భగవాన్ బాబావారు ముఖ్యంగా సమాజానికి మేలు కలిగించేందుకై, మానవులను మంచిగా మార్చి, వారిచేత సమాజసేవ చేయించేందుకై ఒక పథకాన్ని రూపొందించారు. దానికోసం 'మానవతా విలువల బోధన చేసే 'బాల వికాస్' అనే విభాగాన్ని ఏర్పరచారు. ఇది ఉచిత మానవతా విలువల బోధనా విధానం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఈ బాలవికాస్ లో విద్యార్థులుగా వుంటూ మానవతా విలువలైన సత్య, ధర్మ,శాంతి, ప్రేమ, అహింసలను మనసుకు పట్టించుకుని ఆచరిస్తూ సమాజ సేవకులుగా వెలుగొందుతున్నారు. విద్యలో ముఖ్యంగా ఈ ఉన్నత విలువలను ఏర్చి కూర్చిన విద్యా విధానం సత్యసాయి విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నది. ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదవుల్లో, ఉన్నతోద్యోగాల్లో కొనసాతుగూ తాము నేర్చిన విలువలను ఆచరిస్తూ ఉన్నత జీవన విధానాన్ని సాగిస్తున్నారు.
స్వామివారు ముఖ్యంగా యువతను సన్మార్గానుసారులను చేయను ఎంతో శ్రద్ధ వహించారు.
ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన
మహనీయులను గన్న మాతృభూమి,
పాశ్చాత్య వీరుల పారద్రోలించియు
స్వాతంత్య్రమును గన్న సమరభూమి,
పాండిత్యమున చాల ప్రఖ్యాతి గాంచిన,
ప్రతిభ చూపిన యట్టి భరతభూమి,
సంగీత, సాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్య భూమి,
చిత్రకళల తోడ చిత్రమై యున్నట్టి,
భరతభూమి యందు జనన మొంది,
భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ
బాధ్యతంతయు మీదె బాలులార!
ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీసత్యసాయి బాబావారు యువతకు సందేశమిస్తూ, భరతభూమి గొప్పదనాన్ని వివరిస్తూ, జన్మభూమి అయిన భరతభూమి గౌరవ ప్రతిష్టలు కాపాడే బాధ్యత యువతదేనని తెలియజెప్పారు. ఏ దేశంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా ఆయా దేశ, సంస్కృతుల పునాదులను కాపాడేది యువత మాత్రమే! అందుకే భగవాన్ బాబావారు సతతమూ యువతకే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. యువత కోసం విద్యాలయాలూ, కళాశాలలన్నీ ఉచిత, ఉన్నత, విలువలతో కూడిన విద్యనందించే విధంగా బాబావారు రూపొందించి నడుపుతూ, యువతకు అందించి, వారిని కార్యోన్ముఖులను చేయనారంభించారు.
చిన్నమొక్కలను ఎటైనా తిప్పి పెంచవచ్చు, అదే పెద్ద వృక్షాన్ని తిప్పనే లేము, కొట్టడం తప్ప. బాబావారు కట్టడమే కానీ, కొట్టడం తన భావనలలోనే లేదు కనుక, మానవాళినంతా మంచిమార్గం వైపు మళ్లించేందుకు తన అవతార జీవిత పర్యంతం ప్రయత్నించారు.
సత్య సాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి 10 లక్షల పై చిలుకు సందర్శకులు వచ్చారు. ఇందులో భారతదేశం నుండే కాక, 186 ఇతర దేశాల నుండి 13,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్ని రోజులు బెంగళూరులోని 'బృందావనం' ఆశ్రమంలో వుంటూ, అక్కడ తమ కళాశాల విద్యార్ధులకు వేసవి తరగతులు నిర్వహించేవారు. ఏందరో పండితులచేత విద్యార్ధులకు ఒక్కో వేసవిలో ఒక్కో అంశంపై ఉపన్యాసాలు ఇప్పించేవారు. బృందావనంలో వేసవి తరగతుల పేర భారతీయ సంస్కృతీ వైభవాన్ని పండితుల చేత ప్రవచనాలు చేయించేవారు బాబావారు. ఉపన్యాసాల రూపంలో తాము కూడా స్వయంగా, ‘భగవద్గీత గురించీ, భజగోవిందం గురించీ, రామాయణం, మహాభారతం... ఇలా విద్యార్థులకు సులభశైలిలో అర్ధమయ్యేలా ఉపన్యాసాలు, చిన్నకథలతోనూ, హాస్య మిళితం చేసి పద్య సూక్తులనూ, వాక్య విబూదులనూ కలిపి చెప్పేవారు.
బెంగుళూరు వైట్ ఫీల్డ్ లోని, బృందావనంలో ఒక కళాశాల కేవలం బాలుర కోసమే ప్రారంభించారు. నేడు సాయి రమేష్ హాల్ అనే భజనమందిరం, కళాశాల విద్యార్థుల కోసం హాస్టల్, ప్రశాంతి నిలయంలో లాగానే ఉన్నాయి. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా బెంగుళూర్లో ఉచితంగా సకల సదుపాయాలతో, ప్రముఖ వైద్యులతో అవసరమైన వారికి సేవలందిస్తోంది. డైకెనాల్ లోని 'సాయి శృతి' ఆశ్రమానికి వేసవిలో తమ విద్యార్థులతోనూ, కొందరు భక్తులతోనూ వెళ్ళేవారు బాబావారు.
సత్య సాయిబాబావారి భక్తులు ముంబైలో 'ధర్మక్షేత్రం' లేక 'సత్యం' అనీ, హైదరాబాదులో 'శివం' అనీ చెన్నైలో 'సుందరం' అనీ మందిరాలను నిర్మించుకున్నారు. ఇక్కడ నిరంతర సేవా కార్యక్రమాలు జరుగుతూంటాయి. బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ‘ఓం'కారంతో ప్రారంభమై, సుప్రభాతం, ఆ తర్వాత వేద పారాయణ, సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబావారు ఈ సమయాల్లో భక్తులందరికీ దర్శనం ఇచ్చేవారు. అక్టోబరు మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. నవంబరు మాసంలో బాబా జన్మదినం సందర్భంగా భక్తులకు ప్రత్యేక వసతులు, ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికీ బాబా జయంతి సందర్భంగా వస్త్రదానాలు, పేదలకు అన్నదానాలూ, భక్తులందరికీ ఏకరీతిన ఉచిత భోజన సౌకర్యాలూ జరుగుతుండటం విశేషం.
దర్శన సమయంలో బాబావారు మెల్లిగా భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే ఉత్తరాలు స్వీకరిస్తూ విబూది 'సృష్టించి' ఇస్తూ, కొందరిని ప్రత్యేక దర్శనానికి (ఇంటర్ వ్యూ) ఎంపిక చేసి, వారితో ఇంటర్వ్యూ గదిలో మాట్లాడి వారి బాధా నివృత్తి గావిస్తారు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, వారి కష్టసుఖాలనూ వారు చెప్పక ముందే తానే చెప్పి ఓదార్చుతారు. ఇంకా ఇతర అనూహ్యమైన వారిని బాధించే విషయాలను వారు చెప్పకనే గ్రహించి, మాట్లాడి, వాటి నివారణ గావించేవారు.
ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఇళ్ళలో పూజామందిరాల్లోని బాబా పటాల నుంచీ, విగ్రహాల నుంచీ, విబూది, పసుపు, కుంకుమ, పవిత్ర తీర్ధం, శివలింగాలు, అనేక రకాల ప్రసాదాలు, తినుబండారాల వంటివి వస్తూండడం యదార్ధం. అమెరికాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి మహాత్మ్యాలను ఈ వ్యాసకర్త చూడదం, ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది. మేఘాల్ నుండి వర్షం కురవడం ఎంత యదార్ధమో ఇదీ అంత యదార్ధం.