తిలా పాపం తలా పిడికెడు! - టీవీయస్.శాస్త్రి

thila papm thala pidikedu

ఈ మధ్య ప్రతి వారి మనసును కలచి వేసిన సంఘటన -- ఈ దేశ రాజధాని అయిన ఢిల్లీలో, మరి అనేక ఇతర ప్రాంతాల్లో ముక్కుపచ్చలారని పసిపాపలపై జరిగిన/జరుగుతున్న పైశాచిక మానభంగాలు. సభ్య సమాజం తలదించుకోవలసిన సంఘటనలు ఇవి. చాలా మంది వారి ఆవేదనను ఆపుకోలేక, నిందితులకు ఉరిశిక్షలను వెయ్యాలని, వారి అంగాలను ఖండించాలని వాపోతున్నారు. ఇంతకు మునుపు దేశంలో జరిగిన కొన్ని నేరాలకు దారుణమైన శిక్షలు పడ్డాయి. మన రాష్ట్రంలోనే , వరంగల్ లో జరిగిన దారుణమైన యాసిడ్ దాడికి బాధ్యులైన ఇద్దరు నిందితులను అప్పటి పోలీసు ఉన్నతాధికారి శ్రీ సజ్జనార్ ఎన్ కౌంటర్ లో చంపిన విషయం బహిరంగ రహస్యమే! అయితే, దాని తరువాత నేరాలు తగ్గాయా? నేరాలు చేసే వారి ప్రవృత్తిలో మార్పు వచ్చిందా? అంటే, సమాధానం -----ఏమాత్రం రాలేదనే చెప్పాలి.

శిక్షల వల్ల నేరాలు తగ్గవని, ప్రపంచంలోని అనేక దేశాలలో జరిగిన సంఘటనల వల్ల తేటతెల్లమౌతుంది. చాలా ఏళ్ళ క్రితం, నా స్నేహితుడొకడు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా పనిచేసాడు. ఆ తరువాత పదోన్నతిని పొంది ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నడనుకోండి. అతను మేజిస్ట్రేట్ గా పనిచేసే రోజుల్లో ఒకసారి అతనిని కలిసే నిమిత్తం నేను కోర్ట్ కు వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో అతను బెంచ్ మీద ఉన్నాడు. చిన్నచిన్న నేరాలను(Petty Offenses) ఆ రోజు పోలీస్ వారు విచారణ నిమిత్తం ప్రవేశపెట్టారు. ఆ రోజు కోర్ట్ కు హాజరైన వారందరూ స్త్రీలు. వ్యభిచారం చేసిన నేరంలో పట్టుబడ్డారు. పోలీసుల సహాయ సహకారాలతో(అంటే లంచాలిచ్చి), తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు -- ఆ వ్యభిచారిణుల సహకారంతో కూడా నేరంలో భాగస్వాములైన మగవారెవరూ పట్టుపడలేదు. సరే, ఆ వ్యభిచారిణులు బోనులో నిలబడ్డారు. వారిని మేజిస్ట్రేట్ గారు , "మీరు నేరం చేసారా?" అని అడిగారు. దానికి వారు నేరం చేసినట్లు అంగీకరించారు. వెంటనే, మేజిస్ట్రేట్ గారు వారినుద్దేసించి "మరెప్పుడూ ఇటువంటి నేరాలు చెయ్యవద్దు. ఈ సారికి మిమ్మల్ని క్షమించి వదలి పెడుతున్నాను." అని తన తీర్పును వెలువరించి బెంచ్ దిగి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన నేను, అతనిని ఛాంబర్ లో కలుసుకొని, "కనీసం జరిమానా అన్నా విధిస్తావని అనుకున్నాను" అని అన్నాను. అందుకు అతను, "వారికి జరిమానా విధిస్తే, ఆ డబ్బులు కట్టటానికి అప్పు చేస్తారు. ఆ అప్పు తీర్చటానికి ఈ నేరాన్నే మళ్ళీ చేస్తారు. మనం వేసే శిక్ష నేరాన్ని పెంచినట్లౌతుంది." అని చాలా హేతుబద్ధంగా జవాబు చెప్పాడు. అతను చెప్పింది నాకు నచ్చింది. చట్టాలు ఎన్నో ఉన్నాయి. వరకట్నం ఒక నేరం. మంత్రులే తమ కొడుకులకు కోట్లల్లో కట్నాలు తీసుకుంటున్నారు. మరి ఈ నేరాలను ఎలా ఆపగలం? కేవలం, సంస్కరణల ద్వారానే ఆపగలం. ఒక వీరేశలింగం, ఒక గురజాడ వంటి మహానుభావులు వంద సంవత్సరాలకొకడు జన్మించినా చాలు. సమాజంలోని దురాచారాలు, నేరాలు అరికట్టపడతాయి.

పై సంఘటనల వల్ల మనకు తెలిసింది ఏమిటంటే -- శిక్షలు నేరాలను తగ్గించవు. నేటి యువతకు శిక్షలు కన్నా 'శిక్షణలు' ముఖ్యం. అసలు ఈ నేరాలకు బాధ్యులు ఆ యువకులేనా? అంటే, కాదనే చెప్పాలి. తల్లిదండ్రులది, ప్రభుత్వాలది, పోలీసు వ్యవస్థది, న్యాయ వ్యవస్థది. చాలా వ్యవస్థలకు ఈ నేరాల్లో భాగం ఉన్నాయి. ఈ పాపాన్ని వారందరూ పంచుకోవలసినదే. వివరంగా విశ్లేషించుకొని వద్దాం!మన పిల్లలు ఎలా చదువు కుంటున్నారు?వారి స్నేహితులెవరు? వారేమైనా దురభ్యాసాలకు అలవాటు పడ్డారా? ఇటువంటి ముఖ్యమైన విషయాలను పట్టించుకోవటానికి తల్లిదండ్రులకు తీరిక ఉండదు. ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇక చెప్పేదేముంది! సంపాదన వ్యామోహంలో పడి , పిల్లల మంచీ చెడులను పట్టించుకునే తీరిక ఉండదు. పిల్లలకు అవసారాలకు మించి డబ్బులిస్తుంటారు. ఖరీదైన వాహనాలను కొనిపెడతారు. ప్రభుత్వం వారి పుణ్యమా అని వీధికి రెండు బార్లు వెలిసాయి. వయసులో ఉన్న యువకులు చిత్తుగా, మత్తుగా తాగి విపరీతమైన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదంలో మరణించటం మనం చూస్తూనే ఉన్నాం! వీరిలో మంత్రుల కొడుకులు, ఉన్నతాధికార్ల సంతానం, ఐశ్వర్యవంతుల వారసులే ఎక్కువ.

ఈ మధ్య శ్రీ తనికెళ్ళ భరణి గారు ఒకచోట ప్రస్తావిస్తూ --- తెలుగు వారికి 'పద్యం' దొరకటం లేదు, 'మద్యం' మాత్రం పుష్కలంగా లభిస్తుంది, అందుకేనేమో పూజలలోకూడా, 'మద్యే మద్యే పానీయం' అని అంటున్నారేమో! అని చమత్కారంగా అన్నారు. కామంలోఉన్న వాడికి, నేరాన్ని ప్రేరేపించే 'మద్యం' మంచినీళ్ళ కన్నా సులువుగా లభ్యం అవుతుంది. చేతిలో పిస్టల్ ఉన్న వాడు ఏదో ఒక నాడు నేరం చేయక మానడు. అలానే, నేరాన్ని ప్రేరేపించే వివిధ సాధనాలు సమాజంలో విచ్చలవిడిగా లభ్యమైతే నేరాలను అరికట్టటం సాధ్యమా? నేరం కన్నా, నేరస్తులుకన్నా-- నేర ప్రేరణకు కారణ భూతులు దారుణ శిక్షార్హులు. అంటే తల్లిదండ్రులు మొదలుకొని ప్రభుత్వాల వరకు అందరూ బాధ్యులే! కొన్ని విషయాలు చాలా స్వల్పమైనవిగా కనిపిస్తాయి. కానీ, వాటి ప్రభావం పిల్లల మీద ఎంత వరకు ఉంటుందనే ఆలోచన కొంత మంది తల్లిదండ్రులకు ఉండదు. పిల్లలు చదువుకుంటుండే సమయంలోనే, తల్లి దండ్రులు వారి సమక్షంలోనే బెడ్ రూంకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. దాని ప్రభావం పిల్లల మీద ఉంటుందో లేదో మీరే ఆలోచించండి.

ప్రతి జాతికి ఒక సంస్కృతి, సాంప్రదాయం ఉంటుంది. అటువంటి వాటికి మనమెప్పుడో తిలోదకాలిచ్చాం! వేష భాషలు వికారంగా మారాయి. మనసులో కామవికారాలు లేకపోతే, 70 ఏళ్ళ వయసు దాటినవారు జుట్టుకు రంగు వేసుకునే అవసరమేముంది? కాయిన్ బాక్స్ ఫోన్ల వద్ద ఆడపిల్లలు నిలబడి గంటలసేపు ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులకు తెలియదు. తెలుసుకునే తీరిక కూడా వారికి లేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న నేరాలను తలచుకుంటేనే వళ్ళు భయంతో వణికిపోతుంది. ముద్దులొలికే ఆ చిన్నారి పాపలకు చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి 40 గంటలు ఒక రహస్య ప్రదేశంలో ఉంచి మానభంగం చేసిన నరరూప రాక్షసులు కూడా -- ఒక కన్నతల్లితండ్రుల బిడ్డలే! జరిగిన ఈ నేరంలో నేరస్తుల తల్లితండ్రుల, స్నేహితుల, ప్రభుత్వ, న్యాయవ్యవస్థ, సంఘం, ముఖ్యంగా రాజకీయ నాయకుల బాధ్యత లేదంటారా? మీరే ఆలోచించండి. మనిషిని రాక్షసుడిగా మారుస్తున్న మద్యం ఏరులై పారుతున్నంత కాలం ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు