చాలామంది, పుట్టి, పెరిగిన ఊరు వదిలి, ఉద్యోగరీత్యానో, ఇంకో కారణం చేతనో, వేరే పట్టణానికో, నగరానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్ళి స్థిరపడిన తరువాత, ఓ వయసు వచ్చిన సమయంలో, అదేదో nostalgia పేరు చెప్పి, ఓసారి మనం పుట్టిన ఊరువెళ్ళి చూసొస్తే బాగుండునూ అనే ఓఅర్ధరహితమైన భావన వస్తూంటుంది. అర్ధరహితం అని ఎందుకన్నానంటే, ఎప్పుడో పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇన్ని సంవత్సరాల తరువాత చూసేందుకేమీ ఉండదు. ఎక్కడ చూసినా మార్పే. అరే ఇక్కడ "ఫలానా వారిల్లుండేదీ.. పిన్నిగారు ఎప్పుడు వెళ్ళినా పటిక బెల్లం పెట్టేవారూ, వాళ్ళ ఇంటరుగుమీద హాయిగా ఆడుకునే వారమూ..", ఇక్కడ ఓ పెద్ద కొబ్బరి తోటుండేదీ, మా ఇల్లు ఇక్కడే కదూ ఉండేదీ..ఇంటికి పెద్ద కాంపౌండూ, వెనకాల పెద్ద పెరడూ..10-15 గదులూ, పెరట్లో నుయ్యీ.. అక్కడే కదూ తువ్వాలు కట్టుకుని స్నానం చేసేవాడినీ...( ఆరోజుల్లో ఆడవారికి మాత్రమే స్నానం గదులు ).
నూతిగట్టు పక్కనే ఓ పొయ్యీ దానిమీద ఓ "డేగిసా" తో వేణ్ణీళ్ళు కాచుకోడమూ, తెల్లారేసరికి అమ్మ, పెరట్లో తులసికోట దగ్గర ప్రదక్షిణాలు చేయడమూ, అన్నిటిలోనూ ముఖ్యం పెరట్లో ఓ రుబ్బురోలూ, పండగల్లో అమ్మ గారెలకోసం మినపప్పు రుబ్బడం, పచ్చళ్ళు వంటగదిలో ఉన్న బుల్లి రుబ్బురోలులో.ఇంట్లోనే ధాన్యం పోసుకోడానికి ఓ గాదె.... ఇలా సినిమా రీలులాగ యాభై ఏళ్ళ క్రితం పాత గుర్తులన్నీ తిరుగుతాయి. కానీ, యదార్ధానికి ప్రస్తుతం అక్కడ ఉండేదేమిటంటే-- ఓ కార్పొరేట్ స్కూలూ, దానికో సెక్యూరిటీ వాడూనూ. ఏదో వాడి కాళ్ళావేళ్ళా పడి, ఓసారి లోపలకి వెళ్ళి చూసొస్తామని వెళ్ళడం. మనకి కనిపించేది ఏమిటీ, ఉత్త ప్రహారీ గోడ. ఆ ప్రహారీ గోడమీదే, సుద్ద ముక్కతో నాలుగు నిలువు గీతలు గీసికుని, వాటినే వికెట్లనుకుని, చక్క బ్యాట్టు, టెన్నిస్ బాలుతో క్రికెట్ ఆడిన రోజులు గుర్తొచ్చి, ఎమోషనల్ అయిపోవడం. ఆ మిగిలిన ప్రహారీ గోడ మీద ఆప్యాయంగా చెయ్యి వేసి ఫొటో తీసికోడం !
అక్కడనుండి , ఏ అమ్మమ్మగారో ఉండే, అగ్రహారానికి వెళ్ళి చూద్దుము కదా, ఆ నాటి మండువా లోగిలి రూపురేఖలే మారిపోయాయి. ఎన్నెన్ని జ్ఞాపకాలు.. పెరట్లో ఓ నుయ్యీ, దాంట్లో ఓ తాబేలూ.. కాళ్ళెత్తి దానిని చూడడం ఓ మధుర జ్ఞాపకం... అలా కాళ్ళెత్తి తొంగి చూడకండిరా పిల్లలూ.. నూతిలో పడిపోతారూ అంటూ అమ్మమ్మ గారి చివాట్లూ..అలాగే , ఎప్పుడైనా కాలికి ఏ బెణుకో వస్తే, ఆవిడ తలుపు వెనకాలా, నేను తలుపుకి ఇవతలా ఉండి, ఆవిడ వేసే " ఇరుకు మంత్రమూ "...అవన్నీ గుర్తుచేసికుంటూ చూస్తే , ఎదురుగా కనిపించిందేమిటీ? ఓ బహుళ అంతస్థుల ఏ కళా లేనిఓ పెద్ద కాంప్లెక్స్ .అయినా ఆ రోజుల్లో చూసినవన్ని ఇప్పటికీ ఉంటాయని ఆశించడమే తప్పు.. అయినా ఎక్కడోమూల ఓ ఆశ.. చాలామంది, నగరాల్లోని గోల భరించలేక, స్వంత ఊళ్ళో స్థిరపడిపోదామా అని అనుకుంటూంటారు.
ఏదో కాలుష్యరహిత వాతావరణమూ, నీళ్ళూ ఉంటాయి కదా అని. కానీ కాలంతోపాటు మనుషుల్లోను మార్పొచ్చేసింది. ఒకడిగొడవ ఇంకోడికి పట్టదు. గ్రామాల్లోకూడా ప్రతీదీ " వ్యాపారాత్మకం ( commercial ) గా మారిపోయింది. ఆరోజుల్లో కనిపించే ఆప్యాయతలు కొండెక్కేశాయి.అయినా మన చిన్నతనంలో ఉన్న స్నేహితులు ఇప్పటికీ ఉండాలనేమీ లేదుగా.మహా ఉంటే అప్పటి స్నేహితుల కొడుకులో, మనవళ్ళో ఉంటారు. వాళ్ళకేం పట్టిందీ ఈ ముసలి ముతక వాళ్ళతో ? ఉద్యోగరీత్యా గడిపిన ఉన్నఊరు వదులుకుని ఏదో సాధించేద్దామని పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళడమంటే, ఓ చెట్టుని వేళ్ళతో పీకేసి, ఇంకోచోట పాతడానికి ప్రయత్నించినట్టన్నమాట. ఉన్న స్నేహితులని వదులుకుని, కొత్తవారిని పరిచయం చేసికొవడంకూడా అలాటిదే.ఎక్కడ చూసినా రాజకీయాలు. నాయకులు అవకాశవాదులు--ఛాన్సొస్తే పార్టీలు మార్చేస్తారు. Development పేరు చెప్పి, ఏవేవొ మొదలెట్టడం. ఇన్ని సంవత్సరాలూ ఏ అభివృధ్ధీ లేకుండానే, వాళ్ళందరూ బతికి బట్టకట్టారా ఏమిటీ? ఈ development అనేది ఓ తాయిలం లాటిది. కానీ తాయిలం మూలంగా, మనం ఏమేమి కోల్పోతున్నామో తెలిసిపోలేకపోతున్నాము.ఇవన్నీ " పాతచింతకాయపచ్చడి " లా కొట్టిపారేస్తారనుకోండీ, అలాగని చెప్పకుండా ఉండలేముగా.
అందుకే పుట్టిపెరిగిన ఊరికి వెళ్ళి, ఏదో ఉధ్ధరించేయడంకంటే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా దాచుకోవడమే ఉత్తమం..
సర్వేజనాసుఖినోభవంతూ...