శ్లో" జపాకుసుమ సంకాశం కాశ్య పేయం మహాద్యుతిం,
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.
శ్లో" బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః,
సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకరః.
అనగా సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. ఉదయ కాలంలో బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంకాలం విష్ణువు. జీవుల పుట్టుక , పెరుగుదల, క్షయం అన్నీ సూర్య తేజస్సు వల్లే జరుగుతాయి.
సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.
పంచాంగాల్లో " రథ సప్తమి వివరణలో సూర్య జయంతీ, అభోజ్యార్క వ్రతాది నిఖిల వ్రతాని కర్తవ్యాని వైవస్వత మన్వాదిః " అని వ్రాస్తారు. అంటే ఈ వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు ఉగాది పండుగగా ఉండేదని అనుకోవచ్చు. రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అనడానికి ఆరోజు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉన్నాయి.
నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడ పువ్వుల వ్రతం, చద్ది కూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుక గౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్ర గుప్తుని నోము వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి రోజే పడతారు.
తెలుగు వారు- రథసప్తమి
ప్రతి సంవత్సరం మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వదినం. ఆ రోజు మనం ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపళ్ళు పెట్టి అవి నెత్తి మీద పట్టుకుని స్నానం చేయాలి. కొంచం పొద్దు పోయిన తర్వాత పాలు పొంగించాలి. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయేటట్లుగా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యనికి నివేదన చేసి నమస్కరించాలి. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్యరథం అంటారు.
జిల్లేడు ఆకులు-విశిష్టత
జిల్లేడు ఆకులు దొంతర తలమీద పెట్టుకునే ఆచారాన్ని గురించి తెలుసుకుందాము. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వనమూలిక వీర్య వంతమై ఉంటుంది. కావుననే వనమూలికలు సంగ్రహించే కాలాన్ని గురించి మన వైద్యులు కొన్ని నియమాలు పెట్టారు. నీలి చెట్టులో రంగుకొన్ని కొన్ని పక్షాల్లోనే బాగా ఉంటుంది. కాబట్టి అట్టి పక్షం వస్తే కాని నీ లి చెట్లను కోయక పోవడం కర్షకులకు అనుభవమే. ఈ తలివిడిలో జిల్లేడు ఆకుల్ని ఈ తరుణంలో నెత్తి మీద ధరించండంలోఏదో విశేషం ఉంటుంది కదా. ఈసడింప బడుతూ ఉన్న జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక. ఈ ఆకులు పైన నునుపుగా క్రింద నూగుగా ఉంటాయి. ఇది సంవత్సరంలో అన్ని రోజుల్లో పూస్తుంది. జిల్లేడు ఆకులు తుంపినా, కొమ్మలు విరిచినా తెల్లని పాలు కారుతాయి. ఆ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటి పోటు తగ్గుతుంది. జిల్లేడు చిగుళ్ళరసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. జిల్లేడు ఆకులు వెచ్చబెట్టి ఆముదం రాచి పైన వేస్తే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పక్షవాతము, కుష్టు, మూర్చ, విషజంతువుల కాట్లు మున్నగు దుష్టసాధ్యములైన రోగాలలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీనికి సంస్కృతంలో సూర్యాహ్వాయ, అర్క, రవి అనే పేర్లు ఉన్నవి. ఈ నామాలు దీనికి సూర్యునితో గల సంబంధాన్ని తెలియ చేస్తున్నాయి. రథ సప్తమి సూర్యుని గూర్చిన పండుగ కాబట్టి ఆనాడు జిల్లేడు ఆకులకు అంత ప్రాధాన్యం వచ్చిందని అనుకోవాలి.
రేగుపండ్లు-విశిష్టత
రేగుపండ్లు నెత్తిమీద పెట్టుకోవడంలో కూడా ఏదో అర్థం ఉండి ఉండాలి కదా. భవిష్యోత్తర పురాణంలో రథసప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులు కాని, ఏడు రేగు ఆకులు కాని, రెండు రకాల ఆకులు కాని పెట్టుకుని స్నానం చేయాలని ఉంది. కాని మన దగ్గర జిల్లేడు ఆకుల దొంతర మీద రేగుపండ్లు ఉంచుకుని స్నానం చేస్తారు. శిశిర ఋతువైన మాఘఫాల్గుణ మాసంలో రేగుపండ్లు బాగా దొరుకుతాయి. " ఫలశైశిరః" అని రేగు సంస్కృత నామాల్లో ఒకటి. రథసప్తమికి ఇంచుమించు ఒక నెల పూర్వం వచ్చే సంక్రాంతి భోగి పండుగనాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు తల మీద నుంచి దిగబారేటట్లు పోస్తారు. అలా పోయడం వలన దీనిని భోగిపండ్లు పోయడం అంటారు.ఆ పిల్లలకు ఉండే పీడ వదిలిపోతుందని మనవారి నమ్మకం. ఆనాడు రేగుపండ్ల మూలకంగా ఒక్క చిన్నపిల్లలకే జరిగే విషయం రథసప్తమి నాడు అందరికీ జరుగుతుందని అనుకోవాలి.
చిక్కుడు కాయలు-విశిష్టత
ఇక రథసప్తమి నాడు పూజలో వాడే వానిలో చిక్కుడు కాయల,చిక్కుడు ఆకుల విషయం తెలిసికొందాము. చిక్కుడు కార్తీకమాసం నాటికి కదురంత మొక్క ఉంటే మాఘమాసం నాటికి నా మహిమ చూపుతానని అంటుందని పెద్దలు అంటారు. ప్రకృతిని ఆరాధించే మన పెద్దలు మాఘ మాసంలో బాగా పూచి కాచే చిక్కుడును కూడా మాఘమాసపు పర్వాలలో పేర్కొనదగిన రథసప్తమినాటి ఆరాధన ద్రవ్యాలలో చేర్చి ఉంటారు. రథసప్తమి సూర్యుని రథానికి సంబంధించిన పర్వం కాబట్టి చిక్కుడు కాయలతో, వెదురుపుల్లలతో ఆనాడు రథాన్ని చేసి దాని మీద చిక్కుడు ఆకు పరచి నైవేద్యానికి ఆధారపాత్రగా ఉపయోగించే ఆచారం నెలకొల్పి ఉంటారు. నైవేద్యం పెట్టడానికి వేడి పొంగలి చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండే పసరు, ఆర్ద్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనికపు మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య వర్థకం అవుతుంది.
" ఆరోగ్యం భాస్కరాధిచ్చేద్ " జ్యోతీష శాస్త్ర ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే , మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్ర దోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన వలన వేగంగా ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమవ్రతంగా లోకవ్యాప్తిలో ఉంది.
* ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం అనగా సూర్యాస్తమయం లోపు మంచి గుమ్మడికాయను ఏదైనా ఆలయంలో భ్రాహ్మణుడికి దానం చేసిన సర్వవిధాల శ్రేయస్కరం.
సర్వేజనాః స్సుఖినోః భవంతుః