ఇది వరకటి రోజుల్లో బట్టల విషయాలు గుర్తుండే ఉంటాయి కదూ. ఆ రోజుల్లో ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువే. పండగలకీ పబ్బాలకీ , పిల్లలందరికీ విడివిడిగా బట్టలు తీయడం కూడా కొద్దిగా శ్రమతో కూడిన పనే. ఆడపిల్లలకి పరికిణీలూ, మగ పిల్లలకి “ ఇజార్లు “ ( పొట్టిలాగులు/ నిక్కర్లు ) ఒకే తానులోంచి తీసికుని హాయిగా టైలర్ కి ఇచ్చేసేవారు. పైగా ఓ ఇంచో, అర్ధించో పొడుగ్గా కుట్టించేవారు. ఏం పెరిగినా, పెరక్కపోయినా “ తాడి” లా పెరిగేవారుగా, కుట్టించినవి కురచ అయిపోకుండా అన్నమాట. స్కూలుకి వెళ్తున్నంతకాలమూ, నిక్కర్లే గతి. ఏదో కాలేజీకి వచ్చిన తరువాతే పాంట్లు. రాత్రిళ్ళు వేసికోడానికైతే “ చార్ల పైజమాలు”. ఇంట్లో ఉండే దిళ్ళకి గలేబులు కూడా ఈ గళ్ళ తాను” లోవే. అదోరకమైన “ ecological balance” పాటించేవారు. పైగా మగ పిల్లలందరికీ ఒకే డిజైనూ ( సాధారణంగా గళ్ళు ) , ఒకే రంగు బట్టలూ వేస్తే, ఇంకో సౌలభ్యం కూడా ఉండేది—ఏ తీర్థాలకో, జాతర్లకో వెళ్తే, విధివశాన తప్పిపోయినా, వెతకడానికి సులభంగా ఉండేది. సాధారణంగా , పెద్ద పిల్లల బట్టలు పొట్టయిపోగానే, తరవాతివాడికి వంశపారంపర్యంగా వచ్చేసేవి. ఆతావేతా చెప్పేదేమిటంటే, మగపిల్లల బట్టలకి ఆయుర్దాయం ఎక్కువే. పైగా ఆ రోజుల్లో టైలర్ వేసిన కుట్లూ, బట్ట నాణ్యతా కూడా బావుండేవి. ఆడపిల్లలకైతే ఏదో “ ఓణీ” వచ్చేదాకా , సేం టు సేం.
ఇంక ఇంటి ఇల్లాళ్ళకి సాధారణంగా , ఏ 60 నెంబరో, 80 నెంబరో నేత చీరలు. పైగా వాటిని ఏ కొట్టుకో వెళ్ళి కాదు, ఇంటింటికీ తిరిగే “ మూట్ల “ వాళ్ళ దగ్గరే.. రోజువారీ వాడకానికీ, మడిబట్టలకోసమూ ముతక చీరలు. ఇవి కాకుండా, ఇంటికి ఏ చుట్టాలైనా వస్తే బొట్టుపెట్టివ్వడానికి ఇవ్వడానికి “ పెట్టుబడి చీరలు” అని ఉండేవి.. కొన్ని రోజులు వాడిన తరువాత, ఏ స్టీలు సామాన్ల వాడికో ఇచ్చేసి , అవసరమయ్యేవో, లేదా ఇచ్చిన చిన్న చిన్న వస్తువులో తీసికోవడం. కొంచం డిజైను , రంగు బావుంటే, ఏ కిటికీలకో, ద్వారాలకో కర్టెన్లలా కుట్టించుకోవడమో చేసేవారు. సాధ్యమైనంతవరకూ, తమ జాకెట్లు ( బ్లౌజులు) టైలర్ కి కాకుండా, ఇంట్లోనేకుట్టుకోడానికి, ఓ కుట్టు మిషనోటి తప్పనిసరిగా ఉండేవి..
పైన చెప్పినవన్నీ పాతకాలపు రోజులు. కాలక్రమేణా, సంపాదనలూ పెరిగాయి, దానికి సాయం న్యూక్లియర్ ఫామిలీలూ వచ్చాయి. పిల్లల బట్టల వ్యవహారమైతే, పుట్టినప్పుడు కొనే డయపర్లనుండి, రోజువారీవాడకానికీ, ప్రత్యేక సందర్భాల్లో వేసికునే బట్టలూ, స్కూలు యూనిఫారాలూ అన్నీ బ్రాండెడ్ వే. ఇంక ఆడ, మగ వారి వేషధారణ కూడా ఏక్ దం ఆధునికీకరణ అయింది. ఆఫీసులకు వెళ్ళే ఆడ మగవాళ్ళందరూ ఓ టీషర్టూ, జీన్సూ వేసేసికుంటే పనైపోతోంది. అవసరార్ధం మార్చుకున్నా అడిగేదెవరూ లేరు.
ఒకానొకప్పుడు వేసుకునే బట్టకు చిరుగుంటే , బయటకు వేసుకోడానికి కొద్దిగా వెనుకాడేవారు. పంచలకీ, చీరలకీ ఏ ఉత్తరేణి కుట్టో వేసుకునేవారు. పాంట్లకైతే, ఏ టైలరు చేతో మిషను మీద అదేదో “ రఫ్ఫింగ్ “ చేయించుకునేవారు. బట్ట చిరుగుపట్టిందంటే, దాన్ని ఏ స్టీలుగిన్నెలవాడికో, పనిమనిషికో వెళ్ళాల్సిందే. అలాటిది ఈరోజుల్లో అంతా “ ఉల్టా”… జీన్స్ కి చిరుగు ఉండడం ఓ పేద్ద ఫాషనుట. అదేదో డిటర్జెంట్ ప్రకటనలో ‘ మరక మంచిదే “ అన్నట్టు ఈ రోజుల్లో “ చిరుగు మంచిదే “ లోకి వచ్చాము. పోనీ ఆ చిరుగులైనా కనిపించని చోట్లా అంటే అలా కాదు… ఆ చిరుగూ, దాని వెనక్కాల ఉండే శరీర భాగమూ ఊరంతా కనిపించాలి. ఎక్కడదాకా వచ్చిందంటే చిరుగు లేకపోతే, బలవంతంగా అయినా ఆ జీన్స్ ని చింపేదాకా…
ఆడామగా ఎంత కురచ వేష ధారణ చేస్తే అంత ఆధునికం. ఇదివరకటిరోజుల్లోలాగ , ఏ జీన్సైనా పొట్టి అయిపోతే, దాన్ని కురచగా గజ్జల్లోకి సరిపడేలా కత్తిరించేసికోడం. పోనీలెండి ఇలాగైనా , పొట్టయిపోయిన జీన్స్ కి తిరిగి ప్రాణం పోస్తున్నారని ఓ దండం పెట్టుకోవడమే….
సర్వేజనా సుఖినోభవంతూ…