భగవంతుడిచ్చిన కొన్ని వరాలు… - భమిడిపాటి ఫణిబాబు

Bhagavantudichhina Konni Varalu

భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన వరాలలో, మొదటిదేమిటయ్యా అంటే "మర్చిపోవడం", అలాగే రెండోది "చిరాకు పడడం". ఈ రెండింటినీ, selective  వాడేసికుంటే, హాయిగా బ్రతికేయొచ్చు. పైగా ఈ ప్రక్రియలకి ఏవో ఋజువులూ వగైరాలాటివి కూడా అవసరం ఉండదు. అంతగా అవతలివాడు నమ్మనట్టు కనిపించాడా, "ఒట్టు" పెట్టేసికోడానికి కావలిసినన్ని ఉన్నాయి. దేవుడిమీద ఒట్టు అన్నారనుకోండి, ఏమాత్రం దైవభీతి ఉన్నవాడైనా సరే, టక్కున నమ్మేస్తాడు. పోన్లెద్దూ దేవుడికి కోపంవస్తుందేమో.. అనుకుని.

ఈ మర్చిపోవడమనేది కొంతమందికి ఓ అలవాటుగా ఉంటూంటుంది.కొంతమంది కి ఒక్కొక్కప్పుడు "హాబీ" (hobby) గా కూడా ఉంటూంటుంది. సమస్య ఎంత సీరియస్సైనా సరే, 'అరే మర్చేపోయానండీ.'. అని మనమీదకూడా "ఒట్టు" పెట్టగలిగే ప్రాణిని మనం ఏం చేయగలమంటారు? ఓహో నిజమే కాబోసు అని తూర్పుకి తిరిగి దండం పెట్టడం తప్ప. గుర్తుండే ఉంటుంది, పిల్లలు చిన్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళే సందర్భంలో, ప్రతీ రోజూ ఏదో ఒకటి మర్చిపోవడమే. ఓ రోజు పెన్సిల్ బాక్స్, ఇంకోరోజు రైన్ కోటు, ఇంకో రోజు టిఫిన్ బాక్స్, ఇలా  తల్లితండ్రుల్ని ఏడిపించడానికి రోజుకోటి మర్చిపోవడం. ఆ వస్తువులు లేకుండగా స్కూలికి పంపమనీ,  కొత్తది కొనిపెడతారనీ, వాళ్ళకీ తెలుసు.

ఈ విధంగా వాళ్ళకి పాతవాటిని వాడి, వాడి, మొహం మొత్తేసినప్పుడల్లా, ఈ "మర్చిపోవడమనే" అస్త్రాన్ని ఉపయోగిస్తూంటారు. దీనర్ధం ఏమిటంటే,  selective గా వాడడం చిన్నతనంలోనే వంటబట్టినట్టన్నమాట, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఇలాటివారికి, రాజకీయాల్లో బాగా రాణిస్తూంటారు, వాళ్ళు చూడండి, ఎన్నికల సమయాల్లో చేసిన హామీ లన్నీ, ఎన్నుకోబడగానే హాయిగా "మర్చిపోతారు".

స్కూలు వయస్సునుండి కాలేజీ లెవెల్ కి వచ్చిన తరువాతైతే ఇంకో రకపు "మర్చిపోవడాలు" ఉంటాయి. రాముడు మంచి బాలుడు టైపు కాకుండా, ఏదో పరీక్షలముందే , రాత్రిళ్ళు కాఫీలు త్రాగేసి, తెల్లవార్లూ బట్టీలు పట్టేసి, మర్నాడు ఏదో "పొడిచేద్దా" మనుకునే టైపు, అన్నీ వచ్చేశాయీ అనుకుంటారు, తీరా పరీక్ష హాల్లో, పేపరు చూసేటప్పటికి  ఒక్కటీ అర్ధం అవదు. ఇంటికెళ్ళిన తరువాత, ఏ తండ్రో " ఈ ప్రశ్నకి జవాబేం వ్రాశావురా.." అని అడగ్గానే, "అర్రే మర్చేపోయానే.." అనేసి ఊరుకుంటాడు.

ఈ విద్యాశ్రమాలన్నీ దాటుకుని గృహస్థాశ్రమం లోకి వచ్చిన తరువాత, ఈ మర్చిపోవడాలలో కావలిసినంత ప్రావీణ్యం వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇంటి ఇల్లాలు, ఫలానా..ఫలానా వస్తువులు బజారునుండి తెమ్మందనుకుందాం, లిస్టు వ్రాసుకోడానికి నామోషీ, ఈమాత్రం సరుకులకి మళ్ళీ లిస్టోటా అనుకుని, "బుర్ర" లోనే గుర్తు పెట్టుకోవడం. ఏదో పిల్లలకి ఏ పిండివంటో చేసే ఉద్దేశ్యంతో అవేవో dry fruits లాటివికూడా చెప్పినట్టు గుర్తే , కానీ వాటి ఖరీదులు చూస్తే గుండె గుబేలుమంటోంది. పోనిద్దూ వచ్చే నెలలో చూసుకుందామనే సదుద్దేశ్యంతో వాటిని convenient గా మర్చిపోవడం. తీరా ఇంటికి వెళ్ళిన తరువాత, సంచీలో ఉన్న సరుకులన్నీ చూసి, " అదేమిటండీ జీడిపప్పూ, కిస్మిసు తేలేదేమిటీ.." అని అడగ్గానే, "అర్రే అదేమిటో గుర్తే రాలేదే, ఏదో చెప్పేవనిమాత్రం గుర్తుంది కానీ, ఏమిటో జ్ఞాపకం రాలేదు.." లాటి డయలాగ్గు బ్రహ్మాస్త్రం లాటిది. కానీ ఇలాటివి అప్పుడప్పుడు వాడితేనే క్షేమం. ఏదో మొదటిసారి నమ్మొచ్చు, కానీ ప్రతీసారీ ఈ సాకే వాడితే పట్టుబడ్డానికే అవకాశం ఎక్కువ.

ఇంక భగవద్ప్రసాదం రెండో వరం గురించి- "చిరాకుపడడం" దీన్ని  quantitative గా చెప్పడమైతే కుదరదు. పరిస్థితులు, వాతావరణం చూసుకుని మరీ వాడుతూండాలి. ఏ నెలాఖరికో, భార్యా, పిల్లలూ ఏ సినిమాకో తీసికెళ్ళమని అడిగినప్పుడూ, పిల్లలకి చదువుమీద శ్రధ్ధ తగ్గిపోతోందని, దగ్గర కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పమన్నప్పుడూ, అక్కడికేదో రోజంతా ఆఫీసులో పని చేసి..చేసి.. శ్రమపడిపోయినట్టు మొహం పెట్టేసి, ఓ చికాకు "mode" లోకి వెళ్ళిపోతే, గండం గడిచినట్టే.   ఒక్కొక్కప్పుడు ఈ "చిరాకు" ఉపయోగకరంగా కూడా ఉంటుంది.  భర్తతో ఏ స్కూటరుమీదో షికారు కి వెళ్దామనుకుంటే, ఆయన దగ్గర ఉండేది సైకిలు మాత్రమే, వచ్చే జీతంలో స్కూటరు ఎలాగూ కొనలేడు, ఎప్పుడో పుట్టింటికి వెళ్ళినప్పుడు, మాటల్లో తల్లితండ్రులతో .." మీ అల్లుడిగారికి రోజూ గంటల తరబడి బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చేటప్పటికి, ఎక్కడలేని "చిరాకూ" వచ్చేస్తోందీ, ఓ అచ్చటా లేదూ, ముచ్చటా లేదూ.. ఓ స్కూటరుంటే బాగుంటుందీ.." అని, భర్తగారి " చిరాకు" ఓ పాశుపసాస్త్రం లా ఉపయోగిస్తుంది. పాపం ఆ తండ్రి, తన కూతురు ఎక్కడ కష్టపెట్టుకుంటుందో అనుకుని అప్పో సప్పో చేసి ఆ స్కూటరుకి కావలిసిన డబ్బు ఇస్తాడు.  ఇలాటివన్నీ ఇదివరకటి రోజుల్లో అనుకోండి, ఇప్పుడు ఓ క్రెడిట్ కార్డు చూపిస్తే కావలిసినన్ని దొరుకుతున్నాయి.

ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళు సాధారణంగా ఏ ఆఫీసరుగానో ఉంటూంటారు. చనువుగా ఉంటే ఏం నెత్తికెక్కేస్తారో అనే భయంతో, సర్వకాలసర్వావస్థల్లోనూ మొహం 'చిరాకు' పడ్డట్టుగా పెట్టేయడం.దీనితో ఆయన క్రింద పనిచేసే ఉద్యోగులు కూడా మరీ అంత చొరవ తీసికోరు. ఆఫీసుల్లో పనికి పనీ అవుతుందీ, ఈయనకొచ్చిన ఈ పేరూ ప్రతిష్ఠల ధర్మమా అని, బయటివారెవ్వరూ ఈయన దగ్గరకి రావడానికి ప్రయత్నించరూ.

ఈవిధంగా చెప్పుకుంటూ పోతే వీటివలన ఎన్నెన్నో లాభాలు. బాగుంది కదా అని మరీ ఎక్కువగా ప్రదర్శిస్తే ఒక్కొక్కప్పుడు బెడిసికొట్టడం కూడా సంభవించొచ్చు.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి