సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట  ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణించి, ఆతడి  తపోనిష్ఠకు మెచ్చి శ్రీహరి అతడిని కరుణించడం గురించి వర్ణిస్తున్నాడు పరమశివుడు.

అలక తిమిరంబు తను గప్పు నను భయమున 
ముఖసుధాసూతి నునువెల్గు ములికిఁ గూర్చి 
సవదరించిన సింగిణిచాయ, నొసలి
వంకచూపునఁ దగఁ గరివంక బొమలు                       (తే)

ఆయన ముంగురులు నల్లగా చీకట్లవలె ఉన్నాయి. ముఖము చంద్రబింబంలా ఉన్నది.చీకట్లవంటి ఆ ముంగురులు తనను కప్పేస్తాయి అనే భయముతో ముఖము అనే చంద్రుడు నునువెలుగు అనే బాణాన్ని సంధించాడు, నల్లని కనుబొమలు అనే వింటికి. ఓరచూపుల 
వెన్నెలలు అనే బాణములను సంధించినట్లుగా ఆయన క్రీగంటి చూపులు మెరుస్తుండగా తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు.

బలభిదుపలాద్రి మౌళిన్ 
బలపలగాఁ బొదువు ముదిర పటలము పగిదిన్ 
లలితోత్తమాంగతలమున 
జిలుగుందెలి క్రొత్త చలిది చిక్కము దనరన్             (కం)

'బలభిత్' అంటే బలుడు అనే రాక్షసుడిని సంహరించినవాడు, దేవేంద్రుడు. ఉపలాద్రి అంటే రత్నము అనే కొండ. ఇంద్రుని రత్నము అంటే ఇంద్రనీలమణి. ఇంద్రనీలమణి వంటి కొండకొమ్మున విరళముగా అంటే కొద్ది కొద్దిగా, ఆగి ఆగి వ్యాపిస్తున్న మేఘములగుంపు లాగా ఆయన తలమీద అప్పుడే మూటగట్టిన చల్ది అన్నపు చిక్కం ఉన్నది!

దిగ్వాసుం, డురుపించ లాంఛిత శిఖోదీర్ణుండు, వర్షాపయో 
ముగ్వర్ణుండు, నవాంబుజాహితలతాముక్తాంగదుండున్ , సుధా 
రుగ్విస్మేరముఖుం, డనంగశతజద్రూపాధికుం, డగ్రభూ 
వాగ్వర్గోద్భవభూమి, శ్రీవిభుఁడు, శ్రీవత్సాంకవక్షుండునై               (శా)

దిక్కులే అంబరములుగా కలవాడు, చక్కని పించముతో ప్రకాశిస్తున్న శిఖను గలవాడు, వర్షాకాలపు మేఘముల నీలవర్ణ శరీరమును కలవాడు, చంద్రునివంటి తెల్లని ముత్యాల భుజకీర్తులు కలవాడు, చంద్రుని వెన్నెల వంటి అమృతం చిందే నవ్వుల ముఖమును 
కలవాడు,  వందల మన్మథులను మించిన అందగాడు, అన్నిటికన్నా ముందుగాపుట్టిన వేదములకు నిలయుడు, శ్రీవిభుడు, శ్రీవత్సము అనే అందమైన పుట్టుమచ్చను కలిగిన  వక్షస్థలము గలవాడు ఐన ఆ శ్రీహరి తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు.

నొడువుల పడఁతుక మగనికిఁ
బొడచూపని తనదురూపు పొడగనిపించెన్,
జడనిధిశయనుఁడు కొంగున 
ముడిచిన మణి గాదె భక్తముఖ్యులకెల్లన్       (కం)

సరస్వతీవిభుడికి అంటే బ్రహ్మకు కూడా పొడచూపని తత్త్వము, శ్రీ కృష్ణ తత్త్వము.ఆ రూపు పొడ గనిపించింది. ఆ జడనిధిలో పడుకున్న మహానుభావుడు తన ముఖ్య భక్తులకు 'కొంగు మణి' కదా! కొంగున ముడిచిన బంగారం అన్నట్లు కొంగున ముడిచిన  మణి అంటున్నాడు, బంగారం కన్నా మణులు యింకా అరుదైనవి, విలువ కలవి కదా!

నిగనిగని విదళకదళీ 
యుగళిన్ నగి జిగిఁదొలంకునూరులఁ గనుచొ
క్కు గదురఁజేయు జగత్పతిఁ
దదిలి కనుంగొనుచు మునిమదావళమెలమిన్    (కం)

నిగనిగలాడే అరటిబోదెలను అపహస్యంచేసే కాంతిచేత చూపరులకు పరవశాన్ని  కలిగించే తన ఊరువుల కదలికతో స్వామి విచ్చేశాడు, తన భక్తుడిని కరుణించడానికి! మునిశ్రేష్ఠుడైన పుండరీకుడు చూసి పులకించిపోయాడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి