పాండురంగమాహాత్మ్యం - ద్వితీయాశ్వాసము
అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు అడిగిన ప్రశ్నకు అందుకు సమాధానము యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై చెప్పడం ప్రారంభించాడు.
శ్రీదయిత చరణ సేవా
ప్రాదుర్భవదఖిల విభవ భాసుర! సర సా
హ్లాదక! వితరణవిద్యా
వేదీ! రామానుజేంద్ర వేదాద్రీశా! (కం)
శ్రీ మహాలక్ష్మి చరణములను సేవించిన కారణముగా కలిగిన సమస్త వైభవములతో ప్రకాశించేవాడా! సరసులకు, అంటే, కవి గాయక కళాకారులకు ఆహ్లాదాన్ని కలిగించేవాడా! దానము చేయడం అనే విద్య తెలినవాడా! అంటే పాత్రనెరిగి, పరిమితులనెరిగి, వినయముగా దానం చేసేవాడా! రామానుజయ్య సుతుడా, వేదాద్రి మంత్రీశ్వరా, వినుమయ్యా అని ఈ కావ్యములో రెండవ ఆశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. పరమశివుడు అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న స్థలం గురించి ఆనంద పరవశుడై చెప్పటం ప్రారంభించాడు.
శైలజ! విను విను షట్కంఠ! కరవీర
కుశల పల్లవంబులఁ గొమరుమిగులు
ఘర్మవీరానది గలసె నెచ్చట నట్టి
భైమి దక్షిణతీరభాగమునకు
యోజనంబున సమస్తోన్నతంబగు తీర్థ
మును క్షేత్రమును జాలఁ బొగడువడయుఁ
బౌండరీకములన భాసిల్లు నచటన
దేవతోత్తముఁడు లక్ష్మీ విభుండు (సీ)
భక్త రక్షణ దాక్షిణ్య సక్తబుద్ధి
యఖిలనిగమౌఘ గిరిగుహా హరిపృథుకము
పాండురంగుండు సాకృతిబ్రహ్మలీల
నిలిచియున్నాఁడు భువనవర్ణితవిభూతి (తే)
శైలజా! షణ్ముఖా! వినండి. గన్నేరు, 'కుశ'ల మెరుపులను కలిగిన ఘర్మవీరానది, భీమనది కలిసిన స్థలానికి దక్షిణ తీరములో యోజనము దూరములో అటువంటి అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న స్థలం ఉన్నది. పుండరీకములు అనబడే ఆ నదుల తీరములో దేవతోత్తముడైన శ్రీలక్ష్మీవిభుడు, శ్రీమన్నారాయణుడు నిలిచి ఉన్నాడు. భక్తరక్షణ మగ్నమైన బుద్ధితో, సమస్త వేదములనే గుహయందు నివసించే సింహము, ఆది నారసింహము ఐన ఆ శ్రీహరి పాండురంగడు అనే నామమును గ్రహించి వెలసి ఉన్నాడు బ్రహ్మలీలతో, విశ్వఖ్యాతిని పొందిన వైభవముతో.
అలికులవేణి! విన్ము! రచితాఖిల పుణ్యుఁ డశేష గణ్యు డ
త్యలఘు వివేకపాకఖని యార్యజనస్తవనీయధైర్యుఁ డు
జ్జ్వలగుణరత్న రత్ననిధి, సత్య దయార్ణవ శాంతి దాంతి మాం
సలగతి, పుండరీకుఁడను సన్ముని పొల్చునొకండు పెంపునన్ (చ)
తుమ్మెదలగుంపు వంటి కురులతో ప్రకాశించే లలితా! విను! సమస్త పుణ్యములకు, విశేషమైన వివేకమునకు నిధివంటివాడు, సాటిలేనివాడు, సుజనులచే పొగడబడే మహానుభావుడు,సద్గుణములకు సముద్రమువంటివాడు, సత్యము, శాంతి, దాంతి రూపుదాల్చినట్లుగా పుండరీకుడు అనే ఒక సన్ముని ఉండేవాడు.
చలిచీమనేనియుఁ జాఁద్రొక్క శంకించుఁ
బలుకఁడెన్నడు మృషాభాషణములు
కలుషవర్తనులున్న పొలముపొంతఁ జనండు
కలిమికుబ్బడుఁ లేమిఁగలఁగఁడాత్మ
దలయెత్తిచూడఁడెవ్వలనఁ బరస్త్రీల
ధైర్యంబు విడఁడెట్టి ధర్ధరముల
నొరులసంపదకునై యుపతపింపడు లోన
నిందింపఁడెంతటి నీచునైన (సీ)
మిన్నకయచూడఁడాఁకలిగొన్న కడుపు
సర్వభూత దయోదయోత్సవ మొనర్చు
నిగమఘంటాపథైకాధ్వనీనా బుద్ధి
బ్రహ్మవిద్యానవద్యుండు బ్రాహ్మణుండు (తే)
ఆ పుండరీకుడు ప్రాణాలు పోతాయి పాపం అని చలిచీమలను తొక్కడానికి కూడా శంకించేవాడు, అంత భూతదయ కలిగినవాడు. ఎన్నడూ వృధాగా సంభాషించేవాడు కాడు. కలిమి లేములకు పొంగడం, కుంగడం తెలియనివాడు, అంటే ద్వంద్వములనుజయించినవాడు. పరస్త్రీలను కన్నెత్తి చూసేవాడు కాడు. ఎటువంటి విపత్తులలోనూ ధైర్యమును విడనాడేవాడు కాడు. యితరుల ఉన్నతిని, సంపదను చూసి మనసులో రగిలిపోయేవాడు కాడు, మత్సరాన్ని జయించినవాడు. ఎటువంటి నీచుడినైనా నిందించేవాడు కాదు, పరనింద చేసేవాడు కాడు, అంటే ఆత్మస్తుతి కూడా తెలియనివాడు! ఆకలికడుపుతో మాడేవారిని ఊరికే చూసి జాలి పడేవాడు కాడు, ఆకలిని తీర్చేవాడు! సర్వభూతదయ అనే ఉదయ ఉత్సవమును చేసేవాడు! వేదవిహితమైన మార్గములో నడిచేవాడు, బ్రహ్మవిద్యలో అసమానుడు ఆ పుండరీకుడు అనే బ్రాహ్మణుడు.
మొదలఁ గామక్రోధముల బరాబరిచేసి,
సత్యవాఙ్నియమంబు సంగ్రహించి,
సాత్త్వికస్వల్పభోజనబుద్దిఁ గ్రొవ్వాగి,
యంగాష్టకాసక్తి హవణుపఱచి,
తరసి ముప్పదిరెండుతత్త్వంబులూహించి,
మది సత్త్వసంపద మస్తరించి,
తెలిసి ముద్రాసనంబుల మేను పనిగొని,
పాపపూరుషుఁ బటాపంచుఁ చేసి, (సీ)
యతఁడు మూలాలవాల గహ్వర కరండ
కుండలీస్థాన గోకర్ణ కోకపాల
తత్త్వదర్శన వర్ణాధిదైవత దళ
నిర్ణయంబెంత యంతయు నిజముగాంచి (తే)
మొదలే కామ క్రోధములను జయించాడు. సత్యవాక్కు పలకడం అనే నియమాన్ని పాటించేవాడు. సాత్వికమైన, మితమైన భోజనముతో కొవ్వును అణిచాడు. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, మనన, సమాధులనే ఎనిమిది విధములైన యోగమార్గమును స్వాధీనము చేసుకున్నాడు. శబ్ద, రూప, రస, స్పర్శ,గంధములు అనే పంచ తన్మాత్రలు, ధివ్యాపస్తేజోవాయురాకాశములు అనే పంచమహాభూతములు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయములు, షట్చక్రాలు, ప్రకృతి, మహత్తు, అహంకారము, జీవాత్మ, పరమాత్మ అనే ముప్పై రెండు తత్త్వములను తెలుసుకుని, ధీనపరుచుకున్నాడు. సత్త్వసంపదను పొందాడు. ముద్రల, ఆసనముల పస, రహస్యములను తెలుసుకుని, శరీరమును జయించాడు. పాపపురుషుడిని జయించాడు. కుండలినీశక్తి తత్త్వమును తెలుసుకున్నాడు. శ్రీమహావిష్ణు సంబంధమైన యంత్ర బీజాక్షరములను, యంత్ర స్థానముల అధిదేవతా, ప్రత్యధి దేవతలను, యంత్ర చక్రములలోని వివిధ దళములను సంపూర్ణముగా తెలుసుకున్నాడు. అంతటి మహా సజ్జనుడు, సాధకుడు, యోగి, ఉపాసకుడు, భక్తుడు ఆ పుండరీకుడు అని చెబుతున్నాడు పరమశివుడు అంటూ సమస్త ఆధ్యాత్మిక ఉపాసనా మార్గముల రహస్యాలను చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు.
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.