ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రా నాగలక్ష్మి

( జమ్ము )

1972 వరకు ఆఖరు రైల్వే స్టేషనుగా పంజాబు లోని ' పఠాన్ కోట ' వుండేది . జమ్ము - కశ్మీరు వెళ్లాలంటే పఠాన్ కోట నుంచి రోడ్డుదారిలో వెళ్ల వలసి వచ్చేది . పెరుగుతున్న మిలటరీ అవుసరాలు , టూరిస్ట్ ల తాకిడిని తట్టుకోడానికి 1972 లో జమ్ము వరకు మొదటి రైలు నడపబడింది . నేషనల్ హైవే 1 జమ్ముమీదుగా కశ్మీరు లోయ కు వెళుతుంది .

అంతవరకు శాంతిగా వున్న కశ్మీరీ లోయ లో 1984 లో మొదటి సారిగా వేర్పాటు వాదుల అలజడులు మొదలయేయి . పొరుగు దేశం అండదండలతో వేర్పాటు వాదులు కశ్మీరీ పండిట్లను శ్రీనగరు లోయ నుంచి తరిమి వెయ్యడంతో అంత వరకు శీతాకాలపు రాజధానిగా మాత్రమే ప్రాముఖ్యత కలిగిన జమ్ము నగరంగా రూపు దిద్దుకోసాగింది . చొరబాటుదారుల అలజడులు , వేర్పాటు దారుల గొడవలతో జమ్మూ యెప్పుడూ వార్తలలో వుంటుంది . జమ్ము నగరానికి ఆ పేరు రావడానికి గల కథ తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు .

14 వ శతాబ్దం లో అఖనూరు ప్రాంతాన్ని పరిపాలించిన జంబులోచనుడు ఓ రోజు వేట నిమిత్తమై తావి నదీ తీరాన వున్న అడవికి వచ్చి , సేద తీరేందుకు నది వొడ్డున విశ్రమించగా జాతి విరోధులైన ఓ పులి , జింక ఒకే ప్రదేశం లో తావి నది నీటిని తాగి వారి దారిన అవి వెడలి పోవడం చూసి జాతి వైరులు యింత శాంతిగా బతుకుతున్నాయంటే యిక్కడ నగర నిర్మాణం చేస్తే అక్కడ నివసించే మనుషులు యెంత శాంతంగా మనుగడ సాగిస్తారో కదా అని తలచి యెప్పడూ వేటాడరాదని నిశ్చయించుకొని ఆ ప్రదేశం లో నగర నిర్మాణం చేసేడు . జంబులోచనుని చే నిర్మించబడిన నగరం కాబట్టి ఆ నగరం జంబునగరం అని పిలువబడసాగింది . కాలక్రమేణా అది జమ్మునగరం గాను ఆ తరువాత జమ్ము గానూ పిలువబడసాగింది .

జంతువులు మాత్రమే యిక్కడ శాంతిగా బ్రతక గలుగు తాయేమో అనే అపోహను కలుగ జేస్తోంది నేటి జమ్ము .

ఎవరి దిష్టి తగిలిందో , యేం చేస్తే తిరిగి శాంతి స్థాపన జరుగుతుందో ఆ పైవాడే చెప్పాలి , లేక అతనికీ చేతకాదో కాలమే చెప్పాలి . ఇక ప్రస్తుతం లోకి వస్తే వైష్ణ దేవీ వెళ్లే వారికి జమ్ము రైల్వే స్టేషను నుంచి బస్సు సౌకర్యం వుంది , సుమారు జమ్ము నుంచి కట్రాకు 45 కిలో మీటర్ల దూరం వుంటుంది . స్టేషనుకి అతి దగ్గరగా చాలా వసతి గృహాలు వున్నాయి . జమ్ము- కశ్మీరు ప్రకృతి ఆరాధకులకు , తీర్థయాత్రీకులకూ యిష్టమైన ప్రదేశం . నిలిచింది . చారిత్రాత్మక కోటలు , హరప్ప నాగరికత మొదలయిన చారిత్రాత్మకమైన ప్రదేశాలు వుండడం తో చరిత్ర కారులలోనూ మొదటి స్థానం సంపాదించుకుంది . జమ్ము లో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు రఘునాథరావు మందిరం , రణభీరేశ్వర్ మహదేవ మందిరం , బహుకోట , ముబారక్ మండి , పురాని మండి , అమర మహల్ , కరబల , పీర్ మీఠా . ముందుగా నాకు నచ్చిన రఘునాథ్ మందిరం గురించి తెలియ జేస్తాను .రఘునాథ్ మందిరం -- . రైల్వే స్టేషనుకి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో వుంది . జమ్ము నగరానికి మధ్య భాగంలో వున్న మందిరం యిది . పూర్వం యీ ప్రాంతాన్ని ' సుయి ' అని పిలిచేవారు .  ఈ మందిరాన్ని 1822 లో మహారాజా గులాబ్ సింగ్ చే ప్రారంభించబడి అతని పుతృడైన మహారాజా రంజిత్ సింగ్ పరిపాలనా కాలంలో 1860లో పూర్తి చెయ్యబడింది . దీనిని మందిరం అనే కంటే మందిర సముదాయం అంటే సరిపోతుందేమో ? యెందుకంటే యీ ప్రాంగణం లో చిన్న మందిరాలు కాక పెద్ద మందిరాలు మొత్తం యేడు వున్నాయి .

విశాలమైన పెద్ద ముఖద్వారం , లోపల పాలరాతి నేల చాలా శుభ్రం గా వుంటుంది . బయటి ద్వారం పై రంగురంగుల దేవీ దేవతా మూర్తులు మనల్ని ఆకట్టుకుంటాయి . బంగారు రేకు తాపడం చేసిన పెద్ద మందిరం , యిది సీతారామలక్ష్మణులకు అంకితం చెయ్యబడింది . మందిరం లోపల మహాభారత , రామాయణ , భాగవత గాధలు మందిరం లో నాలుగు వైపుల చిత్రీకరించి వున్నాయి . మొత్తం మందిరం శిక్కు శిల్పకళతో నిర్మింపబడింది . నిర్మాణంలో మొఘల్ శిల్పకళ ప్రభావం కనిపిస్తుంది . పెద్ద ప్రాంగణం మూడు వందలు నాలుగు వందల మంది కూర్చొని భజనలు నిర్వహించుకో గలిగేంత పెద్ద హాలు , ఓ పక్క రాధాకృష్ణ మందిరం వున్నాయి . ప్రవేశద్వారానికి కుడి వైపున సుమారు అడుగున్నర వున్న స్పటిక లింగం చూడ ముచ్చటగా వుంటుంది . పగలంతా తెరిచే వుంటుంది యీ కోవెల . ఆటంకవాదుల భయానికి యీ మందిరం దగ్గర , చుట్టు పక్కల మిలటరీ రక్షణ యెక్కువగా కనిపిస్తుంది . శివమందిరం , గణేష మందిరం , ఆంజనేయు మందిరం కూడా యీ ప్రాంగణం లో వున్నాయి . ఈ మందిరంలో మొత్తం 12 లక్షల విష్ణురూప ( గండకీ నదిలో వుండే ) శాలిగ్రామాలు వున్నాయి .

బజారు మధ్యలో వుండడం తో బయట యెంతో అలజడిగా వుంటుంది , కాని లోపల అంత ప్రశాంతంగా వుంటుంది .ముఖ్య ద్వారానికి యెడమ వైపున యాత్రీకులకు ఉచిత వసతి , భోజన సౌకర్యాలు వున్నాయి .మహారాజా రంజిత్ సింగ్ చే ప్రారంభించ బడిన ఉచిత వేద పాఠశాల యిప్పటికీ నడప బడుతోంది . మహారాజా రంజిత్ సింగ్ హిందూ గ్రంధాలను పర్షియన్ , అరబిక్ భాషలలోకి , వారి గ్రంధాలను సంస్కృతం , హిందీ భాషల లోకి అనువదించేందుకు పండితులను ప్రోత్సహించే వాడట . అందుకు అవుసరమయిన గ్రంధాలను సేకరించి యీ పాఠశాలలో పండితులకు అందుబాటులో వుంచినట్లు చెప్తారు .

అమర నాథ్ యాత్రప్పుడు యిక్కడి వసతి గదులలో వేల సంఖ్యలో యాత్రీకులు బస చేస్తూ వుంటారు . 1999 లో ఆటంకవాదులు అమర నాథ్ యాత్రీకులను లక్ష్యంగా యీ మందిరాన్ని టార్గెట్ చేసి కాల్పులు జరిపారు . అందులో యెందరో యాత్రీకులు ప్రాణాలు కోల్పోయేరు . ఆ సంఘటనకు ముందు రోజు మేం యీ మందిరంలో వున్నాం , సాయంత్రం ఢిల్లీకి బయలుదేరేం . ఒక్కరోజులో మేం తప్పించుకున్నాం .    రఘునాథ్ మందిరానికి అర కిలోమీటరు వరకు నాలుగు వైపులా చిన్న పెద్ద దుకాణాలు షాపింగుకి అనువుగా వుంటాయి . షాపింగ్ మాల్స్ కూడా వున్నాయి . ఈ ప్రాంతాన్ని రఘునాథ్ మార్కెట్టు అని అంటారు . కశ్మీరీ హస్త కళలకు సంభందించిన అన్ని వస్తువలు దొరకుతాయి . మన కళ్లతో చూసి కొనుక్కోవాలి . పోస్టులో పంపుతాం అనే మాటలు నమ్మొద్దు నాసిరకం సరుకు మనకు చేరే అవకాశం యెక్కువ . టూరిస్ట్ ప్రదేశం కాబట్టి మోసాలు కూడా యెక్కువగా వుంటాయి .

సిల్క్స్ అమ్మేవాళ్లు ఉంగరం లోంచి మొత్తం చీరని బయటకి లాగి చూపిస్తారు , అది ఒక ట్రిక్క్ మాత్రమే , మేలి రకపు సిల్క్  కాబట్టి అలా చెయ్యొచ్చు అనే మాటలు నమ్మఖ్కరలేదు . సిల్క్ ని కాల్చి చూసుకొని కొనుక్కోడమే మేలు .

బాదం , అక్రోటు లని రెండింటిని చేతిలోకి  తీసుకొని మెల్లగా నొక్కితే అవి పగలాలి , అప్పుడే అవి మంచి రకానివిగా గుర్తించాలి , తొక్క గట్టిగా వున్న వాటిని కొనవద్దు . మేలురకం బాదం లు , అక్రోటులు కాస్త యెక్కువ ధర లో వుంటాయి . కుంకుమ పువ్వు ప్రభుత్వపు ఆమోదం వున్న పేకెట్స్ నే తీసుకోవాలి .

కశ్మీరీ వర్క్ వున్న డ్రస్సులు , చీరలు తీసుకో వచ్చు . ఈ మార్కెట్టులో యెక్కువ బేరసారాలు వుండవు . అలాగే తివాసీలు కూడా ప్యూరు వూలు , సిల్క్ , పోలియస్టర్ లలో దొరుకుతాయి . నాణ్యతను బట్టి ఖరీదు వుంటుంది .

ఇక్కడ అన్ని తరగతులవారికి అందుబాటులో వుండే భోజన వసతి సదుపాయాలు వున్నాయి .

అమర్నాధ్  యాత్ర రిజిస్ట్రేషన్ కార్యాలయం , ప్రభుత్వపు వసతి గృహాలు కూడా యీ ప్రాంతం లోనే వున్నాయి .

ఈ ప్రాంతం లో వున్న కె.సి రెసిడెన్సీ లో వున్న పలక్ రివాల్వింగ్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది , భోజనం చేస్తూ మొత్తం జమ్ము నగరాన్ని వీక్షించడం నాకు చాలా నచ్చింది . వైష్ణవదేవి నెలకొని వున్న పర్వత శిఖరాలు , గలగలా ప్రవహిస్తున్న తావి నది , బహు మహల్  , రఘునాథ్ మార్కెట్ , జమ్ము నగరం మొత్తం , యివన్నీ యెత్తులో కూర్చొని చూడ్డం చాలా బాగుంటుంది . వీలయితే మీరు కూడా ఆ అనుభవాన్ని సొంతం చేసుకోండి .

పై వారం మరిన్ని విశేషాలతో మీ ముందుంటానని తెలియజేస్తూ  అంత వరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి