చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఇదివరకటి రోజుల్లో అంటే, మా ముందు తరం వారి రోజులన్నమాట, ఇంటికి ఎంతమంది పిల్లా పాపా, పాడీ ఉంటే అంత సుభిక్షమనే సదుద్దేశ్యంతో ఉండేవారు.అందుకనే ఏ ఇంట్లో చూసినా కనీసం, నలుగురైదుగురు పిల్లలుండేవారు. ఆనాటి పరిస్థితుల ధర్మమా అని, తిండికీ, బట్టకీ కూడా లోటుండేది కాదు. ఎవరి ఓపికనిబట్టి వారు చదువులూ, పెళ్ళిళ్ళూ కానిచ్చేవారు.

క్రమక్రమంగా, న్యూక్లియర్ ఫామిలీలు వచ్చేశాయి, మహ అయితే ఇద్దరు పిల్లలతో సరిపెట్టేసికుంటున్నారు. అంతకంటె ఎక్కువయితే పోషించే ఓపికెక్కడిదీ? అప్పుడప్పుడు టి.వీల్లో మా ఊరివంట కార్యక్రమం లో విటూంటాము, మీకు పిల్లలెంతమందీ అని యాంకరమ్మ అడగడం, వెరైటీ అయితే 'పాపా, బాబూ' అని చెప్పడం, ఇద్దరు పాపలే అయితే కొద్దిగా డిఫిడెంటు గా చెప్పడం, ఇంక ఇద్దరూ మొగపిల్లలే అయితే పేద్ద పోజెట్టి చెప్పడం!ఆతావేతా తేలెదేమిటంటే, మేమిద్దరం, మా పిల్లలు ఇద్దరూ అని! ఏక్ దం డిసిప్లీన్డ్ సిటిజెన్!!

పిల్లలిద్దరికీ ఎడం ఉంటే సౌలభ్యాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి, ఏ బజారుకో, సినిమాకో వెళ్ళినప్పుడు, ఇద్దరినీ ఎత్తుకోవాల్సిన పనుండదు. అక్కకి తమ్ముడిమీద ఓ మెటర్నల్ ఫీలింగు కూడా వస్తుంది, వయస్సు తేడా వలన.పిల్లలిద్దరి మధ్యా మరీ, రెండేళ్ళే తేడా ఉంటే, కొద్దిగా కష్టం అయిపోతుంది, ఇద్దరినీ సముదాయించడం. ఇద్దరికీ అమ్మే కావాలి. కవలపిల్లలైతే అసలు గొడవే లేదు! తిట్టుకుంటూనో, కొట్టుకుంటూనో మొత్తానికి, ఓ పదేళ్ళు మన చెప్పుచేతల్లో ఉండి, ఆ తరువాత, వాళ్ళ దారిన వాళ్ళు పెద్దైపోతారు!

అప్పుడప్పుడు చూస్తూంటాము, ఎవరికైనా ఇద్దరు పిల్లలు అదీ పాపా, బాబూ అయితే'అబ్బ ఏం ప్లానింగండీ' అనడం! అక్కడికేదో, వీడు ఓ పెద్ద ప్లానేసికుని ఓ మొగా, ఓ ఆడా కనేసినట్లు పోజిచ్చేస్తాడు. ఇప్పటికీ క్రొమొజోమ్ములో అవేవో ఫలానా గా కలిస్తే ఆడపిల్లా, ఇంకోలా కలిస్తే మగాడూ అని అంటారు మన సైంటిస్టులు, వాటికి ఇప్పటిదాకా పేరే పెట్టలేకపోయారు, అదేదో లెఖ్ఖల్లొలాగ x, y అంటున్నారు, వాళ్ళకే ఈ బ్రహ్మ రహస్యం తెలియక కొట్టుకుంటుంటే, మరి ఈ తండ్రిగారికి ఎలా తెలిసిందండి బాబూ? ఏదో ఘనకార్యం చేసేసినట్లు పోజూ!

ఇద్దరు పిల్లలకీ మరీ తక్కువ ఎడం ఉంటే, కొద్దిగా కష్టమే. పెద్దవాళ్ళు ఎప్పుడూ శాంతస్వభావం కలవారే, అని మా ఇంటావిడా, అమ్మాయీ అంటూంటారులెండి.పోనీ ఏదో అనుకుంటున్నారులే అని వదిలేద్దామా అనుకుంటే, దానికి ఓ కొరాలరీ పెడతారు-రెండో వాళ్ళెప్పుడూ రౌడీలే అని! అదొక్కటే బాగోలెదు. ఔనూ, నోరుందీ, నెగ్గుకొస్తారూ తప్పెమిటీ?సాధారణంగా పెద్దపిల్లలు శాంతస్వభావులూ, రెండోవాళ్ళు నోరుండి నెగ్గుకొచ్చేరకాలుగానూ పేరుతెచ్చుకుంటారు..

ఈ రెండో పిల్లలున్నారే,ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా 'చాలూ' లోకే వస్తారు!అమ్మా నాన్నా లకి ఎప్పుడూ సింపతీ తనమీదే ఉంటుందని,తననుకున్నది సాధించాలంటే, పేద్దగా అరిచి గీ పెట్టేస్తారు. అమ్మొ, నాన్నో ఇంకో గదిలోంచి, ఓ అరుపు అరుస్తారు,'అదేమిటే, పెద్దదానివి కదా, పాపం వాడడుగుతూంటే ఇవ్వొచ్చు కదా' అని.అప్పుడు ఈ చిన్నాడికీ/చిన్నదానికీ ఓ విషయం confirm అయిపోతుంది. నోరుంటే ఎక్కడైనా నెగ్గుకు రావచ్చని! వీళ్ళకి భవిష్యత్తులో రాజకీయనాయకులయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి!పాపం, ఆ పెద్ద పిల్లో,పిల్లాడో భరిస్తారు వీళ్ళ ఆగడాలన్నీ.ఒక్కొక్కప్పుడు ఈ పెద్ద పిల్లలూ వారికి కావలిసినవేవో, అంటే ఏదో ఔటింగుకి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా,ఆ చిన్నాళ్ళని ఓ సారి తొడపాయసం పెడితే చాలు.అదో tactic.ఇంట్లో అయితే ఫరవాలేదు, అమ్మో నాన్నో వీళ్ళ rescue కి వస్తారు, మరి బయటో ఆ పెద్దాళ్ళమీదే ఆధార పడాలిగా! అందుకే ప్రతీ విషయం లోనూ give and take policy!

ఆహా మన పిల్లలెంత అన్యోన్యంగా ఉన్నారో అని ఆ poor తల్లితండ్రులు మురిసిపోతూంటారు! అంతా 'మాయ'!

ఈ రోజుల్లో తల్లితండ్రులలో ఓ విషయం గమనిస్తూంటాము. తల్లికో, అత్తగారికో వంట్లో ఓపికున్నప్పుడే, పిల్లల్ని కనే కార్యక్రమం పూర్తిచేసుకుంటారు, అది స్వదేశమైనా, విదేశమైనా సరే.  Baby sitting  కి పాపం వీళ్ళేకదా దిక్కూ. విశ్వాసపాత్రంగా మనవడినో, మనవరాలినో చూసుకుంటారూ, భార్యాభర్తలిద్దరూ హాయిగా ఉండొచ్చూ. పైగా ఎవరైనా అడిగినా, “ అదేమిటోనండీ మా బాబు/ పాప కి  వాళ్ళ అమ్మమ్మా / నానమ్మ దగ్గరే అలవాటండీ” అని చెప్పుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఆ పిల్లో పిల్లాడో స్కూలుకివెళ్ళేదాకానే ఈ ముచ్చట్లు.

కొంతమందిని చూస్తూంటాము,'పిల్లలెంతమందీ' అని అడగండి--' ఆయ్ మీ దయవలన ఇద్దరండి' అంటాడు! వీడి మొహం, ఏదో భగవంతుడి దయ అంటే బావుంటుంది కానీ, అవతలివాడి దయేమిటీ, విన్నవాళ్ళేమనుకుంటారో అని కూడా ఆలోచించరు!.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి