కథ : దివ్య దీపావళి
రచయిత : నండూరి సుందరీ నాగమణి
సమీక్ష : ఆకునూరి మురళీ క్రిష్ణ
గోతెలుగు 135వ సంచిక!
దీపావళి నాడు బాణసంచా కాల్చడం డబ్బుని వృధా చెయ్యడం అంటారు కొందరు. అది సంప్రదాయం అంటారు మరి కొందరు. కాల్చిన బాణసంచా నుంచి వచ్చిన పొగ చలికాలంలో క్రిమి కీటకాలనుండి మనల్ని రక్షిస్తుందని అంటారు ‘అన్నీ వేదాలాలోనే ఉన్నాయట’ అని వాదించే మరికొందరు. వీరిలో ఎవరు ఒప్పో తెలియదు కానీ, బాణసంచా కాల్చని దీపావళి పండుగని మాత్రం ఊహించుకోవడం కష్టం.
అసలు ఆ ఆచారమే దీపావళిని పిల్లలకి ఇష్టమైన పండుగని చేసింది. పిల్లలే కాదు- దీపావళి అనగానే పెద్దలకి కూడా గుర్తొచ్చేది తమ చిన్నతనం లో జరుపుకున్న దీపావళి పండుగే. తల్లిదండ్రులతో పేచీ పెట్టి మరీ కొనిపించుకుని కాల్చిన టపాసులే !
సరిగ్గా ఈ నేపథ్యంలో రాసిన కథ నండూరి సుందరీనాగమణి గారి ‘దివ్య దీపావళి !’ క్రిందటి దీపావళి గో తెలుగు పత్రికలో ప్రచురితమై దీపావళి మతాబులా ప్రకాశించింది. ఈ సమీక్ష చదివాక మీరెలాగూ కథ చదవకుండా ఉండలేరు కనుక సమీక్షలో కథని రాయదల్చుకోలేదు నేను. కేవలం కథ మీద నా విశ్లేషణనే రాస్తాను.
విశ్లేషణః కథ అంటే పాఠకుడ్ని తన చెయ్యి పట్టుకుని రచయిత చేయించే ప్రయాణం అన్నారెవరో. కొత్తబట్టలేసుకుని అందరికీ గొప్పగా చూపించుకోవడమే పండగనుకుంటాం బాల్యంలో. కానీ నిజమైన ‘పండుగ’కి అర్ధం పెద్దయ్యాక, జ్ఞానం వికసించాకే తెలుస్తుంది.
ఈ జీవిత సత్యాన్ని తెలిపే ప్రయాణాన్ని ‘దివ్య దీపావళి’ కథలో రచయిత్రి నండూరి సుందరీ నాగమణి గారు పాఠకుడి చెయ్యిపట్టుకుని చాలా జాగ్రత్తగా చేయించారు.
ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఆరంభంలో బుజ్జిగాడికి దీపావళి టపాసులు కొనివ్వడానికి వాళ్ళ నాన్న పదివేలు ఖర్చుపెడుతున్నాడన్న విషయం అర్థమై ఆవేశ పడ్డ రాజారావుతో పాటూ మనం కూడా ఆవేశ పడతాం. ఆ తరువాత టపాసులు కాల్చడం తనకెంత ఆనందాన్నిస్తుందో వర్ణించి చెప్పిన బుజ్జిగాడి మాటల్లో పడి మనం కూడా మన చిన్నతనంలోకి వెళ్ళిపోయి ‘నిజమే కదా’ అనుకుంటాం.
ఆ తరువాత బుజ్జిగాడి ఆందోళన తెలిసి మనం కూడా చిన్నపిల్లాడిలా తల్లడిల్లిపోతాం. బుజ్జిగాడి సమస్యకి పరిష్కారం చెప్పిన తండ్రి మాటలకి ఓ క్షణం మనమే బుజ్జిగాడైపోయి ఆనందంగా తల ఊపేస్తాం. బుజ్జిగాడి దీపావళి నిర్వచనం అర్ధమయ్యాక ఆనందం, అర్ధ్రత రెండూ మనసుని కమ్మేసి రాజారావు పాత్రలోకి ప్రయాణం చేసేసిన మనం అప్రయత్నంగానే జేబులో చెయ్యి పెడతాం ఐదు వేలు తీసి ఇవ్వడానికి ! పాత్రలతో, కథతో మమేకం చేయించే ఇంతకన్నా అందమైన ప్రయాణం ఏం కావాలి పాఠకుడికి?!
కథనంః ఒక సన్నివేశంలో “బుజ్జీ నీ టపాసులు చాలా బాగున్నాయి” అని నారి అన్నాక ‘ఆ మాటలకి బుజ్జికి దిగులుగా అనిపించింది’ అన్న వాక్యాన్ని రాసి సన్నివేశాన్ని ముగిస్తారు రచయిత్రి. ఒక్క క్షణం ఆ వాక్యం దగ్గర ఆగిపోతాం.
తన టపాసులని పొగిడినందుకు చిన్నపిల్లాడైన బుజ్జికి గొప్పగా అనిపించాలి కానీ దిగులుగా ఎందుకు అనిపించడం? అన్న ప్రశ్న మనసులో ఉదయించి, బుజ్జి అందరిలాంటి మామూలు పిల్లవాడు కాదన్న విషయం అర్ధమౌతుంది. ఒక్క చిన్న వాక్యంలో బుజ్జి కేరెక్టరైజేషన్ని మన కళ్ళ ముందు ఉంచిన రచయిత్రి నేర్పు ప్రసంశనీయం.
అంతే కాదు, మొదట చెల్లితో టపాసులని పంచుకోవడానికి కూడా ఇష్టపడని బుజ్జిగాడు తరువాత నారిగాడికి కాల్చడానికి టపాసులు లేవని బాధపడ్డాడు. ఎందుకు? మధ్యలో తల్లి చెప్పిన నీతిని తలకెక్కించుకున్నాడు కనుక. అలాగే మధ్యతరగతి కుంటుంబంలో పుట్టిన బుజ్జి దీపావళికి పదివేల రూపాయలతో టపాసులు కొనుక్కోగలిగేంత శక్తి ఎలా సంపాదించుకున్నాడు? తండ్రి చెప్పిన మాటలు విని ఆచరించాడు
కనుక- ‘ఒక మంచి పిల్లాడు’ ఎలా ఉండాలో వాక్యాల్లో నీతులు చెప్పకుండా కథ చదివిన పిల్లలకి సన్నివేశాల చిత్రణతో అన్యాపదేశంగా చెప్పారు రచయిత్రి.
ఈ రెండూ ఈ కథలో చక్కగా అమరిన కథనానికి ఉదాహరణలు మాత్రమే.
కొసమెరుపుః సాధారణంగా ఏ పత్రికలోనైనా, వెబ్ మ్యాగజైన్లోనైనా ఒక కథకి ఒక బొమ్మ ( illustration) వేస్తారు. కానీ ఈ కథకి కథని మన కళ్ళ ముందు చూపిస్తున్నట్టుగా నాలుగు చక్కని బొమ్మలని ప్రెజెంట్ చేసారు మాథవ్ గారు. కథ ఆయనని అంత బాగా ఇన్స్పైర్ చేసిందని నేను అనుకుంటున్నాను.
ఇంకెందుకు ఆలస్యం? మీ దీపావళిని ‘దివ్యమైన దీపావళి’ చేసే దివ్య దీపావళి కథని, బొమ్మలని వెంటనే ఆస్వాదించండి…
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు.... http://www.gotelugu.com/issue135/3477/telugu-stories/divyadipavali/