ముక్కు పచ్చలారని కాశ్మీరం - ..

( శ్రీనగర్ ---1 )

1980 లో వెళ్లినప్పుడు మా బంధువుల యింట్లో బస చేసేం . అతను ఆర్మీ లో ' మేజర్ ' గా వుండేవారు . వారి నివాసం శ్రీనగరు కి వెలుపల ఆర్మీ వారి క్వార్టర్స్ లో అవడం వల్ల మాకు బస అక్కడే వున్న ఓ ఖాళీ యింట్లో యిచ్చేరు . పొద్దున్నే అంటే 5 గంటలకల్లా మేము తయారయి  వారింటికి వెళ్లి టీ , బ్రేక్ ఫాష్ట్ చేసి మధ్యాహ్నానికి వారిచ్చిన భోజనం నీళ్లు తీసుకొని వారిచ్చిన వూలు బట్టలు ( మేము మామూలు స్వెట్టర్ తీసుకొని వెళ్లేం . మా బట్టలు ఆ చలికి చాలవని జమ్ము లో దిగిన వెంటనే తెలిసింది . అక్కడనుంచి ఆర్మీ వారిచ్చిన వూలు బట్టలే మమ్మల్ని కాపాడాయి ) . టోపీలు , మేజోళ్లు , లాంగ్ కోట్లు వేసుకొని బయలుదేరి వారి జీపు లో బస్టాండు చేరి అక్కడ నుంచి సైట్ సీయింగుకి వెళ్లేవారం . రాత్రి మళ్లా వారి జీపు లో బసచేరి మా బంధువులు అమర్చిన వేడివేడి ఆంధ్రా భజనంచేసి విశ్రాంతి తీసుకొనే వారం . మేమున్న నాలుగు రోజులు వారిచ్చిన ఆథిధ్యం మరువలేనిది .

మా బంధువుల యింటికి వెళ్లాలంటే యాపిల్ తోటలలోంచి వెళ్లేవారం . రాత్రి పళ్లు కోసి పొద్దుట బాక్స్ లలో సర్దేవారు . యాపిల్ తోటలు చూడడం అదే మొదటిసారి , యెంతో కుతూహలంతో పళ్లతో విరగ కాసిన చెట్లను , గడ్డిలో గుట్టలా పోసివున్న యెర్రని యాపిల్స్ ను బస్టాండు చేరేంతవరకు చూస్తూవుండడం గొప్పగా వుండేది . ఇప్పటికీ యే పండ్ల తోటలనైనా అదే కుతూహలంతో చూస్తూ వుంటాను .

మేం వెళ్లినది అక్టోబరు నెలలో , ఓ రోజు రాత్రి అక్కడ ఆ యేడాదికి మొదటి హిమపాతం జరిగింది . మేం పొద్దున్న టీ కోసం మా బంధువుల యింటికి వెళుతూ వుంటే దారికి యిరువైపులా తెల్లగా వున్న మంచు చూసేం .

అప్పుడు దాల్ సరస్సులో విహరిస్తూ యెప్పటికైనా ఒక్కసారి హౌసు బోటులో వుండాలని కోరుకున్నాం . చక్కని నగిషీలు చెక్కిన హౌసుబోటు మమ్మలని యెంతో వూరించేది .

ఆ కోరిక తీరదు అనుకుంటున్న సమయంలో 1997 ఆగష్టులో మేం మా వాళ్లంతా వారిస్తున్నా అమర్ నాథ్ యాత్రకు మేమిద్దరం మా చిన్నబ్బాయి ( 19 సం..) ని తీసుకొని వెళ్లేం . అమర్ నాథ్ దర్శనం అయేక జమ్ము కి వెళ్లే బస్సులలో సీటు దొరకక మూడు రోజులు శ్రీనగరులో వుండ వలసి వచ్చింది , అప్పుడు బస్సు కండక్టరు సిఫార్స్ చేసిన హౌసుబోటులో వుండడానికి వప్పుకున్నాం ( గవర్నమెంటు చే గుర్తింప బడిన హౌసు బోటులలో నే బస చెయ్యండి మిగతా వాటిలో వుండొద్దూ అని తరచు ఆర్మీ వారు యాత్రీకులను హెచ్చరించేవారు ) . మొత్తం హౌసుబోటు ( రెండు రూములు , డ్రాయింగ్ రూము , డైనింగు హాలు ) పొద్దున్న బ్రేకు ఫాష్టు  , టీ , రెండుపూటలా భోజనం కలిపి ₹800/ . రోజూ మమ్మలని ఒడ్డున విడిచి పెట్టడం , తిరిగి తీసుకురావడం కూడా ఆ సొమ్ములోనే  .

1984  లో వేర్పాటువాదుల సహకారంతో శ్రీనగరు నుంచి పండిట్లని తరిమి వేయడం వల్ల రేగిన అలజడుల వల్ల దెబ్బ తిన్న పర్యాటక వ్యాపారం తిరిగి 1997 లో కాస్త అల్లర్లు తగ్గడం వల్ల హౌసుబోటు , హోటల్ యజమానులలో ఆశలు కలిగాయి . అప్పుడే మేం వెళ్లడంతో హౌసుబోటు వారినుంచి మాకు మంచి మర్యాదలు లభించేయి . చినార్ కర్రతో నిర్మింపబడ్డ హౌసుబోటు , లోపల నీటుగా పడకలు , మంచి పనితనంతో వున్న తలుపులు కిటికీలు , పది కుర్చీలతో వున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ , మంచి ఖరీదైన డిన్నరు సెట్లు  ముచ్చటగా వున్నాయి . ఆ రోజు అమర్ నాథ్ యాత్రలో కలిగిన అనుభవాలను నెమరువేసుకుంటూ , తగిలిన దెబ్బలకు మందు రాసుకుంటూ హౌసుబోటు బయట కూర్చొని చుట్టూ వున్న మిగతా హౌసుబోట్లని చూస్తూ , పర్యాటకులను తీసుకు వెళుతున్న హౌసుబోటు యజమానుల కళ్లల్లో మెరుపులను చూస్తూ గడిపేం .

అలా మేం కూర్చొని వుండగా పువ్వులు అమ్మే వారి నుంచి సిల్క్ చీరలు , లడాక్ గంటలు , కశ్మీరీ డ్రస్సులు షికారా  ( చిన్న పడవ ) లలో మా వద్దకు తెచ్చి అమ్మడం ఆశ్చర్యాన్ని కలిగించింది . పొద్దున్న సన్నని చలిలో టీ తాగుతూ కూరలు , దినసరిసరకులు కూడా షికారాలలో అమ్మడం చూసేం .

శ్రీనగరు సరస్సులకు , ఉద్యాన వనాలకు ప్రసిద్ది . అందుకని మేం ఒకరోజు ఉద్యానవనాలు చూడ్డానికి , మరోరోజు డాల్ లేక్ లో విహరించడానికి , మరోరోజు శంకరాచార్యుల వారి మందిరం దర్శించుకోడానికి నిర్ణయించుకున్నాం .     మొదటి రోజు మా హౌస్ బోటు యజమాని సలహా మేరకు షికారాలో ఉద్యానవనాలు చూడ్డానికి వెళ్లేం .

షికారాలో వెళుతూ సరస్సు నీళ్లల్లో చేతులు పెడదాం సినిమా హీరో హీరోయిన్ల లా అని చూస్తే నీళ్లు చాలా చెత్తగా వున్నాయి . షికారా నడిపే అతను హౌసుబోటులో మనం వాడేనీరు , మనం చేసే వన్నీ దాల్ లేక్ లోనే కలుస్తాయని  చెప్పగానే హౌస్ బోట్స్ వల్ల దాల్ లేక యెంత కలుషితమైందో , అవుతోందో ! అర్దమై  బుద్దిగా చేతులు నీళ్లల్లో పెట్టకుండా ప్రయాణం చేసేం .

షికారా అవతల వొడ్డు చేరింది అక్కడ దిగి ' నిశాంత బాఘ్ ' చూడ్డానికి వెళ్లేం .

నిశాంత బాఘ్ -----

1633 నూర్జహాను పెద్దన్న గారైన ఆసిఫ్ ఖాన్ చే 46 ఎకరాలలో చక్కగా తీర్చి దిద్దబడిన ఉద్యానవనం .  ఉర్దూ భాషలో ' నిశాంత బాఘ్ ' అంటే ' ఆనందవనం ' అని అర్దం . ఈ ఉద్యానవనానికి కావలసిన నీరు దాల్ సరస్సునుంచి కాలువల ద్వారా మళ్లించేరు .

ఉద్యాన వనం మద్యనుంచి నాలుగు వైపులా పౌంటెన్స్ కట్టి వుంటాయి , ముఖ్య ద్వారం నుంచి ఉద్యానవనం చివర కొండల వరకు వరుసగా నాటిన చినార్ , సైప్రస్ వృక్షాలు , నడిచే దారికి యిరువైపులా రంగురంగుల గులాబీ మొక్కలు వాటి వెనుక పచ్చని లాన్స్ కను విందు చేస్తాయి . ముఖ్య ద్వారం లో ప్రవేశించగానే చక్కని ఉద్యానవనం , దూరంగా జబర్వాన్ పర్వత శ్రేణులు వాటికి వెనుకగా మంచుతో కప్పబడిన పీర్ పంజాల్ పర్వతశ్రేణులు కనువిందు చేస్తాయి .   ఈ ఉద్యాన వనాన్ని రెండు భాగాలుగా వర్ణిస్తారు , ఒకటి మామూలు ప్రజానీకానికి , రెండవది రాణివాసపు స్తీ ల కొరకు . ఆ కాలం లో కట్టిన కట్టడాలు కూడా చూడొచ్చు . యెత్తైన గోడల మీంచి జారుతున్నట్లుగా చేసిన నీటి అమరిక చా ముచ్చటగా వుంటుంది .

ఈ ఉద్యానవనం గురించిన మొఘల్ కాలానికి సంబంధించిన ఓ పిట్టకథ కూడా వుంది . అది కూడా చెప్పుకుందాం . ఈ ఉద్యాన వనం పూర్తయిన తరవాత అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాను ఈ ఉద్యానవనం గురించి విని చూడ్డానికి వస్తాడు , ఉద్యానవనం అందం చూసి మెచ్చుకుంటాడు , అలా చాలా సార్లు ఉద్యానవనం చూడ్డానికి వస్తూ వచ్చినప్పుడల్లా ఉద్యానవనం తనకెంతో నచ్చినదని చెప్తూ వుంటాడు . అలా పదేపదే చెప్తేనన్నా ఆసిఫ్ ఖాన్  తనకు కానుకగా ఆ ఉద్యానవనం యిస్తాడని అనుకుంటాడు , అలా జరగక పోయేసరికి కోపగించుకొని దాల్ సరస్సునుంచి వచ్చే నీటి సరఫరాని ఆపి వేస్తాడు షాజహాను . నీరు లేక యెండిపోతున్న ఉద్యానవనాన్ని చూస్తూ  చింతాగ్రస్తుడైన ఆసిఫ్ ఖాన్ ని  చూసిన అతని సేవకుడు చక్రవర్తి ఆజ్ఞను ఉల్లంగించి ఉద్యాన వనానికి నీరు పెట్టమని సలహా యిస్తాడు , అది స్వామి ధిక్కారమని తాను చేయలేనని అంటాడు ఆసిఫ్ ఖాన్ , జరిగిన విషయం తెలుసుకున్న షాజహాను నిశాంత బాఘ్ కి నీటి సరఫరా చేయిస్తాడు .

నిశాంతబాఘ్ పర్షియన్ రీతిలో నిర్మించబడినది . ఇందులో పౌంటెన్స్ కాకుండా యెత్తైన గట్టుల మీద పన్నెండు కట్టడాలు వున్నాయి . వీటిని పన్నెండు రాశులకు ప్రతీకలను చెప్పేరు . ఈ ఉద్యానవనంలో ఎంతసేపు గడిపినా తనివితీరదు . సమయాభావం వల్ల ఓ రెండు గంటలు గడిపి వెనుతిరిగేం .

పైవారం మరో అద్భుతమైన మరో ఉద్యానవనం గురించి తెలియజేస్తాను ,

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి