కథ : రంగుల కల
రచయిత : అనంత పద్మనాభరావు మోచర్ల
సమీక్ష : నల్లాన్ చక్రవర్తుల గోపీకృష్ణమాచార్యులు
గోతెలుగు 113వ సంచిక!
ఈ కథ గురించి విశ్లేషించే ముందు అతి గొప్పదైన కథా ప్రక్రియను ఒక్కసారి మననం చేసుకోవాల్సిందే! పాఠకులను పాత్రలతో ప్రయాణింపజేస్తూ, ఆనందం, ఉద్వేగానుభూతులను పంచుతూ ప్రత్యేకమైన ప్రపంచంలో విహరింపజేసే అద్భుతం... కథ. రచయిత అనంతపద్మనాభరావు మోచర్ల 'రంగుల కల 'ను కథా ప్రక్రియలో ఆవిష్కరించిన తీరు అభినందనీయం. అన్నింటికన్నా ముందుగా రచయితకు తను చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత వుండాలి. అది అనంతపద్మనాభరావులో పుష్కలంగా కనిపించింది.
శిరీష్ పాత్ర మొట్టమొదటిసారిగా మరియాను చూసినప్పుడు కథ చదువుతున్న పాఠకులు శిరీష్ లైపోయి మరియా అందాన్ని ఆస్వాదిస్తారు. మరియా అందాన్ని అంత అద్భుతంగా వర్ణించారు రచయిత. శిరీష్, మరియా పాత్రల మధ్య అనిర్వచనీయమైన ప్రేమానుభూతి ఆద్యంతం కొనసాగడం ఈ కథలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాల్లో ఒకటి. శృంగారానికీ, బూతుకీ మధ్య వుండే పల్చని పొరను గమనించడం అందరికీ సాధ్యంకాని అంశం. మరియా అందాన్ని వర్ణించినప్పుడు ఆ నైతికతను ప్రదర్శించారు అనంత పద్మనాభరావు. అన్ని ప్రేమకథలకూ అంతిమంగా విజయమే లభిస్తుందనే నమ్మకం వుండదు. అయితే, పాఠకులు మాత్రం ప్రేమజంట కలవాలనే సానుకూలమైన దృక్పథంతోనే ముందుకు సాగుతారు.
శిరీష్, మరియాలతో ప్రయాణించే పాఠకులు తీవ్రమైన ఉద్వేగానికి లోనవ్వక తప్పదు. పాఠకులను పూర్తిగా కొత్తప్రపంచంలోకి తీసుకెళ్లే 'రంగుల కల 'లో ద్వారా హాలోవీన్ డే విశిష్టత కూడా తెలుస్తుంది. మరియాపై శిరీష్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదలై, స్నేహంగా మారి, గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందిన తరువాత... చివరలో శిరీష్ కి మిగిల్చిన ఆవేదన పాఠకుల గుండెలకు గుచ్చుకుని, వెచ్చని కన్నీటి చుక్కలు స్పృశిస్తాయి. ఇక పంచే ఎంత డాబుగా వున్నా అందమైన అంచు లేకపోతే అది సంపూర్ణం కానేరదు. అనంతపద్మనాభరావుగారి గొప్ప కథకు, అందాన్నీ, పరమార్థాన్నీ ఆపాదించింది మాధవ్ గీసిన బొమ్మ. అమెరికా వాతావరణాన్ని ప్రతిబింబించడమే కాక, మొత్తం కథలోని అందాన్నంతా పులుముకున్న బొమ్మ నిజంగా అద్వితీయమనే చెప్పాలి. ఇక చివరిమాట... కథల్లో మంచి కథలూ వుంటాయి, గొప్పకథలూ వుంటాయి. 'రంగుల కల ' నిస్సందేహంగా గొప్పకథ. పాఠకులకు గొప్పకథల్ని అందించడంలో ముందుంటామని 'గోతెలుగు.కాం' సంపాదకవర్గం మరోసారి నిరూపించింది.
..ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు...http://www.gotelugu.com/issue113/2967/telugu-stories/rangula-kala/