కథ : ఐసోలేట్
రచయిత : ప్రతాప వెంకట సుబ్బారాయుడు
సమీక్ష :అన్నమయ్య
గోతెలుగు 155వ సంచిక!
'ఐసోలేట్' కథను సమీక్షించే ముందు ఒక మాటను మనస్పూర్తిగా చెప్పి తీరాల్సిందే! పాఠకుల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడం వేరు, వారిచేత ఏదో ఒకరకంగా చదివించాలనుకోవడం వేరు. రెండోదానికి ప్రయత్నించినప్పుడే శృంగారం బూతుగా పరిణమిస్తుంది. నైతిక విలువ అనే హద్దును దాటకుండా కలవరపెట్టే శృంగార కథలను కాకుండా మురిపించి, మైమరపించే కథలను మాత్రమే ఆదరిస్తూ ప్రేక్షకులకు మధురానుభూతులను పంచుతున్న 'గోతెలుగు.కాం' యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇక కథ విషయానికొస్తే... మనిషి బంధాల బాధ్యతల్లో, బాధ్యతల పరుగులో తల మునకలై నిజమైన సుఖసంతోషాలకు ప్రాధాన్యమివ్వడం లేదు. తమ పిల్లల బాధ్యతలు తీరిన తరువాత కూడా మనవలు, మనవరాళ్ల గురించి తపిస్తూ తమ గురించి తాము ఆలోచించడం మానేస్తున్నారు. రమణి, రాజారావుల జంటను చూస్తే చిలిపి పనులకూ, ఏకాంత సౌఖ్యానికీ దంపతులకు వయసంటూ లేదనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు జీవించడం, పరస్పరం ఒకరి సన్నిధిలో మరొకరు బాహ్య ప్రపంచాన్నే మరచిపోవడం దంపతులకు ఓ మధురమైన అనుభూతి. జీవితంలో ఒక దశలో పరుగుని ఆపేసి, దంపతులిద్దరూ చేతిలో చెయ్యేసి స్వర్గపు అంచులను చవిచూడాలనే ఆలోచనే గొప్పది. దాన్ని ఆచరణలో పెట్టిన రమణి, రాజారావుల పాత్రలను చూస్తే ప్రస్తుత సమాజంలో వున్న అనేకానేక జంటలు ఈర్ష్య పడక తప్పదు. రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడు ఆ పాత్రలను అంత మురిపెంగా చిత్రీకరించారు. పెళ్లైన కొత్తలో రచయిత చెప్పినట్టుగా ఆర్థిక లేమి, ఏకాంతం కరవవడంలాంటి అనేక కారణాలవల్ల ఏన్నో జంటలు బాధ్యతల సుడిగుండంలో చిక్కుకుపోతాయి.
అయితే, వాటినుండి జీవితాంతం విరామం ఎవరికీ దొరకదు. ఒక దశకు చేరుకున్న తరువాత ఎవరికి వారు తీసుకోవలసిందే! మూడుముళ్ల ముచ్చట, ఏడడుగుల వేడుక జరిగిన తరువాత తమ దాంపత్యం తొలినాళ్ల మాధుర్యాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి చూడాలి. 'ఆకాశం వెన్నెల గుమ్మరిస్తూంటే తాజ్ అందం చూడ 'మంటూ రమణితో రాజారావు అన్నమాట హృద్యంగా వుంది. ఇక మొత్తంగా కథ విషయానికొస్తే... కథంటే ఉత్కంఠను రేకెత్తించే మలుపులు వుండాలీ, పాఠకుల్ని చదివించగలిగే మెలికలుండాలనే అభిప్రాయం ఎంత తప్పో 'ఐసోలేట్' కథ చదివితే స్పష్టంగా అవగతమవుతుంది. 'ఐసోలేట్'లో అనూహ్యమైన మలుపులు లేవు, ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు లేవు. మనసును హత్తుకునే రమణి, రాజారావు దంపతులు మధురానుభూతులను తమ సొంతం చేసుకోవాలనుకునే ముందడుగు తప్ప! ముదిమి వయసులోనూ కోర్కెలు రెక్కలు కట్టుకుని ఎగరగలవనే అంతరార్థంతో చిత్రకారుడు మాధవ్ అందించిన బొమ్మ కథకు అపురూపంగా, అతికినట్టుగా సరిపోయింది. పుంఖాను పుంఖాలుగా వచ్చే కథల్లో మానవీయ విలువలున్న కథలను ఎంపిక చేసి పాఠకులకందించడం గొప్ప విషయం. ఇంతమంచి కథను రాసిన రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడికీ, 'గోతెలుగు.కాం' యాజమాన్యానికీ హృదయపూర్వక అభినందనలు.
ఈ క్రింద లింకులో ఈ కథ చదివెయ్యండి మరి http://www.gotelugu.com/issue155/3968/telugu-stories/isolet/