మొబైల్ ఫోన్లలో 5 మెగా పిక్సెల్ కెమెరాలు మామూలే. అంతకన్నా మంచి రిజల్యూషన్‌లో ఫొటోలు తీయడానికీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫుల్ క్వాలిటీ ఫొటోలు కావాలంటే డిజిటల్ కెమెరాలనే ఆశ్రయించాలి. ఒకప్పుడు కెమెరా అంటే, దాంట్లో ఫిలిం ఉండేది. దాన్ని డెవలప్ చేసి, ఫొటోగా మార్చడం ఓ పెద్ద తంతు. ఇప్పుడు అలా కాదు, జస్ట్ డిజిటల్ కెమెరాతో క్లిక్ మనిపించేసి ఫొటోని ప్రింట్ చేసేసుకోవచ్చు. క్షణాల్లో అయిపోతుందీ పని. ఇంట్లోనే ఫొటోల్ని ప్రింట్ చేసుకునే సాంకేతికత అభివృద్ధి అయ్యింది. మామూలుగా పెద్ద ఫొటో అంటే, సినిమా పోస్టర్ సైజ్‌లో ఊహించుకోవచ్చు. ఫ్లెక్స్ ప్రింటింగ్ వచ్చేసిన తర్వాత దగ్గరగా చూస్తే క్వాలిటీ తక్కువగా ఉన్నా, దూరంగా చూస్తే క్వాలిటీగానే కనిపించేలా ఫొటోల్ని ప్రింట్ చేసుకోవడానికి వీలుంది. అలాగే, కెమెరాని ఎంత జూమ్ చేసినా ఓ వంద మీటర్ల తర్వాత లేదంటే 200 మీటర్ల దూరంలో ఫొటోని చిత్రీకరించడం చాలా చాలా కష్టం. కానీ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న వాటినీ కెమెరాలో బంధించి ఫొటో తీయగలిగితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. దగ్గరా ఉన్నవారూ, దూరంగా ఉన్నవారూ ఒకే ఫొటోలో అత్యంత క్వాలిటీతో కనిపించడమంటే అది మహాద్భుతం. ఆ మహాద్భుతాన్ని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా సుసాధ్యం చేశారు.
గిగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఓ ఫొటో ఇప్పుడు ప్రపంచమంతా నివ్వెర పోయేలా చేసింది. దాదాపు 360 డిగ్రీల కోణంలో ఈ ఫొటో తీయబడింది. అదెలా సాధ్యం? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే ఆ ఫొటోని చూస్తే. దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారూ ఒకే తరహా క్వాలిటీలో ఫొటోలో కనిపిస్తున్నారు. ఎక్కడ జూమ్ చేస్తే, అక్కడికి దగ్గర్నుంచే ఫొటో తీసినట్లుగా కనిపిస్తుంటుంది. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడుకోవాలంటే ఇదే అత్యద్భుతం అని చెప్పవలసిందే. సాంకేతిక అద్భుతంగా ప్రపంచమంతా ఈ ఫొటో తీసిన విధానం గురించి చర్చించుకుంటోంది. అయితే ఇటువంటి ఆవిష్కరణల వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉగ్రమూకల కదలికల్ని పసిగట్టేందుకు, అలాగే జన సమూహం ఎక్కువగా ఉన్న చోట్ల సంఘ విద్రోహ శక్తుల కుట్రల్ని భగ్నం చేయడానికి ఈ ఫొటోలు ఉపయోగపడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అలాగే, అంతరిక్షంలో అద్భుతాల్ని తిలకించేందుకు, అంతరిక్ష విశేషాల్ని అందరికీ తెలియజేసేందుకు కూడా ఈ ఫొటో సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి పెద్దన్న. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం కోసం తీసిన ఈ అతి పెద్ద ఫొటో కూడా ఓ సంచలనం, ప్రత్యేకం.
ఈ ఫోటో చూడాలంటే ఈ లింకును క్లిక్ చేయండి. http://edition.cnn.com/interactive/2017/01/politics/trump-inauguration-gigapixel/