గోతెలుగు కథాసమీక్షలు - ..

 

 

కథ : కేస్లా 
రచయిత్రి : సమ్మెట ఉమాదేవి 
సమీక్ష : రామదుర్గం మధుసూదనరావు

గోతెలుగు 86వ సంచిక!

 

అతడే ఓ పోరాటం..!

 


పోరాటం...వినడానికి చాలా చిన్నపదం. కానీ దానికున్న శక్తి అపారం. దేని మీద పోరాడాలి...ఎవరిపై పోరాడాలి..ఎందుకు పోరాడాలో  తెలిసినా...ఆసక్తి ఉన్నా తగినంత శక్తి లేకుండా ‘ఇదంతా మన వల్ల కాదులే...’ అనుకుని చేతులెత్తేసిన సందర్భాలు మనలో చాలా మందికి ఎదురయి ఉంటాయి. కానీ కేస్లా కథ చదివాక పోరాటం అంటే ఏంటో అర్థమవుతుంది. అడవికి...సమాజానికి మధ్యలో అటు ఇటుగా వస్తున్న అనుమానపు తూట్లను తప్పించుకో లేక...ఎదుర్కొన లేక తండాలు ఎలా నలిగి పోతున్నాయో ఈ కథ ద్వారా  అక్షర చిత్రిక పట్టిన రచయిత్రి సమ్మెట ఉమా దేవి గారికి ప్రత్యేక అభినందనలు తెలపాలి. తన వారి బాగు కోసం పరితపించి...పోరాడి...నీరసించి...ఊరికి వెలియై...అయిన వారికి దూరమై...అన్నీ పోగొట్టుకుని మౌన రుషిలా మిగిలిన కేస్లా తిరిగి సువాలి...మాల్యక్కల సాంగత్యంతో ఎలా చేతనత్వం పొందాడో రచయిత్రి చెప్పుకొచ్చిన తీరు అత్యద్భుతం. నిశిత పరిశీలన...ఆ తాండా బతుకులపై అవగాహన...అవ్యాజమైన ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి కథలు పుట్టుకు రావు. కేవలం తెలిసిన నాలుగైదు పదాల్ని పట్టుకు వేలాడి...వాక్య విన్యాసాలతో పాఠకులను మైమరపించే తాయిలాలు ఈ కథలో మీకు కచ్చితంగా కనబడవు. అడవిలో ఉన్న ‘వాళ్లు’ ఎవరి కోసం ఎందు కోసం ఎలా బతుకుతున్నారో చెబుతూనే...ఇవతల ఉన్న వాళ్లు ఆవలి వాళ్ల కోసం ఎన్ని మార్గాల్లో అన్వేషిస్తుంటారో...ఎవరెవర్ని బలి పశువులుగా చేస్తుంటారో అక్షర ధైర్యంతో వ్యక్తీకరించిన రచయిత్రిని శబాష్‌ అనక తప్పదు. పోలీసుల లాకప్‌లో హర్యా లాల్‌ ‘ఆత్మ హత్య’... నా అనుకున్న వాళ్లే మూఢ నమ్మకంతో కేస్లాను ఊరి నుంచి తరిమి తరిమి గొడుతున్నప్పుడు అండగా నిల్చిన దీరు అమానవీయ ‘మరణం’...ఈ రెండు ఘటనలు కేస్లా కథలో కీలకాలు. మాల్యక్క పాటలు...సువాలి ప్రేమలు... ఆ తండాలో పున్నమి రాత్రుల్లో చల్లగా పరచుకున్న వెన్నెల్లా పాఠకుల్ని తాకుతాయి. ఈ కథకు తాండా మాండలికం జవం అదే జీవం! బహిష్కృతుడిగా...తిరస్కృతుడిగా...అన్నీ వదిలేసుకుని...భయంకరమైన రూపంతో జీవచ్చవంలా బతుకీడుస్తున్న కేస్లా...మాల్యా...సువాలి...స్నేహితుల సాంత్వనంతో తేరుకున్నాక ...మళ్లీ తాండానే కోరుకోవడం అతనికి ఆ మట్టిపై ...అక్కడి మనుషులపై ఉన్న మమకారాన్ని వ్యక్తం చేస్తుంది. కథా శిల్పం నిజంగా అనల్పం. అడవిలో ఉన్నవాళ్ల గురించి చెబుతూ...మెరుపు తీరు అస్తరు...వెలుగు తీరు సాయం జేస్తరు...నీడ తీరు దొర్కకుంట పోతరు...అని చెప్పడం రచయిత్రి రచనా వైదుష్యమే! అలాగే తూరుపు కొండల్ని చూసినప్పుడల్లా కేస్లా మనసులో ఉవ్వెత్తున ఎగిసి పడే ఉత్తేజ తరంగాల్ని ఆవిష్కరించిన తీరు అభినందనీయం. వెయ్యి మాటలెందుకు...కేస్లా కథ చదువుతున్నంత సేపు నేను ఆ తండా లోనే ఉండి పోయాను...మీరు చదివినా అలాగే ఉంటుంది!!
–రామదుర్గం మధుసూదనరావు

ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు... http://www.gotelugu.com/issue86/2286/telugu-stories/keslaa/

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి