బంగారు భరిణలో రత్నాలు పగుల గొడితేగాని రావు, మెల్లిగా తెరిస్తే కనిపిస్తాయి, కంటికింపుచేసి, కడుపు నింపుతాయి. కంటికింపుచేసి, కడుపు నింపుతాయి. - ఈ పొడుపుకధకు జవాబు దానిమ్మ పండు. బైబుల్ లోనూ దానిమ్మ ప్రస్తావన ఇలా ఉంది--'-మిగ్రోనులో ఒక కొండ కోనలో ఒక దానిమ్మ చెట్టు క్రింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు.'. ఇంకా ఇలానూ ఉంది- ' హగ్గయి 2:19—19 - గోదాముల్లో ధాన్యం నిలవవుందా? ద్రాక్షాలతలు, అంజూరపు చెట్టు, దానిమ్మ చెట్టు ఇంకను పండ్ల నీయటం లేదా? (లేదు).అయితే మిమ్మల్ని ఈ రోజునుండి ఆశీర్వదిస్తాను!’--అంటే దానిమ్మ క్రీస్తు తరం నుంచీ ఫలాలనిస్తున్న వృక్షం అన్నమాట. దానిమ్మ పత్రిని వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక వ్రతంలో ఏకవింశతి పత్రి పూజలో పన్నెండ వది. లలితా సహస్రనామాలు చదివేప్పుడు మనం అమ్మవారి 'దాడిమికుసమప్రభ' అనే నామం చదువుతాం.
దానిమ్మ శాస్త్రీయ నామం " ఫునికా గ్రానటుం".దానిమ్మ పండు పండ్ల జాతులలో బహు మేలైనది . దానిమ్మను సంస్కృతంలో 'దాడిమ 'లేక దాడిమము అని అంటారు .ఆంగ్లం లో పొమగ్రనేట్ అంటారు.తెలుగు పర్యాయపదాలు మాత్రం చాలానే ఉన్నాయి.దాడినిమ్మ, మధుబీజము , దామిడీ వృక్షమ్ మొదలైనవి. దానిమ్మకు "పునికా గ్రనాటమ్" అనే శాస్త్రీయనామం ఉంది .దానిమ్మను తమిళంలో "మాధుళం ఫలం" అనీ అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషలలో అనార్ అని అంటారు.
దానిమ్మ 3నుండీ 6 మీ. ఎత్తువరకూ పెరిగే చిన్న చెట్టు ,పెద్ద మొక్క కోవకు చెందినది.దీని చిన్నకొమ్మలు చివర ముళ్ళలాగా కూసుగా ఉంటాయి.చిన్న ఆకులు , ఎర్రని పూలు, పండ్లు ముదిరేకొద్దీ ఎర్రగానూ లేక కమలాపండురంగులోకీ వస్తాయి.లోపలి విత్తనాలు మంచి ఎర్రముత్యాల్లా నిగనిగలాడుతూ చూడగానే తినా లనిపిస్తాయి.దానిమ్మ పూలు సంవత్సరమంతా పూస్తాయి, కాయలుమాత్రం మే నుంచీ జూన్ వరకూ లభ్య మవుతాయి.వీటిపై ఉడతల దాడి ఎక్కువ.
కాబూల్ దానిమ్మ రుచికీ ,సైజుకూ, రంగుకూ కూడా ప్రసిధ్ధి . ప్రసిధ్ధ నటి కీ,శే. భానుమతి తన రంగు రోజూ ఒక గ్లాసుడు దానిమ్మ రసం త్రాగడం వల్లే అనిచెప్పినట్లు అంటారు. దానిమ్మను తోటల్లో రైతులు వ్యాపారపంటగానేకాక మన ఇళ్ళలోనూ స్థలం ఉన్నవారు పెంచి ఫలా లను ఆర గించి ఆరోగ్యం తమ స్వంతం చేసుకుంటున్నారు.ఇది పర్షియా, కాబూల్ బెలూచిస్థాన్ అడవుల్లో ప్రకృతి సిధ్ధం గా పెరిగే చిన్న చెట్టు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పండించే దానిమ్మ సాగురైతులకు ధనాగారం వంటిది, దానిలోని నిగనిగలాడే గింజల్లా. దానిమ్మ చెట్టుకు సరైన జాగ్రత్తలుతీసుకునిసాగుచేస్తే ఒక్కో చెట్టుకూ కనీసం 100 నుంచి 150 కాయలు కాస్తాయి. ఒక్కో కాయ దాదాపు అర కిలోకుపైగానే ఉండవచ్చు.షుమరుగా మూడేళ్ళ లో దానిమ్మ కాపుకొస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ తోటలను పెంచుతున్నారు. భారతదేశంలో కర్ణాటకరాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. దానిమ్మ భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫండు. దానిమ్మకు నీరుకూడా ఎక్కువగా అవసరం లేదు. అందు వల్ల రైతులు సాధారణంగా నీటి కరవు ఉన్న అటవీ ప్రాంతాలలో సులువుగా దానిమ్మ సాగుచేయను వెను కాడరు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలని స్తుంది. దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తుంది. పచ్చని చెట్టు నిండా ఎర్రగా, నిగనిగలాడుతూ కళ్లకు కను విందు చేసే దానిమ్మకాయలు చూస్తుంటే ప్రకృతి అందాలకు ఎంతో ఆనందం కలుగుతుంది.
తినడానికి రుచిగా ఉండటమేకాక పుష్కలంగా పోషకాలుకూడా ఉన్నది. దానిమ్మ రక్త శుధ్ధికి ఎంతో మంచిది. దీనిలో విటమిన్ ఎ,సి, ఇ ,బి5, ఫ్లవనొఇద్స్ ఉన్నాయి. దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . వాణిజ్యపరంగానేకాక ఔషధ గుణాల పరంగాకూడా దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది.
పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణాల వేడి ప్రభావం నుంచి రక్షణకలిగిస్తుంది . అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమూహం దానిమ్మ. అందువల్ల శరీర కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, క్యాన్సర్లను అడ్డుకుంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను అవసరమైనంత వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మన గుండె ఎంచక్కా భద్రంగా కలకాలం పనిచేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడను కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు రసం.ప్రకృతి అందించే ఈ మందును సేవించి మంచి ఆరోగ్యం పొందవచ్చు.సహజ ఆస్ప్రినే కాక దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. గర్భిణీ స్త్రీలకు దానిమ్మ అమోఘమైన ఫలితాలను కలిగిస్తుంది.గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవ సర మైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే ఎంతో మంచిది. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనా లతో బాధపడే వారికి మంచి మందు ఇది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగ జేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి. దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తుంది . రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - హృదయంలో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం నుంచీ రక్షణనిస్తుంది . అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ 50 కన్నా తక్కువగా ఉన్నా- వారనికో సారి గ్లాసుడు దానిమ్మరసం త్రాగడం మంచి మందు. దానిమ్మగింజలు నమిలేకంటే రసము తీసుకొని త్రాగడం వల్ల వెంతనే గుణంకనిపిస్తుంది. దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది. దానిమ్మ పండ్ల తొక్కను, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉప యోగిస్తున్నారు.దానిమ్మ పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్ కంటే మేలైన వైన్ తయారు చేయవచ్చునట. ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి త్రాగితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
కాళ్ళ వాపువస్తే ఈ ఆకును కడితే తగ్గుతుంది. గర్బవతులు ప్రతి రోజు 600 మి.గ్రా నుండి 400 మి.గ్రా ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ లభిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. దానిమ్మ పండ్లను అర కప్పు తీసుకోవడం ద్వారా చెడు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, ఊబకాయాన్నితగ్గిస్తుందని ఆరోగ్య నిపు ణులు అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలకు నయం అవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా సాగడం కోసం దానిమ్మను తీసుకోవాలి. గొంతునొప్పికి దానిమ్మ దివ్యౌషధంగా పని చేస్తుంది.
ఎవరైనా జబ్బుపడిన వారిని పలుకరించను వెళ్ళే ప్పుడు ఆపిల్, బత్తాయి పళ్లతోపాటుగా దానిమ్మ పండు ను ఖచ్చితంగా తీసుకెళతాం.దానిలో ఉండే ఔషధ గుణాలవల్ల ఇలా చేయడం జరుగుతున్నది."అనార్కలీ" అంటే దానిమ్మ మొగ్గ అని అర్థం. అనార్కలి సినిమా గురించీ తెల్సుకదా!అనార్కలీ అనే ఆమె ఎర్రగానూ, నాజూకుగానూ, చూడముచ్చటగానూ ఉండటం వల్లే అక్బర్ చక్రవర్తి ఆమెకు ఆ పేరు పెట్టాడట. జ్వరంవల్ల దాహం వేసేవారికి దానిమ్మరసం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. దానిమ్మలో ఉండే నూనెలు, ఎపిడేర్మల్ కణాలకు శక్తిని అందించి వయసు తోవచ్చే చర్మంపై ముడతలను అదుపుచేస్తుంది. దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలను వాడమని సౌందర్య నిపుణుల సలహా . దానిమ్మ పండు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.దానిమ్మఓ దివ్య ఔషధం.
దానిమ్మ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ పూర్తి పోషకాలను అందించే ప్యాకేజ్ గా పిలవబడుతున్నది. దానిమ్మలో వివిధ రకాల పోషకాలు ఉండటం వల్ల దీన్ని ' అద్భుత ఫలంగా ' గా కూడాపిలుస్తారు.
వంద గ్రాముల దానిమ్మ 83 కెలోరీల బలాన్ని మనకు అందిస్తుంది. ఈ కేలరీలు ఆపిల్ కంటే అధికం. 100 గ్రాముల దానిమ్మలో నాలుగు గ్రాముల పీచు ఉంది. ఇది జీర్ణశక్తిని పెంచి, ప్లేగు సంబంధిత సమస్యలను రానివ్వదు. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మలో ధాతువులు, క్యాల్షియం, కాపర్,ఐరన్, పొటాషియం, మాంగనీస్‌లు కూడా ఉన్నాయి.
ధమనులను శుభ్రపరుస్తుంది దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్. దీన్లో గ్రీన్ టీలో కంటే అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ,ఆల్కహాల్ అధికంగా త్రాగేవారు దానిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటారు. దానిమ్మ ముఖ్యంగా హృద్రోగాలవారికి చాలా మేలు చేస్తుంది. వాత, కఫ హరం.జీర్ణశక్తిని పెంచుతుంది.పూలు రక్తశ్రావాన్ని అరికడతాయి. కొమ్మ బెరడు రక్త విరోచనాలను తగ్గిస్తుంది.ఆయుర్వేద, సిధ్ధ ,యునానీ, హోమియో పతి వైద్యాలలో బాగా ఉపయోగిస్తు న్నారు. దానిమ్మరసం త్రాగి దాగున్నరోగాలను తరిమికొడదాం .