భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు సాక్షాత్ దైవ స్వరూపులు. భగవంతుడు అనగా ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం మొదలైనవన్నీ కలిగినవాడు అని అర్ధం. నిరాకార,నిర్వికార, నిత్య, శుధ్ధ , బుధ్ధ ,ముక్త స్వభావమైన దివ్య చైతన్యం సాకారమై సర్వజీవులనూ ప్రేమతో బ్రోచి, కాచి ,కాపాడను భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈశ్వరమ్మ, పెదవెంకమరాజు దంపతులకు ప్రవేశ గర్భంలో కుమారునిగా రూపొందింది.
యదాయదాహిధర్మస్య గ్లాని ర్భవతి భారత
అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం .
ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృధ్ధి అవుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను-- అన్నాడు పరమాత్మ.
భగవంతుడు యోగభూమి, త్యాగభూమి, పుణ్యభూమి ఐన పవిత్ర భారతదేశంలో అన్ని యుగాల్లో ఆయా కాల,మాన, పరిస్థితులకు తగినట్లుగా అవతరిస్తుంటాడు. భగవంతుడు తాను అనేక అవతారాలు ధరిస్తూ సాధు సజ్జనులను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తూ వచ్చారు. ఐతే ఈ కలియుగంలో పరమాత్మ అలా దుష్ట శిక్షిణ కాక, దుష్టగుణాలను మాత్రమే సంహరించే యత్నం చేయసాగారు.
అలా వచ్చినవే షిరిడీ సాయి బాబా, ఆ తర్వాత సత్య సాయి, రానున్న ప్రేమసాయి అవతారాలు. సత్యసాయి అవతారంలో చేపట్టిన ముఖ్య కార్య క్రమాలు వేదోధ్ధరణ , ధర్మ రక్షణ, విద్వత్ పోషణ, భక్త రక్షణ అనేవి.
సత్య, ధర్మ ,శాంతి,ప్రేమ,అహింస అనే ఐదు మానవతావిలువలను పాటించినవారే నిజమైన మానవులనీ, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవనీ ప్రవచించడమేకాక ,తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేసుకునే మార్గాన్ని చూపిన భగవానుడు శ్రీ సత్యసాయి బాబా వారు. ఆయన భోధనలు మానవాళికి మార్గ దర్శకాలు. ఆయన తత్వం ప్రేమ తత్వం. ఆయన చూపిన మార్గం సేవా మార్గం.మానవులను ఉధ్ధరించనుదివి నుండీ భువికి దిగి వచ్చి, మానవుల కోసం మానవుల మధ్యనే తిరిగిన దైవ స్వరూపం బాబా వారు. మానవ హృదయాలలో ప్రేమ అనే జ్యోతిని వెలిగించి దానిని సేవ అనే నూనెతో ప్రజ్వలింప జేయ డానికే బాబావారు వచ్చారు.దానికోసమే ఈ సత్యసాయి అవతరించారు.
అవతరించుట యనుటలో అర్ధమేమి?
జనులపై ప్రీతి వాత్సల్యపరత తోడ
వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి,
జీవ ప్రజ్ఞతో బాటుగా దైవ ప్రజ్ఞ.-
భగవంతుడైన విష్ణుమూర్తి తన భక్తులను కాపాడను దశావతారాలు దాల్చాడు. వాటిలో శ్రీరామ చంద్రుడు శరణన్న వారినంతా శత్రువు ఐనా సరే కాపాడారు. దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ కావించారు. శ్రీకృష్టావతారంలో తన భక్తులనందరినీ కాపాడారు. మానవ జాతికి సన్మార్గాన్ని బోధించారు. మానవ జాతినంతా ఉద్దేశించి అర్జునునికి ఉపదేశించినట్లుగా భగవత్ గీత బోధించారు.అలాగే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ధర్మ రక్షణా, సాధు జన రక్షణ, వేదోధ్ధరణ, విద్వత్ పోషణ కావించను మానవాకారం దాల్చిన సాక్షాత్ భగవంతుడు. ఈ అవతారంలో ఆయన ఆయుధం ' ప్రేమ '. మానవుల నందరినీ ఉధ్ధరించను ప్రేమ ద్వారా సేవ చేయించి సన్మార్గాను వర్తనులను కావించడమే ఆయన సంకల్పం.
శ్రీ సత్యసాయి బాబా వారు ఆర్తజనులను కాపాట్టమే తన వ్రతంగా దాల్చారు.
భగవంతుడు తన అన్ని అవతారాలలోనూ మానవాకారం దాల్చినపుడు సాధారణ మానవుల వలెనే ప్రకృతి ధర్మాలను పాటిస్తూ జీవనం సాగిస్తుండేవారు. అలాగే శ్రీ సత్యసాయి బాబా ప్రవర్తిస్తూ వచ్చారు.
భగవాన్ బాబా రత్నాకర వంశంలో జన్మించారు. బాబా వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్య నారాయణ రాజు. ఆపస్తంబ సూత్రుడుగా రత్నాకర వంశంలో జన్మించాడు. సత్య సాయి బాబా వారికి ఇద్దరు అక్కలు, అన్న శేషమ రాజు, తమ్ముడు జానకి రామయ్య, ఐదవ సంతానంగా బాబా వారి కుంటుంబంలో జన్మించారు తల్లి ఈశ్వరమ్మ పెరటి లోని బావిలో నీరు తోడుతున్న సమయంలో ఆకాశంనుండి ఒక నీలి రంగు గోళం వంటి కాంతి తనలో లీనమౌతున్నట్లు అనిపించి ఆమె స్పృహ కోల్పోతుంది.
అలా బాబా వారు ప్రవేశ గర్భంలో జనించారు. అత్త గారు శ్రీ సత్యనారా యణ స్వామి వ్రత ప్రసాదం తెచ్చి ఇచ్చా క బాబా వారి జననం జరుగుతుంది. అందువల్ల ' సత్యనారాయణ రాజు ‘అని నామకరణం చేస్తారు. సత్య నారాయణ రాజును స్నేహితులు రాజూ అని పిలిచే వారు, ఇంట్లోవారు మాత్రం సత్యం అని పిలిచేవారు. బాబా జననానికి ముందు వారి ఇంటిలో నున్న సంగీత వాయిద్యాలు తబలా, వీణ, మృదంగం వాటంతట అవే మ్రోగేవి. తాత గారు, దీని గురించీ సిద్దాంతులను సంప్రతించగా వారింట దైవాంశ సంభూతుడు జన్మించ బోతున్నాడని చెప్పాడు. బిడ్డ జన్మించాక స్నానం చేయించి పక్క మీద పరుండ బెట్టినపుడు ఒక నాగు పాము వచ్చి పసి బాలుని శిరస్సు మీద పడగ పట్టి ఉండటం ఇంటి లోని వారు చూస్తారు. అది మనుషులను చూడగానే వెళ్ళి పోతుంది. ఇది కూడా ఒక దివ్య అవతార వైభవంగా పండితులు చెప్తారు.
పసి ప్రాయం నుండే బాబా వారు కొన్ని మహాత్యాలు చూపుతూ వచ్చారు కానీ, ఆయన భగవంతుడనే భావన తనకై తాను ప్రకటించే వరకూ ఎవ్వరికీ కలుగ లేదు. శ్రీకృష్ణుడు తల్లి యశోదకు తన నోట్లో సృష్టినంతా చూపినా ఆమెకు తానెవరో తెల్సుకోకుండా చేస్తారు. అలాగే బాబా వారు తానెవరో తాము ప్రకటించే వరకూ తల్లిదండ్రులకైనా తెలియనివ్వ లేదు. అవతార ప్రకటన తర్వాతే అంతా ఆయన దైవమనే విషయం తెల్సుకున్నారు.
1940మార్చి 8వ తేదీన రాజుకు ఒక ఎర్ర తేలు కుడుతుంది. దానికి వైద్యం చేసినా రాజు కొంత విచిత్రమైన ప్రవర్తనతో ఉండే వాడు. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండే వాడు. శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసే వాడు కాడు. ఆ సంవత్సరం అక్టోబర్ 20, తన 14వ యేట రాజు తన పుస్తకాల సంచీ పడేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నాకు ఈ బంధాలతో పని లేదు."అని చెప్పగా, అయన తండ్రి కోపించి " నీవు దయ్యమా? భూతమా? ఎవరు నీవు?" అని అడగ్గా , సత్యనారాయన రాజు, అక్కడ ఉన్న ఒక పళ్ళెం లోని మల్లె పూలు దోసిలితో తీసు కుని విసరగా క్రింద ' నేను సాయిబాబాను ' అనే తెలుగు అక్షరాలు ఏర్పడతాయి..' నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. అని చెప్పి ఇల్లు వదలి వెళ్ళి పక్కే ఉన్న ఒక తోటలో చెట్టు క్రిందకు వెళతాడు. అక్కడ చేరిన వారందరి చేతా భజనలు చేయిస్తాడు. తానే మొదటగా 'మానస భజరే గురు చరణ - దుస్తర భవ సా గర తరణం ' అంటూ పాడగా, అంతా చేరి పలికే వారు. అలా వారితో భజనలు చేయించే వాడు. ఒక ఫోటో గ్రాఫర్ వచ్చి ఫోటో తీస్తూ పక్కనే ఉన్న రాతిని తీయ బోగా వద్దని వారిస్తాడు సత్యనారాయణ. ఫోటోలో అది ఒక షిరిడీ సాయి విగ్ర హంలాగా వస్తుంది. అలా తాను ఆ షిరిడీ అవతారమని చూపుతాడు. అప్పటి నుండీ ఆయన్ను సత్య సాయి బాబా అని అంతా పిలిచే వారు. అప్పుడు రాజుకు 14 సం. వయస్సు.
సత్య సాయి బాబాగా ప్రకటించుకుని, ఆ రోజునుండీ తన మహత్యాలను చూపుతూ, భక్తులకు శారీరక మానసిక రుగ్మతలను బాపుతూ, భజనలు చేయిస్తూ వచ్చారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడంతో, ఒక భజన మందిరం నిర్మాణం జరిగింది. ఎందరెందరో ఎంతో దూర ప్రాంతా ల నుండీ రావడం, దర్శన, స్పర్శన, సంభాషణలు బాబా వారు వారికి అనుగ్రహించడం జరుగుతూ వచ్చింది. అలా అలా భక్తులు దేశ విదేశాల నుండీ రాసాగారు. బాబా వారి కీర్తి, యశస్సూ ఎవ్వరి ప్రచారం లేకుండానే భక్తుల ద్వారా, విశ్వ వ్యాప్తమైంది.
మొదటి సారిగా 1944లో భక్తులు పుట్టపర్తి గ్రామంలో ఒక చిన్న భజన మందిరం నిర్మించారు. దానిని నేడు "పాత మందిరం" అని పిలుస్తున్నారు. రాను రానూ భక్తులు పెరిగి పాత మందిరం చాలక ప్రస్తుతం ఉన్న ప్రశాంతి నిలయ నిర్మాణం 1948లో మొదలైంది. దీనికి సాయి కుల్వంత్ హాల్ అని బాబా వారే పేరు పెట్టారు.
బాబా వారు 1963లో తన ఉపన్యాసంలో లో తాను శివుడు, శక్తి స్వరూపమని ప్రకటించారు. తాను షిరిడీ సాయి బాబా అవతారమనీ, అది శివ స్వరూపమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయి బాబాగా కేవలం శక్తి అంశగా అవతరిస్తాననీ చెప్పారు.
తల్లి ఈశ్వరమ్మ బాబా వారిని మూడు కోరికలు కోరుతారు.
మొదటిది పుట్టపర్తి చిన్నకుగ్రామం, అక్కడ చదువుకోవాలనే అభిలాష ఉన్న పిల్లలు బుక్క పట్టణం వెళ్ళాల్సి వస్తున్నది. చాలా మంది పిల్లలను అలా పంపను బాధ పడుతున్నారనీ, అందువల్ల పుట్టపర్తిలో ఒక పాఠశాల నిర్మించమని ఆమె కోరగా, అలాగే పాఠశాల నెలకొల్పారు బాబా వారు. అది ప్రస్తుతం ఒక విశ్వ విద్యాలయంగా రూపొందింది. తల్లి రెండవ కోర్కెగా అక్కడ ఏదైనా అనారోగ్యం పాలైన వారిని బుక్క పట్నమో మరెక్కడికో తీసుకెళ్ళాల్సి వచ్చి ప్రాణాపాయాలు సైతం జరుగుతున్నాయని, ఆ తల్లి తండ్రుల బాధ చూడ లేకున్నాననీ ఆమె అక్కడ ఒక చిన్న హాస్పెటల్ ఏర్పాటు చేయమని కోరారు. అలాగే బాబా వారు ఏర్పరచారు. అది నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పెటలై దేశ విదేశాల వారికి ఉచిత వైద్య సేవలను అందిస్తున్న ఆదర్శ వైద్య శాలగా పేరు గాంచి, ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం ఉచితంగా జరుగుతూ ఉండటం విశేషం. ఇహ ఈశ్వరమ్మ గారు బాబా వారిని తమ మూడవ కోరికగా, పుట్టపర్తిలో జనాల మంచి నీటి ఎద్దడి చూసి ఒక మంచి నీటి నుయ్యి ఏర్పరచమని కోరగా బాబా వారు అలాగే ఏర్పరచారు, అది కేవలం పుట్టపర్తి గ్రామానికే కాక ఎన్నో జిల్లాలకు ఉచిత 'సత్యసాయి జల ధార' అనే పేర మంచి నీరు అందుతూనే ఉంది. తల్లి కోరిన మూడు కోరికలూ సర్వజనాళికీ వరాలయ్యాయి.
ఒకప్పటి ఈ చిన్న పుట్టపర్తి గ్రామం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. తల్లి గారికి మిచ్చిన మాట ప్రకారం శాస్వత నివాసం మాత్రం పుట్టపర్తి లోనే ఏర్పర్చుకుని , భక్తుల కోరిక మేరకు ఇతర ప్రాంతాలను దర్శించి వచ్చేవారు . విశ్వవిద్యాలయం, సూపర్ స్పెషాలిటీ హాస్పెటల్, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద ప్రదర్శనశాల ,సత్యసాయి క్రీడోత్సవాలకు ,హిల్ వ్యూ ఓపెన్ స్టేడియం -ఒక రైల్వే స్టేషను, విమానాశ్రయం,ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి. భక్తుల వసతికోసం ఉచితంగానూ, చాలాతక్కువ చెల్లింపుతోనూ గదులు, భోజనాలకు కాంటీన్ అతి తక్కువ ధరకే లభ్యమవుతుండగా, సత్యసాయి సెంట్రస్ ట్రస్ట్ వారు ఇటీవల ఉచిత అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ అందించా లని తీర్మానించి, ప్రకటించారు. అతి త్వరలో అది ప్రారంభంకానున్నది.
పుట్టపర్తి ఆశ్రమానికి భారతదేశపు ప్రముఖ నాయకులు ,అబ్దుల్ కలామ్, వాజ్పేయి వంటి ప్రముఖులు అతిధులుగా వచ్చి సందర్శించి, బాబా వారి దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యాలు లభ్యమై ఆనందించారు. బాబావారి అనుగ్రహానికి పాత్రులైన వారు కోకొల్లలు. విశ్వ వ్యాప్తంగా ఉన్న భక్తులను స్వామివారు అనుగ్ర హించి, ఆపదల నుంచీ కాపాడిన సంఘటనలు కోటాను కోట్లు.
నిరుపేదలనుండీ ,ధనికులవరకూ ,సాధారణ జనం నుండీ ఉన్నతోద్యోగులవరకూ , దేశ నాయకులనుండీ సాధారణ ఉద్యోగులవరకూ ఎందరో ఎందరెందరో స్వామి వారి కృపకు నోచుకున్నవారే. వారి అవసరాలనూ, ఇబ్బందులనూ బట్టి వారికి బాబావారు అనేక వస్తువులను సృష్టి చేసి ఇవ్వసాగారు. అనారోగ్యాన్ని రూపు మాపనూ, చదువు, ఉద్యోగమూ, ఆర్ధిక ఇబ్బందులూ , మనశిక వ్యాధులనూ రూపుమాపి సరిచేయను బాబావారు తమ ఆసీర్వద సూచకంగా రక్షరేకులుగా వివిధ వస్తు సృష్టి చేసి, ఉంగరాలూ, గొలుసులూ, డాలర్లూ , దేవుని విగ్రహాలూ, మొదలైనవి ప్రసాదించేవారు.
---- సత్యసాయి పాదార్చిత. ఆదూరి హైమావతి