చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు, అర్ధసాంవత్సరిక ( Half yearly), సాంవత్సరిక ( Annual ) పరీక్షలముందు, ప్రతీనెలా అవేవో స్లిప్ టెస్టులు ( Sliptests) అని ఉండేవి గుర్తుందా? ఏదో పరీక్షలముందు రాత్రిళ్ళు టీ లు తాగేసి, బట్టీ పట్టేసి, మర్నాడు ఏదో రాసేద్దామనుకునే, నాలాటి వాళ్ళకు ఇదో పెద్ద గండం. ఎక్కడ సుఖపడిపోతామో అని, ప్రతీ నెలా ఇదో గోలా. ఏడాదంతా చదవమంటే ఎలా కుదురుతుందమ్మా? అయినా అప్పుడు నేర్చుకున్న ప్రపంచ చరిత్రా, హిందూ దేశ చరిత్ర, ఛందస్సూ, ఇవన్నీ భావి జీవితంలో ఏముపయోగించాయంటారు? చదివిన చదువుకీ, చేసిన ఉద్యోగానికీ ఎక్కడా సంబంధం లేదు. ఎలాగోలాగ ఓ డిగ్రీ తగిలించుకుంటే ఉద్యోగాలు వచ్చేవి ఆరోజుల్లో.ఇప్పుడంటే అవేవో creative skiళ్ళూ, సింగినాదం కావాలంటున్నారు..
ఉద్యోగంలో చేరిన తరువాత, మనం ఆ ఏడాదంతా సరీగ్గా పనిచేశామో లేదో, ఆఫీసరుకి ఒంగి ఒంగి సలాములు పెట్టామో లేదో అనే ప్రాతిపదిక మీద, ఆ ఆఫిసరు , తన కింద పనిచేస్తున్న వారిగురించి, ACR ( Annual Confidential Report) రాసేవాడు. ఆఫీసర్లందరూ నిజాయితీగా ఉండేవారా అంటే చెప్పడం కష్టం. వారితో మన ప్రవర్తన ని బట్టి ఆ ACR లు ఏవో రాసేవారు. కర్మం ఏమిటంటే వాటిని బట్టే ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండేవి. మన దారిన మనం నిజాయితీగా ఉంటే గొడవే లేదు అలాకాకుండా ఉన్న ఆఫీసరుకి " కాకా" పట్టి, రోజులు గడిపేసికుంటే జరిగే పని కాదు. ఆ తరవాత వచ్చినవాడినీ, ఆ తరవాత వచ్చినవాడినీ... అలా ఉద్యోగ జీవితంఅంతా ఎవరోఒక పైవాడికి దాసోహం అంటునే ఉండాలి. ఎందుకొచ్చిన బతుకూ? గవర్నమెంటు సర్వీసులో, పనితనం చూసేవాడెవడూ ? మనం ఫలానా క్యాటిగరీలో ఉన్నామా లేదా, ఉన్నట్టైతే ఈ ACR లూ అవీ ఉత్తుత్తివే. అయినా చేతిలో పనున్నప్పుడు భయపడ్డం ఎందుకూ? అయినా ఈ ACR లు ఏవో ఉధ్ధరించేస్తాయని కాకపోయినా, చెడ్డగా రాస్తే చిరాగ్గా ఉంటుంది. గమ్మత్తేమిటంటే, బాగా రాసినప్పుడు ప్రమోషన్లు రాలేదు..
పైచెప్పిన ACR లనె ఈరోజుల్లో అవేవో Appraisals అంటారుట. ప్రతీ ఏడాదీ , ప్రెవేటు కంపెనీల్లో ఎప్పుడు విన్నా వీటి గొడవే. పైగా ఈ appraisals ని బట్టే, ఆ ఏడాది ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా కూడా తేలుస్తారుట. వామ్మోయ్, గవర్నమెంటులో మరీ ఇంత సీరియస్సు కాదు.
చిత్రం ఏమిటంటే, ఈ ఈతిబాధలు ఉద్యోగం నుండి రిటైరయాకకూడా నీడలా వెంటాడుతాయి.. అదేదో “ నిను వీడని నేనూ..” అన్న పాటలోలాగ. పైగా ఎవరికీ చెప్పుకోలేకపోతాము కూడానూ. ఇవన్నీ ఓ ఎత్తైతే, ఇళ్ళల్లో భార్యలు చేసే appraisals ఇంకోలా ఉంటాయి. ఈ ఏడాదిలో, ఎన్ని సినిమాలకి తీసికెళ్ళాడూ, ఎన్నెన్ని ఊళ్ళు తిప్పాడూ, కొంచం వయసొచ్చిన తరువాత ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలకి తీసికెళ్ళాడూ, ఆ వెళ్ళినప్పుడు ఏ స్టార్ హొటల్లోనే ఉన్నామా లేక ఏ దేవస్థాన సత్రంలోనేనా? విడిగా వెళ్ళామా, లేక టూర్లవాళ్ళతో వెళ్ళామా, విడిగా వెళ్తే ఏసి 2 లేక స్లీపరా? On a scale of 10 ఇన్నేసి ఉంటాయి. , వీటన్నిటినీ ఎలాగోలాగ నెగ్గుకురావొచ్చులెండి, ఎవరికో దాచిపెట్టాలని కూడా లేదు. పిల్లలు వాళ్ళంతటివారు వాళ్ళైన తరువాత అలాటి బాధ్యతలు కూదా తగ్గుతాయి. హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేయొచ్చు. మరి అలాటప్పుడు ఈ భవిష్యత్తుని నిర్ణయించే ఈ appraisals గొడవేమిటీ అనుకుంటున్నారు కదూ.. అక్కడికే వస్తూంట...
మన ఇల్లాళ్ళలో కొందరికి వేసవికాలం వచ్చిందంటే ఊరగాయలు స్వయంగానే పెట్టాలనుకుంటారు, మార్కెట్ లో ఎన్నిరకాల ఊరగాయలు దొరుకుతున్నా సరే. అదో తృప్తీ వాళ్ళకి.బయట దొరికే ఊరగాయల్లో ఏం నూనె వాడాడో ఏమిటో, ఆవపిండీ, కారం ఈరోజుల్లో ఎక్కడ చూసినా కల్తీయే కూడానూ. పోనిద్దూ ఒంట్లో ఓపికున్నంతకాలం ఓ యాభై కాయలు ఒరుగులుగానూ, ఇంకో నలభై కాయలు ఆవకాయా, మాగాయా కలిపేస్తే, పిల్లలు కూడా తింటారూ అదేమైనా పెద్ద బ్రహ్మవిద్యా ఏమిటీ అని అనుకుంటారు. ఆశయం మహోన్నతమైనదే. కానీ ఆచరణలో బలైపోయేవాడు ఏ పనీపాటా లేకుండా రిటైరయి ఇంట్లో కాళ్ళకీ చేతులకీ అడ్డుపడే మొగుడు.దగ్గరలో ఉండే ఏ మాల్ కో వెళ్ళి నువ్వులనూనె, కారం, ఆవపిండీ, ఉప్పూ, ఓ ఇంగువడబ్బా తెచ్చికోడం... దానికి తోడొస్తారు. ఆ తెచ్చినవన్నీ ఆవకాయ గుండ కలిపేసి ఇంక కాయలు వర్షం పడేలోపలే తెమ్మని రోజూ గుర్తుచేస్తారు. " పోనీ నువ్వుకూడా వస్తావేమిటీ.. ఆ కాయలేవో నువ్వే చూసుకోవచ్చు.." తో మొదలవుతుంది. అబ్బే వాళ్ళా లొంగేదీ.. భార్య :- ఆమాత్రం దానికి ఈ ఎండలో నేనెందుకులెండి, మీరే మంచి కాయలు, టెంక పట్టినవేవో చూసి తెచ్చేయండి.. ఇన్నేళ్ళనుండీ తేవడం లేదూ.. మీ సెలెక్షన్ ఫరవాలేదులెండి.. భర్త : - ఎన్నికాయలూ ?.. భార్య: ఎంతోకాదులెండి.. ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు చాలు.. ఆ గిన్నేమిటో ఆ కొలతలేమిటో ఛస్తే అర్ధం అవదు ఈ బక్క ప్రాణికి. పోనీ ఆ గిన్నేదో తీసికెళ్తేనో.. భార్య ఓ చూపు ( ఈ మాత్రానికి ఆ గిన్నెందుకండీ అనే అర్ధం లో ) చూసేసరికి గిన్నె వదిలేసి, మార్కెట్ కి బయలుదేరడం.వాళ్ళు మాత్రం ససేమిరా కాయలకోసం మార్కెట్ కి రారంటే రారు. సెలెక్షన్ ప్రాసెస్ లో వీళ్ళుకూడా ఉండి, ఆ కాయలు కోసిన తరువాత బాగాలేకపోతే, చివాట్లేయడానికి ఎవరో ఒకరుండొద్దూ? దానికన్నమాట. ఈ విశాల హృదయం.. కానీ భర్తపడే మానసిక ఒత్తిడి ఎవరికి తెలుస్తుందీ? ఆ నాలుగ్గిన్నెల కొలత గుర్తుపెట్టుకోవాలి. టెంక ఉండేటట్టు ముక్కలు కోయించాలి. మళ్ళీ తక్కువైపోతాయేమో అని ఇంకో కిలో కోయించడం. మొత్తం అన్నీ ఓ ఆటోలో వేసికుని కొంపకి చేరడం. ఇదిగో ఈ ప్రకరణం అంతా part and parcel of annual appraisal అన్నమాట. పాసయ్యామా, ప్రతీరోజూ ధోకా లేకుండా కొత్తవకాయ, లేదా పాతావకాయే. ఏదో వేసవికాలం వస్తోంది కదా అని ఆవకాయ మాటెత్తాను… ఇలాటి appraisals పుంఖానుపుంఖాలుగా ఉంటాయి…ఎవడి తలరాతనుబట్టి వాడికీ…
సర్వేజనా సుఖినోభవంతూ…