ఉధమ్ పూర్
జమ్ము కశ్మీరు లో జిల్లా ముఖ్యకేంద్రం మైన ఉధమ్ పూర్ గురించి తెలుసుకుందాం .
జమ్ము నుంచి శ్రీనగరు లోయ కు వెళ్లే ముఖ్య రాజమార్గం NH-1A మీద వున్న నగరం . హిమాలయాలలోని శివాలిక్ పర్వతాలలో నిర్మింప పడ్డ నగరం కావడంతో సముద్రమట్టానికి సుమారు 756 మీటర్ల యెత్తులో వుంటుంది . ఉధమ్ పూర్ పెద్ద వుద్యానవనం లో నిర్మింప బడ్డ నగరంలా వుంటుంది . సంవత్సరం పొడవునా అంత్యంత అహ్లాదకరంగా వుండే వాతావరణం కావడంతో సహజ సిద్దంగా పెరిగి యెప్పుడూ పూలతో వుండే మొక్కలు పచ్చని తివాసీ పరచినట్లుండే నేల యెత్తైన వృక్షాలు కొన్ని చోట్ల రాష్ట్ర వృక్షమైన చినార్ వృక్షాల తో యెంతో అందంగా వుంటుంది .
మహారాజా ఉధమ్ సింగ్ జ్ఞాపకార్థం యీ వూరుని ఉధమ్ పూరు గా వ్యవహరిస్తున్నారు .
జమ్ము నుంచి 68 కిలో మీటర్లు , కట్ర నుంచి 23 కిలో మీటర్ల దూరంలో వుంది . డిల్లీ , అహమ్మదాబాదు , ఇండోరు ల నుంచి రైలు సేవలు వున్నాయి . జమ్ము నుంచి బస్సు సేవలు వున్నాయి . ఈ నగరం యెప్పుడూ ఆటంకవాదుల తాకిడికి గురౌతూ వుంటుంది . ఆర్మీ , పౌరుల సహకారం తో ఆటంక వాదులకు యెదురు దెబ్బ కొడుతూ వుంటారు . ఈ పట్టణం లో 70 శాతం కశ్మీరీ పండిట్లు నివసిస్తున్నారు . వీరిని ' పహాడీలు ' అని వ్యవహరిస్తారు . ముఖ్యంగా యీ జిల్లాలో డోగ్రి , పహాడీ భాషలు మాట్లాడతారు . కశ్మీరు వేలీలో యిక్కడి ప్రజలు మంచి మర్యాదస్థులని పేరు , వీరు సాంప్రదాయబధ్దంగా వుంటారు .
పఠాన్ కోట నుంచి జమ్ము బైపాస్ చేస్తూ మరో దారిన ఉధమ్ పూర్ కి చేరుకోవచ్చు . ఈ దారి దట్టమైన అడవి గుండా ప్రయాణిస్తుంది . ప్రయాణం చాలా అహ్లాదకరంగా వుంటుంది , ప్రమాదభరితం కూడా , యెందుకంటే యీ రోడ్డు పాకిస్థాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా వుండడంతో చొరబాటుదారులు చాలా మంది యీ అడవులలో దాగి అవకాశం కోసం కాచుకొని వుంటారు . అందుకని ఆర్మీ వారు అటుగా ప్రయాణించ వద్దని హెచ్చరిస్తూ వుంటారు .
ఉధమ్ పూర్ మీద ఆటంకవాదులు తరచు దాడులకు తెగబడ్డం వెనుక వున్న కారణాలేంటో చూద్దాం , యిక్కడ యెక్కువమంది హిందువులు వుండడం , ఆర్మీ వారి ' నార్ధరన్ కమాండ్ ' వారి ముఖ్య కార్యాలయం వుండడం మరోకారణం , యింకో ముఖ్య కారణం యేమిటంటే భారత వాయుసేన వారి ' ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ ' వుండడం , జమ్ము నుంచి కశ్మీరు లోయకు , లడాక్ కు వెళ్లే ఆర్మడ్ ఫోర్సెస్ వారి ట్రాన్సిట్ పాయింటు కూడా యిదే అవడం . తరచుగా యీ ప్రాంతం లో చొరబాటు దారులు అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తూ వుంటారు . వారి ప్రయత్నాలను యిక్కడి ప్రజలు ఆర్మీ వారు తిప్పి కొడుతూ వుంటారు .
ఈ పట్టణంలో ఒకచోట నుండి మరోచోటికి నడవడం పర్వతారోహణతో సమానం . శివాలిక్ పర్వతాలలో చక్కగా తీర్చిదిద్దిన పట్టణం యిదేనేమో ! . ఇంత చక్కగా పట్టణాన్ని తీర్చిదిద్దడం , చక్కని వెడల్పైన తారు రోడ్లు యెప్పటి కప్పుడు బాగు చేస్తూ వుండడం వెనకాల యిండియన్ ఆర్మీ వారి సహకారం పూర్తిగా వుంది .
ఈ పట్టణం చుట్టుపక్కల వున్న పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం . మే నెలలో కూడా హిమపాతం జరిగే ప్రదేశం గా పేరు పొందిన పత్ని టాప్ గురించి చెప్పుకోవాలి . పత్ని టాప్ కి పదకొండు కిలోమీటర్ల దూరంలో వున్న నాథ టాప్ పర్యాటకులలో ప్రాముఖ్యత కలిగి వున్నాయి . మా యాత్రలలో అందరూ వెళ్లే ప్రదేశాలే కాక పౌరాణిక ప్రాముఖ్యత వుండి పర్యాటకులు తరచుగా వెళ్లని ప్రదేశాలు చాలా వుంటాయని నా వ్యాసాలు చదివే పాఠక దేవుళ్లకు తెలుసు . వారికోసం ముందుగా అలాంటి రెండు సరస్సుల గురించి పరిచయం చేసి తర్వాత అతి పురాతన మైన మందిర సముదాయాన్ని పరిచయం చేస్తాను తరువాత పత్ని టాప్ గురించి తెలియ జేస్తాను .
జమ్ము కశ్మీరు అనగానే మనకి గుర్తొచ్చేది ' దాల్ లేక్ ' అతి సుందరంగా స్వర్గాన్ని తలపిస్తూ వుండే దాల్ లేక్ పర్యాటకులకు మొదటి ఆకర్షణే కాని అంతే అందంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన యీ రెండు సరస్సులు కూడా మనకి అంతే అహ్లాదాన్ని కలుగ జేస్తాయి . ఇంక విషయం లోకి వెళితే మొదటి సరస్సు పేరు సురింసర్ సరస్సు , రెండవది మన్సర్ సరస్సు యీ రెండిటి పురాణ కథలు ఒకదానితో మరొకటి ముడి పడి వున్నాయి , ముందుగా మీకు పౌరాణిక కథ చెప్తాను తరువాత యీ ప్రదేశాల గురించి పరిచయం చేస్తాను .
మహాభారతం ప్రకారం పాండవులు వనవాసంలో వుండగా యీ ప్రాంతం నాగుల ఆధీనంలో వుండేది . అర్జునుడు ఊలూపిని చూసింది యిక్కడే , మొదటి చూపులోనే ఒకరంటే ఒకరు యిష్టపడి గాంధర్వ వివాహం చేసుకుంటారు . వారికి ' ఐరావణుడు ' అనే పుతృడు జన్మిస్తాడు . అర్జునుని కి చిత్రాంగద ద్వారా భభ్రువాహనుడు జన్మిస్తాడు . ఆ పుతృని కూడా ఊలూపి పెంచుతుంది . పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లినపుడు అర్జునుడు ఊలూపిని విడిచి పెట్టి వెళ్లిపోతాడు . మహాభారత యుధ్దానంతరము పాండవులు అశ్వమేధయాగం తలపెట్టి యాగాశ్వాన్ని అర్జునుని నేతృత్వంలో విడిచి పెడతారు . యాగాశ్వాన్ని భభ్రువాహనుడు బంధించగా అర్జనుడు దానిని విడిపించడానికి వచ్చి భభ్రువాహనుని తో యుధ్దం చేస్తాడు . బలపరాక్రముడైన భభ్రువాహనుడు అర్జునుని వధించి అతని తలను తల్లికి ( ఊలూపి ) కానుకగా సమర్పించగా ఊలూపి భభ్రువాహనుని మందలించి అర్జనుడు అతని తండ్రి అని చెప్తుంది . తండ్రిని బ్రతికించుట యెలా ? అన్న ప్రశ్నకు ఊలూపి పాతాళ లోకంలో శేషనాగు తలపైనున్న నాగమణి అర్జునుని పునః ర్జీవుని చేస్తుందని తెలియజేస్తుంది . భభ్రువాహనుడు పాతాళ లోకానికి తన బాణం తో మార్గం చేసుకొని ఆ సొరంగ మార్గం గుండా వెళ్లి శేషుని ఓడింది మణి తో మరోమార్గం గుండా భూలోకానికి వస్తాడు . మణి మహిమ తో అర్జనుడు పునఃర్జీవితుడవుతాడు . భభ్రువాహనుడు సొరంగ మార్గంలో ప్రవేశించిన ప్రదేశం లో యేర్పడ్డ సరస్సును ' సొరంగసర్ ' అని మణితో తిరిగి వచ్చిన ప్రదేశం లో యేర్పడ్డ సరస్సును ' మణి సర్ ' అని పిలిచేవారు కాలక్రమేణా యివి సురింసర్ , మన్సర్ లుగా పిలువబడసాగేయి .
చైత్రమాసం , శ్రావణమాసం , ఆశ్వీజ మాసాలలో కశ్మీరీలు యీ సరస్సులలో స్నానాలు చెయ్యడానికి వస్తారు . ఈ సరస్సులలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు .
సురింసర్ సరస్సు ----
సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఒక కిలోమీటరు వెడల్పు వున్న యీ సరస్సు చుట్టూరా దట్టమైన చెట్లు పొదలతో , పచ్చని కొండలతో మధ్యన వున్న చిన్న ద్వీపం , అక్కడ వేల సంఖ్య లో నివసిస్తున్న గబ్బిలాలలో వుంటుంది . పక్షుల అధ్యయన కారులకు యీ సరస్సు స్వర్గం అని అంటారు . ఇక్కడ కొంగలు , బాతులే కాక పేరు తెలియని నీటి పక్షులు , తాబేళ్లు , వివిధ రకాలైన చేపలు యీ సరస్సులో చూడొచ్చు . చుట్టుపక్కల వున్న అడవిలో చెట్లపైన వింతవింత శబ్దాలు చేస్తున్న రకరకాలైన పక్షులు పలుకరిస్తాయి . ఈ పరిసరాలలో పక్షుల కాకుండా అడవి జంతువులు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి . నగరవాతావరణానికి దూరంగా ప్రశాంతంగా ప్రకృతిలో గడపాలనుకొనే వారికి మంచి ప్రదేశం . పర్యాటకులు సేదతీరేందుకు బెంచీలు యేర్పాటు చేసేరు . చుట్టుపక్కల హోటల్స్ రాలేదు కాబట్టి యిక్కడ యింకా ప్రశాంతంగానే వుంది . ఉధమ్ పూర్ నుంచి సుమారు 81 కిలోమీటర్ల దూరం లో వుంది . ఇక్కడ నుంచి మన్సర్ సరస్సు సుమారు 30 కిలో మీటర్లు ఉధమ్ పూర్ వైపు వుంది .
మన్సర్ సరస్సు ---
సురింసర్ కి సుమారు 30 కిలో మీటర్ల దూరం లో వుంది మన్సర్ సరస్సు . జమ్ముకి 62 కిలో మీటర్ల దూరం , ఉధమ్ పూర్ కి 32 కిలోమీటర్ల దూరంలో వుంది . ఈ రెండు సరస్సులకు జమ్ము వెళ్లకుండా పఠాన్ కోట నుంచి వేరే రోడ్డు వుంది . ఆ రోడ్డు పాకిస్థాను బోర్డరుకి దగ్గరగా వుండడం తో యీ ప్రాంతం లో చొరబాటుదారులు సమయం కోసం పొంచి వుంటారని ఆర్మీ వారు సామాన్య ప్రజలను ఈ దారి వాడవద్దంటారు . ఉధమ్ పూర్ నుంచి వెళ్లే దారంతా చిక్కని అడవి గుండా వుండడం తో ప్రయాణం అహ్లాదకరంగా వుంటుంది . చాలా చోట్ల సూర్యకిరణాలు చొరబడనంత దట్టంగా వుంటుంది అడవి , పగలే చీకటిగా వుంటుంది .
ఈ సరస్సు సురింసర్ కంటే విస్తీర్ణం లో పెద్దది . ఈ మధ్య కాలంలో పర్యాటకులకు యిష్టమైన స్థలాలలో మొదటిదిగా పేరు పొందింది . ఈ సరస్సు ప్రకృతి సౌందర్యానికే కాదు యాత్ర స్థలంగా కూడా పేరు పొందింది . ఈ సరస్సు తూర్పు వొడ్డున వున్న ఆదిశేషు ని మందిరం స్థానికులలో ప్రసిద్ది పొందింది . కొత్తగా పెళ్లైన దంపతులు యీ సరస్సుకు ప్రదక్షిణ చేసి ఆదిశేషని మందిరంలో విగ్రహాన్ని దర్శించుకుంటే వారి నాగ దోషాలు పోయి పిల్లాపాపలతో కలకాలం సుఖంగా వుంటారని స్థానికుల నమ్మకం . అంతేకాదు యిక్కడ పుట్టుజుత్తులు తీయించే ఆచారం కూడా వుంది . ఈ మందిరం లో ఆరు తలల ఆదిశేషును విగ్రహం దర్శించుకొని అక్కడ వున్న పెద్ద రాతిపైన వున్న యెన్నో యినుపగొలుసులు ఆశ్చర్యాన్ని పొందేం . అవి యెందుకు అక్కడ వున్నాయి అని అడిగితే అవి చిన్నచిన్న నాగుల రూపాలని ఆది శేషుని దర్శించుకొనేందుకు వచ్చేయని చెప్పేరు .
ఇక్కడ ఉమాపతి మహదేవ మందిరం , నృసింహ మందిరం , దుర్గాదేవి మందిరం వున్నాయి .
క్రిమ్చి మందిర సముదాయం --
ఉధమ్ పూర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వుంది యీ మందిర సముదాయం . ఈ మందిరాలు సుమారు 11 వ శతాబ్దానికి చెందినవి గా గుర్తించేరు . ఈ మందిర సముదాయంలో నాలుగు పెద్ద మందిరాలు , మూడు చిన్న మందిరాలు వున్నాయి . ఇక్కడ వున్న పెద్ద మందిరం 50 అడుగుల యెత్తు వుంటుంది . ఈ మందిర నిర్మాణం లో గ్రీకు శిల్పకళ ప్రభావం యెక్కువగా కనిపిస్తుంది . ఈ మందిరాలు ముఖ్యంగా శివునికి సమర్పించినవి అయినా విష్ణు , పార్వతి మందిరాలు కూడా వున్నాయి .
ఈ మందిరాలను పాండవ మందిరాలని కూడా అంటారు . పాండవులు అరణ్య వాసంలో వున్నప్పుడు యీ ప్రాంతం లో నివసించేవారని , అప్పుడు వారు ప్రతిష్ట చేసినవే యీ విగ్రహాలను అంటారు . 11 వ శతాబ్దం లో ఖుషాను రాజులు నిర్మించిన మందిరాలను తిరిగి నిర్మించి నట్లు స్థానికులు చెప్పేరు .
ఈ మందిర సముదాయానికి దగ్గరగా వున్న వూరు క్రిమ్చి కావడంతో యీ మందిరాలని క్రిమ్చి మందిరాలు అనసాగేరు . ఇక్కడ మరో చిన్న పిట్ట కథ కూడా చెప్పేరు క్రిమ్చి వూరున్న ప్రాంతం మహాభారత కాలంలో కీచకుని సామ్రాజ్యంలో వుండేదట , అతని పేరు మీదుగా యీ వూరిని కీచకనగరం అని పిలిచేవారట , కాలాంతరాన యిది క్రిమ్చి గా మారిందట . యేది యేమైనా మేం రెండు అందమైన సరస్సులను అతి పురాతనమైన మందిర సముదాయాలను చూసేం అన్న తృప్తి కలిగింది . మరునాడు మా ప్రయాణం పత్నిటాప్ వైపు సాగింది .
పై వారం ఆ వివరాలు తెలియజేస్తాను అంతవరకు శలవు .