( జమ్ము ---4 )
కట్ర - భవన్----
జమ్ము రైల్వే స్టేషను నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ' రియాసి ' జిల్లాలో వున్న పట్టణం . దేశ రాజధాని నుంచి కట్ర వరకు రైలు సేవ కూడా నడపబడుతోంది . జమ్ము రైల్వే స్టేషను నుంచి బస్సులు కూడా వున్నాయి . కట్ర నుంచి వైష్ణవదేవి మందిరానికి నడక దారి మొదలవుతుంది . భక్తులచే షేరోవాలి , జైమాతాదేవి గా పూజలందుకొనే వైష్ణవదేవీ మాత నివాసం కట్రాకు దగ్గరగా వున్న త్రికూట పర్వత శ్రేణులు . అమ్మవారి మందిర ప్రాంతాన్ని ' భవన్ ' అని అంటారు . కట్ర నుంచి ' భవన్ ' కి సుమారు 13.5 కిలోమీటర్లు , కొండదారి కావడం తో భక్తులు నడకన గాని , గుర్రాల పైన గాని , పల్లకిలో గాని వెళ్లవలసి వుంటుంది . ఈ మధ్యకాలంలో మందిర ట్రస్టు , ప్రైవేటు సంస్థ కలిసి హెలీకాఫ్టర్ సేవ ప్రవేశ పెట్టేరు . అర్ధకుమారి నుంచి భవన్ వరకు బేటరీ తో నడిచే ఆటోలు నడుపుతున్నారు . హెలీకాఫ్టర్ సేవ వతావరణం మీద ఆధారపడి వుంటుంది .
1980 వరకు చాలా సన్నని కాలిబాటగా వున్న ఈ దారిని T-Series అధినేత గల్షన్ కుమార్ యిచ్చిన విరాళంతో మందిరం వరకు సిమెంటు రోడ్లు వెయ్యబడ్డాయి . ఉచిత భోజన సదుపాయం కూడా కలుగచెయ్యబడింది .
మందిర ట్రస్టు చొరవతో భవన్ వరకు దారంతా షెడ్డులు , వీధి దీపాలు , అడుగడుగునా ఫలహారాల దుకాణాలు యేర్పాటు చేయబడ్డాయి .
షేరోంవాలి గా పిలువబడే వైష్ణవదేవీ మాత స్థలపురాణం యిలా చెప్తారు
కృతయుగంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి వారిలోని తేజస్సును తీసి , ఆ మూడు తేజస్సులను కలిపి ఒక చిన్న పాపలో ప్రవేశ పెడతారు. ఆ పాప మహా తేజొవంతురాలై ప్రకాశిస్తూ “ఓ తల్లులారా నన్నెందుకు సృష్టించేరు” అని అడుగగా త్రేతాయుగంలో నువ్వు భూలోకంలో జన్మించి శ్రీరాముని విష్ణుని అవతారముగా గుర్తించిన అనంతరం భూలోకంలో నీ అవతారం పరిసమాప్తి ఔతుంది. నువ్వు విష్ణువులో ఐక్యమై వైష్ణవిగా భూలోకంలో పూజలు అందుకుంటావు అని చెప్తారు .
ఆ ప్రకారంగా త్రేతాయుగంలో దక్షిణదేశంలో రత్నాకరుని యింట పాపగా జన్మిస్తుంది. పాప జన్మ రహాస్యం తెలియని రత్నాకరుడు పాపకు వైష్ణవి అని నామకరణం చేసి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు . వైష్ణవి జ్ఞాన సముపార్జనలో గురువులందరి దగ్గర నుంచి విద్యను పొంది, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందడానికి గురువుల దగ్గరకి వెళ్ళగా యోగాన్ని మించినది లేదని వారి నుంచి తెలుసుకొని తపస్సమాధిలొకి వెళ్తుంది.
త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసంలో వుండగా తపస్సులో వున్న వైష్ణవి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. వచ్చినది విష్ణు అవతారమని గ్రహించిన వైష్ణవి ప్రణమిల్లి తనని ఐక్యం చేసుకోమని కోరుతుంది . అందుకు శ్రీరాముడు పట్టాభిషేకానంతరం వచ్చి ఆమెను అనుగ్రహిస్తానని మాట యిస్తాడు . ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు పట్టాభిషేకానంతరం వైష్ణవి వద్దకు వృద్దుని రూపంలో రాగా వైష్ణవి తన వద్దకు వచ్చినది విష్ణుమూర్తి యని పోల్చుకోలేక పోతుంది . అప్పుడు శ్రీరాముడు తన నిజరూపంతో దర్శనమిచ్చి తిరిగి తాను కలి యుగంలో కల్కి అవతారంలో వచ్చి ఆమెను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఆమెను త్రికూట పర్వతాన తపస్సమాధిలో వేచి వుండమని చెప్తాడు . శ్రీరాముని ఆజ్ఞ మేరకు వైష్ణవి దక్షిణ భారతాన్ని విడిచి ఉత్తర భారతానికి వెళ్లి త్రికూట పర్వత ప్రాంతాన వున్న అడవులలో యోగసాధనలో వుంటుంది. ఆమె యెప్పుడూ కోతుల గుంపుతో చుట్టుముట్టబడి సింహవాహనముపై తిరుగుతూ వుండేది.
త్రేతాయుగము ముగిసి ద్వాపరంలో కృష్ణావతారంలో విష్ణుమూర్తి కంసుడు , నరకాసురుడు మొదలగు వారిని సంహరించి మహాభారత యుద్ధానంతరం కృష్ణావతారం చాలించి వైకుఠంలో వుండసాగెను.త్రికూట పర్వత ప్రాంతాన యోగసమాధిలో వున్న వైష్ణవి ముగిసిన ద్వాపరయుగము గురించి గాని కలియుగ ప్రారంభము గాని తెలియలేదు. యెప్పుడూ కోతుల సముదాయముతో చుట్టుముట్టబడి సింహమును వాహనముగా చేసుకొని తిరుగుతూ వుండే వైష్ణవి మామూలు మనవమాత్రురాలు కాదని తలచిన శ్రీధరుడు అనే పేదవాడు ఆమె భక్తుడుగా మారుతాడు . వైష్ణవి గురించి విన్న గోరక్షకనాధ్ అనే యోగసాధకుడు ఆమె యోగశక్తి ఎంతటిదో తెలుసుకొని రమ్మని తన ముఖ్య శిష్యుడైన బైరవనాధుని పంపుతాడు. భైరవనాధుడు వైష్ణవిని వెన్నాడుతూ వుంటాడు . ఆమెని చూస్తున్నప్పుడు ఆమె యొక్క యోగశక్తిని అంచనా వెయ్యవలసిన అతని కళ్ళు ఆమెను మొహంతో చూస్తూ వుంటాయి .
శ్రీధరునికి చుట్టుపక్కల వుండే సిద్దులకు, యోగులకు తాపసులకు భోజనాలు ఏర్పాటు చెయ్యాలనే తలంపు కలుగుతుంది. శ్రీధరుడు పేదవాడగుటచే భోజనము యేర్పాటుకు కావసిన ధనము కాని సరకులు కాని లేకపోవుటచే అతను నగరములోని వారి వద్దకు పోయి సహాయము అర్ధించెను. అలా సమకూడిన ధనము భోజన ఖర్చులకు సరిపోదని తెలిసిన శ్రీధరుడు ముందురోజు రాత్రి ఆందోళనతో నిద్ర రాక గడుపుతాడు . మరునాడు గోరక్షక్ నాథ్ తన శిష్యులతో వస్తాడు . పిలిచిన వాళ్లకు రెట్టింపుమంది వస్తారు . వైష్ణవి ఎనిమిది సంవత్సరాల బాలికగా వచ్చి అందరికి విస్తరాకులు పరచి వడ్డన సాగిస్తుంది . ఎవరు కోరిన వంటకాన్ని వారికి వడ్డించి వారిని సంతృప్తులను చేస్తుంది . శ్రీధరుడు , బైరవుడు ఆ బాలిక వైష్ణవి అని గ్రహిస్తారు. శ్రీధరునిలొ ఆమె పట్ల భక్తి పెరుగగా భైరవునిలో ఆమె పట్ల మోహం అధికమౌతుంది . భైరవుడు తనను వివాహమాడమని వైష్ణవిని వేధించసాగేను . వైష్ణవి భైరవుని తప్పించుకొని త్రికూట పర్వతంపైకి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటూ వుంటుంది . ఆ ప్రదేశాన్ని యిప్పుడు “చరణ్ పాదుకా ” గా వ్యవహరిస్తున్నారు . కొంతకాలానికి భైరవుడు వైష్ణవి వునికి కనిపెట్టి అక్కడకు చేరుకుంటాడు . వైష్ణవి అక్కడనుంచి యిప్పటి ” అధ్ కుమారి ” అని పిలవబడుతున్న గుహకు చేరి అక్కడ తపస్సు చేసుకుంటూ వుంటుంది ,
భైరవుడు అక్కడకు కుడా వచ్చి వేధించడంతో అక్కడనుంచి భవన్ కు చేరుకొని శివలింగాన్ని ప్రతిష్టించుకొని ప్రశాంతంగా యోగ సాధన చేసుకుంటూ వుంటుంది . కొంతకాలానికి భైరవుడు అక్కడకు కూడా వస్తున్న సమాచారం యోగ శక్తితో తెలుసుకున్న వైష్ణవి తన వాహనమైన సింహాన్ని అధిరోహించి భైరవునకు యెదురు వెళ్లి తన కరవాలముతో భైరవుని శిరస్సు ఖండిస్తుంది . భైరవుని శిరస్సు ఎదురుగా వున్న పర్వత శిఖరాన పడుతుంది. భైరవుని శిరస్సు నేలను తాకగానే అతని తప్పిదం అతనికి తెలుస్తుంది. భైరవుడు తన తప్పును క్షమించమని వైష్ణవిని వేడగా ఆమె అతన్ని క్షమించి అతనికి మోక్షప్రాప్తి నిస్తుంది . తన దర్శనానంతరం భైరవుని దర్శించే వారికి వైష్ణవీదేవి యాత్ర ఫలం పొందుతారు అనే వరాన్ని అనుగ్రహిస్తుంది. శ్రీధరుడు వైష్ణవిని పూజించుకుంటూ శివసాన్నిధ్యం చేరుకుంటాడు. మానవ రూపంలో విష్ణువుకై వేచి యుండడం ప్రమాద భరితమని తలచిన వైష్ణవి ఒక గుహలో ఐదు అడుగుల ఎత్తైన గుట్టపైన మూడు శిలలుగా యోగసమాధిలో కల్కి కై వేచియుంది . తనలో వున్న శివుని ఎదురుగా నిలుపుకొని యిప్పటికి యోగ సమాధిలో వుండి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ త్రికూట పర్వతంపై కొలువై వుంది మాతా వైష్ణవీదేవి .
వైష్ణవదేవి కోవెలలో ప్రతి రోజు ప్రొద్దుట సాయంత్రం హారతి విశేషంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు నవరాత్రి వుత్సవాలు జరుగుతాయి . అవి 1) చైత్ర నవరాత్రులు , 2) దుర్గా నవరాత్రులు . ఎనిమిదేళ్ళ బాలికలకు పూజ చేసి కానుకలు సమర్పించడం జరుగుతూ వుంటుంది .ఏడాది పొడవునా సాగే ఈ యాత్రను వర్షాకాలం మరియు శీతాకాలం వెళ్ళకుండా వుంటే మంచిది. యేకాలంలో వెళ్ళినా కూడా తగిన చలిదుస్తులు తీసుకోని వెళ్ళాలి. వర్షాకాలంలో వర్షాలకి కొండచరియలు విరిగి పడతాయి. శీతాకాలంలో హిమపాతం జరగవచ్చు , లేదా ఆ చలి మనం తట్టుకోలేనంతగా వుంటుంది. మే ,జూన్ మాసాలలో కూడా కనీసం రెండు చలిదుస్తులుండాలి . కట్రా లో వుండేందుకు అన్నివసతులు వున్నాయి . ఉత్తరాది , దక్షిణాది భోజన సదుపాయాలూ కుడా వున్నాయి. కష్టతరమైన యాత్రే కాని మనకు ఆ ప్రకృతిని , భక్తుల భక్తి పారవశ్యాన్ని చూస్తూ వుంటే యే కష్టమూ తెలియదు. రాత్రికి పగలుకి తేడా లేకుండా భక్తులు ” జై మాతా ది” నామ స్మరణతో కొండ యెక్కుతూనే వుంటారు .
సందర్శకులు కట్ర లో యాత్రీనివాస్ లో పేర్లు నమోదు చేసుకొని యాత్రీ టిక్కెట్టు తీసుకోవాలి , మధ్యలో వచ్చే చెకింగు లో యీ టికెట్టని పరీక్షించడం జరుగుతుంది , టికెట్టు లేని యాత్రీకులను దర్శనానికి అనుమతించరు , హెలీకాఫ్టర్ లో వెళ్లే వారికి ఆ టికెట్టు నే దర్శనం టికెట్టుగా పరిగణిస్తారు .
కట్ర నుంచి సుమారు 7.5 కిలోమీటర్ల నడక తరువాత ' అర్ధకుమారి ' లో అమ్మవారు తపస్సు చేసుకున్న గుహ వుంటుంది . దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా యిక్కడ అమ్మవారిని దర్శించుకొని తరువాత భవన్ వెళతారు . చిన్న గుహ ఒకరి తరువాత ఒకరు కష్టంగా పాక్కుంటూ వెళ్లాలి . అక్కడ దర్శనం చేసుకొని భవన్ లో వున్న వైష్ణవదేవీని దర్శించుకోవాలి .
ముఖ్యమైన దినాలలో పౌరాణిక ద్వారం గుండా దర్శనానికి అనుమతిస్తారు . కొండపైన పక్కగా వున్న గుహలో శివలింగాన్ని , వినాయకుడి , హనుమంతుడు మొదలయిన దేవీ దేవతలను దర్శించుకొని అక్కడనుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో వున్న బైరవ్ మందిరాన్ని దర్శించుకోవడంతో యీ యాత్ర ముగుస్తుంది .
రాత్రి భవన్ లో బస చేయదలచుకున్న వారు కట్ర లోని యాత్రీనివాస్ లో ముందుగా డబ్బులు చెల్లించి గదులు పొందవచ్చు . సాధారణంగా యాత్రీకులు దర్శనం అయిపోగానే తిరుగు ప్రయాణ మవుతారు .
కట్ర నుంచి అర్ధకుమారి వరకు ఒకే దారిలో సాగే ప్రయాణం అక్కడనుంచి భవన్ వరకు నడిచే వారి దారి వేరుగాను , గుర్రాలదారి వేరుగాను సాగుతుంది . హెలీకాప్టర్ లో పర్యాణించేవారు రాను పోను 5 కిలో మీటర్ల నడక లో వెళ్ల వలసి వుంటుంది .
కోవెల హారతి సమయాలలో తప్ప యిరవైనాలుగు గంటలు భక్తుల కొరకై తెరిచే వుంటుంది .
ఫిబ్రవరి లో ఒకటి రెండు సార్లు హిమపాతం కూడా జరుగుతుంది .
అక్రోట్స్ కొనదల్చుకున్నవారు కట్ర మార్కెట్లో కొనుక్కో వచ్చు . కట్ర మార్కెట్లో దక్షిణ భారతదేశపు వంటలు వడ్డించే చాలా రెస్టారెంట్స్ వున్నాయి .
వైష్ణవదేవిని దర్శించుకొనేవారు యిక్కడకి దగ్గరగా వున్న శివఖోడి ని కూడా దర్శించుకో వచ్చు . కట్ర నుంచి శివఖోడి వరకు బస్సు , టాక్సీ సేవలు వున్నాయి .
పై వారం శివఖోడి వివరాలు తెలుసుకుందాం , అంతవరకు శలవు .