చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు, ప్రపంచాన్ని జయించేస్తామనే ఉత్సాహం ఇప్పుడందరిలోనూ కన్పిస్తోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి, వృద్ధుల వరకూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో టైమ్ పాస్ చేసేస్తున్నారు. ఇంకా, ఏబీసీడీలు కూడా రాకుండానే చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఏముందిలే, చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేస్తే పిల్లలకి టైమ్ పాస్ అయిపోతుందనుకునే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. అలా పిల్లల అల్లరి నుంచి తల్లిదండ్రులు తప్పించుకునేందుకు మార్గాలు వెతకడం మామూలే. కానీ అలా చిన్న పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్ పెట్టడం ద్వారా, వారి కంటి చూపుని నాశనం చేసేస్తున్నామని తల్లిదండ్రులు తెలుసుకోలేరు. స్కూలుకి వెళ్ళకుండానే, అతి చిన్న వయసులో పిల్లల్లో కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇది టెక్నాలజీ తెచ్చిన రోగం. అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు ఊరకే అన్లేదు. స్మార్ట్‌గా తమ పిల్లల్ని మార్చుకోవాలనుకోవడం తప్పు కాదు, అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించే ముందు మంచి చెడులు ఆలోచించుకోవాలని వైద్య నిపుణులు చెప్పే మాటల్ని పరిగణనలోకి తీసుకోవాలి.
యువత విషయానికొస్తే మార్కెట్‌లో ఏ స్మార్ట్ ఫోన్ అప్‌డేటెడ్‌గా అన్పిస్తే, దాని వైపు పరుగులు పెడ్తోంది. ఎక్కడ వైఫై ఉంటే అక్కడ వాలిపోతోంది యువత. ఒక్కసారి స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లోకి అడుగు పెడితే, అదో ప్రపంచం. అందులోంచి బయటకు రావడం అంత తేలిక కాదు. అయితే ఈ తరం యువత పూర్తిగా చెడిపోయిందనలేం. స్టడీస్‌కి సంబంధించిన యాప్స్, అలాగే ప్రపంచ వింతల్ని తెలుసుకునే యాప్స్, ఇంకా సరికొత్త టెక్నాలజీ అప్ డేట్స్ కోసం రూపొందిన యాప్స్ ద్వారా ప్రపంచంలో ఏమేం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నారు. అలాంటివారిని చూస్తే ముచ్చటేస్తుంది. వీటి కోసం కొన్ని గ్రూప్స్ కూడా స్మార్ట్ ఫోన్లు వాడేవారికి అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచులకు తగ్గ యాప్‌ని ఎంచుకోవడమొక్కటే కాదు, ఆ గ్రూప్ మిమ్మల్ని ఏమైనా చెడుదారిలో నడిపిస్తుందా? అనేది కూడా ఆలోచించుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ఆ గ్రూప్‌లోకి ఎంటర్ అయి, ప్రపంచాన్ని దున్నేయొచ్చు. ఇక్కడో ముఖ్య విషయం, దేన్నయినా పరిమితంగా వినియోగించుకున్నప్పుడే అది 'స్వీట్'గా ఉంటుంది. లేదంటే చేదెక్కిపోయి ఫలితం తేడా కొట్టేస్తుంది.
స్మార్ట్‌గా ఇంటర్‌నెట్‌లోకి అడుగు పెట్టాక, అక్కడున్నవనీ చెయ్యగలమనుకోవద్దు. సాధించలేనిది ఏదీ ఉండదుగానీ, అది ఎంతవరకు మనకి ఉపయోగం అనే విషయమ్మీద ఓ అవగాహనకి రావాలి. ప్రమాదకరమైన ప్రయోగాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. టెక్నాలజీ అయినా మరేదైనా, వినియోగానికి ముందు విజ్ఞత అతి ముఖ్యమైన అంశం. ఆ విజ్ఞతని దాంతోపాటుగా అప్రమత్తతనీ మెయిన్‌టెయిన్ చేయగలిగితే, టెక్నాలజీ మీ పాదాక్రాంతమవుతుంది. లేదంటే, మిమ్మల్ని ప్రమాదాల్లోకి నెట్టేస్తుంది. టెక్నాలజీతో జర భద్రం బ్రదరూ!