గురవాయణం - పుస్తక సమీక్ష - సిరాశ్రీ

guravaayanam book review

రచన: డాక్టర్ గురవారెడ్డి
వెల: రూ 150/-
ప్రతులకు: +919701135528

మోకాళ్ళ పర్వతం అనగానే ఏడుకొండలవాడు ఎలా స్ఫురిస్తాడో, మోకాళ్ళ నొప్పులు అనగానే గురవారెడ్డి పేరు అంతలా వినిపిస్తోంది నాకు గత కొన్నేళ్లుగా.. వాచిపోయిన వాజపేయ్ మోకాళ్లకు శస్త్ర చికిత్స చేసిన తెలుగు డాక్టర్ గా మోకాళ్ళ పేషంట్లకి ఈయన పేరు దైవంతో సమానం..ఇదిలా  ఉంటే లిటిల్ సోల్జర్స్ లో బాలనటి శ్రావ్య ఈయన కుమార్తె అని ఒకచోట చదివాను. అప్పటినుంచి ఈయన పేరు నాకు సెలబ్రిటీలా వినబడడం మొదలు పెట్టింది. ఈయన "గురవాయణం" అనే పుస్తకం రాసారని, చదువుతుంటే అసలు సమయం తెలియదని, ఈయనలో హాస్యం పాళ్ళు చాలా ఎక్కువని కొందరు మిత్రులు చెప్పారు.

 

ఆ పుస్తకం ఎలాగైనా సంపాదించాలని అనుకోవడమే తప్ప పుస్తకాల షాపుకు వెళ్ళి ప్రయత్నించలేదు. అనుకోకుండా జూలై 2013 లో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారి ఆహ్వానం మేరకు నేను అమెరికా వెళితే ఈయన అక్కడ నాకు దర్శనమిచ్చారు. వారి "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ఆయనలోని హాస్య చతురత, స్పాంటానిటి నన్ను విస్మయ పరిచాయి. వేదిక మీద వరుసగా ఈనాడు కార్టూనిష్ట్ శ్రీధర్ ని, మధ్యలో గురవా రెడ్డి ని, మరో పక్క రచయిత జే కే భారవి ని కూర్చోబెట్టారు. గురవారెడ్డి గారికి మైక్ ఇవ్వగానే, "ఒక పక్క గీసే వారు, మరో పక్క రాసే వారు..మధ్యలో నేను కోసే వాణ్ణి" అనగానే ఇంకేముంది...చప్పట్లు. ఈయన సమయస్ఫూర్తి, సద్యస్ఫూర్తి గొప్పగా ఉన్నాయనిపించింది. ఎన్నారైలు అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానాలు చెప్తుంటే హాలంతా గొల్లమనే నవ్వులే. అంటే ఆయన రచన చదవడానికంటే ముందు నేను ఆయనకి కనెక్ట్ అయిపోయాను.

 

కార్యక్రమం అయ్యాక ఇక ఉండబట్టలేక మొహమాటం లేకుండా "గురవాయణం" అడిగి తీసుకున్నాను. ఊరికే తీసుకున్నాడు అనే ఫీలింగ్ ఆయనకు లేకపోయినా నాకు లేకుండా ఉండడం కోసం  నా "వొడ్కా విత్ వర్మా" ఆయనకిచ్చా.



డాక్టర్ గురవారెడ్డి స్వానుభవాల సమాహారం ఈ "గురవాయణం" అని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు..

 

అట్ట తిప్పాక ఆపలేదు.. 53 వ్యాసాలున్న ఈ సచిత్ర పుస్తకం  కొన్ని షార్ట్ స్టోరీల్లాగ, కొన్ని ట్రావలోగుల్లాగ ఉన్నాయి.. ఒక ప్రణాళిక, ఒక లెక్క, ఒక కొలత లేకపోవడం ఈ పుస్తకం బాగా చదివించేలా ఉండడానికి కారణం. పైగా రంగుల ఫోటోలు, అక్కడక్కడా కార్టూన్లు, క్యారికేచర్లు వంటివి ఉండడం వల్ల మరింత ఆసక్తి గొలిపింది.. ఇంకొక వెసులుబాటు ఏమిటంటే దీనిని వరుసగా నవలలాగ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచన్నా చదువుకోవచ్చు. నాకు స్వభావరీత్యా ఇలాంటి పుస్తాకాలు ఎక్కువ ఇష్టం.

 

తన మీద తాను జోకులేసునే వాడే ఈ ప్రపంచం లో ఉత్తమ హాస్య కారుడంటారు. ఆ లక్షణం గురవారెడ్డి గారి రచనా శైలిలో అనుక్షణం కనిపిస్తూ ఉంటుంది. బాల్యం, యవ్వనం, మిత్రులు, బంధువులు, పాటలు, సినిమా, సాహిత్యం ...ఇలా ఎన్నింటి గురించో తన స్వానుభవం నుంచి రాసారు కనుక ప్రతీ విషయంలోను చదివింపజేసే విశేషం ఉంది.

 

ఈ పుస్తకంలో ఏది బాగుందో ఏరుకుని చెప్పడం నాకైతే కష్టమే. ఎందుకంటే నా మూడ్ ని బట్టి ఒక్కోసారి ఒక్కోటి నచ్చుతోంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ముళ్ళపూడి రమణ గారి కోతికొమ్మచ్చి సిరీస్ సరసన పెట్టుకోదగ్గ పుస్తకం ఇది.

 

ఈ డాక్టర్ గారికి మోకాళ్ళు అతికించడంలో ఎంత పట్టు ఉందో, తెలుగు పదాలను విరిచి ఆడుకోగలగడంలో కూడా అంతే పట్టు ఉందని ఇది చదివాక అర్థమయ్యింది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు