సనాతన సాంప్రదాయుల గృహాలలో ప్రత్యేకముగా పూజకు ఒక గది (గృహము) ఉండడం మనం అందరం చూస్తున్నాము. సాధారణంగా యజమాని, పెద్దలు అక్కడ పూజలు జరిపి తీర్ధము ప్రసాదము ఇతరులకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ గదిలోనే జపము, పారాయణ, భజనలు మొ: చేస్తాము. పర్వదినాలలో, మరికొన్ని సందర్భాలలో అనగా కుటుంబములో శుభకార్యము జరిగినపుడు వ్రతములు పూజలూ అక్కడే చెయ్యడం మనకు తెలుసు.
పూజకు ప్రత్యేకముగా గది ఎందుకు? భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని అతనివే. మన ఇల్లు, ఆస్థులు, సంపదలూ అన్నిటికీ హక్కుదారు అతనే. ప్రతి ఇంటికీ యజమాని ఆ పరాత్పరుడే గదా! ఇంటి యజమానికి మాస్టర్ పడక గది ఉంటుంది. ఆ గదే సర్వాంతర్యామిది. మనమంతా అతని సంపదలను అనుభవిస్తున్న ఇహలోక వాసులము అంతే. ఆయజమానిని తగు మర్యాదలతో సతతమూ సేవించుట మన ఆచారము, కర్తవ్యం. అందులకే ప్రత్యక గది/ మందిరము.
మన రక్షకుడు మనతోనే ఎల్లప్పుడూ ఉండుట మనకు శ్రేయస్కరము, శుభ సూచికము. యజమాని/రక్షకుడు ఒక గదిలో ఉండుట అతని సూచనలు దీవెనలతో సకల కార్యములూ జరుగుట మన ఆచారము. ప్రతీ గృహమున వివిధ పేర్లతో గదులు ఆయా ఉపయోగములకు/పనులకు కేటాయించుచున్నటులనే మనదరినీ రక్షించు ఆ పరాత్పరునికీ ఒక నివాసము ఉండవలెనన్న
భావమున ఈ పూజా గృహము ఉండాలి.
ఆ గదిలోనే శుభప్రదమయిన ఆలోచనలూ కదలికలూ భావములూ మనకు స్పురిస్తాయి. మన కర్తవ్య ఫలము ఆ గదిలో మనం జరుపు ధ్యానము, జపము స్మరణ పూజ మొదలగు కృతములు నిరంతరమూ తరతరాలనుడి అక్కడ ఉన్న విగ్రహములు దేవతా మూర్తుల పటములందు పదిలపరచబడి మనకు సరియయిన మార్గమును చూపును.
దేవాలయములలో దేవునికి శతాబ్దముల నుండి చేయు అర్చన, పూజ, వేద మంత్రముల ప్రభావముచేత ఆ విగ్రహమునకూ, అ గుడికీ ఆ ప్రాధాన్యత సంతరించు చున్నది. అటులనే మన గృహమున ఉన్న పూజ గదిని కూడా భావించిన అది సకల శుభములు ప్రసాదించును.
దేవాలయము లోని పవిత్రత, మంత్ర ప్రభావము, వివిధపూజలు మన గృహమున లేకున్ననూ కొంతవరకు అదే ప్రక్రియ ఇచ్చటకూడా జరుగును. ఆ ఫలములు ఇచటనే లభ్యమగును. ఈ కారణముచేతనే ప్రతి గృహమున పూజ గది మందిరము సకల సౌభాగ్య దాయకమని మనవిచేయుచున్నాను.
శుభం భూయాత్.