కథ : ఈ -కాలం
రచయిత : అత్తలూరి విజయలక్ష్మి గారు
సమీక్ష : జీడిగుంట నరసింహమూర్తి
గోతెలుగు 55 వ సంచిక!
ఈ రోజుల్లో పెళ్ళి, ఆ తర్వాత జీవితమనేది కేవలం 50 % గారంటీ మాత్రమే. తెలివిగల వాళ్ళు జీవితంలో ఎదురైనా కొన్ని ఇబ్బందులను తమ కనుగుణంగా మార్చుకుని జీవన యాత్ర సాగిస్తారు. భార్యా భర్త లిద్దరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు డబ్బు బాగా సంపాదించుకో గలరేమో కాని జీవితంలో మాత్రం చాలా విషయాలలో రాజీ పడుతూనే బ్రతకాల్సి వుంటుంది. ఉద్యోగాలలో వుండే ఒత్తిళ్ళ వల్ల ఆనందంగా గడపటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపక పోవడం జరుగుతూ వుండటం చూస్తూ వుంటాం. ఈ క్రమంలో వారిలో ఎవరో ఒకరికి అసంతృప్తి చోటు చేసుకుంటూ వుంటుంది.
తత్ఫలితంగా వారిలో ఇగో సమస్యలు, ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవడం ఒకానొక పరిస్తితిలో ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితి, ఆ తర్వాత మెల్ల మెల్లగా జీవితం మీద ఆసక్తి సన్నగిల్లి డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఒక దశలో జీవితంలో రాజీ పడి జీవించే కన్నా విడాకులు తీసుకోవడం నయం అనే పరిస్తితికి వచ్చేస్తారు. "ఈ -కాలం " లోని కధలో లాలిత్య, వ్యాస్ పరిస్తితి కూడా అంతే. కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్న దంపతులకు కోర్టువారు వెంటనే విడాకులు మంజూరు చెయ్యక కొంత సమయం ఇస్తారు. ఈ లోపల వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుని రాజీ పడే అవకాశం ఉంటుందేమో అని వారి ఉద్దేశ్యం. ఈ కథలో లాలిత్య అత్తగారు ప్రవేశంతో తాత్కాలికంగా విడాకుల ఆలోచన వాయిదా పడుతుంది. అత్తగారు కొడుకు కోడళ్ళ ఆలనా పాలనా దగ్గరుండి చూసుకోవడంతో ఆ దంపుతుల మధ్య ఒత్తిళ్ళు , పని తాలూకా శ్రమ తగ్గడంతో వారు మానసికంగా, శారీరకంగా తిరిగి దగ్గరవుతారు. వాళ్ల విడాకులు విషయంలో వారిద్దరిని స్వయంగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలనుకున్న లాలిత్య లాయర్ మిత్రురాలు వారింట్లో పరిస్తితిని చూసాక ఆమెకు అవసరం తప్పుతుంది. ఇది చాలా ఇళ్ళల్లో జరిగే కథే. రచయిత్రి చక్కగా తమదైన శైలిలో హృదయానికి హత్తుకునేతట్టుగా కథను మలిచారు. రచయిత్రికి అభినందనలు
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు.... http://www.gotelugu.com/issue55/1507/telugu-stories/ee-kaalam/
...