సరస్వతీదేవి పాదాలపై సిరిమల్లి - మంగళంపల్లి - వనం వెంకట వరప్రసాద రావు

mangalampalli bala muralikrishna

కళాకారుడు విశ్వమానవుడు. ఏ హద్దులూ లేని విశ్వమూర్తి. అందునా సంగీత కళాకారుడు సాహితీ వేత్తకన్నా ఎక్కువగా,  నేరుగా గుండెను కదిలిస్తాడు. సాహిత్యకారుడు ముందు మేథస్సుకూ ఆ తరువాత హృదయానికి స్పందన కలిస్తాడు. ‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయం ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం’ అని భారతీయుల భావన. సంగీత సాహిత్యాలు జగజ్జనని సరస్వతీదేవి రెండు స్తనములు. ఒకటి సంగీతక్షీరధారలను, మరొకటి సాహిత్య క్షీరధారలను తన   శిశువులకు ప్రసాదిస్తుంది. అమ్మ శారద ప్రేమగా తాగించిన సంగీత, సాహిత్య క్షీరధారలను కడుపునిండా తాగిన అదృష్టవంతులు వాగ్గేయకారులై  ఆ సరస్వతీ ప్రసాదాన్ని ప్రపంచానికి వరదలెత్తి పారిస్తారు. అటువంటి మహానుభావులైన వాగ్గేయకారులలో ఒకరు శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ!ఐదు అడుగులకు కొద్దిగా మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 'మూర్తి' సంగీతప్రపంచంలో మూడులోకాలనూ ఆక్రమించిన త్రివిక్రమ మూర్తి. ఎక్కడో తెలుగునాట గోదావరీ తీరంలో జన్మించిన కుఱ్ఱవాడు అఖిలభారతాన్నీ, అంతటితో ఆగకుండా సమస్త విశ్వాన్నీ తన గానామృతంలో ఓలలాడించి, దేశదేశాల నాయకులకు, అధికారులకు, సామాన్య ప్రజలకు బ్రహ్మానంద సమమైన  హదానందాన్నికలిగించడం ఆ బాలుడి పురాకృత సుకృతం. ఆ బాలుడు తెలుగునాట పుట్టి,  తమిళనాట మెట్టి, అఖిలభారత సంగీతరత్నమై ప్రకాశించడం భారతీయుల అదృష్టం, తెలుగువారి మహద్భాగ్యం. ఆయనను వరించని పురస్కారాలు లేవు. ‘వరించని పురస్కారం యేదన్నా వుంటే, యింకా అనుమానమెందుకు, దానికి ఆయనను వరించే అదృష్టం యిప్పటిదాకా పట్టలేదన్నమాట!’ భౌతికంగా గాయకునిగా జీవించిన ఎనిమిది దశాబ్దాలు ఆయన 'భారతరత్నమై' ప్రపంచ సంగీతసరస్వతీ శిరోరత్నమై ప్రకాశించాడు, యిపుడు అమరులై భారతీయుల గుండెలలో ‘చింతామణి’ ఐనాడు! 

మిత్రులొకరు గుర్తు చేసినట్లు, ఒక కచ్చేరీలో ఆయన గానం చేసిన ‘ ఎందరో మహానుభావులు..’ కృతి విని, ఒక రిక్షా లాగుకుని  జీవించే బడుగుజీవి ఆ రోజు తన ఆదాయాన్ని ఆయనకు దక్షిణగా సమర్పించుకున్నాడు అంటే అంతకన్నా పురస్కారం  యేం కావాలి? ఆ డబ్బులతో తన జేబులోని డబ్బును కలిపి ఆ రిక్షా కార్మికుడి చేతిలోపెట్టి, కనులచెమ్మతో ఆయన ఆనందించారుట! ఆయన గొంతులానే గుండె కూడా అతి మెత్తన అనడానికి యింతకన్నా ఋజువు యేం కావాలి?  

కేవలం ఏ భేషజమూ తెలియని, నిరాడంబరమైన, పసిపిల్లాడివంటి ఆయన తత్త్వానికి ఉదాహరణగా నా స్వీయ అనుభవాన్ని యిక్కడి పాఠక మిత్రులతో పంచుకుంటున్నాను. స్వోత్కర్ష కాదు సుమా! నాలాంటి ఒక అనామకుడు నేరుగా ఫోన్ చేసి, మిమ్మల్ని కలవాలని ఉంది అంటే, అలాగే, రమ్మని పిలిచి మాట్లాడిన ఆదరమూర్తి ఆయన అని తెలియజేయడమే నా లక్ష్యం.'అంగుష్ఠమాత్రుడు' కూడా అధికారపార్టీ వార్డు మెంబర్ అయితే చాలు, అప్పాయింట్మెంట్ తీసుకుని కలవాల్సిన ఈ రోజుల్లో ఆకాశానికి ఎదిగిన సంగీత మూర్తి ఎంత స్నేహమూర్తి అని ఆశ్చర్యం కలుగుతుంది.  

అప్పుడు నా బాల్యమిత్రుడు శ్రీహరి బాంక్ ఆఫ్ టోక్యో, చెన్నై బ్రాంచ్ 'అసిస్టెంట్ మేనేజర్'గా పనిజేసేవాడు. ఎప్పట్లాగే  స్టేషన్ కి వచ్చి కారెక్కించుకుని యింటికి తీసుకెళ్ళాడు. రెండోరోజున మరొక్కసారి కంచికి. ఎన్నోసారో లెక్కపెట్టుకోవడం మానేసి చాలా ఏళ్ళు అయ్యింది అప్పటికి. మరునాడు మా సంభాషణ..

'అరేయ్ మామా! బోరు కొడుతున్నదిరా!'

'ఏం చేద్దాం?'

'ఇవ్వాళా బ్యాంకుకి వెళ్ళాలా?'

'నాదేమన్నా నీలా మార్కెటింగ్ ఉద్యోగమనుకున్నావా? కొద్దిగా ముందో వెనకో పర్లేదు కానీ, వెళ్ళాలి.'

'మంగళంపల్లి వారిని కలుద్దామా?'

మనకు ఎలా దొరుకుతాడురా పెద్దాయన?'

'ప్రయత్నిద్దాంరా!'

'ఆయనెందుకు గుర్తుకొచ్చాడ్రా నీకు?'

'సాహితీసప్తవింశతి' సంకలనానికి ముందుమాట వ్రాస్తారేమో ప్రయత్నం చేద్దాంరా!

(సాహితీ సప్త వింశతి అనే పేరుతో నన్నయ నుండి నారాయణ రెడ్డి దాకా 27 మంది కవుల రచనల గురించి, 27 మంది వక్తలతో  27 రోజులు సాహిత్య ఉపన్యాసాలు ఏర్పాటు చేశాను 2001 లో, మా మధిరలో, నేను నడుపుతున్న చైతన్యభారతి, సాహితీ  సాంస్కృతిక సంస్ట ఆధ్వర్యంలో. ఆ ఉపన్యాసాలను వ్యాసాల రూపంలో సంకలనంగా తీసుకువస్తే యింకా ఉపయోగకరంగా  ఉంటుంది అని ప్రయత్నం మొదలుపెట్టాను)

అప్రాచ్యుడా! ఆశకు హద్దుండాలి! అన్నట్టు చూశాడు మాహరి. నేను పట్టించుకోలేదు. మళ్ళీ కొద్దిగా నస పెట్టాను. టెలిఫోన్ డైరెక్టరీ చూసి, నంబర్ తీసుకున్నట్లు గుర్తు. ఆ నంబర్ కి ఫోన్ చేస్తే ఎవరో ఒకావిడ తీసి, ఎందుకు? ఏమిటి? అని ఆరా తీసింది.'ఆంధ్ర నుండి వచ్చానండీ, గురువుగారిని చూడడం కోసమే, ఆయనగారి కోట్లాది అభిమానులలో నేను ఒకడిని' అన్నాను. ఏమనుకున్నదో ఏమో, ఒక ఫోన్ నెంబర్ యిచ్చి, ఈ నెంబర్ లో ప్రయత్నం చేయండి అన్నది. ఆ నెంబర్ కి ఫోన్ చేశాను. మా హరిగాడు పోరా! బచ్చా! అన్నట్టు చూస్తున్నాడు. అవతలి వైపు ఫోన్ తీసిన ధ్వని. సన్నగా తియ్యగా ఆ మురళీనాదమే మ్రోగింది హలో అని. 

పాదాభివందనంతో మొదలెట్టి రికార్డు వేశాను. ఒక నిముషం మౌనం. మద్రాసు బాగా తెలుసా మీకు? అని ఆ గొంతు మూర్ఛనలు పోయింది. తెలుసు, ఆయన చిరునామా కూడా తెలుసు అన్నాను. అంతకుముందే మాహరిగాడు చెప్పాడు వాళ్ళ ఆఫీసుకు వెళ్ళే దారిలోనే ఆయన ఇల్లు అని. సరే రండి అని అటు శ్రీరాగం, యిటు ఆనందభైరవి, మా హరిగాడి మొహంలో ఆశ్చర్యతాండవం. 'సాహితీ సప్తవింశతి' ప్రూఫుతో బాటుగా, బ్రీఫ్ కేసులో ఉన్న 'భక్తప్రహ్లాద' నాటకం మాన్యుస్క్రిప్ట్ తీసుకున్నాను. ఇదెందుకు అన్నట్లు హరిగాడి లుక్స్! నీకేం తెలుసు అమాయకుడా అన్నట్టు నవ్వి వాడికన్నా ముందు ఎలివేటర్ వైపు అడుగులేశాను.వాడి బ్యాంకు దగ్గరే పెద్దాయన ఇల్లు. ముందు బ్యాంకు కి వెళ్లి అక్కడ ఫ్రీ జిరాక్స్ ఫెసిలిటీ ఉపయోగపెట్టుకుని, 'శ్రీవాసుదేవా హరీ..' కీర్తన జిరాక్స్ తీసుకున్నాను. అంతకుముందు, స్క్రిప్టులో ఆరుముక్కలుగా అక్కడక్కడ ఉన్న కీర్తనను ఒకేదగ్గర వ్రాశాను, జిరాక్సు చేయడంకోసం. కాలింగ్ బెల్లు కొట్టాము. గ్రిల్సు లోంచి కనిపిస్తున్న మెట్లమీద లుంగీలా కట్టుకున్న ధోవతీ అంచులు మాత్రమే కనిపించేట్లు వామనమూర్తి... కాదు సంగీత భువన త్రివిక్రమమూర్తి దిగివస్తున్నట్లు కనిపించింది. తలుపులు తెరుచుకోవడమే ఆలస్యం, వంగి రెండుచేతులతో పాదాలను స్పృశించాను నేను, నా తరువాత హరిగాడు కూడా! ప్రసన్నంగా చూసి మాట్లాడకుండా వెనక్కు తిరిగి మెట్లెక్కుతుంటే మేమూ అనుసరించాము.

పైన పెద్ద హాలు. నాలుగు గోడలకూ సోఫా సెట్లు. మధ్యలో మరొక నాలుగు సోఫాసెట్లు, మధ్యలో మాంచి తివాచీ. తివాచీమీద ఒడిలో వీణను పెట్టుకున్న చిన్నకళ్ళు, చిన్నముక్కు, పసిమివన్నె ఉన్న ప్రౌఢ ఒకామె. తూర్పు భారతంనుండి వచ్చినట్లున్న పోలికలు. ఆపిల్ పండుకు దుస్తులు తొడిగినట్లున్నది. తివాచీమీద కూర్చుని మమ్మల్నీ కూర్చొమ్మన్నట్లు చేయి చూపించారు పెద్దాయన. కూర్చున్నాము. యిక నస మొదలెట్టాను. 'చైతన్యభారతి' గురించి, నా గురించి, హరిగాడు టెన్షన్ పడుతున్నాడు, పాత స్నేహితుడితో  మాట్లాడుతున్నట్టు ఏమిటా చొరవ అన్నట్లు. సంకలనానికి ముందు మాట మీరు వ్రాస్తే నేను అదృష్టవంతుడిని అన్నాను. అప్పటికి దాదాపు పది నిముషాలు గడిచాయి. టీలు కూడా త్రాగడం ఐపోయింది. 'యిప్పట్లో వదిలేట్టు లేదు ఈ నస' అన్నట్టు వీణను ప్రక్కనబెట్టి లేచి సోఫాలో కూర్చుని, మాగజైన్లు తిరగెయ్యడం మొదలెట్టింది ఉత్తరభారతం. ఆయన పలికిన పలుకులు కొన్ని..

'అప్పటి విజయవాడా యిప్పుడున్నది? ఎంతో మారిపోయింది! 'తెలుగువాడు ఎన్నడూ యింకొక తెలుగువాడిని ఓర్చలేడు' 'తెలుగుదేశాన్ని విడిచిపెడితేనే పైకి వస్తాడు తెలుగువాడు''నేను పాడేవాడినేకానీ వ్రాసే వాడిని కాను'  మన్నించండి! తెలుగుజాతికి గర్వకారణమైన వాగ్గేయకారులు మీరు. మీ కీర్తనలెన్నో నాకు కూడా తెలుసు.. 'బ్రతుకంతా చింతే జీవికి  మనసా! పరమాత్ముని కన నోచనివారికి బ్రతుకంతా చింతే..(హమ్ చేశాను సన్నగా) హరిగాడు నా తొడ గిల్లాడు, అరేయ్ పెద్దాయనతో  ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నట్లుగా.'నీ దగ్గర చాలా సమాచారం ఉన్నదే' (నవ్వు) నన్నయ్య నుండి నారాయణరెడ్డి దాకా.. ఊఁ !.. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు! ‘యిది నేను వ్రాసింది భక్త ప్రహ్లాద పద్యనాటకం.. నారదుడి పాత్ర హుందాగా, మహా భాగవతునిగా ఉండేట్లు ప్రయత్నం చేశాను. మీరు  నటించిన నారదుడిలా ఉంటుంది. యివ్వాల్టి నారదుడిలా చవకబారుగా ఉండదు’  ‘సంతోషం. నారదుడు ఎంత మహానుభావుడు! మనవాళ్ళు ఆయనను బఫూనును చేశారు’ అని యింకొద్దిగా లోతుగా చర్చ. అరేయ్! నువ్వు ఐసు చెయ్యడం కూడా ఎప్పుడు నేర్చుకున్నావురా అన్నట్టు మా హరిగాడి అపనమ్మకపు చూపు.

'యిది నారదుడి పాత్రకోసం వ్రాసిన కీర్తన. ఆరు ఎంట్రెన్సులలో ఆరు చరణాలు. రాగమాలికలో సెట్ చేశాము. మీరు ఎప్పుడైనా పాడితే నా జన్మ ధన్యం అనుకుంటాను' నా కీర్తన జిరాక్సు కాపీ వినయంగా ఆయనముందు పెట్టాను. మా హరిగాడు ఫెయింటు అవడానికి దగ్గరలో ఉన్నాడు.

'చాలా ఆశ ఉంది నీకు' (చిరు నవ్వుతో, ఆట పట్టిస్తున్నట్లు) మరొకసారి 'సాహితీసప్తవింశతి' ప్రూఫ్ కాపీని వెనుకా ముందూ చూశారు. తనే లేచివెళ్ళి అల్మారాలో లెటర్ హెడ్, పెన్  తెచ్చుకున్నారు. తన గ్రీన్ ఇంకు తో దానిమీద వ్రాశారు. మధ్యలో ఒకటీ అరా సార్లు తలెత్తి నన్ను చూస్తూ దాన్ని పూర్తి చేసి,  సంతకం పెట్టి నా చేతికిచ్చారు. చదివాను. పుస్తకం గురించి వ్రాసినదానికన్నా నా గురించిన అభినందనలు, ఆశీస్సులే  ఎక్కువ ఉన్నట్లు అనిపించి, యిదేమిటి అన్నట్టు చూసి, నేను నోరు తెరిచి యింకొక మాట అనకముందే ' అదంతే' అన్నట్టు తలపంకించారు. అందులో యిక వెళ్ళొచ్చు అన్న సూచనా ఉన్నది. మరొక్కసారి పాదాలకు నమస్కరించి బయటకు నడిచాము.  మెట్లు మలుపుదిగి క్రిందకు దిగుతుంటే పైన వీణ తంత్రులు మరలా మ్రోగిన ధ్వని. ఈ రోజు ఒక రసవీణియ తంత్రులు తెగిన ధ్వని! ఆజన్మ అమ్మ సరస్వతీస్తన్యాన్ని రెండుప్రక్కలా పొట్టనిండా త్రాగిన ధన్యజన్మ! ఆయనది కల్లా కపటము, భేషజము తెలియని పసి పిల్లాడి బోసినవ్వు! అది ఎక్కడినుండి మొదలవుతున్నదో, యింకెంత తీగ సాగుతుందో తెలియని అమృత ప్రవాహమువంటి తీయని ఆలాపన! ఆ తీరు అచ్చమైన కళాకారుడికి, ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి గుర్తులైన ఖచ్చితమైన ఇష్టాలు, అయిష్టాలు! ఆ తిల్లానా జోరు ఆకాశ గంగా వీచుల హోరు! ఆ విగ్రహం అమ్మ సరస్వతి పాదాల చెంత ఒదిగిన పసిపిల్లడికి పురాకృత సుకృత కారణంగా లభించిన అనుగ్రహం! మాట్లాడేప్పుడే తప్ప, పాడేప్పుడు ఉండని తమిళ యాస! అది శాస్త్రీయ సంగీత సాగరంలో తమిళ అలలకు పోటీగా పోటెత్తి, ఉధృతంగా ఎగసిన వీచిక! యిక ఆ హాయి మనకు మరీచిక! 

ఆ పలుకులో 'సతి ఉన్నా చింతే, సతి లేకయూ చింతే, మతిలేని సతితో మనుగడ చింతే, అందమైన సతి హద్దులు చింతే, అంతా  యింతే అను తలపూ చింతే, బ్రతుకంతా చింతే జీవికి మనసా! పేరు, ధనము చింతే, పేదరికము చింతే, పేరుకున్న బంగారము  చింతే, మురళీధర శ్రీ పురందర విఠలుని మరువని మనసునకంతా నిశ్చింతే' అన్న చురక, ఎరుక! ఆ ఆకృతి ఆలాపనలో అసమంజసమైన విరామాలు లేకుండా, భాషను ముక్కలు చేసి విరిచివేయకుండా సాహిత్యానికి సంగీత  ప్రాణవాయువులను పోసి, సామవేదాన్ని సజీవమూర్తిగా సాక్షాత్కరింపజేసిన  ప్రకృతి. ఈ నేలపై ఆ గొంతు పలికిన కాలంలో బ్రతికి  ఉండడమే మనకు పురస్కృతి! ఆయన ఆత్మకు శాంతి, ఆయన తీయని గొంతును విన్న వారికి మానసికప్రశాంతి కలగకుండా ఎలా ఉంటుంది? సదా శివమయమగు నాదోంకార స్వర విదులు  వన్ముక్తులు! భౌతిక దేహాన్ని వదిలినతరువాత వారు నిత్యముక్తులు! లోకులకు ఆనందాన్ని కలిగించడంలో తనివితీరక, ఆ త్యాగయ్య మరలా జన్మనెత్తినట్లు, త్యాగరాజ కృతులకు  తన ఆలాపనలో కొత్త అందాలను అద్దారు మంగళంపల్లి. గమ్మత్తైన వాస్తవం, త్యాగరాజస్వామి పూర్వీకులు తెలుగువారే, తమిళనాడు వెళ్లి స్థిరపడ్డారు. ఈజన్మలో కూడా ఆ వాసన పోలేదు బహుశా! యింతవరకూ తెలుగువారు ధన్యులు, యికపై 'సంస్కృతం' వారు, అంటే, దేవతలు ధన్యులు! 'బాలమురళి'కి యిక గోకులబృందావనంలో 'బ్రహ్మమురళి'తో జుగల్బందీ! ఆ తలపులవలపుల సంకెళ్ళలో నాదప్రియుడైన  ప్రతివాడి హృదయమూ ఆజీవితమూ బందీ!

ఆ మహనీయమూర్తికి మరొకసారి, మనసులోనే, పాదాభివందనములు!

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి