కథా సమీక్ష - ..

 

కథ : నిర్ణయం
రచన  : వాత్సల్య
సమీక్షకులు  : జీడిగుంట నరసింహ మూర్తి

గోతెలుగు  68వ సంచిక!

 

 

పూర్వం  ఉమ్మడి  కుటుంబాలు  లేని  ఇళ్లంటూ చాలా  అరుదుగా  ఉండేవి. అవి  ఆప్యాయతలూ, అనురాగాలకు  నిలయాలుగా  నిలిచి  పోయేవి. అప్పట్లో  కుటుంబంలోని  వారందరూ  ఒకరిమీద ఒకరు  ప్రేమాభిమానాలు  పెంచుకోవడం  కోసం  కలిసి  ఆనందంగా  జీవించడం  కోసం  కావాలని  దగ్గర సంబంధాలు  వెతుక్కుని  ఇంట్లో  కలుపుకునే  వారు. ఎప్పుడైనా..

 చిన్న  చిన్న  అలకలు  లాంటివే  తప్ప  వేరు  కాపురాలు, ఒకరిపై  ఒకరికి  ద్వేషం, అసూయ, వివక్ష  అనేది ఎవరిలోనూ  ఏ కోశానా  కనిపించేది  కాదు. రానూ  రానూ  పిదప  కాలం  వచ్చి  ప్రతి  వారూ ఎవరి  పోరూ  లేకుండా  స్వేశ్చగా, స్వతంత్రంగా   బ్రతకాలన్న  విపరీత  ఆలోచనలు  పుట్టుకొచ్చాయి. రక్త సంబందీకులలో కూడా  విపరీతమైన  కరడుకట్టిన  స్వార్ధం  నరనరాల  వ్యాపించింది. కేవలం  ఆర్ధిక  సంబంధాలే  ప్రతి  ఇంట్లో  కనపడుతూ  అవి  మానవ  సంబంధాలను  మరుగున  పడేస్తున్నాయి. ఈ  వరసలో  తల్లి  లేదు, తండ్రి లేడు  సోదరులు  లేరు  కేవలం  తన భార్యా, పిల్లలు  తప్ప  వారికి  ఎవరూ  కళ్ళకు  ఆనడం  లేదు. తల్లి  తండ్రులకు  పుష్కలంగా  డబ్బు  ఉంటేనే  వాళ్ళను  ప్రేమగా  పలకరించడానికి  ప్రయత్నం  చేస్తారు. ఆ  డబ్బు పైన  కూడా  పిల్లలకే  అధికారం  వుండాలని  తల్లి  తండ్రులతో  గొడవ పెట్టుకుంటూ  వుంటారు. సరే. ప్రస్తుత  కాలంలో  చాలా  ఇళ్ళల్లో  పైకి  చెప్పుకోకపోయినా  ఇంటింటి  రామాయణం  లాగా  మనం  వింటున్నదే.  ఇక  వాత్సల్య  గారు  వ్రాసిన  కథలోకి  వస్తే  వర్ధనమ్మ  భర్త  మరణించగా  దొరికిన  ఉద్యోగంలో  కొద్దో  గొప్పో  ఇల్లు  గడిపే  ప్రయత్నం  చేస్తున్న  తల్లి  ఉద్యోగాన్ని  కూడా  కబళించాలని  ప్రయత్నం  చేస్తాడు  

ఒక  కొడుకు. అలా  అని  ఆ  తల్లిని  సరిగ్గా, ప్రేమగా  చూసుకోవాలని  ప్రయత్నం  చేసారా  అంటే  అదీ  లేదు. కేవలం  ఆవిడను  ఒక  మూల  కూర్చో బెట్టి  ఆవిడ దగ్గర  వున్న కొద్దిపాటి  డబ్బును  కూడా  లాక్కోవాలని  ప్రయత్నాలు  చేస్తారు. తల్లిని  పంచుకోవడానికి  విముఖత  చూపిస్తూనే  ఆవిడకు  వైద్యం  చేయించడానికి కూడా  మనసొప్పదు. ఒట్టి పోయిన  ఆవులు, గేదెలు  కన్నా  హీనాతి హీనంగా  ప్రవర్తిస్తారు. ఇక ఆవిడకు  ఇద్దరు  కూతుళ్ళు  వున్నా  సోదరులకు  లేని  బాధ్యత  తమ కెందుకు  అన్న  నిర్లక్ష్య  ధోరణి  వారిలో  కూడా  కనిపిస్తుంది.  విదేశాల నుండి  వచ్చిన  మనవడు  అతని  భార్యైనా  ఆమెపై  కనికరం  చూపిస్తారే తప్ప  కొడుకులకు, కోడళ్ళకు, కూతుళ్ళకు  వర్ధనమ్మను  పట్టించుకోవాలన్న  ఆలోచనే  లేదు. పై పెచ్చు  వర్ధనమ్మ  మెడలో ఉన్న కొద్దిపాటి  నగలను  ఊడ పెరుక్కోవాలని  విపరీత కోరిక వాళ్ళల్లో  అణువణువునా  వ్యాపిస్తుంది.

కేవలం  స్వార్ధ  ప్రయోజనాల కోసం  మాత్రమే నటిస్తూ  జీవిస్తున్న తన సంతతి   తన  వాళ్ళు  అనుకుని  భ్రమిస్తున్న వర్ధనమ్మ  ఆ భ్రమలు  వీడి  తన  శేష జీవితాన్ని  తన  పిల్లలకు  దూరంగా  కాశీలో  వృద్ద ఆశ్రమాన్ని  ఎన్నుకుంటుంది.  ఆమె  మెడలో  ఉన్న  నగలపై  ఆశ పోని  ఆమె పిల్లలు  ఆఖరికి  అవి  గిల్టు  నగలని  తెలుసుకుని  నిరాశ  పడతారు. చరిత్ర  ఎప్పుడూ  పునరావృతం అవుతూనే  వుంటుంది. తల్లిని  పెట్టిన  బాధలు  రేపు  తమకు  తమ పిల్లలు  పెట్టరని  అనుకోవడానికి  వీల్లేదు. మారుతున్న  కాలంలో  ఇంకా  స్వార్ధాలు  పెచ్చు పెరుగుతాయే  తప్ప  మానవతా  విలువలు గురించి  ఆశించడం  ఎండమావిలో  నీరును  వెతుక్కోవడం  లాంటిదే.  వాత్సల్య  గారు  సమాజంలో  చీడ పురుగులా  వ్యాపిస్తున్న  ద్రాస్టికాలను మరో  మారు  తమ  కథ  ద్వారా  బాగా  గుర్తు  చేసారు.  అయితే కథ  ప్రారంభంలో  పిల్లల  కోసం  ఎదురుచూస్తోంది  వర్ధనమ్మ  అని  మొదలు  పెట్టటంలో  కొంత  క్లారిటీ  లోపించిందేమో  అని  నాకనిపించింది.

 ఈ క్రింద లింకులో ఈ కథ చదివెయ్యండి మరి... http://www.gotelugu.com/issue68/1855/telugu-stories/nirnayam/

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి