ఒకానొకప్పుడు ఏ వస్తువైనా తయారు చేయడానికి కావాల్సిన చిన్నచిన్న భాగాలతో పాటు, పెద్దవికూడా ఒకే చోట తయారయేవి.. కాలక్రమేణా, స్వంతంగా తయారుచేసేబదులు, బయటనుండి తెచ్చుకోవడం ప్రారంభం అయింది. అన్నీ సేకరించి, జోడించి, దానికో కంపేనీ లేబులోటి తగిలించడం. ఈ పధ్ధతి చవగ్గా ఉన్నట్టు కనిపెట్టారు. మార్కెట్ లో దొరికే బనీన్లూ, లోదుస్తులూ విషయమే తీసికోండి, టోకున దక్షిణాదిన ఈరోడ్/ కోయంబత్తూరు లలో తయారవుతాయిట. పెద్ద పెద్ద Brands అక్కడినుంచే కొనేసి, వాళ్ళ లేబుల్ అంటించేసి అమ్ముకుంటారు. మార్కెట్ లో దొరికే ప్రతీ వస్తువుకీ ఇదే తంతు.
అంతదాకా ఎందుకూ, అమెరికాలాటి దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలుకూడా, తమక్కావాల్సినవన్నీ, మనదేశ కంపెనీలకే అప్పచెపుతారు. దీన్నేదో Outsourcing అంటారుట. ప్రతీదానికీ ఓ ముద్దుపేరు పెట్టడం , అక్కడికేదో ఇదేదో ఆధునిక పధ్ధతనుకోవడం మనందరికీ ఓ అలవాటు. ఇదివరకటి రోజుల్లో ఇంట్లో పెళ్ళిళ్ళకీ, వేసంకాలంలో ఊరగాయలు పెట్టడానికీ, దీపావళి సామాన్లు తయారుచేయడానికీ, అందరూ అంటే పక్కనుండేవాళ్ళూ అందరూ ఓ చెయ్యేసేవారు కాదూ ? అవన్నీ outsourcing కాదూ? ఈ రోజుల్లో ఏ టైలరు దగ్గరైనా కుట్టడానికి బట్టలిస్తే, చొక్కాలకీ, ఆడవారి బ్లౌజులకీ, బొత్తాలూ, “ కాజాలూ “ కుట్టడానికి వేరే ఎవరికో ఇస్తాడు.
ఈ so called outsourcing అన్నది, మన ఇల్లాళ్ళు ఎప్పణ్ణుంచో చేస్తున్నారన్నది, చెప్పుకోడానికి మొహమ్మాటపడతారు కానీ, అందరికీ అనుభవమే. “ చాప కింద నీరు “ లాగనండి, పోలీసాడి లాఠీదెబ్బనండి, బయటవాళ్ళకి కనిపించవు. అంతా subtle… ఉన్నాయా అంటే ఉన్నాయీ, లేవూ అంటే లేవూ. కాలమాన పరిస్థితులనిబట్టుంటుంది ఏదైనా.
ఇది వరకటి రోజుల్లో భర్త ఒక్కరే పనిచేసేవాడు కాబట్టి, ఉద్యోగంలో ఉన్నంతకాలం గొడవుండేది కాదు. రోజులన్నీ ఒకేలా ఉండవుగా, ఎప్పుడో అప్పుడు రిటైరవుతాడే. అప్పుడు మొదలవుతాయి కొత్త విధులు…మరీ రాత్రికి రాత్రే అవుతాయని కాదూ, మెల్లిగా అలవాటు చేస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, “ ఏమిటోనండీ ఈ మధ్యన మోకాళ్ళ నొప్పీ, నడుం నొప్పీ వస్తోందీ… “ .. అప్పుడు తెలుస్తుంది మాస్టారికి, మనంకూడా కొన్ని పనులు చేయకపోతే , పరిస్థితి చెయ్యి దాటిపోవచ్చూ అని. కానీ అలవాటులేదే ఎలాగా? పైగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, అయినా రోగమా ఏమిటీ, మన ఇంట్లో మన పనులు చేసుకోడానికీ?
ఉదాహరణకి…
పొద్దుటే లేవగానే దుప్పటీలు మడతపెట్టడం. ఎండేసిన బట్టలు మడతపెట్టడం. భోజనానికి ముందు, కంచం, మంచినీళ్ళూ పెట్టడం లాటివీ, ఫ్రిజ్ లో పెట్టిన పప్పూ, కూరా లాటివి ఏ మెక్రోఓవెన్ లోనో వేడి చేయడం. ఎంగిలి పళ్ళాలు, గిన్నెలూ , ఇల్లాలు తోమిన తరువాత తుడిచి , సద్దడం .
ఈ రోజుల్లో పురుళ్ళకీ, పుణ్యాలకీ విదేశాలకి వెళ్ళడం చాలా చూస్తున్నాం.. కూతురవొచ్చు, కోడలవొచ్చు.. ఓపికున్నంతకాలమూ వెళ్ళి సహాయపడడం ఓ బాధ్యతే కదా. వాళ్ళకి కావాల్సింది , అత్తగారో, అమ్మో. కానీ రిటైరయి ఇంట్లో కూర్చున్న పెద్దాయన్ని కూడా, buy one get one scheme లోలాగ తీసికెళ్ళాలే. పెద్దావిడక్కూడా చెయ్యందిచ్చొద్దూ? ఆ పసిపిల్లల డయపర్లు మార్చడానికీ, ఫీడింగ్ బాటిల్స్ కడగడానికీ? మరి ఇవన్నీ outsourcing అనక ఇంకేమంటారూ? దీనికి దేశంతో పనిలేదు… స్వదేశంలోఅయినా చేయాల్సిందే. జిహ్వచాపల్యం ధర్మమా అని, నోటికి హితవుగా ఉంటుందని, ఏ గోంగూరో, మెంతికూరో తెచ్చాడా, వాటిని బాగుచేయడం మాస్టారి విధుల్లోకే వస్తుంది.
40 ఏళ్ళపాటు , మాస్టారిని ఉద్యోగానికి పంపడానికీ, పిల్లల్ని తయారుచేసి స్కూళ్ళకి పంపడానికీ, పాపం ఏ తెల్లారకట్లో లేవాల్సొచ్చేది. ఇంకా ఎన్నాళ్ళూ? ఇంట్లో ఉండేదా… ఇద్దరూ.. ఈమాత్రం దానికి మరీ బ్రహ్మముహూర్తంలో లేవడం ఎందుకూ? కానీ మాస్టారికి తెల్లవారుఝామునే లేవడం అలవాటాయె. లేవగానే ఓ గుక్కెడు కాఫీ తాగితేనేకానీ, పని జరగదూ, ఇదివరకటిలాగ కుదరదుగా, మొత్తానికి తనే కాఫీ పెట్టుకుని, ఆ చేత్తోటే పెళ్ళానిక్కూడా రెడీ చేస్తాడు. ఏదో మొహమ్మాట్టానికి, “ అదేమిటండీ నన్ను లేపకపోయారా… “ అని ఒసారి అనేస్తే పోతుంది. మర్నాటినుండీ, కాఫీ అయినా, సాయంత్రం నిద్ర లేచేటప్పటికి చాయీ, మాస్టారి “ పనికి తిండి “ పథకంలోకి వచ్చేస్తాయి.. లేచినవేళ బాగోక, అన్నంలోకి కలుపుకునే పెరుగు సరీగ్గా తోడుకోలేదని అనడం తరవాయి, ఆరోజునుండీ పడుక్కునే ముందర, తోడు పెట్టడంకూడా మాస్టారే.
అన్నిటిలోకీ ముఖ్యమైనది, భోజనాలయిన తరువాత, మిగిలిపోయినవి ఫ్రిజ్ లో పెట్టడం. సరీగ్గా సద్దకపోతే గిన్నెలు ఆ ఫ్రిజ్ లో సరీగ్గా పట్టకపోతే, “ పెద్ద ఫ్రిజ్ కొనుక్కుందామండీ.. “ కంటే, ఏదో మనమే చిన్న గిన్నెల్లో సద్దేయడం ఉత్తమం కదూ…
ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా పనులు ఎప్పుడో outsource చేసేసినట్టే…
సర్వేజనా సుఖినోభవంతూ.