వేస్తారు.  

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి