సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణిస్తూ, ఆతడి తపోవిధానాన్ని వర్ణిస్తున్నాడు పరమశివుడు. మిసిమింతుఁడునుగాక వసియించుఁ గుత్తుక  బంటి నీరను బుండువంటి చలిని; 

మోముఁ దమ్మికిఁ  దేటి మొత్తమై పొగ పర్వ 
వ్రేలుఁగ్రిందలఁ గాఁగ వృక్షశాఖ ;
వేరువెల్లఁకి కాయగూరపండని కోర 
కుదరాగ్ని గాడ్పుచే నుజ్జగించు;
నేచి యీచెవి గాడు పాచెవిఁ బోవంగ 
నుబ్బి లింగముఁబోలె నుండునెండ                      (సీ)

నంతరాయాంధకారంబు లలమికొనిన 
నడఁచు నిజధైర్య సూర్యోదయంబుచేత;
దానవారిని గుఱిచేసి తనకుఁ బోదు 
నాకుఁ బోదని నమ్మి సుశోకుఁడతఁడు                   (తే) 

తన మిసిమి యింతయై తగ్గిపోకుండా, అంటే వన్నె తగ్గకుండనే, పుండులా సలిపే   చలికాలంలో కుతుకలదాకా లోతున్న నీటిలో నిలిచి తపస్సు చేస్తాడు. తన ముఖము  అనే పద్మానికి పొగలాగా తుమ్మెదలు కమ్ముకొంటూ ఉండగా, తలక్రిందులుగా వృక్ష  శాఖలకు వ్రేల్లాడుతూ తపస్సు చేస్తాడు. వేరు, కాయ, కూర, పండు అని చూడక, కోరక, ఉదరాగ్నిని గాడ్పుచే, వేడి గాలిచే ఆర్పుతాడు, తిండి మీద ధ్యాస లేకుండా తపస్సు  చేస్తాడు. ఈచెవి నుండి ఆచెవికి వేడి గాడ్పు ఈడ్చి ఈడ్చి కొడుతుండగా స్థాణువులా, లింగంలా ఎండలో వుండి తపస్సు చేస్తాడు. 

ఏవైనా అంతరాయాలు అనే చీకట్లు అలముకుంటే, తన ధైర్యము అనే సూర్యోదయముతో  ఆ విఘ్నములనే చీకట్లను తరిమికొట్టి తన తపస్సును కొనసాగిస్తాడు. రాక్షస సంహారి ఐన  శ్రీహరినే తనకు లక్ష్యముగా చేసుకుని, తనకు తపస్సు చేయకా తప్పదు, ఆ హరికి తనను కరుణించకా తప్పదు అని అలా తన తపస్సు కొనసాగించాడు పుండరీకుడు!   

ఓ గజరాజగామిని! మహోగ్రపునోములు నోచుచున్న య
య్యోగివరేణ్యునేమమున నుల్లము వెన్నవలెన్ గరంగె,హృ
ద్రాగ సమగ్ర గోపవనితా జనతా పరిరంభ సంభ్రమో
ద్యోగ కళాప్రవర్తికిఁ, జతుర్ముఖ వంచిత ధూర్త కీర్తికిన్                 (ఉ)

పరమశివుడు పార్వతీదేవికి పుండరీకుడి కథ చెబుతున్నాడు. ఓ గజరాజ గామినీ! మహా ఉగ్రమైన నియమముతో తపస్సు చేస్తున్న ఆ యోగివరేణ్యుడిని గమనించి, హృదయానురాగంతో నిండుగా గోపవనితా జనములను కౌగలించుకుని సంభ్రమం  పొంది, పొందించే సరస శృంగార కళా ప్రవర్తికి, ధూర్తుడైన చతుర్ముఖుడిని  వంచించిన కీర్తి కలిగిన ఆ కృష్ణమూర్తికి మనసు వెన్నలా కరిగింది. యిక పుండరీకుడిని 
కరుణించాలి అనుకున్నాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి