కథ : పరుగు పందెం
రచయిత : పి.బి.రాజు
సమీక్ష :పార్నంది వేంకట రామ శర్మ
గోతెలుగు 120వ సంచిక!
పరుగుపందెం కధ లో చాలా సున్నితమైన అంశాన్ని చర్చించారు రచయిత శ్రీ పి బి రాజు గారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్టులైతే, వారి పిల్లల పెంపకం ఎలా?వాళ్ళు ఏ రకం గా ఎదుగుతారు? తల్లిదండ్రుల ప్రేమానురాగాలు వారికి ఎంతవరకు అందుతాయి? ఆ పిల్లల భవిష్యత్, చదువు వగైరా ఎలా ఉండబోతాయి? అన్న ప్రశ్నల కి కొంత మేర సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు రచయిత.
మహర్షి, శశి లు ప్రేమించి పెళ్లిచేసుకుని, తమ తమ తల్లిదండ్రుల ఆదరణ కరువైనా, ఒకరికొకరు ఆసరా గా, పెళ్ళికి ముందునాటి అంతే ప్రేమతో పెళ్ళైన తర్వాత, భార్యకి ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చినా, తనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అంతే అన్యోనత తో ఉంటారు. అయితే భార్య గర్భవతి అయిన కొన్ని నెలల తర్వాత భర్త మహర్షి ఆమెని ఉద్యోగం మానేసి, ఇంటిపట్టునే ఉండి, ప్రసవం అయిదాక తగు జాగ్రత్తలు తీసుకుంటూ, పుట్టబోయే బిడ్డ ఆలనా పాలనా చూసుకొమంటాడు. అందుకు భార్య శశి అంగీకరించదు. మెటెర్నిటీ శలవులు ఆర్నెల్లు, ఆపై ఇంకో మూడు నెలలు కూడా శలవులు పెట్టి బిడ్డ సంరక్షణ చూసుకుని, ఆపై మంచి ఆయా ని పెట్టుకుని బిడ్డని జాగ్రత్త గా మనం పెంచలేమా. ఉద్యోగం మానేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. మహర్షి “మన బిడ్డను ఎవరి చేతుల్లోనో పెడ్తే; వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో ...లేదో; మనమయితే జాగ్రత్తగా చూసుకోవచ్చు. వాడి ఎదుగుదలను కళ్ళారా చూసి ముచ్చట పడొచ్చు. ఆనందించొచ్చు. ఆ అనుభవాన్ని పదిలంగా పది కాలాల పాటు దాచుకోవచ్చు." అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా వినదు ఆమె. ఇంకా ఇంకా అదే విషయం చర్చిస్తుంటే, తనకి తెలిసిన వాళ్ళ పిల్లాడు గురించి ఏదో చెప్పబోతే కూడా ఆమె వరించి, ఇలా అయితే నేను అబార్షన్ చేసుకుంటా గానీ, ఉద్యోగం మానను అని తెగేసి చెప్తుంది. దాంతో బిత్తరపోయిన భర్త ఇంక ఆ విషయం చర్చించడు.
ఆ తర్వాత, శశి స్నేహితురాలు శోభ ఆమెకి తారస పడి “రిహబిలిటేషన్ హౌజ్ఫ ర్ మెంటలీ రిటార్టెడ్” హౌస్ లో ఉన్న 18 ఏళ్ల తన అక్క కొడుకు ని చూడడానికి వెళ్తూ, శశిని కూడా తనతో తీసుకెళ్తుంది. అక్కడ ఆ అబ్బాయి, 18 ఏళ్లు వచ్చినా, మానసికం గా ఎదుగుదల లేక సరిగా మాట్లాడలేక, నడవలేక వింత గా ప్రవర్తిస్తుండడం చూసిన శశికి శోభ ఆ పిల్లాడు అలా అవడానికి కారణం చెప్తుంది. ఆమె అక్క, బావలు ఉద్యోగం లో హోదాలు, జీతం లో ఎదుగుదలు, సమాజంలో ఉన్నత స్థాయి కోసం పడే ప్రాకులాట లో పిల్లడి సంరక్షణ కి ఒక ఆయా ని పెడతారు. ఎంత ఎక్కువ జీతం ఇస్తున్నా, ఆ ఆయా ఆ పిల్లడిని సరిగా చూడక, హింసాత్మకం గా వ్యవహరించడం తో ఆ పిల్లాడు మానసికమైన ఎదుగుదల లేని వాడైపోతాడు. అతను మామూలు మనిషయే అవకాశాలు తక్కువనీ తెలియడం తో ఆ హోమ్ లో ఉంచేస్తారు.
ఈ విషయం తెలుగుకున్న శశి, తనకి పుట్టబోయే బిడ్డకి అలాంటి పరిస్థితి రాకూడదనే, తన భర్త తపన పది ఉంటాడని తెలుసుకుని, తను ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, భర్తకి చెప్తుంది.
ఈ కధ లో భార్యాభర్తలు తమ పిల్లల సంరక్షణ స్వయం గా చూసుకోవాలి, ఆయా లపై వదిలివేస్తే మంచి పరిణామాలు ఉండకపోవచ్చు. వారు డబ్బు కోసం పని చేసినా, మనస్పూర్తిగా ఆ పిల్లలని చూసుకోరు. అటువంటి పరిస్థితుల్లో అవి ఆ పిల్లల ఎదుగుదల పై అది శారీరికం గా, మానసికం గా ప్రభావం చూపుతుంది అన్న సందేశం ఉంది. మంచి సందేశం. ఈమధ్య టీవీ వార్తల్లో, కొన్ని వాట్సాప్ సందేశాల్లో కూడా, ఏడాది, రెండేళ్ళు వయసున్న చిన్న చిన్న పిల్లల్ని శారీరికంగా క్రూరంగా హింసించే కొందరు ఆయా లని చూపించారు. నిజమే! కొందరు డబ్బు తీసుకుంటూ కూడా, మానవత్వం కూడా లేకుండా అలా పిల్లల్ని ఎలా పైశాచికంగా హింసించి శాడిస్టుల్లా ఆనందిస్తారో అంతుపట్టదు. అటువంటి పరిస్థితులు రాకుండా తమ తమ పిల్లల్ని జాగ్రత్త గా పెంచుకోవాల్సిన బాధ్యత ఉద్యోగస్తులైన తల్లిదండ్రులపై ఉంది.
కానీ,ఇప్పుడు మన సమాజం లో చాలావరకు భార్యా భర్తలు ఉద్యోగస్తులే. విదేశాల్లో కూడా మన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారికి పిల్లలు పుట్టినప్పుడల్లా, వారి వారి తల్లిదండ్రులు వంతుల వారీగా ఆయా దేశాలకి వెళ్ళి తమ మనవల సంరక్షణ స్వయం గా చూసుకోవడం జరుగుతున్నదే. మనదేశంలో కూడా, ఇప్పుడు పెద్ద వాళ్ళ డ్యూటీ చాలావరకు కొడుకు కొడలో, లేక కూతురు అల్లుడో ఉద్యోగాలకి పోతే, తమ తమ మనవల సంరక్షణ గానే ఉంటోంది. ఆరకంగా ప్రస్తుత సమాజంలో ఉద్యోగస్టులైన భార్యాభర్తల పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల పోషణ లో ఉంటున్నారు. అందువల్ల ఆయా భార్యాల ఉద్యోగాలకి ఎలాంటి ఢోకా ఉండడం లేదు.పిల్లల భవిష్యత్ పై బెంగా ఉండడం లేదు. ఆర్నెల్లో, తొమ్మిది నెల్లో మెటెర్నిటీ, తదితర సెలవుల తర్వాత హాయిగా ఉద్యోగాలకి పోతున్నారు.
ఈ కధలో పెద్దల్ని ఎదురించి ప్రేమ పెళ్ళి చేసుకున్నందుకు మహర్షి, శశి లకి ఇంకెవరి ఆసరా లేని పరిస్థితి వచ్చింది. మహర్షి కూడా ఎవరో ఒక పిల్లాడి దురవస్థ వినే, తమ సంతానం కూడా అవస్థల పాలు కాకూడదనే భార్యని ఉద్యోగం మానేయమని చెప్పే ప్రయత్నం చేసుంటాడని అనుకోవాలి.
అయితే తను చెప్పబోయి, భార్య అబార్షన్ చేసుకుంటానీ బెదిరించడం తో ఆగిపోయిన మహర్షి ద్వారానే, ఈ కధలో శోభ ద్వారా శశి కి తెలిసిన విషయం తెలియచెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. అప్పుడు భర్త ఎందుకు తన ఉద్యోగం విషయంలో అంత పట్టుదలగా ఉన్నాడో ఆమెకి ఇంకా బాగా అర్ధమయేది.
పైగా ఇంకో విషయం. ఎంత కోపంలో ఉన్నా, తమ కూతురు గర్భవతి అంతే ఎంతటి తల్లిదండ్రులకైనా పంతాలు, కోపాలు చాలావరకూ పోతాయి. వాళ్ళు తప్పకుండా ఇటువంటి పరిస్థితి లో కూతురుకి ఆసరాగా రానే వస్తారు. తమ కొడుక్కి సంతానం కలగబోతోందని తెలిస్తే, ఆ తల్లిదండ్రులు కూడా ఒక మెట్టు దిగి వస్తారు. ఇది సాధారణం గా ప్రేమ వివాహాల్లో జరిగేదే.
తమకి ఆర్ధికం గా లోటులేదు.సంపాదించినన్నాళ్ళు సంపాదించాం. ఇంకా పుట్టబోయే పిల్లల దృష్ట్యా భార్య ఉద్యోగం మానేయడమనేది మంచి విషయమైనా, అది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే డబ్బు వెంట పరుగు మొదలెడితే అది ఆపడం అంటూ ప్రస్తుత సమాజం లో లేదు. అది జరిగితే, ఆర్ధిక స్థోమత బాగా ఉండీ ఇంకా డబల్ ఎర్నింగ్ గ్రూప్ లాగా ఉద్యోగం చేస్తున్న భార్యా భర్తల ఉద్యోగాల్లో కొన్నైనా నిరుద్యోగులకి అందుతాయేమో.
ఏదిఏమైనా పిల్లల సంరక్షణ పూర్తిగా ఆయాలపైనే వదిలివేయడం అన్నది “ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం” లాంటి చట్ట బద్ధమైన హెచ్చరికే!!
ఈ క్రింద లింకులో ఈ కథ చదివెయ్యండి మరి http://www.gotelugu.com/issue120/3148/telugu-stories/parugupamdem/