మీకోసం మీరే ఆలోచించుకోవాలి - !

meekosam meere alocinchukovali

"మీకేమిటండీ..నెల తిరిగేసరికి హాయిగా పెన్షనొచ్చేస్తుందీ, కానీ అందరికీ అలాటి సదుపాయం లేదుగా.." అని పరామర్శించడం చాలామందికి ఓ అలవాటు. ఒకవిషయం గమనిస్తూంటాను, సాధారణంగా చాలామందికి ఈ పెన్షనర్స్ అంటే, చాలా అసూయగా ఉండడం.ఇంతమంది ఘోష వినలేకేమో, కేంద్రప్రభుత్వం వారు కూడా, అప్పుడెప్పుడో 2000 సంవత్సరం తరువాత ఉద్యోగాల్లో చేరినవారికి, ఈ సదుపాయం ఎత్తేసి, ఇంకోటేదో స్కీమ్ ప్రారంభించారు.ఆరోజుల్లో అంతంత జీతాలుండేవి కావు. ఇంకోవిషయం ఏమిటంటే, ఈ పెన్షనర్లకి నెలనెలా ఇస్తున్నారనే కానీ, almost దానికి సమానంగా, మిగిలిన సంస్థల్లో పనిచేసినవారికి, ఒకేసారి ఇచ్చేస్తారన్న విషయం convenient గా మర్చిపోతారు. అలా వచ్చినదానిని, ఏదో డిపాజిట్ లో వేసి, నెలకింతా అని వడ్డీరూపంలో తీసికుంటే బావుంటుందికదా అని ఈ పెన్షనర్లంటారు. ఇలాటివన్నీ easier said than done. ఒక్కసారి చేతిలోకి అంత డబ్బురాగానే, ఆ కుటుంబసభ్యులకి ఎక్కడలేని అత్యవసరాలూ గుర్తొచ్చేస్తాయి !

ఉదాహరణకి ఆ ఇంట్లో ఏ ఇంజనీరింగు పూర్తిచేసో, పూర్తిచేయబోయే కుర్రాడో, కూతురో ఉన్నాడనుకుందాం. తన తోటివారందరూ విదేశాలకి వెళ్ళి, అవేవో ఎమ్.ఎస్సు చేస్తున్నారే, మనం కూడా ఎందుకు వెళ్ళకూడదూ అనే ఓ ఆలోచనవచ్చేస్తుంది.అవేవో పరీక్షలుపాసయి మొత్తానికి ఎక్కడో ఏదో యూనివర్సిటీ లో స్కాలర్ షిప్పు వరకూ సంపాదిస్తాడు పాపం. చల్లగా ఇంట్లో చెప్తాడు-- నాన్నా నాకు స్కాలర్ షిప్పు వచ్చిందీ అవటాఅని.స్కాలర్ షిప్పు అంటే వచ్చిందికానీ, మిగిలిన ఖర్చులుంటాయిగా, ప్రయాణానికీ, ఆ స్కాలర్ షిప్పు డబ్బులేవో చేతికివచ్చేదాకా ఖర్చులూ వగైరా. వాటన్నిటికీ ఈ ఇంటిపెద్దగారికి ఒకేమొత్తంలో వచ్చిన డబ్బుమీద పడుతుంది దృష్టి. దానికి సాయం, తల్లికూడా, "ఎలాగూ ఇక్కడిదాకా చదివించామూ, పాపం బయటకివెళ్ళి ఏదో పైచదువులు చదువుకుంటానంటున్నాడుగా, ఏదో సద్దేయండి మరి .." అంటుంది.మొత్తానికి సింహభాగం ఆ ఖర్చుకు అయిపోతుంది. అందరిమాటా ఏమో కానీ, కొంతమంది ప్రబుధ్ధులకి, తమ తల్లితండ్రులు ఎంత శ్రమ పడిచదివించారో అనే మాటే మర్చిపోయి, ఆ పైచదువులకోసం బయటకి వెళ్ళి, అక్కడే సెటిలయిపోయి, ఈ తల్లితండ్రులని వారి మానాన వాళ్ళని వదిలేస్తాడు. ఇలాటివి జరగలేదంటారా?

ఈ పైచదువులవాడిని వదిలేద్దాం, దేశంలోనే ఉండి, ఏ మహానగరంలోనో ఉద్యోగం చేస్తూన్న ఇంకో కొడుకుగురించి మాట్టాడుకుందాం. ఇంటద్దెలు భరించలేక, ఏదో కొద్దో గొప్పో ఓ కొంపలాటిది ఏర్పాటు చేసికుందామనుకుంటాడు, దానికి ఋణాలు ఇచ్చే బ్యాంకులున్నాయనుకోండి, కానీ ఈరోజుల్లో ఎపార్టుమెంటు కొనాలంటే మాటలా, ఆ బ్యాంకు వాడిచ్చే ఋణం ఏమూలకీ, ఆ టైముకే తండ్రిగారు రిటైరయి, ఒకే మొత్తంగా డబ్బు చేతికివస్తుంది. ఆయన రిటైరయ్యే రోజుకి, శలవు పెట్టేసికుని, ఎక్కడలేని ప్రేమాభిమానాలూ ఒలకపోసేసి, చల్లగా తన మనసులోని ఆలోచన బయటపెడతాడు.-- అప్పటికే, ఈ పెద్దాయనకి తను ఉండేఊళ్ళోనే ఓ ఇల్లుందనుకుందాము, ఆ ఇల్లు అమ్మకానికి పెట్టేసి,ఈ ఏకమొత్తంగా వచ్చిన డబ్బుని దానికి జోడించి, తనకు రాబోయే 'అప్పు' కలిపి, అందరూ కలిసుండేటట్టుగా, తనుండే మహానగరంలోనే ఓ ఇల్లు కొంటే బావుంటుందేమో అని.--. ఈ దిక్కుమాలిన సెంటిమెంటోటికదండీ, ఆ తల్లితండ్రులూ ఒప్పేసుకుంటారు. ఇందులో ఆ పెద్దాయనకి ఒరిగేదేమిటయ్యా అంటే, ఆ ఎపార్టుమెంటు రిజిస్ట్రేషన్ టైములో, ఆయన పేరుకూడా చేర్చడం. దానివలన ఉపయోగం ఏదైనా ఉందా అంటే ఎప్పుడైనా ఆ ఎపార్టుమెంటు అమ్మేటప్పుడు, ఆయన సంతకంకూడా చేయడం. మహా అయితే, పార్కింగులో పెట్టే బోర్డుమీద ఈయన పేరుకూడా రాయడం !

ఈ రోజుల్లో ప్రతీవారికీ మహ అయితే రెండు లేదా మూడు బెడ్రూమ్ముల ఎపార్టుమెంటు కొనగలిగితే మహద్భాగ్యం. మొత్తానికి పెట్టేబేడా పుచ్చుకుని, ఆ తల్లితండ్రులు తమ స్వంత ఇంటిని అమ్ముకుని, చేతిలో కానీ బ్యాంకులో గానీ, ఏగాణీ లేకుండగా, మరి అదంతా ఈ కొత్త ఎపార్టుమెంటుకి down payment కి ఖర్చైపోయిందిగా, గృహప్రవేశం కొడుకూ, కోడలూ చేయగా కొత్త ప్రదేశంలో సెటిలవుతారు. ఆ ఎపార్టుమెంటేదో రెండు బెడ్రూమ్ములదైనమాటైతే, ఆ కొడుక్కి పిల్లలు లేకపోతే, ఓరూమ్ములో వాళ్ళూ, ఇంకో రూమ్ములో ఈ తల్లితండ్రులూనూ. ఒక పిల్లో, పిల్లాడో ఉంటే వాళ్ళూ తల్లితండ్రులూ ఒకరూమ్ములోనూ సెటిలవుతారు. ఆ ముచ్చటెన్నాళ్ళూ, ఈ పిల్లలు పెద్దయేదాకా, ఆ తరువాత ఆ బెడ్రూమ్ము పిల్లల స్టడీ రూమ్మూ, తల్లితండ్రులు హాల్లోకీనూ. ఇవేవో అతిశయోక్తిగా వ్రాస్తున్నాననుకోకండి . ఇవి పచ్చినిజాలు. కొంతమందికి నచ్చకపోవచ్చు.

పోనీ అలాగని ఈ తల్లితండ్రులకి స్వతంత్రం ఉంటుందా, ఎప్పుడు బయటకి వెళ్ళాలన్నా కొడుకునో, కోడలినో అడగాలి, చేతిలో డబ్బుల్లేవుగా.అదృష్టం బాగుండి, ఏ వైద్య సహాయమూ అవసరం ఉండదనుకుందాం, ఎప్పుడైనా అవసరం వచ్చిందా అయిపోయిందే.అన్నీబావుంటే ఈరోజుల్లో ఐటీలో పనిచేసే ప్రతీవారికీ ఉంటుందే అదేదో మెడికల్ ఇన్స్యూరెన్సులూ, అవేవో క్యాష్ లెస్సులూ, వాటితో గండం గడిచిపోతుంది. భార్య తనతల్లితండ్రుల పేర్లూ, భర్త తన తల్లితండ్రుల పేర్లూ నామినీల్లో చేరుస్తారుకనుక. అలా కాకుండగా, ఇంకోటేదైనా జరిగిందా, ఈ తల్లితండ్రుల పని గోవిందాయే. 

చెప్పొచ్చేదేమిటంటే , ఈ పెన్షన్లు లేనివారు, మరీ సెంటిమెంటుకి పోకుండగా, తమ భవిష్యత్తుకూడా దృష్టిలో పెట్టుకుని, తమకంటూ కొంత డబ్బు ఉంచుకుని మరీ ఖర్చుచేస్తే బావుంటుందని.తినో, తినకో పిల్లలని వాళ్ళ కాళ్ళమీద నిలబెట్టగలిగారు,ఇటుపైన వాళ్ళ బతుకులు వాళ్ళే బతకాలి. ఈ పెద్దవారు కూడా, తమకై దాచిన డబ్బుని, పోయేటప్పుడు వాళ్ళతో ఏమైనా తీసికెళ్తారా ఏమిటీ, ఎలాగూ పిల్లలకి వచ్చేదే. ఆ కొనే ఎపార్టుమెంటేదో వీళ్ళు పోయిన తరువాతే తీసికుంటే, వీళ్ళదారిన వీళ్ళూ సుఖంగా ఉండొచ్చు. అంతగా వీరి సహాయం అవసరంలేకుండా, తీసికోగలిగారా సంతోషం.

సర్వేజనా సుఖినోభవంతూ….

-
భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి