పర్యాటకం - కర్రా నాగలక్ష్మి

paryatakam

లదాక్ చూద్దాం రండి

( పథ్తర్ సాహెబ్ మరియు మేగ్నెట్ కొండ )

రాత్రంతా కాల్పులు వినబడుతూనే వున్నాయి . అయిందింటికి అందరూ యెవరిపనులు వారు చేసుకు పోతున్నారు , కాల్పులు జరగడం నిత్యకృత్యంలా వుంది వారికి , నాకు మాత్రం చాలా భయంగా అనిపించింది .

టీ టిఫిను అయేక 2ట్ ,3ట్ లు ( ఆర్మీ వారి భారీ వాహనాలను అలా వ్యవహరిస్తారు ) వరుసగా వున్నాయి , వాటిలో డ్రైవరు వెనుక నున్న యినుప బెంచిమీద కూర్చొని మా ప్రయాణం మొదలయింది . మొత్తం అన్ని ట్రక్కులు ఒకదాని వెనుక ఒకటిగా బయలు దేరేయి . 

ప్రయాణం ముందురోజు కన్నా మెల్లగా సాగుతోంది కారణం  గతుకుల రోడ్డు   మీద భారివాహనాలు యెత్తైనకొండలు యెక్కవలసి రావడం . కను చూపు మేర వరకు యెత్తైన మట్టి కొండలే , మట్టి రంగు మారుతోంది తప్ప  చెట్టు చేమా యేమీ లేవు , కిందన యెక్కడో లోయలో ప్రవహిస్తున్న సింధునది అంతే . ఇనుప బెంచీ మీద గతుకుల రోడ్డులో ప్రయాణం నడుం విరిగిపోసాగింది . ట్రక్కులో వున్న సామానులు గతుకులు వచ్చేటప్పుడల్లా  మా వెనుకవైపు బలంగా తగలడం తో ఆ నొప్పి ఒకవైపు , యీ బాధకన్న నరకం మేలనిపించసాగింది . ఇలా సుమారు 56 కిలోమీటర్ల ప్రయాణం సుమారు యేడుగంటల సమయం పట్టింది  . మద్యమద్య లో టీ బిస్కెట్ , లంచ్ టైములో లంచ్ యిచ్చేరు . దారిలో యెక్కడా కూడా జనావాసాలు లేవు , చెట్టూచేమా లేని ఆ ప్రదేశాలలో జీవరాశులు బతికుండడం కూడా కష్టమే . దారిలో రెండు మూడు ప్రదేశాలలో ఆర్మీ వారి కాంపులు వున్నాయి , లదాక్ కి వెళ్లే ఆర్మీ వారికి టీ భోజనాలు అందించేందుకు యేర్పరచినవి అక్కడ రాత్రి బసకు కావలసిన యేర్పాట్లు లేవు .

కొండలు దాటి లోయలో అడుగు పెట్టేం అక్కడ కాస్త చెట్లు కనిపించేయి , వీటినే ఒయాసిస్ లంటారా ? అనుకున్నాం . అదే కార్గిల్ అన్నారు . సిపాయిల నివాసం దగ్గర మేము దిగి అక్కడవున్న జీపులో ఆఫీసర్ల బస కి బయలుదేరేం . అలా ఓ గంట ప్రయాణం తరువాత ఓ మోస్తరుగా వున్న కొండ వాలులో పదినుంచి పదహారేళ్ల పిల్లలు యేవో యేరి బస్తాలలో వేసుకుంటున్నారు . వాళ్లేం చేస్తున్నారు అని మమ్మల్ని తీసుకు వెళ్లేందుకు వచ్చిన కేప్టెన్ ని అడిగితే అతను శతృదేశపు సైనికులు పేల్చిన బులెట్స్ తాలూకా షెల్ లని , అవి యిత్తడితో చేస్తారని , పిల్లలు వాటిని సేకరించి అమ్ముకుంటారని అదే వారి ముఖ్యమైన ఉపాధి. అని చెప్పేరు . అంతమంది బతికేందుకు సరిపడా బులెట్స్ ఫైర్ చేస్తారా ? అనే ప్రశ్నకి అతను చిరునవ్వు సమాధానంగా యిచ్చేడు . 

అక్కడకూడా తాత్కాలిక నివాసాలు తప్ప మరేమీ లేవు . జమ్ము- కశ్మీరు రాష్ట్రంలో లదాక్ జిల్లాలో మొదటి పెద్ద నగరం లేహ్ , 

రెండవ పెద్ద నగరం యీ కార్గిల్ .

రాత్రి భోజనాలు చేసేటప్పుడు కార్గిల్ యుధ్దం విషయాలు చాలా చెప్పేడు అతను . అక్కడకు యెదురుగా వున్న పెద్ద కొండమీద వున్న పాకిస్థాన్ స్థావరం చూపించేడు . అక్కడనుంచి వాళ్లు ఫైర్ చేస్తూ వుంటారని , యితను పోష్టింగ్ కి యిక్కడకు వచ్చిన రోజు ఛార్జ్ యివ్వవలసిన కేప్టెన్ తో రాత్రి భోజనం చేస్తూవుండగా శతృవులు వాళ్ల పోష్ట్ నుంచి చేసిన కాల్పులలో ఓ బులెట్ మట్టిగోడను చీల్చుకొని వచ్చి ట్రాన్సఫర్ వచ్చిన కేప్టెన్ కి తగిలిందని , అతను అలాగే భోజనం పళ్లెంలో ఒరిగి పోయి మరణించేడని చెప్పేడు . ఆ విషయాన్ని దృవీకరిస్తూ  బులెట్ గోడకు యేర్పరడిన రంధ్రం దానికింద రాసిన వివరాలు వున్నాయి . 

ఆ రోజు నేను భోజనం కూడా చెయ్యలేక పోయేను . నిజంగా అక్కడి ప్రతీ సైనికుడికి పాదాభివందనం చెయ్యాలనిపించింది . ఆ రాత్రి నిద్దరలేదని వేరే చెప్పాలా ? నిన్న రాత్రి కూడా ఫైరింగ్ జరిగిందా అనే నా ప్రశ్నకి అదో మాటా అన్నట్టుగా నవ్వుతూ టీ బ్రేక్ ఫాష్ట్ యిచ్చి తిరిగి జీపులో ట్రక్కులు ఆగివున్న చోట దింపేసేడు .

అప్పట్లో ద్రాస్ కార్గిల్ ప్రాంతాలలో చొరబాటు దారుల తాకిడి యెక్కువగా వుండడంతో ఆర్మీ వారు పర్యాటకులను అనుమతించేవారు కాదు . కాని యిప్పుడు యెన్నో పర్యాటక సంస్థలు అమర్నాధ్ యాత్రతో పాటు సోన్ మార్గ్ , ద్రాస్ , కార్గిల్ కూడా చూపిస్తున్నారు . ద్రాస్ , కార్గిల్ తిరిగి బాల్టాల్ గాని సోన్ మార్గ్ గాని తీసుకొని రావడం ఒకరోజులో పూర్తిచేస్తున్నారు .

ఇక్కడ కూడా కార్గిల్ వార్ మేమోరియల్ ని నిర్మించేరు . ఇక్కడ 15 కేజీల బరువుగల , వంద అడుగుల యెత్తున భారతీయ ఝండా ని యెగురవేసేరు . ప్రస్తుతం కార్గిల్ లో యిదో ప్రత్యేక ఆకర్షణ , యిలాంటి దే ఈ మధ్య అటారీ బోర్డరులో కూడా యింత పెద్ద ఝండాని యెగుర వేసేరు భారతీయ ఆర్మీ వారు .

మరునాడు కొంతదూరం పర్వతాలమీద సాగిన మా ప్రయాణం తరువాత మైదానాలలో మంచి దారిలో జరగడం వల్ల ఆ రోజు సుమారు 250 కిలో మీటర్లు ప్రయాణించేం .

ఆ ప్రయాణం  ' నిమ్మో ' గ్రామం మీదుగా సాగింది . 

కార్గిల్ దగ్గర రెండు మోనష్ట్రీలు వున్నాయి కాని మేము చూడలేదు . అప్పటికే చాలా మోనష్ట్రీలు చూసేం కాబట్టి మాకు పెద్దగా కుతూహలం లేకపోయింది . అదీకాక అక్కడ ఆర్మీవారి బళ్లుతప్ప వేరే వాటిని అనుమతించరు . ఆ యెడారిలో చలిగాలులమధ్య ధూళిదుమ్ము యెందుకొచ్చాం దేవుడా అని విచారిస్తున్న సమయంలో ఓ రెండు  అధ్బుతాలని చూసేం .

మాకు మేం వెళ్తున్న ప్రాంతాలలో చూడదగ్గ ప్రదేశాలేమిటో తెలీని అయోమయ పరిస్థితులలో అరుదైనవి యెదురుపడితే ఆనందమే కదా ? 

అదేమిటో చెప్తాను . అడుగడగుకీ ఆగుతూ వెళుతున్న ప్రయాణం కాబట్టి ట్రక్కు ఆగగానే మళ్లీ యెందుకాపేరో అనుకొని బయటకి చూస్తే పక్కగా చాలా నిటారుగా వున్న యెత్తైన గుట్టమీద రంగులు రాసిన యిటుకల కట్టడం లోకి అందరూ అంటే సైనికులు వెళ్లి రావడం కనిపించింది . కాళ్లు పట్టేసేయని కిందకు దిగేం . అప్పటికి మేం సుమారు 12 వేల అడుగుల యెత్తుకు చేరుకున్నాం . యెత్తుగా వున్న గుట్ట యెక్కడానికి వెనుకాడేం కాని సైనికులు తప్పక చూడవలసిన శిక్కుల గురుద్వారా అంటే యెలాగో పైకి యెక్కి వెళ్లేం . చిన్న గదిలోకి గుహలో దూరినట్లు దూరి వెళ్లేం . అక్కడ పెద్ద రాయి , దాన పక్కగా శిక్కుమతస్థాపకుడైన ' గురునానక్ ' గారి ఫొటో వుంది . ఓస్ యింతేనా అనుకున్నాం . లోపల వున్న సైనికుడు రాతి వైపు చూపిస్తే అటు చూసేం ఆరాతిమీద గురునానక్  కూర్చొని వున్నట్లు ముద్ర పడి వుంది మరో పక్క పెద్ద పాదం ముద్ర వున్నాయి . 

ఆ కథ సైనికుడు యిలా వివరించేడు . 

1517 గురు నానక్ లదాక్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ యీ ప్రదేశంలో ధ్యానం చేసుకుంటూ వుండగా యీ ప్రాంతాన వున్న దుష్టుడు నానక్ ధ్యానం భంగం చెయ్యాలని యెన్నో విధాల ప్రయత్నించి విఫలమవడంతో ఆ దుష్టుడు పక్కన వున్న పెద్ద రాతిని నానక్ మీదకు దొర్లించి , నానక్ మరణంచి వుంటాడని దగ్గరగా వచ్చి రాతిని కాలితో తన్నగా ఆ రాతిలో అతని పాదం యిరుక్కు పోతుంది . పక్కకు జరిగిన రాతి కింద నానక్ చెక్కుచెదరక ధ్యానం చేసుకోవడం చూసి అతను భగవంతుడని తలచి దుష్టుడు తన పాదాన్ని రాయినుండి విడిపించమని నానక్ ని ప్రార్ధించగా నానక్ అతనిని దుష్టత్వం విడిచి మంచిమనిషిగా మారమని చెప్పగా దానికి అతను అంగీకారము తెలుపగానే అతని కాలు రాతినుండి విడి పడుతుంది . అప్పటినుంచి అతడు నానక్  కి శిష్యునిగా మారేడట .

దీనిని పథ్తర్ సాహెబ్ అని అంటారు . శిక్కుల పవిత్రస్థలాలలో యిది వొకటి .

ఆ రాతి దగ్గర కాస్త సమయం ధ్యానం లో కూర్చుని బయటకి వచ్చేం . బయట ఆర్మీ జవాన్లచే నడప బడుతున్న లంగరులో వేడివేడి పాయసం తిని తిరిగి మా ట్రక్కులో కూర్చున్నాం .

ఈ పథ్తర్ సాహెబ్ ను లేహ్ నుంచి కూడా వచ్చి దర్శించుకోవచ్చు . లేహ్ పట్టణానికి సుమారు 55, 60 కిలో మీటర్లు  ప్రయాణించి చేరుకోవచ్చు 

ఇక్కడ మేం చూసిన మరో అద్భతం యేమిటంటే మాగ్నెట్ కొండ.

యీ పర్వతాలలో మాగ్నెట్  కొండ వుందని ఓ బోర్డు కనిపించింది . మేం వెళుతున్న రోడ్డుపైనే బోర్డు వుంది , రోడ్డు పైన తెల్లని రంగుతో నాలుగు గీతలు గీసివున్నాయి , ఆ గీతల మధ్యలో బండిని యింజన్ ఆఫ్ చేసి పెడితే యెత్తుగా వున్న వైపుకి బండిలాగ బడుతుంది . అలాగే యీ ప్రాంతంలో పైనుంచి వెళ్లే విమానాలు కుదుపుకు లోనవుతాయట , అంతే కాకుండా పైలెట్లు యీ ప్రాంతానికి రాగానే విమానాల వేగాన్ని పెంచినడుపుతారట .

యివాళటికి యీ రెండు వింతలు చదవండి మళ్లా వారం మరికొన్ని విశేషాలతో అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి