చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaaram

కొన్ని దశాబ్దాల క్రితం వరకూ, చాలామంది కొన్ని  “ సువాసనలు “ ఆస్వాదించేవారు. దురదృష్టవశాత్తూ, ఈరోజుల్లో ఆ “ సు “ లు మాయమైపోయి, ఏవేవో వాసనలు మాత్రమే మిగిలాయి. ఉదాహరణకి వేసవికాలం తరువాత వచ్చే తొలకరి శుభారంభానికి, అదో రకమైన మట్టివాసన వచ్చేది , గుర్తుందా? అసలు ఈ రోజుల్లో మట్టన్నదే లేకపోతే, ఇంక ఆ సువాసన ఎక్కడిదీ? అంతా కాంక్రీటు మయమయిపోయి, పడిన వర్షపు నీళ్ళుకూడా , ఇంకడమనేది లేదు. అభివృధ్ధి పేరుతో, గ్రామాల్లో కూడా, కాంక్రీటు రోడ్డులే. చివరకి ఇళ్ళల్లో  పూలమొక్కలు పెంచడానికి మట్టి బయట కొనుక్కోవాల్సొస్తోంది.

కాయగూరల విషయమే తీసికోండి, ఏదైనా కూర కానీ, ఆకుకూరకానీ కత్తిపీటతో కోసినప్పుడు. ఒకరకమైన సువాసన వచ్చేది. ఈరోజుల్లోనో, కొత్తిమిర, కరివేపాకు లకి కూడా వాసనుండడంలేదు. ఏదో పశువుల మేతలా తయారయ్యాయి.. ఏ సరుకు తీసికున్నా అదే పరిస్థితి. వంటింట్లో, ఇంటి ఇల్లాలు కూరలోకో, పచ్చడిలోకో, పోపు వేయిస్తే మూడు వీధులదాకా తెలిసేది. అంత ఘాటుగా ఉండేది. ఏ వంటకంలోనైనా, ఇంగువ పెడితే ఘుమఘుమ లాడేది.  ఇంటికి అతిథులొస్తున్నారని ఏ వెల్లుల్లిపాయలైనా  ఏ కూరలోనో , పప్పులోనో వేస్తే, , ఆ వాసన ఇంట్లో మంచం మీదుండే, ఏ పెద్దవారో పసిగట్టి,, వెంటనే ఓ కేక పెట్టేవారు—నాకు విడిగా చెయ్యి, ఆ అమంగళం వంట నాకొద్దూ అనేవారు, కారణం వెల్లుల్లి చాలా ఇళ్ళల్లో నిషిధ్ధం. ఈరోజుల్లో ఆ గొడవే లేదు—నోట్లో ముద్ద పెట్టుకున్నా  వెల్లుల్లి రుచే తెలియదూ.

ఆ రోజుల్లో బ్యూటీ పార్లర్లూ , ఫేషియల్సూ ఎక్కడా? అసలు ఒళ్ళు తోముకునే సబ్బులే అపురూపరం.  ఏ కాలవకో స్నానానికి వెళ్ళి, ఆడవాళ్ళు ఒంటినిండా, పసుపు రాసుకుని, ఓ మునుగు మునిగి, కాలవలోని ఒండ్రు మట్టి తోనే  రుద్దుకోవడం. అలాగే మగవారూనూ, గలగలా పారే  కాలవల్లోనే, ఓపికున్నంతసేపు ఈత కొట్టేయడం..  బహుశా ఆ పసుపు వాడ్డంవలనే ఏమో, స్త్రీల శరీరంమీద, అవాంఛిత వెంట్రుకలనేవే కనిపించేవి కావు.ఈరోజుల్లో పసుపనేది వాడ్డమే నామోషీ. అధవా మార్కెట్ లో వచ్చినా, ఓ నెలరోజులకల్లా పురుగు పట్టేస్తుంది. పైగా, ఆ పసుపు వాడితే, ఏ చర్మరోగమో రావడానిక్కూడా ఆస్కారం ఉంది.

ఇవన్నీ ఒకెత్తైతే, కొత్తగా ఇంట్లో పసిబిడ్డ పుట్టినప్పుడు, ఆ పది పదిహేనురోజులూ, పురిటిగదిలోని, పసిబిడ్డ దగ్గరకు వెళ్తే ఆ అమోఘమైన సువాసనే వేరు… ఇంట్లో ఉండే ఏ అమ్మమ్మో, నానమ్మో, ప్రతీరోజూ ఉదయమే, ఆ పసిబిడ్డకి, ఒళ్ళంతా ఆముదంతో మాలీషు చేసి, సున్నిపిండి నలుగు పెట్టి, కాళ్ళమీద బోర్లా పడుక్కోపెట్టి , ఆరారగా దోసిళ్ళతో గోరువెచ్చని స్నానం చేయించి, సాంబ్రాణి పొగ తగిలిస్తే.. ఆ సువాసనలు రాకుండా ఎలా ఉంటాయీ? ఈరోజుల్లో, అసలు ఆముదం అనేదే ఉన్నట్టు మర్చిపోయారు, సున్నిపిండైతే సరేసరి. ఇంక సువాసనలెక్కడా? మహా అయితే, డెట్టాలో, ఇంకోటేదో వాసనలే గతి. వీటికి సాయం దోమల  రాకుండా వాడే ఏ Good Knight కాయిల్ పొగోటీ.

అంతదాకా ఎందుకూ, ఆడవారు, వేసవికాలం వచ్చిందంటే, సాయంత్రం పూట, మల్లెపూలూ, మధ్యలో దవనం ఆకులతో మాలలు కట్టుకుని, కొప్పులో పెట్టుకునేవారు. అసలా మల్లెపువ్వులూ, దవనం ఈరోజుల్లో ఎక్కడైనా కనిపిస్తున్నాయా, కనిపించినా, ఆ మాల మీద ఏ సెంటు స్ప్రేయో కొడితేకానీ, ఎటువంటి వాసనా ఉండదు. ఆరోజుల్లో అసలు ఈ “ సెంటు “ లు ఎక్కడవాడేవారూ? ఏ పెళ్ళిళ్ళల్లోనో, మగపెళ్ళివారికి ఎదురు సన్నాహం సమయంలోనూ, విడిదిలో వాడుకోడానికి ఏ Scented Hair oil  సీసాలకే పరిమితం.. రోజూ సెంటు వాడాల్సిన అవసరమే ఉండేది కాదూ, కారణం ప్రతీరోజూ స్నానం అనేది తప్పనిసరీగా చేసేవారు. అందుకే శరీరం నుండి, ఏ దుర్వాసనా వచ్చేది కాదు.. స్నాన పానాదులకి ఈరోజుల్లో అసలు టైమే ఉండడంలేదాయె. బహుశా అందుకేనేమో , బయటకు వెళ్తే పక్కనుంచి ఎవరైనా వెళ్తూంటే, గుప్పుమని ఏదో సెంటు వాసన వస్తుందే.. పైగా వీటిలో రకరకాల   Spray  లు. అదేదో రాసుకుంటే, అమ్మాయిలు టక్కున వచ్చేస్తారుట. ఆ ప్రకటనలు గుడ్డిగా నమ్మేసి, ప్రతీవాడూ, వాటిని జల్లేసికుని మన ప్రాణాలు తీయడం మిగిలింది.

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా,   Moov, Amrutanjanm Mosquito Coil   సువాసనలతోటే రోజులు వెళ్ళిపోతున్నాయి, వాటికే అలవాటు పడాలి మరి…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు